ఫ్రంట్‌ ప్రయత్నమా ? ప్రచార ఆర్భాటమా ?

ఫ్రంట్‌ ప్రయత్నమా ? ప్రచార ఆర్భాటమా ?

దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తానంటూ రెండు నెలలుగా వల్లె వేస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కేవలం ప్రచార ఆర్భాటమేనా ? ఇప్పటిదాకా సాగిన పర్యటనలు, జరిగిన చర్చల్లో స్పష్టత కొరవడిందా ? దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఒకేతాటిపైకి రావడమన్నది సాధ్యం కాని పనా ? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం దాదాపుగా అవుననే వినపడుతోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ హైదరాబాద్‌ నుంచి పిలుపునిచ్చిన ఫెడరల్‌ ఫ్రంట్‌పై గందరగోళం ఏర్పడుతోంది. ఇప్పటివరకు కెసిఆరే స్వయంగా వెళ్లి పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని కలిస్తే మరి కొందరు హైదరాబాద్‌ వచ్చి ఆయన్ను కలిశారు. అయితే కెసిఆర్‌తో భేటీ తర్వాత ఉమ్మడిగా నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో వెల్లడించే అంశాలకు, ఆ తర్వాత ఆయా నేతలు చెబుతున్న మాటలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటన తర్వాత పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ తనకు ఫోన్‌ చేశారని, ఫ్రంట్‌కు మద్దతు తెలిపారని కెసిఆర్‌ చెప్పారు. అయితే ఆ మరుసటిరోజే అక్కడి ఓ ఆంగ్లపత్రిక తెలంగాణ సిఎం కెసిఆరే మమతకు ఫోన్‌ చేసి మద్దతు కోరినట్లు ప్రచురించిన కథనం సంచలనం రేపింది. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జెఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ కూడా మొదట్లో సిఎం కెసిఆర్‌కు మద్దతు తెలిపినా ఆ మరుసటిరోజే మాటమార్చి తాము కాంగ్రెస్‌ వెంటే ఉంటామని చెప్పారు.

ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన బందంతో కలిసి చెన్నై వెళ్లారు. డిఎంకె నేతలు కరుణానిధి, స్టాలిన్‌, కనిమొళితో సమావేశం అయ్యారు. జాతీయ స్థాయిలో ఫ్రంట్‌ ఏర్పాటుపై తాము చర్చించినట్లు కెసిఆర్‌ తెలిపారు. అయితే ఆ తర్వాత ఎంపి కనిమొళి అందుకు భిన్నంగా స్పందించి కెసిఆర్‌కు షాక్‌ ఇచ్చారు. డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ భేటీ సందర్భంగా మూడో కూటమి అంశం ప్రస్తావనకు రాలేదని కనిమొళి తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ కెసిఆర్‌, స్టాలిన్‌ భేటీ రాజకీయ కూటమి దష్టితో జరగలేదని, రాష్ట్ర హక్కుల గురించే చర్చించారన్నారు. పైగా కాంగ్రెస్‌తో తాము కటీఫ్‌కు సుముఖంగా లేమని కూడా సంకేతాలు ఇవ్వడం కలకలం రేపింది.

మరోవైపు హైదరాబాద్‌కు వచ్చి కెసిఆర్‌తో భేటీ అయిన ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పి అధినేత అఖిలేశ్‌యాదవ్‌ కూడా కెసిఆర్‌ పాలనను పొగడటం పైనే ఎక్కువగా ఫోకస్‌ చేశారు. కెసిఆర్‌ నేతత్వంలో తెలంగాణ ముందుకు వెళ్తోందని, దేశంలో పేదలు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, బిజెపి సర్కారును ప్రాంతీయ పార్టీలే నిలువరించగలుగుతా యన్నారు అఖిలేష్‌. దేశంలో మార్పు కోసం కెసిఆర్‌ చేస్తున్న ప్రయత్నం చాలా మంచిదని, దీనివల్ల దేశానికి మంచి జరుగుతుందని అఖిలేష్‌ చెప్పారు. కెసిఆర్‌ స్పష్టంగా బిజెపి, కాంగ్రెస్‌లపైనే జాతీయ స్థాయిలో పోరాటమని ప్రతిసారీ చెబుతుండగా అఖిలేష్‌ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేకపోవడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఫ్రంట్‌ పేరిట వ్యక్తిగత ప్రచారం పెంచుకునేందుకే కెసిఆర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

అయితే కెసిఆర్‌ ఫ్రంట్‌ ప్లాన్‌కు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కీలకమని కొంతమంది అంటున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన జెడిఎస్‌ అక్కడ విజయం సాధిస్తేనే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని, అందుకే కెసిఆర్‌ బెంగళూరు వెళ్లి దేవెగౌడను, కుమారస్వామిని కలిశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గులాబీ బాస్‌ బెంగళూరు పర్యటనలో అనేక రాజకీయ కోణాలు దాగున్నాయని పలువురు నాయకులు భావిస్తున్నారు. కెసిఆర్‌తో దేవెగౌడ ఏం మాట్లాడారు ? అసలు వారి మధ్య కూటమి ప్రస్తావన వచ్చిందా ? ఫ్రంట్‌ ఏర్పాటుపై దేవెగౌడ కెసిఆర్‌కు హామీ ఇచ్చారా ? అన్న సందేహాలకు స్పష్టత కరువైంది. భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మాత్రం దేవెగౌడ కూటమి మాటను దాటేసి మాట్లాడారు. తెలంగాణలో జనరంజక పాలన సాగుతోందని, అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సిఎం కెసిఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కెసిఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి కూడా దేవెగౌడ మద్దతు ఇచ్చారన్నారు. అంతే తప్ప ఫ్రంట్‌పై దేవెగౌడ నుంచి కెసిఆర్‌కు కచ్చితమైన హామీ లభించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా, ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటే లక్ష్యమంటున్న కెసిఆర్‌ కేవలం యుపిఎ భాగస్వామ్యపక్షాలను మాత్రమే కలుస్తు న్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పైగా కెసిఆర్‌ మూడో కూటమి ఓ కుట్ర అంటూ మొదటి నుంచీ విమర్శిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు పలువురు నేతలకు లేఖలు కూడా రాసినట్లు చెబుతున్నారు. దేవెగౌడ, మాయావతి, మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌, అఖిలేష్‌ యాదవ్‌, హేమంత్‌ సోరెన్‌, స్టాలిన్‌ తదితరులకు రాసిన లేఖల్లో తన అసమర్థ పాలన, అవినీతి నుంచి ప్రజల దష్టి మళ్లించేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ నాటకానికి కెసిఆర్‌ తెర తీశారని కాంగ్రెస్‌ లేఖల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆ లేఖల ప్రభావం కూడా కెసిఆర్‌ పర్యటనల తర్వాత ఆయా పార్టీల నేతల ప్రతి స్పందనపై ఉంటోందంటున్నారు.

మరోవైపు కెసిఆర్‌ ఎక్కడికి వెళ్లినా తన టీమ్‌లో కనీసం 30 మంది దాకా ఉంటున్నారని వాళ్లందరికీ విమానయాన ఖర్చు, తిండి, ఇతర ఖర్చులన్నీ తెలంగాణ సర్కారు ఖజానాపై పడుతున్నాయన్న విమర్శలూ వినపడతున్నాయి. వాస్తవానికి కెసిఆర్‌ చేస్తున్న ఫ్రంట్‌ ప్రయత్నాలు రాజకీయ సంబంధమై నవి. ఆ తరహా యాత్రలు, చర్చలు, సమావేశాలు, భేటీలన్నీ పార్టీ తరపున చేస్తున్న కార్యక్రమాల కిందకు వస్తాయి. కానీ ఇప్పుడు కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం చేస్తున్న పర్యటనలకు సంబంధించిన ఖర్చు అంతా అధికారిక ఖాతాలోకి వెళ్తోంది.

– సప్తగిరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *