జమ్మూ కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి !

జమ్మూ కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి !

ఉగ్రవాదానికి ప్రధాన శత్రువు ప్రజాస్వామ్యం. ఉగ్రవాదాన్ని, వివిధ దేశాల్లో దాని పరాజయాన్ని అధ్యయనం చేసినవారు చెప్పేదొక్కటే. కుంటిదో గుడ్డిదో ప్రజాస్వామ్యమనేది ఉండి, ఎదో ఒక రూపంలో ప్రజలకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వీలుంటే ఉగ్రవాదం క్రమేపీ బలహీనమై పోతుంది. అందుకే ఉగ్రవాదులు ఎన్నికలను బహిష్కరించ మంటారు. ఓటు వేసిన వారిపై దాడులు చేస్తారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను హత్య చేస్తారు. ప్రజాస్వామ్యం బలపడటం ఉగ్రవాదులకు సుతరామూ నచ్చదు. కానీ ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రజల ప్రజాస్వామ్య కాంక్ష ముందు క్రమేపీ బలహీనపడిపోతుంది. అందుకే తీవ్రవాదం, ఉగ్రవాదం బాగా పెచ్చరిల్లిన చోట ఓటింగ్‌ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కావాలంటే ఈశాన్య రాష్ట్రాల ఓటింగ్‌ సరళిని చూడండి. అక్కడ మిజోరాం, నాగాలాండ్‌ వంటి ఉగ్రవాద బాధిత రాష్ట్రాల్లో ఎనభై శాతానికి పైగా ఓటింగ్‌ జరగడం సర్వసాధారణం.

జమ్మూకశ్మీర్‌లోనూ ప్రజాస్వామ్యయుతంగా, నిజాయితీగా ఎన్నికలు జరిగినప్పుడు ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుంది. కానీ కశ్మీర్‌ లోయలోని రాజకీయ నాయకులకు అలజడి, అశాంత వాతావరణం ఉంటేనే లాభం. అందుకే వారు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి ఇష్టపడరు. ఈ విషయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీలది ఒకే మాట, ఒకే బాట. గత నలభై సంవత్సరాలుగా జమ్మూకశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించ లేదు. ఏదో ఒక సాకు చెబుతూ స్థానిక ప్రజా ప్రభుత్వాలు రాకుండా, ప్రజల్లో నిజమైన స్వనిర్ణయా ధికారం పట్ల అవగాహన కలగకుండా జాగ్రత్త పడుతూ వచ్చాయి. వాజ్‌పేయి హయాంలో చాలాకాలం తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను ఎంతో అయిష్టంగా నిర్వహించాయి అక్కడి ప్రభుత్వాలు. తమాషా ఏమిటంటే ఢిల్లీ నుంచి స్వయంప్రతిపత్తి కోరుకునే కశ్మీర్‌ లోయ వేర్పాటువాద పార్టీలు జమ్మూ, లఢాఖ్‌లకు అధికారాలను బదలాయించవు. అలాగే స్థానిక పంచాయితీలకు నిధులు, విధులు బదలాయించవు. స్థానికంగా కొత్త నాయకత్వం రావడం వారికి ఇష్టం ఉండదు.

ఉగ్రవాదులకు కూడా పిడిపి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లతో ఎలాంటి సమస్య ఉండదు. వారి సమస్య కేవలం స్థానిక సర్పంచ్‌లతోనే. అందుకే గత ఆరేళ్లలో పదహారు మంది సర్పంచ్‌లను ఉగ్రవాదులు హతమార్చారు. మరో 30 మందిని గాయపరిచారు. అదే మంత్రులు, ఎమ్మెల్యేలపై కేవలం రెండే దాడులు జరిగాయన్నది ఈ సందర్భంగా గమనార్హం. కాబట్టి ఉగ్రవాదుల టార్గెట్‌ స్థానిక సంస్థల నాయకులే. అంటే ఉగ్రవాదులకు కూడా క్షేత్ర స్థాయిలో కొత్త నాయకత్వం ఎదగడం ఇష్టం లేదన్న మాట !

జమ్మూకశ్మీర్‌లో 78 నగర, పట్టణ స్థాయి స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు, కార్పేరేషన్లు), 70 మున్సిపల్‌ కమిటీలు, ఆరు మున్సిపల్‌ కౌన్సిల్స్‌ ఉన్నాయి. వీటికి 2010లో ఎన్నికలు జరగాలి. కానీ ఇప్పటి వరకూ జరగలేదు. రాష్ట్రంలోని 4082 పంచాయతీ సర్పంచ్‌ పదవులకు, 28,253 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగాలి. చిట్టచివరి ఎన్నికలు 2011లో జరిగాయి. 2011లో ఎన్నికలు జరిగినప్పుడు 77.71 శాతం పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో గెలిచిన వారి కాలపరిమితి 2016కి ముగిసింది. అంటే ఎన్నికలు 2016లో జరగాలి. కానీ మహబూబా ముఫ్తీ ఏదో ఒక సాకు చెప్పి ఈ ఎన్నికలను వాయిదా వేసింది. బిజెపి, పిడిపిల మధ్య ప్రధానమైన అభిప్రాయ భేదం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనే. బిజెపి స్థానిక స్వపరిపాలన కావాలని గట్టిగా డిమాండ్‌ చేసింది. ఎన్నికైన స్థానిక సంస్థలకు నేరుగా కేంద్రం నుంచి నిధులు ఇచ్చి, స్థానిక పరిపాలనను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ స్థానిక సంస్థలు బలపడటం, తద్వరా అట్టడుగు స్థాయిలో కొత్త నాయకత్వం ఎదగడం ఇష్టం లేని పిడిపి దీనికి ఎప్పటికప్పుడు కుంటి సాకులు చెబుతూ అడ్డంకులు పెడుతూ వచ్చింది. కశ్మీర్‌ లోయలో ప్రస్తుతం నాయకత్వం ఒక రెండు మూడు వందల కుటుంబాల చేతుల్లో మాత్రమే ఉంది. గ్రామీణ స్థాయిలో నాయకులు ఎదగకుండా, ఈ రెండు మూడు వందల కుటుంబాలు జాగ్రత్త పడుతూ వస్తున్నాయి. తప్పనిసరై స్థానిక ఎన్నికలు నిర్వహించినా స్థానిక సంస్థలకు నిధులు, విధులు బదలాయించకుండా శతవిధాలా అడ్డుకుంటూ వస్తున్నాయి. ఈ రాజకీయ దిగ్బంధనాన్ని ఛేదించడం కశ్మీర్‌ లోయలో అత్యవసరం. కశ్మీర్‌ లోయలో ప్రజలు వాస్తవానికి మౌలిక వసతులను, కనీస సదుపాయాలను కోరుకుంటున్నారు. వారికి ఆ సదుపాయాలను, వసతులను అందించడానికి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపడం, ఆ సంస్థలకు నిధులు సమకూర్చడం, వారు ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేలా చేయడం అత్యవసరం.

అమర్‌నాథ్‌ యాత్ర తరువాత జమ్మూకశ్మీర్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కొన్ని రాజకీయ శక్తులు, ఉగ్రవాదులు వ్యతిరేకించినా ఈ ఎన్నికలు జరిగి, స్థానిక నాయకత్వం ముందుకు వచ్చేలా చేయడం చాలా అవసరం. జమ్మూ కశ్మీర్‌లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరలో జరుగుతాయని ఆశిద్దాం.

– సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *