మహానాడు ఖర్చు ప్రజల ముందుంచాలి

మహానాడు ఖర్చు ప్రజల ముందుంచాలి

తెలుగుదేశం మహానాడు జాతర ముగిసింది. రాష్ట్రం మొత్తం నుండి తెలుగు తమ్ముళ్ళు పసుపు జాతరలో పాల్గొన్నారు. ఈ మహానాడు ద్వారా గత మహానాడులలో జరగని విధంగా తెలివిగా జాతీయ రాజకీయాలలో ప్రత్యేక పాత్ర పోషించాలని రాజకీయ తీర్మానం చేశారు. అంతకు మించి మహానాడు ద్వారా ప్రజలకు తెదేపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్ర బాబు అందించిన సందేశం శూన్యం.

3 రోజుల పాటు జరిగిన మహానాడులో మొత్తం 37 తీర్మానాలు చేశారు. అందులో 4 తీర్మానాలు కేంద్రం, మోదీ, అమిత్‌షాలను విమర్శిస్తూ చేసినవే. మిగిలిన తీర్మానాలు కూడా వాటిపై చర్చ జరుగు తున్నప్పుడు చంద్రబాబు జోక్యం కలుగజేసుకుని మోదీని, కేంద్రాన్ని విమర్శించటానికే ఎక్కువ సమయం కేటాయించారు. మొత్తంమీద మహానాడు మొత్తంలో కేంద్రాన్ని, మోదీని, విపక్షాలను విమర్శించ టానికే బాబు ఎక్కువ సమయం కేటాయించారు.

దేశంలోని కాంగ్రెస్‌తో పాటు, వివిధ ప్రతిపక్షాలు బిజెపిపై చేస్తున్న విమర్శలనే బాబు తిరిగి అందుకు న్నారు. మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుతున్నట్లుగా సంకేతాలు పంపారు.

మహానాడులో ముస్లిం టోపితో ముఖ్యమంత్రి

ఇస్లాం, క్రైస్తవాల వైపుకు మొగ్గు

లోక్‌సభలో త్రిపుల్‌ తలాక్‌ బిల్లును సమర్ధించిన తెలుగుదేశం పార్టీ, రాజ్యసభలో దాన్ని వ్యతిరే కించటం ద్వారా చంద్రబాబు తన కపట స్వభావాన్ని బయటపెట్టారు. ఈ రోజున ముస్లిం ఓట్ల కోసం మైనారిటీలను బుజ్జగించటం, మదరసాలకు నిధులు కేటాయింపు, విజయవాడలో హజ్‌ యాత్రీకుల కోసం పక్కా భవన నిర్మాణం మొదలైన కార్యక్రమాలు నిర్వహించి ముస్లిం ఓటు బ్యాంకు కోసం తాపత్రయ పడుతున్నారు. మొన్న జరిగిన మహానాడుకు సహితం ముస్లిం సాంప్రదాయ దుస్తులలో వచ్చి ముస్లిం ఓట్లను ఆకర్షించడం కోసం ప్రయత్నం చేసారు.

ఇంతకుముందు చర్చిల చుట్టూ తిరిగారు. ఫాదర్లను కలిసారు. కూటములలో బైబిల్‌ చదివి వినిపించారు. శిథిలావస్థకు చేరిన చర్చిలను బాగుచేయటం కోసం నిధులు కేటాయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తానొక క్రైస్తవ ప్రభోధకుడిగా అవతారం ఎత్తారు.

క్రైస్తవ వేదికపై ముఖ్యమంత్రి బైబిల్‌ పఠనం

హిందుత్వపై చిన్నచూపు

కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ నగరంలో తెదేపా ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పేరిట 39 పురాతన దేవాలయాలను విధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి వాటిలో కనీసం ఒక్క దేవాలయం పునఃనిర్మాణం కోసం చేసిన ప్రయత్నం ఏమి లేదు. ఆ దేవాలయాల గురించి మాట్లాడిన దాఖలాలు ఎంత మాత్రం లేవు. తిరుమల తిరుపతి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను కూడా ఉన్నపళంగా ఇంటికి పంపించి, హిందువుల పట్ల అత్యంత అన్యాయంగా ప్రవర్తించారు. దీన్నిబట్టి కాంగ్రెస్‌ వంటి పార్టీల లాగానే చంద్రబాబుకు కూడా హిందూ సమాజం పట్ల విశ్వాసం లేదనే విషయం మెల్లగా అర్థమవుతోంది.

తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్న సందర్భంగా ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలకు చంద్రబాబు తెరలేపారు. మహానాడు ద్వారా దేశ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల వేదికగా చక్రం తిప్పాలనే వ్యూహం కనపడుతోంది. కాంగ్రెస్‌ పార్టీకన్నా, బిజెపిని ఎక్కువ శత్రువుగా చూడటం, మహానాడు వేదికపై నుండి బిజెపిని ఎక్కువగా విమర్శించడం మొదలైన ఎత్తుగడలు కాంగ్రెస్‌ను తెలుగుదేశం పార్టీకి తక్కువ శత్రువుగా చూపడానికి, కాంగ్రెస్‌ పార్టీతో సంబంధాలు పెంచుకోడానికే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలి లేదా ఒంటరిగా పోటీ చేయాలి. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే ఏమవుతుందో చంద్రబాబుకు తెలుసు. 2009 మహా కూటమి (గ్రాండ్‌ అలయెన్స్‌) లో టి.డి.పి చావుదెబ్బ తిన్న విషయం చంద్రబాబు మరచిపోక పోవచ్చు. చంద్రబాబును సమర్ధిస్తున్న మిగతా ప్రాంతీయ పార్టీలకు ఆంధ్ర ప్రదేశ్‌లో బలం లేదు. తెలుగుదేశం ఆవిర్భాం నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎక్కువసార్లు ఎవరో ఒకరితో ఎన్నికల పొత్తు పెట్టుకునే పోటీచేసింది. ఒంటరిగా పోటీ చేసింది అతి తక్కువ సార్లు. ఇది బాబుకు తెలిసిన విషయమే. 2019లో తిరిగి అధికారంలోకి రావటం కోసం ముస్లిం, క్రైస్తవుల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకో వాలని బాబు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

నిధులెక్కడివి ?

అట్టహాసంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి చల్లచల్లగా కూలర్లు, ఏ.సి.లు పెట్టి మహానాడు నడిపారు. మూడు రోజుల పాటు జరిగిన మహా నాడులో ఒక్క ప్రారంభ కార్యక్రమంలోనే 60 లక్షల ప్లాస్టిక్‌ నీటి సీసాల ఖర్చు అయ్యాయని వినికిడి. దానికితోడు అనేక రకాల వంటకాలు లక్షల మందికి వండిపెట్టారు. వీటి ఖర్చు కోట్లలో ఉండొచ్చు.

రాష్ట్రానికి నిధుల కొరత ఉందని, కేంద్రం నిధులు ఇవ్వటం లేదని చెబుతున్న ముఖ్యమంత్రికి మహానాడు జాతరకు ధనం ఎక్కడి నుండి వచ్చింది? ప్రజలు ఉదారంగా విరాళాలుగా ఇచ్చారా? లేక ఏదైనా కార్పొరేటు సంస్థ మొత్తం ఖర్చు భరించిందా? ఈ విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇదంతా ప్రజాధనమే అయినట్లయితే ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. స్వచ్ఛమైన పాలన, పారదర్శక పాలన చేస్తున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి మహానాడు ఖర్చును ప్రజలముందుంచాలి.

– పద్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *