తెలంగాణలో నిరంతర విద్యుత్‌

తెలంగాణలో నిరంతర విద్యుత్‌

తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ కోతల సమస్యను అధిగమించడం స్ఫూర్తిదాయకమే. పట్టుదల ఉంటే ఎలాంటి సవాళ్ళనైనా అధిగమించవచ్చన్న స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పక్కా కార్యాచరణతో కొనసాగించిన నిరంతర విద్యుత్‌ ప్రణాళికను కొనసాగించింది.

రాష్ట్రం ఏర్పడిన మూడున్నరేళ్ళలోనే ఇది సాధించడం వెనుక ప్రభుత్వ కృషి ఉంది. నిరంతర విద్యుత్‌తో వ్యవసాయరంగంపైనే ఆధారపడుతూ వస్తున్న అన్నదాతలు లాభపడతారు. తక్కువ సమయంలోనే దేశంలో ఈ ఘనత సాధించిన రాష్ట్రంగా తెలంగాణను చెప్పుకోవచ్చు. గతంలో నిరంతర విద్యుత్‌ కోతల కారణంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగించలేక ఎందరో రైతులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అధికవడ్డీలకు అప్పులు చేసి విద్యుత్‌ కోతల కారణంగా పంటలు పండక ఆత్మహత్యలే శరణ మంటూ అర్దాంతరంగా తనువులు చాలించిన రైతుల వ్యధలెన్నో తెలంగాణలో ఉన్నాయి. కలలో అయినా ఊహించని విధంగా ఈ పెనుసంక్షోభానికి ప్రభుత్వం తెర దించి నిరంతర విద్యుత్‌ కలను సాకారం చేయడంతో రాష్ట్ర రైతులు మళ్ళీ వ్యవసాయరంగం వైపే మొగ్గుచూపనున్నట్లు తెలుస్తోంది.

రైతన్నలు అర్ధరాత్రి, అపరాత్రి అనక నీళ్ళు పెట్టుకోవడానికి పొలాలకు వెళ్ళి విద్యుత్‌ షాకులకు బలైపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. నాడు విద్యుత్‌ కొరతతో పారిశ్రామికంగా ఉత్పత్తులు దారుణంగా పడిపోయి వారంలో కొన్ని రోజులు పవర్‌ హాలిడేలను ప్రకటించాల్సి వచ్చేది. విద్యుత్‌ సమస్యతో భాగ్యనగరంలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకొన్న తెలంగాణ ప్రభుత్వం నేడు 24 గంటల నిరంతర విద్యుత్‌ను ఇవ్వగలుగుతోంది. ఈ నిర్ణయంతో పారిశ్రామికరంగం ప్రగతిపథంలోకి అడుగిడు తుందని చెప్పవచ్చు. నిరంతర విద్యుత్‌ సరఫరాతో కార్మికులకు కావలసినంత ఉపాధి దొరకడంతో పాటు ఉత్పత్తులు కూడా పెరగనున్నాయి. ముఖ్యంగా వ్యవసాయరంగ ఉత్పత్తుల పెరుగుదల ఆశాజనకంగా కనపడుతోండడంతో అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం కనబడుతోంది.

తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 6,573 మెగావాట్లు కాగా ఈ ఏడాది ప్రారంభం నాటికి 14,913 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకుంది. గత మూడున్నరేళ్ళ కాలంలో నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు రూ.12,316 కోట్ల నిధులను పంపిణీ చేయడం ద్వారా ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. దీనికోసం ప్రభుత్వం 514 కొత్త సబ్‌స్టేషన్లను, 1,724 కొత్త పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను, 19,154 కిలోమీటర్ల కొత్తలైన్లను నిర్మించింది. దీనితో పాటు తెలంగాణలో 3,142 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కూడా జరుగుతోంది. ఉత్తర, దక్షిణ గ్రిడ్‌ల మధ్య వార్ధా నుండి హైదరాబాద్‌కు 765 కెవిడిసి లైన్‌ ప్రారంభం (దీన్ని పి.జి.సి.ఐ.ఎల్‌ ద్వారా నిర్మించారు) ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్‌ను ఇచ్చి పుచ్చుకొనే సౌలభ్యం ఏర్పడింది. విద్యుత్‌ సంస్థల్లో 24 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భదత్రను కల్పిస్తూ దళారీ వ్యవస్థను నిర్మూలించింది.

– వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *