జనసేన దారెటు ?

జనసేన దారెటు ?

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, జనసేన పార్టీ రథసారథి పవన్‌కళ్యాణ్‌ సమాజానికి తన వంతు కృషి చేయాలని భావిస్తున్న మాట నిజమే అయినా క్రియాశీలకంగా ఆయన అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలపైన ప్రజలకు ఎన్నో సందేహాలున్నాయి. ప్రజావేదికలపై ఆయన మాట్లాడుతున్న మాటలకు, వాస్తవ కార్యాచరణకు ఎక్కడా పొంతన ఉండడం లేదు.

ప్రజాసమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించడమే జనసేన లక్ష్యమంటూ వేదికలపై ఉపన్యాసాలిచ్చే పవన్‌కళ్యాణ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రశంసల వర్షంలో ముంచెత్తడం తెలంగాణలోని ప్రతిపక్ష నాయకులకు మింగుడు పడటంలేదు. 2009 సాధారణ ఎన్నికల ప్రచారపర్వంలో నామమాత్రంగా రాజకీయ ఎంట్రీ ఇచ్చిన పవన్‌కళ్యాణ్‌ 2019 ఎన్నికలే లక్ష్యంగా క్రియాశీలక పాత్రను పోషిస్తోండటం అభినందించదగ్గ విషయమే. అయితే తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందా? లేదా ప్రధాన పక్షాలతో స్నేహ పూర్వక పోటీని కొనసాగిస్తుందా? అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు.

పవన్‌కళ్యాణ్‌ ‘ఛలోరే ఛలోరే ఛల్‌’ యాత్ర జనవరి 21న తెలంగాణలో మొదలై మూడురోజుల పాటు కొనసాగింది. ఈ యాత్ర సందర్భంగా పవన్‌కళ్యాణ్‌ ‘జై తెలంగాణ’ నినాదమంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ నినాదం వింటే వందేమాతరం విన్నంతగా ఒళ్ళు జలదరిస్తుందని, కెసిఆర్‌ స్మార్ట్‌ సిఎం అని, ఎంతో ఓర్పు, నేర్పుతో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని కురిపించిన ప్రశంసల జల్లు తెలంగాణలో రాజకీయంగా దుమారార్నే రేపుతోంది. పాలనా పరంగా తెలంగాణలో ఎన్నో సమస్యలున్నా వాటి జోలికి పోకుండా పవన్‌కళ్యాణ్‌ ఆచితూచి వ్యవహరించడంలోని ఆంతర్యమేమిటన్న విపక్షాల ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.

2009 ఎన్నికల ప్రచార సందర్భంగా అవినీతి కాంగ్రెస్‌ నాయకుల పంచలూడదీసి కొడతామని, 2014 ఎన్నికల ప్రచార సందర్భంగా కెసిఆర్‌ తాట తీస్తామని వీరావేశ ప్రసంగాలు చేసిన జనసేనాని ఇప్పుడు రాజకీయంగా నీచమైన విమర్శలకు తాను వ్యతిరేకమంటూ సుభాషితాలు పలకడం అవకాశవాద రాజకీయమే అనుకోవాలా? అన్ని స్థానాల్లో పోటీ చేయడం కన్నా తమకు బలమున్న స్థానాల్లో మాత్రమే పోటీకి దిగుతామని పవన్‌ ప్రకటించడం ద్వారా తెలంగాణలో టిఆర్‌ఎస్‌తో పొత్తు తప్పదన్న సంకేతాలు అందుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టిఆర్‌ఎస్‌, టిడిపి నిర్మాణాత్మకంగా బలంగా ఉన్నాయని, వాటిని అనుభవజ్ఞులు నడిపిస్తున్నారని చెప్పడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తన అవసరం ఏమీ ఉండబోదని ఆయన చెప్పకనే చెప్పేశారన్న విమర్శలు కూడా వినపడుతున్నాయి. పరిపాలనా పరంగా కెసిఆర్‌ విధానాలు భాగానే ఉన్నా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించిన యువతను కెసిఆర్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కొత్త రాష్ట్రంలో కొలువులు లేక యువతలో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగి పోయిందని, రానున్న ఎన్నికల్లో ఈ సమస్యను అధిగమించడానికే కెసిఆర్‌ పవన్‌కళ్యాణ్‌ను చేరదీసి రాజకీయంగా అక్కున చేర్చుకొన్నారన్న వాదనలు అటు విపక్షాల నుంచే కాకుండా ఇటు ప్రజల నుంచి కూడా వినపడు తున్నాయి.

తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో సీట్లు, ఓట్లు సాధించాలన్న లక్ష్యంతో కాకుండా రాబోయే 25 ఏళ్ళ ప్రస్థానాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళుతోందని పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న హితోపదేశాలు ఆయనను నమ్ముకొన్న అభిమానులకు, కార్యకర్త లకు ఏమాత్రం రుచించడం లేదు. తెలంగాణలో ప్రతిపక్షాలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో స్నేహ పూర్వక పోటీలో భాగంగా జనసేన పార్టీకి కొన్ని సీట్లు కేటాయించి తన రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేయాలన్నదే కెసిఆర్‌ అంతర్గంతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచార సందర్భంగా ఒకరినొకరు దారుణంగా తిట్టుకొన్న ఈ ఇద్దరూ ఇటీవల ఏకాంతంగా సమావేశమై గంటన్నరపాటు మంతనాలను కొనసాగించడం సరికొత్త పొలిటికల్‌ ఈక్వేషన్‌కు దారితీయనుందన్న ఊహాగానాలు బలంగా వినపడుతున్నాయి.

పవన్‌కళ్యాణ్‌ ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని తాను సీరియస్‌గా తీసుకోలేదని, సీరియస్‌గా తీసుకొని ఉంటే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడి ఉండేదని వ్యాఖ్యానించడం పట్ల విమర్శలు వినపడుతున్నాయి. ఆయన జోక్యం చేసుకొన్నంత మాత్రాన చంద్రబాబు ప్రభుత్వం పడిపోయేదా? అంటూ జనం గుసగుస లాడుకొంటున్నారు. కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో ఆయన చేసిన ప్రసంగాలు కార్యకర్తలను, అభిమాను లను, ప్రజలను అయోమయంలో పడేశాయని చెప్పుకోవచ్చు.

అధికార రేసులో ఉన్న పార్టీలకే ప్రజలు ఓట్లేస్తారు కాని సుభాషితాలు చెప్పే పార్టీల నాయకులకు కాదన్న విషయాన్ని జనసేనాని గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న రాజకీయ ప్రసంగాలను వింటుంటే అధికారపక్షాలకు మేలు చేయడానికే ఆయన జనసేనను ప్రారంభించారా ? అన్న అనుమానాలు కలుగు తున్నాయి. నేటి సమాజంలో నిరంతరం జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల పట్ల ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నది వాస్తవమే అయినా వాటిని ధీటుగా ఎదుర్కొనే దిశగా రాజకీయ కార్యాచరణను రూపొందించడంలో మాత్రం విఫలమవుతున్నారన్నది నిర్వివాదాంశం.

– వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *