మాల్దీవుల సంక్షోభం మరో డోక్లాం !

మాల్దీవుల సంక్షోభం మరో డోక్లాం !

డోక్లాం ఘటన జరిగి ఆరునెలలు కూడా కాలేదు. చైనా అదుపు తప్పి హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవులతో కలిసి డోక్లాం-2ను సృష్టించి భారత్‌ను ఇబ్బందిపెట్టాలని చూస్తోంది. సముద్ర తీర ప్రాంతాలలో సైన్యం దూకుడును పెంచడానికి చైనా పూనుకుంది. భవిష్యత్తులో యుద్ధం సంభవిస్తే ఈ స్థావరాలను తన కేంద్రాలుగా చేసుకోవాలని చైనా యోజన.

మాల్దీవులలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి, అధ్యక్షుడిగా ఎన్నికైన నషీద్‌ను 2012లో తుపాకి గురిపెట్టి పదవీచ్యుతిడిని చేశారు. 2013లో యమీన్‌ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుండి హిందూ మహాసముద్రంలోని ఈ ద్వీప సమూహం పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లయింది. యమీన్‌ మాల్దీవుల చారిత్రిక సంస్కృతికి తిలోదకాలిస్తూ ఇస్లాం ఛాందసవాదులకు మద్దతు పలకడం మొదలుపెట్టాడు. దీని ప్రభావం వలన మాల్దీవులలో ‘వహబీ’ సంస్కృతి విస్తరించింది. సిరియాలో పోరాడుతున్న ఇస్లామిక్‌ తీవ్రవాదులు, ఇరాక్‌లో ఉన్న ఇస్లామిక్‌ తీవ్రవాదులలో అత్యధికులు మాల్దీవుల నుండి వెళ్ళినవారే. ఈ విధంగా మాల్దీవులు ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రంగా మారి పోయింది. ఈ దీవులలో పెరుగుతున్న మతపరమైన ఉగ్రవాదం నెమ్మదిగా డ్రాగన్‌కు చేరువైంది. గత నెలలో వెంట వెంటనే వరద ఉధృతివలే సంభవించిన మార్పులు భారతదేశాన్ని కలవరపరచేవిగా ఉన్నాయి. అధ్యక్షుడు యమీన్‌ ప్రతిపక్ష నాయకులను చెఱసాలలో బంధించాడు. ఆ దేశ సుప్రీంకోర్టు ప్రతిపక్ష నాయకులను విడుదల చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవలసిందని యమీన్‌ను ఆదేశించాయి. కాని యమీన్‌ సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించాడు. అంతేగాకుండా సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీలను జైలుపాలు చేశాడు. పార్లమెంటు మూసి వేశాడు. మాల్దీవులలో 15 రోజుల అత్యవసర పరిస్థితిని విధించాడు. పశ్చిమాదేశాలు, భారత్‌ పలుమార్లు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించమని కోరినా యమీన్‌ ధిక్కరించి, అత్యవసర పరిస్థితిని 30 రోజులకు పెంచాడు.

దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి దారితీసిన పరిస్థితులను వివరించడానికి అధ్యక్షుడు యమీన్‌ కొంతమంది అధికారులను తన మిత్ర దేశాలైన పాకిస్తాన్‌, సౌదీ అరేబియా, చైనాలకు పంపించాడు. ఢిల్లీకి తమ దూతను పంపడానికి ఢిల్లీ అధికారులతో సమయం కుదరలేదని మాల్దీవుల ప్రభుత్వం పేర్కొన్నది. అధ్యక్ష పీఠం నుండి తొలగించబడిన ‘నషీద్‌’ భారత ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోమని పరిస్థితులు చక్కదిద్దమని కోరాడు. ఇది ఇష్టం లేని చైనా ఒక ప్రకటన చేస్తూ ‘ఆ సమస్య మాల్దీవుల ప్రజల అంతర్గత సమస్య. ఆ సమస్యను వారు కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. అందులో ఇతర దేశస్థులు జోక్యం చేసుకునే అవసరం లేదు’ అంది. అంటే చైనా ఒక రకంగా భారతదేశానికి హెచ్చరిక చేస్తూ మరోవైపు అధ్యక్షుడు యమీన్‌ చర్యలకు మద్దతిస్తున్నట్లే.

జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న భారత దౌత్యాధికారి అఖిలేష్‌ మిశ్రా మాల్దీవుల విదేశాంగ కార్యదర్శి అహ్మద్‌ షరీఫ్‌ను రెండుసార్లు కలిశాడు. షరీఫ్‌ మాట్లాడుతూ దేశంలో అత్యవసర పరిస్థితిని ముందు అనుకున్నట్టుగానే 15 రోజులకే ఎత్తి వేస్తామని అఖిలేష్‌తో అన్నారు. ఫిబ్రవరి 20 నాటికి ఎమర్జన్సీ తొలగిస్తామని అన్నాడు. ఇక కొన్ని గంటలలో అత్యవసర పరిస్థితి ముగిసిపోతుందనగా దానిని పొడిగించడానికి యమీన్‌ తన పార్లమెంటు సభ్యులతో అసాధారణ సమావేశం నిర్వహించాడు. ఈ సభకు విపక్షాలు హాజరు కాలేదు. చట్టం రూపొందడానికి 43 మంది పార్లమెంటు సభ్యుల సంఖ్య కావాలి. కాని 38 మందే ఉన్నారు. వీరి మద్దతుతోనే ఆ బిల్లును నేషనల్‌ సెక్యూరిటీ కమిటీ ఆమోదానికి పంపించారు. ఈ విషయంపై భారత్‌ మాల్దీవుల ప్రభుత్వాన్ని హెచ్చరించింది. యమీన్‌ భారత్‌ హెచ్చరికను ఖాతరు చేయకుండా అత్యవసర పరిస్థితిని పొడిగించాడు. ఈ అత్యవసర సమయంలో సౌదీ అరేబియా మాల్దీవులకు 160 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ సమయంలోనే చైనా సుందా జలసంధి ద్వారా Surface Active Group కు చెందిన మూడు ఓడలను మాల్దీవులకు పంపించింది. డోక్లాం ఘటన జరిగి ఆరునెలలు కూడా కాలేదు. చైనా అదుపు తప్పి హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవులతో కలిసి డోక్లాం-2ను సృష్టించి భారత్‌ను ఇబ్బందిపెట్టాలని చూస్తోంది. సముద్ర తీర ప్రాంతాలలో సైన్యం దూకుడును పెంచడానికి చైనా పూనుకుంది. భవిష్యత్తులో యుద్ధం సంభవిస్తే ఈ స్థావరాలను తన కేంద్రాలుగా చేసుకోవాలని చైనా యోజన. చైనా యోజనను పరిశీలిస్తే అది మాల్దీవులతో భారత్‌ తలపెట్టిన సైనిక విన్యాసాలకు అడ్డుపడేలా ఉంది.

భారత్‌పై చైనా నిఘా స్థావరం

చైనా మాల్దీవులలో ఒక అబ్జర్వేటరీ (పరిశీల నాలయం) ని నిర్మించడానికి పూనుకుందని మాల్దీవుల ప్రతిపక్ష నాయకులు నివేదికలు ఇస్తున్నారు. దీనికి చైనా ‘సినో-మాల్దీవుల జాగ్రత్త స్నేహం’ అనే పేరు తగిలించారు. దీని ప్రధాన స్థావరం పశ్చిమంగా ఉన్న పగడాలదీవి యొక్క ఉత్తర ప్రధాన సముద్ర మార్గంలో ఉంటుంది. గడిచిన 2017లో యమీన్‌ చైనా పర్యటనలో ఈ ‘అబ్జర్వేటరీ’ నిర్మాణ విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. దీంతోపాటు స్వేచ్ఛా వాణిజ్యం గురించి ఒప్పందాలు కుదిరాయి. చైనా మాల్దీవులలో ‘మాకునుదూ’లో ఏర్పాటు చేస్తున్న స్థావరం భారతదేశానికి సమీపంలోనే ఉంటుంది. భారత మినికాయ్‌ ద్వీపం, ఉత్తర మాల్దీవులు దగ్గరగానే ఉంటాయి. భారత్‌కు చెందిన లక్షద్వీపం నుండి 700 కి.మీ. దూరంలోనూ, భారత భూభాగం నుండి 1200 కి.మీ. దూరంలో ఈ అబ్జర్వేటరీ ఉండ బోతోంది. భారత రక్షణ దృష్ట్యా ఈ అబ్జర్వేటరీ ప్రమాదకరంగా పరిణమించవచ్చు. చైనా ఇప్పటికే భారత్‌ చుట్టూ ముత్యాలహారం చుడుతోంది. కావున ఈ అబ్జర్వేటరీ పూర్తయితే చైనా సముద్ర బలం మరింత బలపడుతుంది.

దేశంలో అంతర్గతంగా అడ్డంకులు లేనందు వలన యమీన్‌ ఆడింది ఆట పాడింది పాటగా మారింది. తనకు వ్యతిరేకంగా నిరసనలు తెలియ జేస్తున్న నలుగురు ప్రతిపక్ష నాయకులను బంధించి జైలుపాలు చేశాడు. నలుగురు అంతర్జాతీయ న్యాయ వాదులు మాల్దీవులలో నెలకొని ఉన్న అత్యవసర పరిస్థితులను అధ్యయనం చేయడానికి మాల్దీవులకు చేరుకున్నారు. వారిని బంధించి వెంటనే దేశ బహిష్కరణ చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన యమీన్‌ ఆసియా బృందాన్ని మాల్దీవులలో పరిస్థితిని పరిశీలించడానికి ఆహ్వానించారు. ప్రతినిధి బృందం చేరుకున్న తర్వాత వారికి ‘వీసా’ నిరాకరించాడు. ఆ ప్రతినిధి బృందంలో భారత్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌ కుమార్‌ కూడా ఉన్నారు. అబ్దుల్‌ గయూమ్‌ మేనకోడలు దువ్వా మౌమూన్‌ యమీన్‌ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రి యమీన్‌ నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడుల వల్ల ఆమె తన పదవికి రాజీనామా చేసింది.

నౌకా విన్యాసాలకు మాలే తిరస్కరణ

భారత్‌-మాల్దీవుల సంబంధాలు పలుచన కావడానికి ‘మాలే’ (మాల్దీవులు) మరో అడుగు వేసింది. ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా నౌకా విన్యాసాలు నిర్వహిద్దామన్న భారత ఆహ్వానాన్ని ‘మాలే’ తిరస్కరించింది. ఈ విన్యాసాలను ‘మిలాన్‌’ అని నామకరణం చేశారు. ఇలాంటి ‘మిలన్‌’లో మాల్దీవులు 1995 నుండి పాల్గొంటున్నాయి. మాల్దీవుల ప్రతినిధి భారత్‌ ప్రతినిధితో మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలుగా మన ఇరుదేశాల మధ్య సైనిక సహకారం బాగానే ఉంది. కాని ఇప్పుడు మా దేశంలో నెలకొని ఉన్న అత్యవసర పరిస్థితి వలన ‘మిలన్‌’ ఉమ్మడి విన్యాసాలలో పాల్గొనలేక పోతున్నామని వివరించాడు. ఈ సంవత్సరమే భారత్‌ నావికాదళం వద్ద మాల్దీవుల నావికాదళం శిక్షణ ప్రారంభించింది. ఇదే సమయంలో చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ‘మిలన్‌’ విన్యాసాలపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. భారత్‌ చైనాను రెచ్చగొడుతోంది. దీనివల్ల చైనా-భారత్‌ సంబంధాలు మెరుగుపడవని ఆరోపించింది.

నిబంధనల ఉల్లంఘన

చైనా కౌగిలిలో మాల్దీవులు సౌకర్యంగా ఉన్నాయను కుంటూండగానే జపాన్‌ అదంతా బుకాయింపు అని హెచ్చరిస్తోంది. yellow sea జపాన్‌ నిఘా నేత్రంలో ఉంటుంది. ఆ నిఘా నేత్రంలో అది మాల్దీవుల పతాకంతో వెళ్తున్న ఒక నౌకను గుర్తించింది. ఆ నౌక పేరు Xin Yuan 18. ఇలాంటి నాలుగు నౌకలు ఉత్తర కొరియాకు సరకులు రవాణా చేస్తున్నాయి. ఇలా రవాణా చేయడం యునైటెడ్‌ నేషన్స్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (unsc) నిబంధనలను ఉల్లంఘించడమే అని జపాన్‌ పేర్కొంది. జపాన్‌ విదేశాంగ శాఖ మాల్దీవులపై చేసిన ఈ ఆరోపణలను ‘మాలే’ వెంటనే ఖండించింది. అక్రమ రవాణాకు తమ జాతీయ పతాకాన్ని ఉపయోగించడాన్ని మేము ఖండిస్తున్నా మని ప్రకటించారు. కాని ‘Wion’  స్వతంత్రంగా మాల్దీవుల ఖండనను పరిశీలించగా మాల్దీవుల ప్రభుత్వం అబద్ధమాడినట్టుగా తేలింది. ఆ నౌకలు మాల్దీవులలో రిజిష్టరు అయినవే అని తేల్చి చెప్పింది. ఈ సంఘటన చైనా – మాల్దీవుల మధ్య మైత్రిని తెలియజేస్తున్నది.

యమీన్‌ ఇలా చెలరేగి పోవడానికి ఎవరి మద్దతు ఉందో సామాన్యులకు కూడా అర్థమవు తుంది. చైనా నుండి మాల్దీవులు 70 శాతం అప్పులు పొందింది. అందుకే చైనా ఎలా చెబితే అలా నడుచుకోవలసిందే. ఇప్పటివరకు చైనా పాకిస్తాన్‌, నార్త్‌ కొరియాలను మిత్ర దేశాలుగా చేసుకుంది. ఇపుడు మూడవ మిత్రదేశం మాల్దీవులు. ఈపరిణామాలు భారత దేశానికి అనుకూలమైనవి కావు.

సమస్యను భారత్‌ పరిష్కరించాలి

మాల్దీవుల స్థిరత్వంపై భారత వ్యూహాత్మక ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. మాల్దీవులు అస్థిరమైతే అది భారత్‌కు ప్రమాదకరం. విద్యార్జనకైనా, చికిత్సకైనా మాల్దీవుల ప్రజలు భారత్‌కి వస్తుంటారు. సందర్శకులు వస్తుంటారు. కాబట్టి మాల్దీవులపై సైనిక చర్య తీసుకొంటే భారత్‌ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. కాని ఆసక్తికరమైన విషయమేమంటే భారత్‌ చుట్టూ ఉన్న చిన్న దేశాలు భారత్‌కు దగ్గర కావడానికి ‘చైనా కార్డును’ ఉపయోగిస్తున్నాయి. ఈ సమస్య సాధనలో భారత్‌ విఫలమైతే శత్రు దేశాల నుండి భారత్‌ మమ్ములను రక్షిస్తుందనే నమ్మకం వమ్ము అయిపోతుంది. ఒకవేళ మాల్దీవుల సమస్యలలో జోక్యం చేసుకోకపోతే మిత్ర దేశాలను కోల్పోవలసి వస్తుంది. ‘మిత్ర దేశాలతో సత్సంబం ధాలు నెలకొల్పుకోవడమే మా మొదటి ప్రాధాన్యం’ అన్న విధానానికి విఘాతం కలుగుతుంది. డొక్లాంలో చైనాకు బుద్ధి చెప్పిన విధంగానే మాల్దీవుల విషయంలో కూడా ఒక అనుకూల విధానాన్ని అవలంభించి సమస్యను పరిష్కరించుకోవాలి.

ఇలాంటి దౌత్య సందిగ్ధంలో భారత్‌ తన ముందు కొన్ని అవకాశాలను ఉంచుకొంది. unscకి ఇండోనేషియా అభ్యర్థిని బలపర్చడం ఒకటి. ఇది మాల్దీవులను వ్యతిరేకించినట్లు. యూరోపియన్‌ యూనియన్‌కు చెప్పి మాల్దీవులపై కొన్ని ఆంక్షలు విధించడం. ప్రత్యామ్నాయంగా భావస్వారూప్యం గల దేశాలతో కలిసి యమీన్‌పై ఒత్తిడి పెంచి ఆ దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పేలా చేయడం. అధికారవాదం మరియు రాడికల్‌ ఇస్లాం ఇవి రెండు కలిస్తే జరిగేది సర్వనాశనమే. హిందూ మహాసముద్రంలో ఉన్న స్వర్గధామాలైన ఈ ద్వీపాలు ఈ రెండింటివల్ల తుడిచి పెట్టుకుపోతుంటే, ఈ సమస్యను పరిష్కరించడంలో భారత్‌ వెనకబడి ఉంటే మరింత అయోమయానికి దారితీస్తుంది.

– తీగెల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *