భరతమాత సేవలో ‘నవదీపం’

భరతమాత సేవలో ‘నవదీపం’

తలలో ఒకపక్క భాగం తూటా దెబ్బకి చితికి పోయింది. ఆవిరైపోతున్న ఆయుష్షులా రక్తం ధారాగా ప్రవహిస్తోంది. ఒళ్లంతా తూటాల గాయాలు. తన ఆయువు ఆఖరి ఊపిరిని లెక్కిస్తోంది.

అలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు.? మూలుగుతారు. మూర్ఛపోతారు. దాహం తీర్చాలని అడుగుతారు. కాని ఆ సైనికుడు మాత్రం గాయపడ్డ తోటి సైనికుడిని భుజానికి ఎత్తుకున్నాడు. మిగిలిన సత్తువను కూడగట్టుకుని గాయపడ్డ సోదరుడిని సురక్షిత ప్రదేశానికి తరలించడంలో నిమగ్న మయ్యాడు. ఆ క్షణంలో ఆయన సంజీవని దగ్గరికే లక్ష్మణుడిని మోసుకెళ్లిన హనుమంతుడు.

ఆ గాయపడ్డ సైనికుడి బతుకులో నవదీప్‌ ‘నవదీపం’ వెలిగించాడు. కాని తాను మలిగి పోయాడు. కొడిగట్టుతున్న ఆ దీపం కోటికాంతులను వెదజల్లే నవదీపంగా నిలిచింది. ఆ కోటికాంతుల నవదీపం పేరు లెఫ్టినెంట్‌ నవదీప్‌.

కాయాన్ని కర్పూరంలా, ఆయుష్షును హారతిగా చేసి భరతమాతను అర్చించడమే నిజమైన అర్చన. ఆఖరి ఊపిరిలోనూ కర్తవ్యాన్నే విశ్వసించగలగడమే అసలైన ప్రార్థన. అలాంటి యువకులు జాతికి నవదీపాలుగా వెలుగులనిస్తారు. అలాంటి వెలుగే లెఫ్టినెంట్‌ నవదీప్‌ సింగ్‌.

జమ్మూ కశ్మీర్‌ కోసం, భారత సమగ్రత కోసం, మన సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు నవనవలాడే నవ యవ్వనాన్ని నైవేద్యం చేసిన వాడు నవదీప్‌ సింగ్‌.

నవదీప్‌ ఎర్రగా, పండులా ఉండేవాడు. కుర్రతనం, ఎర్రదనం కలగలిసి తన ఆర్మీ యూనిట్‌కి బేబీ బాయ్‌గా పేరొందాడు. ఎంబీఏ చేసి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన నవదీప్‌ను చూస్తే సైన్యానికి పనికొచ్చేవాడిలా కనిపించే వాడు కాదు. కాని ఆ పువ్వులాంటి వ్యక్తిలో పులిలాంటి పొగరుండేది. వజ్రం లాంటి కాఠిన్యం ఉండేది. హిమాలయమంత ధైర్యం ఉండేది. అందుకే కార్పొరేట్‌ కెరీర్‌ను కాలదన్ని మరీ సైన్యంలో చేరాడు. రెండు తరాలుగా సైనికులుగా దేశాన్ని సేవించిన కుటుంబం అతనిది. నవదీప్‌ మూడో తరం సైనికుడు.

ఆగస్టు 19, 2011

అతని పెళ్లి సంబంధం గురించి తండ్రి, అక్క ఫోన్‌ చేశారు. ‘సెలవు దొరికినప్పుడు చూద్దాంలే’ అంటూ దాటవేశాడు నవదీప్‌. ఆ తరువాత రోజు అతనికి సెలవు దొరికింది. అయితే అది శాశ్వత సెలవు.

ఆగస్టు 20, 2011 తెల్లవారు జామున మూడు గంటలు

ఈ సమయంలో కశ్మీర్‌ లోయలో మేల్కొనేది ఇద్దరే. ఒకడు కశ్మీర్‌ దీపం కొడిగట్టించేందుకు కలాష్నికోవ్‌ పుచ్చుకుని పాకిస్తాన్‌ నుంచి చొరబడే ముష్కర ఉగ్రవాది. రెండవ వాడు ఇక్కడి ఇసుకరేణువులో ఈశ్వరుడిని దర్శించి, మట్టిలో మాతను దర్శించి, దీని రక్షణ కోసం ప్రాణాలర్పిం చేందుకు సదా సంసిద్ధంగా ఉండే తల్లిభారతి తనయుడు.

ఉగ్రవాదులు పాకిస్తాన్‌ నుంచి కుప్వారా మీదుగా మన దేశంలోకి చొరబడ్డారని సమాచారం వచ్చింది. వారిని మట్టుపెట్టేందుకు మట్టినే తిలకంగా చేసుకున్నారు మన మరాఠా లైట్‌ ఇన్ఫాంట్రీ జవాన్లు. వారికి నాయకుడు ఘటక్‌ ప్లాటూన్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ నవదీప్‌ సింగ్‌. ఉగ్రవాదులు వచ్చే దారిని గుర్తించి అక్కడ మాటు వేశారు మన సైనికులు. ముందుండి నడిపించాడు నవదీప్‌. ఉగ్రవాదులు రైఫిళ్ల రేంజ్‌లోకి రాగానే తూటాల వర్షం కురిపిం చారు మన జవాన్లు.

ఒకటి..రెండు..మూడు

నవదీప్‌ తూటాలకు ముగ్గురు ఉగ్రవాదులు మట్టికరిచారు. మరికొందరు గాయపడ్డారు. ఉగ్రవాదులు కూడా ఎదురు దాడి ప్రారంభించారు. చిమ్మచీకటిని చీలుస్తూ తూటాల నుండి వెలువడే రవ్వలు అడవిలో అగ్గిని రగుల్కొల్పాయి. నవదీప్‌ సహా చాలా మందికి తూటాలు తగిలాయి. నవదీప్‌ సింగ్‌ ఒళ్లంతా గాయాల మయం. నవదీప్‌ పక్కన ఉన్న సైనికుడికి తూటా దెబ్బతగిలింది. అతను నేల కొరిగాడు. వేడిగా, వెచ్చగా రక్తం కారుతోంది. ఎగశ్వాస వేగం పెరిగింది. నవదీప్‌ ఆ దృశ్యాన్ని చూశాడు.

అంతలో ఒక ముష్కరుడు తమకు చాలా దగ్గరగా రావడం గమనించాడు. ఒక్క ఉదుటున తుపాకి అతనివైపు తిప్పి కాల్చాడు అంతే. వాడు ఢామ్మని నేల మీద కుప్పకూలిపోయాడు. అంతలో ఒక తూటా ఎక్కడినుంచో వచ్చి నవదీప్‌ తలకు తగిలింది. తల ఒక వైపు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. రక్తం ధారగా కారుతోంది. నవదీప్‌ తన మిత్రుడిని కాపాడాలనుకున్నాడు. బలమంతా కూడగట్టుకుని అతడిని తన భుజానికెత్తుకుని సురక్షిత స్థలానికి తీసుకెళ్లాడు. ఒక్కో అడుగూ వేస్తుంటే ఆయుష్షు అవిరైపోతోంది. అఖరి క్షణం దగ్గరకు వచ్చింది. అయినా నవదీప్‌ ఆగలేదు. తోటి సైనికుడి ప్రాణాలను కాపాడి తాను కుప్పకూలిపోయాడు.

ఆఖరి క్షణాల వరకు ఆయుధం వదల్లేదు. అరి మూకల్ని ముందుకు రానీయలేదు. తూటాకి అందిన ప్రతీ శత్రువును మట్టుపెట్టాడు. ఆఖరి ఊపిరితో అనుచరుడి ప్రాణాలు కాపాడాడు. ఆఖరి రక్తం బొట్టుతో ఏ రావణుడూ దాటలేని లక్ష్మణ రేఖను సరిహద్దు వద్ద గీశాడు. ఆ తరువాత కష్ణుడిని రాధ కౌగిలించుకున్నట్టు మత్యువును కౌగిలించుకున్నాడు నవదీప్‌. నవదీప్‌ సింగ్‌ సాహసం ముష్కర మూకల గుండెల్లో వణుకు పుట్టించింది. సరిహద్దు అవతల పొంచి ఉన్న గుంట నక్కలకు గుండె జారింది.

ఒక కవి చెప్పినట్టు

పత్రదళములు పుష్పమాలలు

పుణ్యజల అభిషేక కర్మలు

చందనము కర్పూర హారతి

తప్తినీయవు మాతమూర్తికి

సింహవిక్రములై చరించెడు

లక్షలాదిగ యువకిశోరుల

కర్మమయ జీవనమునెగసెడు

తపో జ్వాలల హారతీయుము !!

అవును మరి !! నవదీప్‌ తన కర్తవ్యమయ జీవితపు తపోజ్వాలలతో ప్రాణాల హారతినిచ్చి, నవదీపాలను వెలిగించాడు.

రెపరెపలాడే జెండాను జాగ్రత్తగా చూడండి. గర్వంగా ఎగిరే పతాకపు రంగులో నవదీప్‌ ఆఖరి రక్తపు బొట్టు కూడా కలిసిపోయి కనిపిస్తుంది. దేశం అశోకచక్రతో ఆ వీరుడిని కాదు..కాదు.. తనని తాను సన్మానించుకుంది.

– ప్రభాత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *