టిఆర్‌ఎస్‌తో టిడిపి పొత్తు !

టిఆర్‌ఎస్‌తో టిడిపి పొత్తు !

2001 వరకు టిడిపిలో కొనసాగి తదనంతరం తెలంగాణ ఉద్యమసారథిగా అవతరించి 2013లో తన చిరకాల స్వప్నానికి కార్యరూపాన్నిచ్చి 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలను స్వీకరించిన కెసిఆర్‌తో ఏపి సి.ఎం. చంద్రబాబు రాజీ ఫార్ములాకు వచ్చారన్న సంకేతాలందుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మండలి ఎన్నికల సందర్భంగా ‘ఓటుకు నోటు’ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భంలో కెసిఆర్‌తో తీవ్రంగా విభేదించిన చంద్రబాబు తదనంతరం మారుతున్న రాజకీయాలకనుగుణంగా తన ఎజెండాను కూడా మార్చుకోక తప్పలేదు. చంద్రబాబు తెలంగాణలో తన పార్టీ మనుగడ కోసం సరికొత్త రాజకీయ ఎత్తుగడకు శ్రీకారం చుట్టనున్నారన్న ఊహాగానాలు వినపడుతున్నాయి.

తెలంగాణలో కెసిఆర్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కకావికలమైన టిడిపిలో పేరున్న నాయకులంతా అధికార పక్షంలో చేరిపోగా ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిటిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయొచ్చంటూ ఆ పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తున్న మోత్కుపల్లి నరసింహులు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు కూడా. అయితే తెలంగాణలో టిడిపి క్షేత్రస్థాయిలో బలంగానే ఉందని భావిస్తున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఏదోఒక పార్టీతో జతకట్టి పార్టీ మనుగడను కాపాడుకోవాలన్న దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్‌టిఆర్‌ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. తొలుత పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీ నేతలతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్ర రాజకీయ పరిణామాలను తెలుసుకొని పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాల గురించి దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న చర్చ జరిగినప్పుడు పరోక్షంగా ఆయన టిఆర్‌ఎస్‌తోనే కలసి నడిచే అవకాశాలున్నట్లు సంకేతాలిచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ పార్టీ పగ్గాలను సినీ నటుడు జూనియర్‌ ఎన్‌టిఆర్‌కు అప్పగించాలని కార్యకర్తలు ఇచ్చిన సలహాకు చంద్రబాబు తీవ్రంగా స్పందించి నట్లు తెలుస్తోంది. నాయకులు సొంతంగా ఎదగాలని, తన కుటుంబం నుంచి రాజకీయ నాయకులు వస్తారని ఆశించడం సరికాదని స్పష్టం చేయడంతో టిటిడిపి నాయకులు, కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు.

తెలంగాణలో టిడిపికి బలమైన క్యాడర్‌ ఉండడంతో కెసిఆర్‌ కూడా టిడిపిని కలుపుకు పోవాలన్న దిశగా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఏపి మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి హాజరైన సందర్భంగా కెసిఆర్‌ టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్‌తో టిటిడిపి మద్దతు గురించి ఏకాంతంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.

అధికారపక్షంతో అంతర్గతంగా సన్నిహితంగా మెలుగుతున్న మోత్కుపల్లి చంద్రబాబు డైరెక్షన్‌తోనే టిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న దిశగా అడుగులేశారన్న ఊహాగానాలు కూడా ఆ పార్టీ వర్గాల్లో బలంగా వినపడుతున్నాయి. ప్రస్తుతానికి పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయకుండా మిత్ర పక్షంగా కొనసాగి వచ్చే ఎన్నికలనంతరం అప్పటి పరిస్థితులను బట్టి ఓ నిర్ణయం తీసుకోవాలన్నదే చంద్రబాబు అంతర్గతంగా స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులేకుండా సొంతంగా బరిలో దిగితే అడ్రస్‌ గల్లంతు కాక తప్పదన్న విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. ప్రస్తుతం కేంద్రంతో కొనసాగుతున్న ఘర్షణ వైఖరి, కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా టిడిపి ఆవిర్భవించడం తదితరాల నేపథ్యంలో అధికారపక్షమైన టిఆర్‌ఎస్‌తోనే జత కట్టాలన్న దిశగా చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నట్లు సంకేతాలందుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సొంతంగానే అధికారంలోకి వచ్చే బలమున్నా విపక్షాలకు ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వరాదన్న రాజకీయ దూరదృష్టితోనే కెసిఆర్‌ కూడా ఈ రాజీ ఫార్ములాకు ఓకే చెప్పనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

చంద్రబాబు టిటిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయకుండా ఆ పార్టీతో జతకట్టి వచ్చే ఎన్నికల్లో 20 సీట్లకు పైగా పొందాలన్న వ్యూహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలోనే పొత్తుల విషయాల గురించి మాట్లాడుకుందామని చంద్రబాబు తెలంగాణ నేతల సమావేశంలో స్పష్టం చేసినా ఆ ఇరు పార్టీల మధ్య ఇప్పటికే ఓ అవగాహన ఏర్పడిందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

జాతీయ రాజకీయాల వైపు దృష్టిని సారిస్తున్న తెలంగాణ సి.ఎం. కెసిఆర్‌ వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు కెటిఆర్‌కు పార్టీ పగ్గాలను అప్పగించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ విజయం నల్లేరుపై నడకలా సాగేందుకే ఆయన టిడిపి సహాయ, సహకారాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ మిత్రపక్షంగా టిడిపి మారుతుందా? లేదా ? అనే ప్రశ్నకు మరికొద్ది నెలల్లోనే సమాధానం లభించే అవకాశాలు కనపడుతున్నాయి.

– పద్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *