పక్కా వ్యూహంతో అధికారపక్షం దూకుడు

పక్కా వ్యూహంతో అధికారపక్షం దూకుడు

అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికారపక్షమైన టీఆర్‌ఎస్‌ ముందస్తు రాజకీయ వ్యూహంతో దూకుడుగా వ్యవహరించి విపక్షాలపై పైచేయి సాధించగల్గిందనే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నీ తానై విపక్షాల దూకుడుకు కళ్ళెం వేయగా, మంత్రులు కూడా సరైన హోంవర్క్‌తో సమర్థవంతంగా వ్యవహరించారన్న భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

సమావేశాల సందర్భంగా విపక్షాలు పలుమార్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అస్త్రశస్త్రాలను సంధించినా కేసీఆర్‌ సైన్యం ధీటుగా ఎదుర్కొని రాజకీయ చతురతను చాటుకొంది. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన గత మూడున్నరేళ్ళలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏ విధంగా విజయవంతంగా అమలుచేశారన్న అంశంపై అధికారపక్షం క్లారిటీ ఇవ్వడంలో విజయవంతమైంది.

ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి విపక్షాలు సంధించిన ఆరోపణాస్త్రాలను తిప్పికొట్టడంలో సీఎం కేసీఆర్‌ తనదైన దూకుడును ప్రదర్శించి ఆకట్టుకోగలిగారు. రుణాలపై వడ్డీని చెల్లించకపోవడంతో ఆ భారాన్ని రైతులే మోయవలసి వస్తోందంటూ కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణ తెలంగాణ రైతాంగానికి ఊరటనిచ్చిందనుటలో సందేహం లేదు. ఈ ఆరోపణలపై సభలో ముఖ్యమంత్రి సమాధాన మిస్తూ లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలపై వడ్డీ పడితే ప్రభుత్వమే చెల్లిస్తుందని సభాముఖంగా స్పష్టం చేయడంతో మరోసారి విరుచుకుపడటానికి ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌కు అవకాశం లేకుండా పోయింది.

16 రోజుల పాటు జరిగిన శీతాకాల సమావేశాల్లో ఆద్యంతం అధికారపక్షం ముందస్తు వ్యూహంతో వ్యవహరించి విపక్షాలను ధీటుగా ఎదుర్కొంది. ఈ సమావేశాల్లో మొత్తం 69 గంటల 25 నిమిషాల పాటు సభ జరిగినా, సభలో సర్కార్‌ను ప్రశ్నించేందుకు ప్రతిపక్షానికి సరైన అవకాశాలెన్నో దొరికినా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయడలో విఫలమయ్యాయన్న విమర్శలు వినపడుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 11 బిల్లులను ప్రవేశపెట్టి చట్టాలను చేసింది. వీటిలో అధికంగా ఆయా చట్టాలకు సవరణ బిల్లులే కావడం విశేషం. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రైతు సమస్యలపై కాంగ్రెస్‌ ఛలో అసెంబ్లీకి పిలుపు నివ్వడంతో ప్రభుత్వం ఇరుకున పడటం ఖాయమని భావించిన విశ్లేషకుల అంచనాలు తలకిందు లయ్యాయి. కాంగ్రెస్‌ సమావేశాల మొదట్లో ప్రదర్శించిన దూకుడును తదనంతరం కొనసాగించలేక పోయింది. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, విపక్షాలను సమన్వయం చేయడంలో విఫలం కావడం ప్రభుత్వానికి బాగా కలసివచ్చిన అంశాలుగా పేర్కొనవచ్చు.

కొన్ని అవకాశాలు అంది వచ్చినా కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సభ్యుల మధ్య నెలకొన్న సమన్వయ లోపంతో ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోలేకపోయారన్న వాదనలు లేకపోలేదు. మొత్తంమీద ఈ సమావేశాల్లో విపక్షాల ఎత్తుగడలన్నీ విఫలం కాగా ప్రజల్లో చర్చకు కారణమవుతున్న అనేక అంశాలపై సరైన వివరణ ఇవ్వడంలో ప్రభుత్వం తన సమర్థతను నిరూపించు కోగలిగిందన్నది నిర్వివాదాంశం. ప్రజాసమస్యలను సుదీర్ఘంగా చర్చించేందుకు సమావేశాలను ఎక్కువ రోజుల పాటు నిర్వహించాలంటూ విపక్షాలు పట్టుపట్టగా 50 రోజుల పాటు నిర్వహిస్తామంటూ అధికారపక్షం సై అంటే సై అని సమాధానమిచ్చి, కేవలం 16 రోజుల్లోనే సమావేశాల ముగింపునకు మంగళం పాడటం విస్మయాన్ని కల్గిస్తోంది. శాసనసభ సమావేశాలు జరిగిన తీరును చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ది ఏ పాటిదో తెలిసిపోయిందంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 50 రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తామని గొప్పలకు పోయిన అధికారపక్షం 16 రోజులకే ముగించడంపై విమర్శలను ఎదుర్కొనక తప్పలేదు. సభలో నిజాం చరిత్రను తిరగరాస్తానంటూ సీఎం కేసీఆర్‌ ప్రకటించడం, తదనుగుణంగా మజ్లీస్‌ పార్టీ సీఎంను పొగడటం సమంజసంగా లేదన్న విపక్షాల వాదనలతో కొంతవరకు ప్రజలు ఏకీభవిస్తున్నారన్న భావన కలుగుతోంది. ఈ సమావేశాల్లో ప్రజల సమస్యలను సమర్థవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే గాకుండా ప్రభుత్వ వైఫల్యాలను కూడా పూర్తిస్థాయిలో ఎండగట్టామని విపక్షాలు సంబరపడిపోతుండగా, విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తామే పైచేయి సాధించామని అధికారపక్షం చెబుతోంది.

బీఏసీ సమావేశాన్ని నిర్వహించకుండానే సభను వాయిదా వేయడంపై విపక్షాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమావేశాల్లో ఎస్టీల విద్యుత్‌ బకాయీలన్నింటినీ రద్దు చేయడమే గాకుండా వారిపై ఉన్న విద్యుత్‌ కేసులన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల ఎస్టీ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా 50 రోజుల పాటు జరగుతాయని భావించిన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అధికార, విపక్షాల లోపాయయికారి ఒప్పందంతో కేవలం 16 రోజులే జరిగాయంటూ ప్రజలు నిరాశకు గురవుతున్నారు. సమావేశాలు ముందుగా నిర్ణయించిన ప్రకారం 50 రోజుల పాటు కొనసాగి ఉంటే తమకు సంబంధించిన మరిన్ని సమస్యలకు ప్రభుత్వపరంగా పరిష్కారం లభించి ఉండేదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అర్ధాంతరంగా సమావేశాలను ముగించడంలో అధికార, విపక్షాలు ఏకమమ్యాయన్న వాదనలను వారు వినిపిస్తున్నారు. మొత్తం మీద అటు అధికారపక్షానికి, ఇటు విపక్షాలకు జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల సమరంలో సమన్వయ లోపంతో విపక్షాలు విఫలం కాగా పక్కా ప్రణాళికతో, రాజకీయ వ్యూహాలతో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిం దని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

– వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *