పర్యావరణహితం – హరితహారం

పర్యావరణహితం – హరితహారం

నీడనిచ్చే, ప్రాణవాయువునిచ్చే, చల్లని గాలినిచ్చే చెట్లే మనిషి మనుగడకు ఆధారం. మొక్కలు, చెట్లనుంచే మానవులకు ఆహారం లభిస్తుంది. పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. భూమి సారవంతమవుతుంది. ఏమాత్రం హాని లేకుండా.. ప్రయోజనాలు మాత్రమే కలిగించేవి చెట్లు. తెలంగాణ ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించింది. హరితహారం పేరిట బహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది. ప్రజలనూ భాగస్వాము లను చేసింది. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు, సామాజిక సేవా సంస్థలను కూడా కలుపుకొనిపోతోంది.

తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ఉద్యమ స్థాయిలో కొనసాగుతోంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రతియేటా హరితహారం పేరిట ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తూ లక్షలు, కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఈనెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పరిధిలో ఒకేసారి లక్షా నూట పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహించారు. గజ్వేల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం మాత్రమే కాదు, సమాజంలోని అన్ని వర్గాల వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ఒకేరోజు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చారు. అనేక రకాల మొక్కలను ప్రభుత్వమే సమకూర్చింది.

సంఖ్య కోసమో లేక లక్ష్యం అధిగమించడానికో మొక్కలు నాటొద్దని ప్రభుత్వం మొదటినుంచీ చెబుతోంది. పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణపై ప్రేమతో మొక్కలు నాటాలని ప్రచారం చేస్తోంది. ఆకుపచ్చ తెలంగాణ సాధన దిశగా అందరూ పునరంకితం కావాలని ప్రతీ హరితహారం లోనూ పిలుపునిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. వాతావరణ సమతూకాన్ని కాపాడేందుకు మొక్కల అవశ్యకతను ప్రజలకు చేర్చాలని మీడియాను కోరుతోంది. హరితహారంతో చేకూరే బహుళ ప్రయోజనాలను ప్రజల దష్టికి తీసుకెళ్లాలని విన్నవిస్తోంది.

ఈ మహత్తర కార్యక్రమానికి 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. తెలంగాణ మొత్తంలో మొక్కలను నాటాలని, రాష్ట్రం మొత్తం పచ్చదనంతో కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. మొదటిదశ హరితహారంలోనే ఒకేరోజు హైదరాబాద్‌ వ్యాప్తంగా 25 లక్షల మొక్కలు నాటి రికార్డు సష్టించారు.

హరితహారం కార్యక్రమానికి ప్రత్యేకంగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని 24 శాతం అటవీ ప్రాంతంలో నూటికి నూరు శాతం అడవులు పెంచడం. పట్టణాలు, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక అడవుల పెంపకం చేపట్టడం. తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం. అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్‌ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడం. సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం. అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం. పెద్ద ఎత్తున సాగే వక్షాల నరికివేతను నిలువరించడం. సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం. ప్రజల భాగస్వామ్యంతో విస్తతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం.. వంటి లక్ష్యాలతో హరితహారాన్ని చేపట్టింది తెలంగాణ సర్కారు. ఐదేళ్ల కాలానికి గానూ ఇప్పటికే నాలుగేళ్లు పూర్తయ్యాయి. నాలుగో విడత హరితహారం ఇప్పుడు పూర్తయింది.

హరితహారం కార్యక్రమం ఏ స్థాయిలో నిర్వహిస్తోందో.. అదే స్థాయిలో ప్రచారాన్ని కూడా ఉధతంగా చేస్తోంది ప్రభుత్వం. ఈ మహాయజ్ఞంపై ప్రజలకు అవగాహన కల్పించేలా వార్తా కథనాలు ప్రచురించి, ప్రసారం చేసే మీడియా సంస్థలు, జర్నలిస్టులకు హరితహారం అవార్డులు కూడా ఇస్తోంది. ఫలితంగా హరితహారం ప్రజలకు మరింత చేరువయ్యేలా విస్తతంగా ప్రచారం జరుగుతుందని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు.

సాధారణంగా ప్రభుత్వంలో ఉండే పార్టీలు తమదైన శైలిలో చేపట్టే పథకాలకు రాజకీయ ప్రయోజనాలను దష్టిలో పెట్టుకుంటాయి. అయితే.. తెలంగాణలో చేపట్టిన హరితహారం కార్యక్రమం.. అటు ఆ పార్టీకి మైలేజీని తీసుకురావడంతో పాటు.. వాస్తవంగా సమాజానికి, పర్యావరణానికి ఉపయోగ కరంగా ఉంటోంది. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే ప్రధానంగా భూతాపాన్ని కొంతైనా తగ్గించే అవకాశం ఉంటుంది. పర్యావరణానికి మేలు కలుగుతుంది. మొత్తానికి సమాజానికి ప్రయోజన కారిగా ఉంటుందనడంలో సందేహం లేదు.

అయితే ప్రతి హరితహారం ముగిసిన తరువాత నాటిన మొక్కలకు పోషణ లేక ఎండిపోతున్నాయని లేక మేకలు తినేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. నాలుగో విడత హరితహారం విషయంలో మాత్రం ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. నాటిన వందశాతం మొక్కలు పెరిగి పెద్దవి కావాలంటే మొదట వాటికి జంతువుల నుండి రక్షణ కల్పించాలి. అందుకు వాటి చుట్టూ ఇనుప కంచె లేదా మరేదైనా రక్షణ కవచం ఏర్పాటు చేయాలి. అలాగే అవి ఎండిపోకుండా నిరంతరం రెండు పూటలా నీరు పోసే ఏర్పాటు చేయాలి. అలాగే మొక్కల వేళ్ళు బలంగా పెరిగి భూమిలోకి చొచ్చుకు పోతే భవిష్యత్తులో ఎన్నో తరాలకి చక్కని నీడనిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తాయి. ఇది జరగాలంటే మొక్కలకు బలాన్నిచ్చే ఎరువులను పెరిగే దశలో ఉపయోగించాలి. ఇటువంటి రెండు మూడు చర్యలు తీసుకుంటే హరితహారం నిజరగానే రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంది.

– సప్తగిరి, 9885086126

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *