రజాకార్ల భజన చేస్తున్న కెసిఆర్‌

రజాకార్ల భజన చేస్తున్న కెసిఆర్‌

తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఈ శీతకాల సమావేశాలలో శాసనసభలో ఒక బాధ్యతా రహితమైన ప్రకటన చేశారు. సుమారు 250 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రాంతాన్నీ, ఇక్కడి సంస్కృతినీ, సాధారణ ప్రజానికాన్నీ పీడించి, కనీస మానత్వం లేకుండా నిరంకుశంగా పాలించిన నిజాం నవాబులను తెలంగాణ ప్రజలందరూ గౌరవించి, పూజించాలట. అంతేకాక సమైక్యాంధ్ర పాలనలో చరిత్ర లేఖనంలో తప్పులు జరిగి, నిజాం నిరంకుశ పాలనను ఎండగట్టే విధంగా ఎన్నో వర్ణనలూ, వివరాలూ ఉన్నాయట. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం లెంపలేసుకుని ఆ అపచారాలను నివృత్తి చేసుకోవ డానికి మళ్ళీ చరిత్రను తిరగరాస్తుందట. ప్రతి ఇంట్లో నిజాం నవాబుల ఫోటోలు పెట్టి, పూలమాలలు వేసి, రోజూ పూజలు కూడా చేయాలని మన ప్రజానికానికి గౌరవ ముఖ్యమంత్రి పిలుపు నివ్వనందుకు మనం ఎంతో సంతోషించాలి !

ఈ విధంగా ఆయన నిజాం దండకాన్ని చదవడానికి, నిజాం సమాధిని సందర్శించాలనడానికి ఆయన చెప్పిన కారణాలు అత్యంత హాస్యా స్పదంగా ఉన్నాయి. గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించిన సర్‌ ఆర్దర్‌కాటన్‌కు గౌరవ సూచకంగా అక్కడి స్థానిక ప్రజలు ఆయన జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి, నిజాంసాగర్‌ను నిర్మించిన నిజాంను తాను గౌరవించి పూజించడంలో తప్పేంటన్నది ఆయన వాదన. ఆర్దర్‌ కాటన్‌ గాని, నిజాం నవాబు గాని నీటి పారుదల సౌకర్యాలు కల్పించింది, దేశాన్ని ఉద్ధరించడానికి కాదని, అపార రాజకీయ అనుభవమున్న మన ప్రియతమ ముఖ్యమంత్రికి తెలిసే ఉంటుందని ప్రజలు ఆశిస్తున్నారు.

కసాయివాడు మేక పిల్ల కోసం రోజూ రకరకాల ఆకులు, గడ్డిని కష్టపడి తెచ్చి దానిని పోషిస్తాడు. అంతమాత్రాన ఆ మేకపై వానికి ప్రేమ ఉన్నట్లు కాదు. ఆ గ్రాసాన్ని తిని దాని మాంసం పెరిగితే, మంచి ధరకు అమ్ముకోవచ్చని వాని అభిప్రాయం. ఆంగ్లేయులు, నిజాం నవాబులు చేసింది కూడా అంతే. ఆనకట్టలు నిర్మించింది, చెరువులు నింపింది కేవలం పంటలు బాగా పండించిన రైతులను నిలువు దోపిడీ చేసి తమ సంపదను పెంచుకోవడం కోసం తప్ప, రైతుల పట్ల ప్రేమతో కాదు.

ప్రపంచంలోనే అత్యంత కర్కష నిరంకుశ పాలకులలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఏడవ నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలోని కవులు, మేధావులు, రైతులు, మహిళలు కూడా ఆయుధాలు చేపట్టి ‘తెలంగాణ సాయుధ పోరాటం’లో పాల్గొన్నారు. స్వామి రామానంద తీర్థ వంటి ఆధ్యాత్మిక వేత్తలు, ఆర్య సమాజ్‌, ఆంధ్ర మహాసభ వంటి ప్రజా పోరాట సంస్థలు సమర శంఖం పూరించి బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేశాయి.

తెలంగాణ మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించిన నిరంకుశ నిజాంను క్షమించాలని మన ముఖ్యమంత్రి కోరుకోవడం, ఆయన రాజకీయ పేరాశను, ప్రజా హృదయాన్ని అర్థం చేసుకోలేని అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తుంది.

‘భారత్‌, చైనా యుద్ధం సందర్భంగా 6 టన్నుల బంగారాన్నిచ్చిన మహనీయుడు నిజాం’ అని నిజాం భజన చేస్తున్న ముఖ్యమంత్రికి ఆ బంగారం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదా ?. ఎండకు ఎండి, వానకు తడిసి, రక్తాన్ని చెమటగా మార్చుకొని తెలంగాణ పేద రైతులు పంటలు పండిస్తే, ‘పటేళ్ళు, పట్వారీలు, దొరలు’ అనే దోపిడీ దొంగల ముఠాలను వారిపైకి ఉసిగొల్పి వారిని నిలువు దోపిడీ చేసి కూడబెట్టిందే కదా ఆ బంగారం. ఆ అమాయక శ్రమ జీవుల కష్ట ఫలితాన్ని దోచుకున్న పాప ఫలితమే, ఆ నిజాం నవాబులు కట్టించిన భవంతులు. ఈ విషయాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విస్మరించడం, రాజకీయ దివాళా కోరుతనానికి పరాకాష్ట.

రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి పీఠం దక్కదేమోననే అనుమానం, ఆత్మ విశ్వాస రాహిత్యమే. కెసిఆర్‌ను ఇలాంటి బాధ్యతా రాహిత్య ప్రకటనలు చేసే విధంగా ప్రేరేపించిందని అనుకోవలసి వస్తోంది. చరిత్ర శక్తిని గ్రహించని ఇలాంటి ఎంతోమంది రాజకీయ నాయకులు చరిత్ర గర్భంలో కలిసిపోయారని కెసిఆర్‌ గ్రహించాలి. చరిత్రను మార్చి రాయడం తన తరం కాదనీ, అది తన వ్యక్తిగత ఆస్తి కాదని ఆయన గుర్తించాలి. నిజాం పాలనా కాలంలో షోయ బుల్లాఖాన్‌ లాంటి అనేకమంది ముస్లిం మేధావులు సైతం అతని దాష్టీకాలను నిరసించారు. ప్రజాస్వామ్య వాదులు నిజాం నిరంకుశ చర్యలను ఎండగట్టారు. అలాంటి నిజాంను ప్రశంసిస్తూ పుస్తకాన్ని ప్రచురిస్తాం అని ప్రకటిస్తున్న సిఎం, అలా చేస్తే తెలంగాణ ప్రజలు తనని కూడా కాల గర్భంలో కలిపేస్తారని గ్రహించాలి. ఎందుకంటే ఇది దొరల రాజ్యం కాదు. ప్రజాస్వామ్య భారతం విలసిల్లుతున్న కాలం.

– లక్ష్మణ సేవక్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *