మోహన్‌లాల్‌ కశ్మీరీ అలియాస్‌ ఆగా హసన్‌ జాన్‌

మోహన్‌లాల్‌ కశ్మీరీ అలియాస్‌ ఆగా హసన్‌ జాన్‌

అఫ్గన్లను అడిగితే ఆయన పేరు మీర్జా కులీ కశ్మీరీ అని చెబుతారు. బ్రిటీషర్లకు, అఫ్గన్లకు మధ్య జరిగిన యుద్ధాల్లో ఆయన బ్రిటీషర్ల కోసం గూఢచర్యం చేశాడు. అఫ్గన్లను ఓడించేందుకు ప్రయత్నించాడు. తరువాత ఇరు సైన్యాల మధ్య సంధి చేయడంలో కీలక పాత్ర వహించాడు.

ఇరానియన్లను ఆయన గురించి అడగండి! ఆయన పేరు ఆగా హసన్‌ జాన్‌ కశ్మీరీ అని చెబుతారు. ఆగా హసన్‌ జాన్‌ పర్షియన్‌ భాషలో ఉద్దండుడని ఆయన చరిత్రంతా చెబుతారు. కానీ ఆయన అసలు పేరు మోహన్‌ లాల్‌ జుత్షీ. మోహన్‌ లాల్‌ కశ్మీరీ అన్న పేరు కూడా ఉంది. ఆయన పేరు మాత్రమే కాదు… వేషం మార్చేవాడు, భాష మార్చేసే వాడు. ఏ భాష మాట్లాడితే ఆ భాషే మాతభాషేనేమో అన్నంత అనర్గళంగా మాట్లాడేవాడు. కేవలం ఇరాన్‌, అఫ్గనిస్తాన్‌ మాత్రమే కాదు.. ఆయన మధ్య ఏషియా దేశాలన్నిటా వేర్వేరు పేర్లతో తిరిగాడు. ఆయా దేశాల సమాచారాన్ని సేకరించాడు. అవసరమైతే ముస్లిం పేరు పెట్టుకుని, స్థానికంగా ఉన్న ధనికులు, రాజవంశీకుల అమ్మాయిల్ని వివాహం ఆడేవాడు. వారి ద్వారా ఉన్నత స్థాయిలో సంబంధాలు పెంచుకుని, సమాచారాన్ని రాబట్టే వాడు.

గూఢచారుల గురించి పెద్దగా తెలియని రోజుల్లోనే మోహన్‌ లాల్‌ కశ్మీరీ ఢిల్లీ సింహాసనం కోసం ఆసియా ఖండమంతా తిరిగి సమాచారాన్ని సేకరించేవాడు. ఆయన తాత మొగల్‌ పాదుషా షా ఆలమ్‌ ఆస్థానంలో పనిచేసేవాడు. 1857 యుద్ధం జరుగుతున్న సమయంలో మోహన్‌ లాల్‌ బ్రిటీషర్ల పంచన చేరాడు. మళ్లీ మొగలు సామ్రాజ్యం రాకూడదన్న కోరికతో ఆంగ్లేయులకు సహకరించాడు. ఆంగ్లేయులు అఫ్గన్లతో చేసిన యుద్ధంలో కీలకపాత్ర పోషించాడు.

1831లో అలెగ్జాండర్‌ బర్న్స్‌ అనే బ్రిటీష్‌ గూఢచారితో కలిసి మోహన్‌ లాల్‌ కశ్మీరీ మధ్య ఆసియా అంతా తిరిగాడు. ఫ్రెంచ్‌, ఇంగ్లీష్‌, పష్తూ, ఫార్సీ వంటి పలు భాషలు నేర్చుకున్నాడు. 1841లో బర్న్స్‌, మోహన్‌ లాల్‌ కాబూల్‌లో ఉండగా ఆయనపై శత్రువులు దాడి చేశారు. బర్న్స్‌ను కాబూలీలు చంపేశారు. మోహన్‌ లాల్‌ మాత్రం తన పేరు మీర్జా కులీ అని చెప్పుకుని, కల్మా చదివి తాను ముస్లింనేనని నమ్మబలికాడు. అలా ఆయన బతికి బయటపడ్డాడు.

1845లో బ్రిటీష్‌ రాణి విక్టోరియా ఆయనను లండన్‌కు ఆహ్వానించి సత్కరించింది. అప్పుడు ఆయన తన పేరు మోహన్‌ లాల్‌ కశ్మీరీ అని బయటపెట్టాడు. అప్పటి దాకా బ్రిటీషర్లు ఆయనను ముస్లిం అనే అనుకున్నారు.

అయితే ఆయన బ్రిటీషర్లతో ఉంటూనే వారి సమాచారాన్ని స్వాతంత్య్ర సమరయోధులకు అంద జేసేవాడు. ఆయన భార్య హైదరీ బేగమ్‌ బ్రిటీషర్లకు సంబంధించిన సైన్యం వివరాలన్నీ సేకరించి రాసుకుంటూ ఉండేది. ఇవన్నీ స్వాతంత్య్ర సమరవీరులకు అందజేసేది. ఇలా ఒకే సమయంలో మోహన్‌ లాల్‌ అటు బ్రిటీషర్లకు, ఇటు స్వాతంత్య్ర సమరయోధులకు సమాచారాన్ని అందించే వాడు. ఈ విషయం బయటపడిన తర్వాత ఆయన భార్యను బ్రిటీషర్లు కట్టడి చేశారు.

ఒకే సమయంలో ఆయనను బ్రిటీష్‌ పాలకులు, మొగలులు, అఫ్గన్‌ దుర్రానీ పాలకులు సత్కరించి, బిరుదులు ప్రదానం చేయడం విశేషం. ఇది ఆయన దౌత్య వ్యవహార చాతుర్యానికి అద్దం పడుతుంది. ఈజిప్టు , ఇంగ్లండ్‌, బెల్జియం, స్కాట్లండ్‌, ఐర్లండ్‌, జర్మనీలలో కూడా ఆయన పర్యటించాడు.

1857 స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆయనను బ్రిటీషర్ల తొత్తుగా భావించి భారతీయ సైనికులు ఆయనను వెన్నాడారు. కానీ ఆ తరువాత నుంచే బ్రిటీషర్లు ఆయనను పట్టించుకోవడం మానేశారు. ఆయనకు ఇస్తామని చెప్పిన ధనాన్ని ఇవ్వలేదు. బ్రిటీషర్ల కోసం ఆయన చేసిన అప్పులను వారు తిరిగి చెల్లించలేదు. ఫలితంగా ఆయన ఆస్తులు కరిగిపోయి కటిక పేదవాడిగా మారిపోయాడు. ఒక్క ముద్ద అన్నం కోసం కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. తెల్లవాళ్లతో తిరిగినందుకు మోహన్‌ లాల్‌ను కశ్మీరీ పండితులు సమాజం నుంచి బహిష్కరించారు. ఆయన ఆగా హసన్‌ జాన్‌ కశ్మీరీ అన్న పేరునే స్థిరం చేసుకుని తన చివరి రోజులు గడిపాడు. చివరికి ఒక రోజు ఆయన చనిపోయాడు. ఢిల్లీలో ఇప్పటికీ ఆగా హసన్‌ జాన్‌ కశ్మీరీ సమాది ఉంది.

ఆ కాలంలోనే గూఢచర్యం చేసి, పలు దేశాల సమాచారం సేకరించిన మోహన్‌ లాల్‌ కశ్మీరీ గురించి ఇప్పటి తరం కశ్మీరీలకు ఏమీ తెలియదు. మోహన్‌ లాల్‌ కశ్మీరీ అటు మొగలులు, స్వతంత్ర పోరాట యోధులు, బ్రిటీషర్లు.. ఇటు అఫ్గన్లు, పర్షియన్లు.. ఎవరి నమ్మకాన్ని చూరగొనలేక అజ్ఞాతంగా ఆఖరి రోజులు గడిపాడు.

– ప్రభాత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *