ముగిసిన అధ్యాయం మళ్ళీ తెరపైకి

ముగిసిన అధ్యాయం మళ్ళీ తెరపైకి

గత ఏడాది కాలంగా కనుమరుగైన ఏపి ప్రత్యేక హోదా అంశం రూపాంతరం చెంది ప్రత్యేక ప్యాకేజీగా మారినా మన అవకాశవాద నాయకులు మరోసారి ఆ తేనెతుట్టెనే కదిపి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనుకోవడమే బాధాకర పరిణామం.

రాష్ట్ర విభజనానంతరం ఏపికి ప్రత్యేక హోదాపై నామమాత్రంగా ఉద్యమాలు జరిగాయే గానీ, ఏ ఒక్క పార్టీ కూడా చిత్త శుద్ధితో ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఈ అంశంపై పోరాడిన కాంగ్రెస్‌ పార్టీకి జనాదరణ లేకపోవడం, అధికారపక్షమైన తెలుగుదేశం హోదా కన్నా ప్యాకేజీయే ముద్దంటూ సర్దుకు పోవడం, ప్రధాన విపక్షమైన వైకాపా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా హోదా అంశాన్నే ప్రస్థావించ కుండా కేంద్రంలోని ఎన్డీఏకు బేషరతుగా మద్దతు ప్రకటించడం, హోదా ఇవ్వకుంటే రాజీనామా చేస్తామన్న వైకాపా ఎంపీలు మౌనవ్రతం పాటించడం తదితర వరుస పరిణామాలతో ‘హోదా’ అంశం ఇక గతించిన చరిత్రే అనుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు.

ప్రత్యేక ప్యాకేజీ రూపంలో రాష్ట్రానికి నిధులు కూడా దశల వారీగా వస్తూనే ఉన్నాయి. ప్రత్యేక హోదా అంశమన్నది తెరమరుగై ప్రజలు ప్రశాంతంగా ఉన్న సమయంలో వైకాపా అధినేత వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి తాజాగా మరోసారి ఆ తేనెతుట్టెను కదిలిరచారు. జనవరి 22న ఓ జాతీయ ఛానల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏపికి ప్రత్యేకహోదా ఇస్తే వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలసి నడిచేందుకు సిద్ధమేనంటూ తన అంతరంగాన్ని ఆవిష్కరించడంతో ఆంధ్రలో మళ్లీ హోదా ప్రకపంనలు మొదలయ్యాయి.

ఏపికి ప్రత్యేక హోదా రాదన్న విషయం జగన్‌కు తెలిసినా మరోసారి ఆ తేనెతుట్టెను కదిపి తన చిరకాల ప్రత్యర్థి అయిన చంద్రబాబును ఇరుకున పెట్టాలన్నదే ఆయన టార్గెట్‌గా స్పష్టమవుతోంది. జగన్‌ వాదంతో ఒక్కసారిగా రాజకీయ పార్టీలు ఉలిక్కి పడ్డాయి. ఎన్నికల ఏడాది కావడంతో హోదా సెంటిమెంట్‌నే ప్రధాన అస్త్రంగా చేసుకొని ప్రజల మద్దతును కూడగట్టాలన్న లక్ష్యంతో వైకాపా పావులు కదుపుతుండగా ఈ సరికొత్త సవాల్‌ను ఎలా అధిగమించాలో తెలియక అధికారపక్షం విలవిల్లాడు తోంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపికి ప్రత్యేక హోదాకు సంబంధించి ఎలాంటి చట్ట బద్ధత కల్పించని కాంగ్రెస్‌ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇచ్చిన మాట ప్రకారం ఏపికి ప్రత్యేక హోదాను ఇస్తామంటూ సెలవిస్తోండటం విస్మయాన్ని కల్గిస్తోంది.

బిజెపితో పొత్తు కోసమే జగన్‌ హోదా నాటకానికి తెరలేపారంటూ అధికారపక్ష నాయకులు విరుచుకు పడుతున్నారు. జగన్‌ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలతో ఏపిలో సరికొత్త పొత్తుల సమీకరణ లపై కూడా నేడు చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బిజెపితో జగన్‌ పొత్తు కోరుకొంటున్నారంటూ కొంతమంది టిడిపి నాయకులు భావిస్తుండగా ఆ అవకాశమే లేదని బిజెపి నాయకులు కొట్టిపారేస్తు న్నారు. హోదా కోసం తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తానంటూ గతంలో పలుమార్లు చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ఆ మాటను నిలుపుకోకుండానే హోదా ఇస్తే పొత్తుకు సిద్దమనడం విమర్శలకు అవకాశ మిస్తోంది. జగన్‌ వ్యాఖ్యలను మంత్రి కామినేని శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో ఖండిరచారు. మరో మంత్రి మాణిక్యాల రావు దీనిపై స్పందిస్తూ రాష్ట్రంలోను, కేంద్రంలోను ఎన్డీఏ కూటమి చక్కని అవగాహనతో పనిస్తోందని, జగన్‌ స్వచ్ఛందంగా మద్దతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొనడం విశేషం. ఒకరు ప్రత్యేక హోదా పేరుతో, మరొకరు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రధాని మోదీ దగ్గర తమ ప్రాబల్యం కోసం పడుతున్న తంటాలను చూసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నవ్వుకొంటున్నారు.

ఏ పార్టీ అయినా తనతో కలిసి వచ్చే మరో పార్టీతో పొత్తు పెట్టుకోవడంలో తప్పులేదు. కాని ఈ అవకాశవాద చెలిమికి ప్రజా సమస్యల రంగు పులమడం ఎంతవరకు సమంజసమన్నదే ప్రశ్నార్థ కంగా మిగులుతోంది. ¬దా అంశం ప్రస్తుతానికి ముగిసిన అధ్యాయమే అయినా ఎన్నికల మూడ్‌ను బట్టి మోదీ ఏం చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికార పగ్గాలను చేపట్టిన నాటి నుంచి అప్రతిహతం గా జైత్రయాత్రను కొనసాగిస్తున్న మోదీ ఈ సారి దక్షిణాదిపై గురి పెట్టారని, బిహార్‌కు ఇచ్చినట్లుగానే భారీస్థాయిలో ఏపికి కూడా నిధులిచ్చే అవకాశా లున్నాయని కొంతమంది భావిస్తున్నారు.

– పద్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *