మంచుకొడలపై మహా సాహస చరిత్ర

మంచుకొడలపై మహా సాహస చరిత్ర

దేహ్‌ శివా వర్‌ మోహ్‌ ఇహే

శుభ్‌ కర్మన్‌ సే కభున టరూ

నడరూ అరి సే జబ్‌ జాయే లడూ

నిశ్చయ్‌ కర్‌ అపనీ జీత్‌ కరూ

(ఈ దేహం దేవుడిచ్చిన వరం. మంచి పనులు చేయడంలో వెనకడుగు వేసేది లేదు. శత్రువుతో పోరాడేందుకు వెళ్తున్నప్పుడు నాలో భయం ఉండదు. దఢనిశ్చయంతో విజయం సాధించాలి.)

భయంకరమైన రణరంగంలో రక్తం పారుతున్న ప్పుడు, ఆకాశం ఆ ఎరుపును పులుముకున్నప్పుడు, కత్తుల కణకణల మధ్య, సైన్యాల రణధ్వనుల మధ్య ఉప్పొంగిన ఛాతీతో, ఉన్నత మస్తకంతో దశమేశ గురువు గురుగోవింద సింహుడు ఖడ్గాన్ని ఎత్తి నిలుచుని ఈ రణగీతం పాడుతున్నాడు. ఆయన మట్టి గుట్టల మధ్య మేరుశిఖరంలా భాసిస్తున్నాడు. ఆయన నుదురు ఆరిసేనల పాలిట రుద్రభూమి. కన్ను కోటి సూర్యులు. భుజం ఆది భుజంగం శేషువు, బాహువు శత్రువుల పాలిటి రాహువు.

వాహె గురూ దశమేశ్‌.. వాహె గురూజీ కా ఖాల్సా.. వాహె గురూజీ కా ఫతహ్‌..

ఒక్కసారిగా ఆ సైనికుడికి మెలకువ వచ్చింది. కలలో గురుగోవిందుడు కళ్ల ముందు నిలిచాడు. ఏవరా గురుగోవిందుడు ? భయంతో కిచకిచలాడే పిచ్చుకను గండభేరుండంగా మార్చేవాడు. పిరికి నక్కను పరాక్రమ సింహంగా మార్చేవాడు. సవాలక్ష మంది ఉన్న శత్రుసేనపై ఒక్కడే దూకి పోరాడి గెలిచేలా చేసేవాడు. ఆ సైనికుడి ఒళ్లంతా ఎదో తెలియని ప్రకంపనలు. ఎదో తెలియని ఉద్వేగం. ఎదో వర్ణనకందని ఉత్సాహం.

ఆ సైనికుడికి ఆ మరుసటి రోజు జీవితంలోని అత్యంత కఠిన పరీక్ష ఉంది. రెండు ట్రిలియన్‌ చదరపుటడుగుల మంచు, మైనస్‌ 52 డిగ్రీల చలి, మంచుకొండకు ఎక్కడ పగులు ఉందో తెలియదు. ఎప్పుడు మంచు తుఫాను మొదలవుతుందో తెలియదు. ఆ మంచు నరకంలో పదిహేను వేల అడుగుల ఎత్తున పాకిస్తానీ శత్రువు పొంచి ఉన్నాడు. శత్రువు చెక్‌ పోస్ట్‌ను చేరాలంటే పదిహేను వందల అడుగులు నిటారుగా ఉన్న మంచుకొండను ఎక్కాలి. పాకిస్తానీల పోస్టును చేజిక్కించుకోవాలి. మంచు తుఫాను మధ్యే ఎలాగోలా సర్దుకుని పడుకుంటే వచ్చిన కల అది !

1980వ దశకంలోనే ఆ మంచుకొండపై పాకిస్తాన్‌ కన్నుపడింది. దానిపై ఆధిపత్యం వస్తే చైనా – పాకిస్తాన్‌ రహదారి రాకపోకలపై భారత్‌ నుంచి ప్రమాదం ఉండదు. భారత్‌ చేతిలో ఉన్న లడాఖ్‌కి రక్షణ ఉండదు. ఆ ప్రాంతం పేరు సియాచిన్‌. పాక్‌ ఆ హిమానీ నదంలోని సాల్టరో రేంజ్‌లో స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అన్నిటికన్నా ఎత్తైనది, అత్యంత కీలకమైనది కాయద్‌ ఆజం పోస్ట్‌. కాయద్‌ ఆజం అంటే గొప్ప నాయకుడని అర్థం. పాకిస్తాన్‌ మహ్మద్‌ అలీ జిన్నాను ఆ పేరుతో సంబోధిస్తుంది.

ఈ పోస్టును చేజిక్కించుకునేందుకు భారత్‌ నిర్ణయించింది. 1987 మే నెలలో పాకిస్తాన్‌ కల్నల్‌ రాజీవ్‌ పాండే నాయకత్వంలోని దళాన్ని చంపేసింది. తొమ్మిది మంది చనిపోయారు. జూన్‌ నెలలో మేజర్‌ వరీందర్‌ సింగ్‌ నాయకత్వంలోని 8వ జమ్మూ లైట్‌ ఇన్‌ ఫాంట్రీ బెటాలియన్‌కు ఈ పోస్టును చేజిక్కించు కునే బాధ్యతను ఇచ్చారు. జూన్‌ 23న మన సైనికులు బయలుదేరారు. ఉదయం ఎనిమిదింటికి బయలుదేరి తెల్లవారు జామున నాలుగు గంటల దాకా ఎగబాకితే చేరుకుంది కేవలం 150 మీటర్లే. అంత కఠినమైన పరిస్థితులు. ముందు సుబేదార్‌ హర్నామ్‌ సింగ్‌. ఆ తరువాత సుబేదార్‌ సంసార్‌ చంద్‌ పైకి ఎగబాకుతూ ప్రాణాలు కోల్పోయారు. మేజర్‌ వరీందర్‌ సింగ్‌కి ఛాతీలో శత్రువు తూటా దిగింది. అప్పుడు రక్తమోడు తూనే మన నాయకుడికి, మరో ఇద్దరికి ముందుకు సాగమని ఆదేశాలిచ్చాడాయన. మిగతా ఇద్దరికీ మంచులో తీవ్ర అనారోగ్యం చేసింది. వారు ముందుకు వెళ్లలేకపోయారు. గురుగోవిందుడిని కలలో దర్శిం చిన మన యువ వీరుడు ఒంటరిగానే ముందుకు సాగాడు. మంచు తుఫానులో ఎగబాకు తూంటే చనిపోయిన ఎనిమిది మంది సైనికుల శవాలు కనిపించాయి. అతనిలో పట్టుదల మరింత పెరిగింది. కొండ మీదకి వెళ్లాడు. బయట నిలుచున్న ఇద్దరినీ పరలోకానికి పంపాడు. బంకర్‌లో మరో ఆరుగురు ఉన్నారు. బంకర్‌ తలుపు తెరిచి, గ్రెనేడ్‌ విసిరి, తలుపు మూసేశాడు. మరుక్షణం దిక్కులు పిక్కటిల్లే శబ్దం అయింది. శత్రువులందరూ సఫా అయిపోయారు. ఆ మరుసటి రోజు తెలిసింది వారంతా పాకిస్తాన్‌లోని అత్యంత కీలకమైన స్పెషల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌కి చెందిన షాహీన్‌ కంపెనీ సైనికులని.

జూన్‌ 26 నాటికి కాయద్‌ ఆజం పోస్టుపై త్రివర్ణపతాకం ఎగిరింది. ప్రపంచ సైనిక చరిత్రలోనే అసాధ్యమన్న పనిని ఆ సైనికుడు సుసాధ్యం చేశాడు. అందుకే ఆ పోస్టుకు ఆయన పేరు పెట్టారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో అత్యంత సాహసోపేతమైన పోరాటం చేసిన ఆ బాణం లాంటి సైనికుడి పేరు బాణా సింగ్‌. ఆ పోస్టు పేరు బాణా పోస్ట్‌.

బాణా పోస్ట్‌ మనచేతుల్లోకి రాగానే సియాచిన్‌పై భారత్‌ ఆధిపత్యం ఏర్పడింది. సియాచిన్‌ మన చేతుల్లోకి రావడం తోటే జమ్మూ కశ్మీర్‌లో అత్యంత వ్యూహాత్మకమైన పట్టు సాధించగలిగాం.

బాణా సింగ్‌కు పరమవీర చక్ర ప్రదానం చేశారు. ఆ తరువాత కూడా ఏళ్ల తరబడి సైన్యంలో సేవ చేసి, 32 ఏళ్ల తరువాత ఆయన రిటైర్‌ అయ్యి, జమ్మూ లోని తన సొంత గ్రామమైన కడ్యాల్‌లో వ్యవసాయం చేస్తూ కాలాన్ని గడుపుతున్నాడు. ఆయన కుమారుడు రాజేంద్ర సింగ్‌ తండ్రి బాటలోనే సైన్యంలో చేరాడు.

జమ్మూ కశ్మీర్‌ రక్షణలో అత్యంత కీలకమైన ఘట్టానికి కథానాయకుడైన బాణా సింగ్‌ను కలిస్తే ‘ఇతడేనా అంతటి మహాకార్యాన్ని చేసింది?’ అని పించక మానదు. అంత మామూలుగా, సీదాసాదాగా ఉంటాడీయన.

‘కాయద్‌ పోస్ట్‌ను చేజిక్కించుకున్న తరువాత ఏం చేశారు ? త్రివర్ణ పతాకం ఎగరేశారా ? భాంగ్రా నత్యం చేశారా ? గట్టిగా కేకలు వేశారా ?’ అని ఆయన్ను అడిగితే నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు. ‘పాక్‌ సైనికులందరూ చనిపోయాక అక్కడ ఒక స్టవ్‌ కనిపించింది. పక్కనే కాస్త బియ్యం కనిపిం చాయి. స్టవ్‌పై గిన్నె పెట్టుకుని అన్నం వండుకుని నేను, మా తోటి వారూ కలిసి తిన్నాం. ఒక్కొక్కరూ మూడేసి రోజులుగా అన్నం తినలేదు మరి’

మూడు రోజులు అన్నం, నిద్ర లేకున్నా కర్తవ్యం కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేశామన్న గొప్ప కూడా చెప్పుకోవడం తెలియదు పరమవీరచక్ర బాణా సింగ్‌కి.

‘నేను గొప్ప పనేం చేయలేదు. నా స్థానంలో ఎవరున్నా నేను చేసిందే చేసేవారు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను అంతే’ ఇవి బాణా సింగ్‌ గుండె లోతుల్లోంచి వెలువడ్డ మాటలు. ఇలాంటి వేలాది బాణాలే మన దేశానికి అభేద్యమైన రక్షణ కవచం.

– ప్రభాత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *