జనబాహుళ్య బడ్జెట్‌

జనబాహుళ్య బడ్జెట్‌

పూర్తి ఆదాయాన్ని సమకూర్చే బడ్జెట్‌ ఇది. సుమారు 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో గత నాలుగు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్రమోది పాలనలో, ఆర్థిక రంగంలో తీసుకున్న సంస్కరణలు, ఆ సంస్కరణల అమలు తీరు, తద్వారా వస్తున్న ఆర్థిక వృద్ధి ఫలితాలు ప్రపంచ ఆర్థిక నిపుణులకు ఆశ్చర్యంగా కనిపిస్తున్నవి. ప్రపంచ బ్యాంకు, ఐయంఎఫ్‌, అభివృద్ధి చెందిన దేశాలు, భారత ఆర్థిక వ్యవస్థను సునిశితంగా పరిశీలిస్తున్నవి. త్వరలోనే భారత్‌ ప్రపంచంలో 7వ ఆర్థిక వ్యవస్థ స్థానం నుండి 5వ ఆర్థిక వ్యవస్థ స్థానానికి వచ్చే అవకాశమున్నదని విశ్లేషిస్తున్నారు.

మోది అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతూ అభివృద్ధికి నిర్వచనమిచ్చారు. ప్రకృతి వనరులను సంరక్షించుకుంటూ ఉపాధి అవకాశాలను సృష్టించుకొని సత్యం, అహింసా మార్గాల పునాదిపైనే ప్రజలు జీవించే అవకాశాలను కల్పించాలని తెలిపారు. దాని ఆధారంగానే గత 4 సంవత్సరాల బడ్జెట్‌లు వచ్చాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కూడా ఆ విధంగానే ఉంది. ఏ ముఖ్యమంత్రి అడగకుండానే మొదటి బడ్జెట్‌లోనే 32% రాష్ట్రం వాటాను 42% చేసి సమాఖ్య వ్యవస్థ, జాతీయ స్ఫూర్తిని నింపారు.

ఆదాయంలో వృద్ధి

2013-14 యుపిఎ ప్రభుత్వ చివరి బడ్జెట్‌ సుమారు 16 లక్షల కోట్లుగా ఉన్నది. ఈ 4 సంవత్సరాలలో నరేంద్రమోది నాయకత్వంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అంచనాలు పెరుగుతూ 2018-19 బడ్జెట్‌ సుమారు 25 లక్షల కోట్లకు చేరుకుంది. గత 65 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 16 లక్షల కోట్లకు బడ్జెట్‌ చేరితే కేవలం ఈ 5 సంవత్సరాలలోనే 9 లక్షల కోట్లు అదనంగా పెరిగింది. యుపిఎ ప్రభుత్వ 2013-14 చివరి బడ్జెట్‌లో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 10 లక్షల కోట్లు. నరేంద్రమోది ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాలలో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, 5వ బడ్జెట్‌ ద్వారా వచ్చే ఆదాయం కలిపి సుమారు 18 లక్షల కోట్లకు చేరుకుంటున్నది. గత 65 సంవత్సరాలలో పన్నుల ఆదాయం 10 లక్షల కోట్లు అయితే ఈ 5 సంవత్సరాలలో 8 లక్షల కోట్లు అదనంగా పెరిగింది. ఈ విధంగా 80% ఆదాయం పెరగడం ప్రధాని మోది కార్యశైలికి అద్దం పడుతున్నది. ఆర్థిక సంస్కరణలు, అవినీతికి అడ్డుకట్ట వేయడం, పారదర్శకత పాలన, సంస్కరణలను ఆచరణాత్మకంగా అమలు చేసి ఫలితాలు రాబట్టడం వంటివి ఇందుకు కారణాలు.

గత 4 సంవత్సరాలుగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ నిధులను నూటికి నూరు శాతం అమలు చేయడం ప్రణాళికా బద్ధమైన సమయ పాలనతో కూడుకున్న పరిపాలన అని కొనియాడక తప్పదు. కొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 60-70% కూడా ఖర్చు చేయడం లేదు. కానీ 2017-18 కేంద్ర బడ్జెట్‌ డిసెంబర్‌ 31, 2017 వరకే 80% బడ్జెట్‌ నిధులను ఖర్చు చేసినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. నోట్ల రద్దు, జిఎస్‌టి (పరోక్ష పన్నుల చట్టం) తేవడం, నల్లధన నిర్మూలనకు సిట్‌ ఏర్పాటు, స్విస్‌ బ్యాంకుతో Automatic Exchange of Information Agreementచేసు కోవడం, కార్మిక సంస్కరణలు, బినామీ ఆస్తుల చట్టం, RERA, Bankruptcy Code, Direct Benefit taxation, Aadhar Link, సబ్సిడీల దుర్వినియోగాన్ని అరికట్టటం, బొగ్గు, ఇనుము మొదలైన విషయాలలో పారదర్శక టెండర్లు నిర్వహించడం వంటి వాటి ద్వారా లాభాల సృష్టి జరిగింది. పొదుపును పాటించడం, లెక్కకు రాని డబ్బు లెక్కలోకి తేవడం, చట్టబద్ధ వ్యాపారాన్ని ప్రోత్సహించడం, 3 లక్షల దొంగ కంపెనీలను గుర్తించి రద్దు చేయడం, 14 వందల పనికిరాని చట్టాలను తొలగించడం, పంచవర్ష ప్రణాళికను రద్దు చేసి నీతి అయోగ్‌ తెచ్చి ముఖ్యమంత్రులందరినీ దీనిలో భాగస్వాములను చేసి పార్టీలకు అతీతంగా ‘టీమ్‌ ఇండియా’ అనే జాతీయ స్ఫూర్తిని నింపడం వలన 25% ఆదాయ పన్ను పెరిగి 18 లక్షల మంది పన్నుల పరిధిలోకి రావడం వలన ఈ ఆదాయం సమకూరింది.

ఈ నాలుగు సంవత్సరాలలో నరేంద్రమోది ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, నవరాత్రి ఉపవాసంలో కూడా శ్రమించడం వలన దేశం వృద్ధి బాటలో ముందుకు సాగుతున్నది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ నిర్మించడం, పన్ను బేస్‌ పెంచడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపాలనలో ఉపయోగించడం, రహదారులు, రైల్వేలు వంటి రవాణా సౌకర్యం పెంచడం, ఆధునీకరించడం, అంతర్జాతీయ కార్యకలాపాలకు నియమనిబంధనలు సడలించడం, 24 గంటల విద్యుత్‌ అందుబాటులోకి తేవడం, సులభ వ్యాపార వాణిజ్య విధానాలు కొనసాగే నిర్ణయాలు తీసుకోవడం వలన ఈ అభివృద్ధి సాధ్యమైంది.

యుపిఎ కాలంలో విదేశీ మారకం సుమారు 12 లక్షల కోట్లు అయితే నేడు అది 20 లక్షల కోట్లకు చేరుకున్నది. Fiscal Deficit యుపిఎ హయంలో 4.5 ఉంటే నేడు 3.25 కి తగ్గింది. స్టాక్‌మార్కెట్‌లో విశ్వాసం పెరిగింది. సులభ వ్యాపార విధానాన్ని దేశ విదేశాలలో ప్రచారం చేయడం వలన 130 స్థానాలు మెరుగుపరచుకొని, పెట్టుబడులు సృష్టించుకొని దేశం అభివృద్ధి దిశలో ముందుకు పోతున్నది. ఒకవైపు ధరల స్థీరీకరణతో పాటు పొదుపు పెరిగి ఆదాయం వస్తోంది.

ఇదంతా చూసి ‘గబ్బర్‌సింగ్‌ టాక్స్‌’, ‘వ్యవస్థీకృత ఆర్థిక దోపిడి’ అన్న కాంగ్రెసు నాయకులకు పాలుపోవడం లేదు. యుపిఎ ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పుడు 8% వృద్ధిరేటు ఇచ్చామంటున్నారు. కానీ 10% ద్రవ్యోల్బణం కూడా ఇచ్చారు. దాని ద్వారా -2% అభివృద్ధి ఎన్‌డిఎకి వారసత్వంగా వచ్చిందని గుర్తించాలి. ఎన్‌డిఎ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని 3 శాతం లోపే కట్టడి చేయడంలో సఫలమైంది. రాష్ట్రాల ఎగుమతులు పెరిగాయి. ఆర్థిక క్రమశిక్షణ వచ్చింది.

పెరిగిన ఆర్థిక క్రమశిక్షణ

పాశ్చాత్య పారిశ్రామిక పెట్టుబడి విధానానికి వ్యవసాయ ఆధార దేశ ఆర్థిక విధానానికి తేడా తెలియని ఆర్థికవేత్తలు చేసిన పొరపాటు వలన దేశంలో వృద్ధి మందగించింది. దేశ అభివృద్ధికి జిడిపి కొలమానం కాదు. వృద్ధిరేటు పడిపోయిందని గగ్గోలు పెట్టేవారికి, పాశ్చాత్య ఆర్థిక విధానం ఒంటబట్టిన వారికి, పెట్టుబడి వర్గాలకు కొమ్ముకాసేవారికి భారత ఆర్థిక విధానం అర్థం కాదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవసరానికి మించి, అవసరం లేని వస్తు ఉత్పత్తి ప్రజలపై రుద్ది, అవసరమైతే అప్పు ఇచ్చి కొనుగోలు చేయించి, ప్రకృతి వనరులను కొల్లగొట్టే ఆర్థిక విధానం మోది ప్రభుత్వంలో లేదు.

నోట్ల రద్దు తర్వాత అందరి డబ్బు బ్యాంకులోకి వచ్చింది. పొదుపు పాటించడం మొదలుపెట్టారు. దుబారా తగ్గింది. అనవసర వస్తు వినిమయం తగ్గింది. స్థిరాస్తుల విలువలు నేలకు దిగాయి. అందువల్ల జిడిపి తగ్గడం సహజం. అంతమాత్రాన ఎవరూ పేదవారు కాలేదు. పేదరికం పెరగలేదు. ఎవరి డబ్బులూ పోలేదు. సమాజంలో భద్రతా భావం పెరిగింది. పర్యావరణానికి మేలు జరిగింది. అవినీతి తగ్గుముఖం పట్టి అభివృద్ధి పెరుగుతోంది. అంతే తప్ప కొనుగోలు శక్తి మాత్రం తగ్గలేదని గ్రహించాలి. వాస్తవం చెప్పాలంటే ప్రజలలో ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. దీనినే పొదుపు అంటారు. పొదుపు పెరిగినా, వస్తు వినిమయం మందగించినా జిడిపి వృద్ధి కనిపించదు. అంతమాత్రాన పేదరికం పెరగదని గ్రహించాలి.

ఉపాధి కల్పన

నరేంద్రమోది ప్రభుత్వం వచ్చాక చదివిన చదువుకు, నైపుణ్యానికి సమన్వయం చేసి, ముద్రా పథకం ద్వారా ఆర్థిక తోడు అందించి పని సంస్కృతిని ప్రోత్సహించి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దేశంలో 3 వేల ఐటిఐ నైపుణ్య కేంద్రాలను నెలకొల్పారు. కానీ కొన్ని పార్టీలు ‘నిరుద్యోగ భృతి ఇస్తాం, హాయిగా తిని రోడ్లపై తిరగండి’ అని చెప్తున్నాయి. వీరిది నకారాత్మక ధోరణి అని గుర్తించాలి.

స్వదేశీ ఆర్థిక విధానం

2018-19 బడ్జెట్‌లో ప్రధానంగా వ్యవసాయానికి, దాని అనుబంధ రంగాలకు, గ్రామీణ వృత్తులకు, గ్రామీణాభివృద్ధికి, విద్యవైద్య రంగాలకు, మౌలిక సదుపాయాల వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. సులభ పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలు సృష్టించుకోడానికి, సౌకర్యవంతమైన జీవనానికి అనుకూలంగా ఉన్న బడ్జెట్‌ ఇది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, దీర్ఘకాలిక మౌలికరంగాల వృద్ధికి 14.34 లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించడం స్వదేశీ ఆర్థిక విధానానికి పునాదిగా భావించాలి.

వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం

ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానంగా వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోనిది. అయినా కేంద్రం దీనిపై దృష్టి సారించి గత 4 సంవత్సరాల నుండి దీర్ఘకాలిక నిర్మాణాత్మక మౌలిక సదుపాయాలను అందిస్తూ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని సంకల్పించారు. రైతు సమగ్రాభివృద్ధికి పంట రుణాలు, భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలు, వాటి పరిశోధన, సబ్సిడీ ఎరువులు, సాగునీటికి ప్రాధాన్యం, 24 గంటల విద్యుత్‌, ఫసల్‌ భీమా యోజన, పశు సంపద, పాల ఉత్పత్తికి ప్రాధాన్యం, ఇ-మార్కెట్‌ అనుసంధానం, ఆహార ఉత్పత్తి పెంచడం, వ్యవసాయ పనిముట్లు రైతులకు సబ్సిడి మీద ఇవ్వడం, ధాన్యం నిలువ గోడౌన్లు, వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానం జోడించడం, సూక్ష్మ సేద్యం, విదేశీ ఎగుమతి దిగుమతులలో వ్యవసాయ ఉత్పత్తులకు అనుకూలమైన విధానం చేపడుతున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా కనీస మద్దతు ధరపై 50% అదనంగా రేటు నిర్ణయించడం, సేంద్రియ వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ రూపొందించడం చేస్తున్నారు.

రైతులు వ్యవసాయ సంస్థాగత పంట రుణాలు పొందేందుకు 11 లక్షల కోట్ల రూపాయలు నాబార్డ్‌ ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు. భూసార పరీక్షలు చేసి Soil Health Cards ఇవ్వటానికి నిధులు పెంచారు. 10 కోట్ల మంది రైతులు ఇప్పటికే ఫసల్‌ భీమా యోజన ద్వారా లబ్ది పొందారు. పంటల భీమా జాతీయ సగటు 26% శాతంగా నమోదైంది. దీనిని 50 శాతానికి తీసుకొచ్చేందుకు 13 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.

రైతుల పెట్టుబడికి అదనంగా 50% ధర కల్పించి కనీస మద్దతు ధర నిర్ణయిస్తామన్నారు. నిర్ణయించిన మద్దతు ధర మార్కెట్‌లో రాకపోతే భవంతర్‌ భుక్తర్‌ యోజన ద్వారా తగ్గిన ధరను సమకూర్చుతామని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి నిర్ణయిస్తామని తెలిపారు. ప్రతి రాష్ట్రానికి స్వయంగా Agriculture Commissoin  ప్రతినిధి వెళ్ళి పెట్టుబడులను మదింపు చేస్తారని తెలిపారు. సేంద్రియ వ్యవసాయానికి స్వయం సహాయక బృందాల ద్వారా ప్రోత్సాహం కల్పిస్తూ భూసారం పెంచేందుకు పశుసంపద పెంపుదలకు ప్రాధాన్యమిస్తారు. ఎరువుల సబ్సిడీకి 70,800 కోట్లు కేటాయించింది.Operating Green Project కింద ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, టమాటాలు, ఇతర కూరగాయలకు క్లస్టర్స్‌ ఏర్పాటు చేసి నిల్వ సామర్థ్యం పెంచి, ట్రేడింగ్‌ ప్రోత్సహిస్తున్నారు. ఆహార శుద్ధికి 1400 కోట్లు కేటాయించారు. ప్రతి జిల్లాకు ఒక ఆహారశుద్ధి కేంద్రం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో 40 మెగా ఫుడ్‌పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ చర్యల ద్వారా రైతులు పండించిన ధాన్యం ఉత్పత్తులకు రేటు పెరిగే అవకాశం ఉంది.

పశుసంవర్ధన, Acqua Culture కు 10 వేల కోట్లు కేటాయించారు. తద్వారా గ్రామీణ ఉపాధి పెరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి 2 వేల కోట్లు కేటాయించారు. 585 ఇ-మార్కెట్‌లను అనుసంధానం చేస్తున్నారు. ఔషధ సుగంధ మొక్కలను పెంచటానికి 2 వేల కోట్లు కేటాయించి విదేశీ ఎగుమతులకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. వెదురు సాగుకు 1200 కోట్లు కేటాయించడం ద్వారా గిరిజన రైతుకు ఉపాధి అవకాశాలు పెంచి, లాభం చేకూరుస్తున్నారు. రైతు సహకార సంఘాల ద్వారా అహార శుద్ధి చేసి ఎగుమతులను ప్రోత్సహించడం కొరకు 100% పన్ను మినహాయింపు ఇచ్చారు. ఆహార శుద్ధి పెంచి ఎగుమతులు చేసి రైతుల ఉత్పత్తులకు Demand, Supply సూత్రం వర్తించే విధంగా, తద్వారా రైతులకు గిట్టుబాటు రేటు సమకూరాలని ప్రభుత్వ సంకల్పించింది. ఇంకా అనేక వ్యవసాయ అనుబంధ రంగాలకు ఈ విధంగా ప్రోత్సాహం కల్పిస్తున్నారు. అందులో ప్రధానమైంది రైతులు నేరుగా గ్రామాల అంగళ్లలో అమ్ముకోడానికి కావలసిన మార్కెట్‌ వ్యవస్థను గ్రామ్స్‌ పేరుపై ఏర్పాటు చేస్తున్నారు.

2013-14 సంవత్సరం 21,933 కోట్లు వ్యవసాయ బడ్జెట్‌ యుపిఎ వారసత్వంగా వస్తే దాన్ని 2018-19 బడ్జెట్‌లో 63,836 కోట్లకు పెంచడం ద్వారా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తున్నది.

వ్యవసాయ వృద్ధి, గ్రామ వికాసం సమన్వయంతో ముందుకెళ్లాలని గ్రామీణ మౌలిక వసతుల వృద్ధికి 22 వేల కోట్లు కేటాయించారు. గత 4 సంవత్సరాల నుండి గ్రామ పంచాయితీలకు నేరుగా నిధులందిస్తు న్నారు. మొత్తానికి కాంగ్రెసు వెటకారానికి బదులుగా ఈ బడ్జెట్‌ ద్వారా Suit Boots డబ్బులు గావ్‌ గరీబ్‌కు వెళుతున్నాయి. ఇది కాంగ్రెసుకు మింగుడు పడటం లేదు.

ఇప్పటికే పారిశ్రామిక ప్రగతి అభివృద్ధిలో ఉన్నది. కానీ గ్రామీణ సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ముద్ర యోజన ద్వారా 3 లక్షల కోట్లు రూపాయలు కేటాయించి గ్రామీణ ఉపాధికి పెద్దపీట వేశారు. ఈ చర్య ద్వారా 2022 నాటికి 10 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. Macro Economy ని నియంత్రించారు.

ఆరోగ్య రక్షణ

దేశంలో 50 కోట్ల మంది పేద మధ్య తరగతికి ఆయుష్‌ పథకం ద్వారా సంపూర్ణ ఆరోగ్య రక్షణ కల్పించే బృహత్తర పథకానికి ఈ బడ్జెట్‌లో నాంది పలికారు. సంవత్సరానికి 10 కోట్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయల విలువ కలిగిన ఉచిత వైద్య సేవలు అందించేట్లు సంకల్పించారు. రైతులు కూలీలు అప్పుల బారిన పడకుండా ఆత్మహత్యలకు తావులేకుండా అవకాశం కల్పించారు. ఈ పథకాన్ని ప్రకటించిన వెంటనే ప్రపంచ దేశాల ప్రముఖులు ప్రధాని మోదిని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం ఇది. దీని పూర్తి విధివిధానాలు త్వరలోనే నిర్ణయించి అమలు చేస్తామని తెలిపారు.

మన రక్షణ రంగం వాజ్‌పేయి పాలన మినహాయిస్తే దాదాపు 60 సంవత్సరాల నిరాదరణకు గురైంది. కానీ నేడు మోది నాయకత్వంలో 2,95,000 కోట్లు నిధులు కేటాయించి పరిశోధన, రక్షణ రంగాన్ని పటిష్ఠం చేస్తున్నారు. మనం బలంగా ఉంటే శత్రువులు కూడా గౌరవిస్తారనే చాణక్యుని అర్థశాస్త్రాన్ని అమలు చేస్తున్నారు.

విద్యా రంగంలో మౌలిక మార్పులకు కేంద్రం నడుం బిగించింది. 85,010 కోట్లు కేటాయించింది. ఇందులో ఆధునిక వసతులకు, డిజిటలీకరణకు ప్రాధాన్యమిచ్చారు. గిరిజన విద్యార్థులకు ఏకలవ్య, గురుకుల పాఠశాలలు ప్రతిపాదన చేశారు. విద్యతోపాటు ఉపాధి పెంచే శిక్షణ, మానవీయ కోణం, ప్రకృతి వనరుల సంరక్షణ, పచ్చదనం పరిశుభ్రతను జోడించి విద్యా వ్యవస్థలో సామాజిక బాధ్యతను పెంచుతున్నారు.

ఎస్‌సి, ఎస్‌టిలకు ఈ ఆర్థిక సంవత్సరంలో విద్య, ఆర్థిక, సామాజిక వృద్ధికి 10,527 కోట్లు గతం కంటే పెంచారు. ఎస్‌సి లకు గతంలో 52,119 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో 56,619 కోట్లు కేటాయించారు. ఎస్‌టి లకు గతంలో 32,508 కోట్లు కేటాయిస్తే నేడు 39,135 కోట్లు కేటాయించి ఎస్‌సి, ఎస్‌టిల ఉన్నతికి ప్రోత్సాహమిచ్చారు.

5,90,000 కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించి అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్‌, రైలు, ఎయిర్‌, సీ పోర్ట్స్‌ కనెక్టింగ్‌కి ప్రాధాన్యమిస్తున్నారు.

సేవారంగంలో 8% వృద్ధిరేటు సాధించారు. బ్యాంకుల వడ్డీరేటు సుమారు 4% తగ్గి సామాన్యునికి రుణ సౌకర్యం పెరిగి రుణభారం తగ్గుతున్నది. వీటితోపాటు ఈ బడ్జెట్‌లో ఉపాధికి, అభివృద్ధికి సంబంధించిన అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చారు.

ఇంతకు ముందు ప్రభుత్వాలు సంస్కరణలు చేపట్టినా అమలులో విఫలమయ్యాయి. కానీ నరేంద్రమోది ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ప్రణాళికా బద్ధంగా, సమయ బద్ధంగా ఆచరణలో పెట్టడం వలన మంచి ఫలితాలు వస్తున్నాయి. అంత్యోదయం మొదలైంది. కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతున్నవి. అందరితో కలిసి, అందరి అభివృద్ధి సాధిండమే (సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌) లక్ష్యంగా ముందుకు పోతున్నారు. దేశాన్ని ఏకాత్మ భావన దిశగా నడిపిస్తున్నారు. ప్రపంచంలో ఈ దేశాన్ని 6వ అభివృద్ధి స్థానం నుండి మొదటి అభివృద్ధి స్థానంలోకి తీసుకువెళ్లేందుకు టీమ్‌ఇండియా ముందుకు వెళుతోంది.

– నరహరి వేణుగోపాల్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు, 9849066640

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *