నంది అవార్డుల్లో ప్రతిభకు కళ్ళెం

నంది అవార్డుల్లో ప్రతిభకు కళ్ళెం
  • ప్రభుత్వంపై సినీ ప్రముఖుల అసంతృప్తి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మ కంగా ప్రదానం చేసే ‘నంది’ పురస్కారాల ప్రక్రియ ఇటీవలి కాలంలో అత్యంత ప్రహసనంగా మారు తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత మూడేళ్లుగా నంది అవార్డుల ప్రక్రియకు దూరంగా ఉన్న ప్రభుత్వం ఒకేసారి మూడేళ్ళ పురస్కారాలను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అవార్డులను ప్రకటించిన మరుసటి రోజు నుంచే ఎంపికలో చాలా అన్యాయం జరిగిందంటూ ఎందరో కళాకారులు తమ గళాన్ని వినిపించడంతో అటు జ్యూరీ సభ్యులతో పాటు ఇటు రాష్ట్రప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడక తప్పలేదు. ఈ పురస్కారాలకు సంబంధించి పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదన్న వాదన అటు చిత్రపరిశ్రమ వర్గాలతో పాటు, ఇటు సామాజిక మాధ్యమాల్లో కూడా వినపడుతోంది. ఏ కళాకారుడైనా తాను పడ్డ కష్టానికి వచ్చే గుర్తింపుగా నంది పురస్కారంపై కలలు కనడం సహజం. వాణిజ్యపరంగా వచ్చే గుర్తింపుకన్నా ఈ పురస్కారాల ద్వారా వచ్చే గుర్తింపునకే మన కళాకారులు అత్యంత ప్రాధాన్యమిస్తుంటారన్నది జగమెరిగిన సత్యమే.
అయితే రాను రాను ఈ ప్రభుత్వ ప్రోత్సాహకాలు  రాజకీయ ఒత్తిళ్ళతో ప్రభావితమవుతూ నైతిక విలువల, ఉన్నత మార్గదర్శకాలను మంటగలుపుతూ వస్తున్నాయన్న అభిప్రాయాలు బహిరంగంగానే వినపడుతున్నాయి. ముఖ్యంగా కాకతీయుల వైభవానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గుణశేఖర్‌ రుద్రమదేవి చిత్రానికి, ఎవర్‌గ్రీన్‌ హీరో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి చితం ‘మనం’ కు ఈ పురస్కారాలలో ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు లభించకపోవడం నేడు టాలీవుడ్‌లో పెనుదుమారాన్నే రేపుతోంది.
రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రను అత్యద్భుతంగా పోషించిన అల్లు అర్జున్‌ సపోర్టింగ్‌ ఆర్టిస్టుగా గతంలో సైమా, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకోగా రాష్ట్ర ప్రభుత్వం క్యారెక్టర్‌ ఆర్టిస్టు అవార్డును ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్న ప్రశ్నకు జ్యూరీ సభ్యులు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించి అవార్డులను ఎంపిక చేసే విషయంలో జ్యూరీ సభ్యులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గత మూడేళ్ళ అవార్డులను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇచ్చిందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రుద్రమదేవి తెలంగాణాకు సంబంధించిన మూవీ కాబట్టి పన్ను మినహాయింపు, అవార్డులను పొందలేకపోయిందన్న ప్రాంతీయ విద్వేషాన్ని ప్రభుత్వం మూటగట్టుకోవలసి వచ్చింది. ‘వడ్డించే వాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏమన్న’ తరహాలో ఈ అవార్డుల ప్రదానం కొనసాగిందన్న భావన విమర్శకుల్లో కలుగుతోంది. గతంలో శ్యాంబెనగళ్‌, కె. బాలచందర్‌, సత్యజిత్‌రే, కె.విశ్వనాథ్‌ వంటి దర్శకదిగ్గజాలు దర్శకత్వం వహించే వాణిజ్య విలువలు లేని సామాన్య సహజచిత్రాలకు అవార్డుల పంట పండుతుండేది. కాలగమనంలో వచ్చిన మార్పులతో నేడు పక్కా కమర్షియల్‌ సినిమాలు కూడా అత్యున్నత పురస్కారాలను సాధిస్తూ అవార్డుల ప్రక్రియనే అవహేళన చేస్తున్నాయన్న అభిప్రాయం సినీ అభిమానుల్లో కలుగుతోంది. నంది అవార్డులను ఆశించి రానివారిలో ఒకరిద్దరు విమర్శలు చేయడం సహజం. కానీ ఈ మూడేళ్ళ అవార్డుల ప్రకటనకు సంబంధించి సినీ వర్గానికి చెందిన ఒక్కొక్కరు ఒక్కోరోజు తెరపైకి వస్తూ విమర్శల వర్షాన్ని కురిపిస్తోండడంతో జ్యూరీ సభ్యులు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు. అవార్డులు ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు అవార్డులంటే ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారాయంటూ విప్లవ నటుడు ఆర్‌. నారాయణమూర్తి తన గళాన్ని విప్పడంలో తప్పేమీ లేదన్న అభిప్రా యాలు ప్రజల నుంచి వినపడుతున్నాయి. ఇక సంచలన కామెంట్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన రాంగోపాల్‌వర్మ అవార్డుల ప్రకటనపై తనదైన శైలిలో సెటైర్లు వేసి నంది కమిటీ సభ్యులను ఇరుకున పడేశారు. ‘వావ్‌. మైండ్‌ బ్లోయింగ్‌. సూపర్‌ సెలక్షన్‌. ఎక్కడా ఒక్క శాతం కూడా పక్షపాతం లేదు. పూర్తిస్థాయిలో మెరిట్‌ పరంగా అవార్డులను ప్రకటించిన ఇలాంటి కమిటీ ప్రపంచంలోనే మరెక్కడా లేదు’ అని ఆర్జీవీ చేసిన పోస్టు ప్రభుత్వ పెద్దలతోపాటు కమిటీ సభ్యుల్లోనూ చిర్రెత్తిస్తోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టు క్యాటగిరిలో అల్లు అర్జున్‌ నామినేషన్‌ పంపడం వల్ల తాము కూడా అదేవిధంగా అవార్డునిచ్చామని జ్యూరీ కమిటీ సభ్యులు వివరణ ఇవ్వడం, తాము అలా పంపలేదంటూ అందుకు సంబంధించిన వివరాలను రుద్రమదేవి దర్శకుడు గుణశేఖర్‌ మీడియా సమక్షంలో బహిర్గతం చేయడంతో నంది కమిటీ సభ్యులకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తప్పలేదు.
నంది అవార్డుల కమిటీలో ఒకే కులానికి చెందిన వారే అత్యధిక శాతం ఉండడంతో పారదర్శకంగా ప్రోత్సాహకాలు లభించలేదన్న వాదనలను కూడా ప్రభుత్వం భరించక తప్పలేదు. నంది పురస్కారాలను తమకు తోచినట్లుగా ప్రకటించే కమిటీ మీడియా ముఖంగా ఈ అవార్డుల ప్రక్రియపై అభ్యంతరం చెప్పిన కళాకారులకు మూడేళ్ళపాటు అవార్డులను అందుకునే అర్హతలేదంటూ సరికొత్త నిబంధనను తెరపైకి తీసుకరావడం ఎంతవరకు ప్రజాస్వామికమో ప్రభుత్వమే వివరించాల్సి ఉంటుంది. ఒకే సారి మూడేళ్ళ అవార్డులను ప్రకటించినా జ్యూరీ సభ్యులు సమతూకాన్ని పాటించడంలో వైఫల్యం చెందడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అవార్డుల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులనార్జించిన బాహుబలికి ఆశించిన రీతిలో న్యాయం జగరలేదని, శతమానంభవతి, పెళ్ళిచూపులు చిత్రాలకు ఫలితం దక్కినా గత మూడేళ్ళలో వచ్చి ప్రేక్షకాదరణను విశేషంగా చూరగొన్న మరికొన్ని చిత్రాలను విస్మరించా రన్న అపవాదును కమిటీ ఎదుర్కొనవలసి వచ్చింది. త్వరలోనే సినీ అవార్డుల ప్రకటనకు సిద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో నంది కమిటీ రాజేసిన వివాదాలను దృష్టిలో పెట్టుకొని మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మూడేళ్ళ అవార్డులను ఒకేసారి ప్రకటించే అవకాశం వచ్చినా కూడా సమతౌల్యాన్ని పాటిం చడంలో నంది అవార్డు కమిటీ సభ్యులు, ప్రభుత్వం విఫలమయ్యార్న విమర్శలను అటు కళాకారుల నుంచే గాకుండా ఇటు సినీ ప్రేక్షకుల నుంచి కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

– పద్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *