జనజాగృతి

జనజాగృతి

రాజస్థాన్‌

సల్మాన్‌కు బెయిలు

కృష్ణజింకల వేట కేసులో ఐదేళ్ళ జైలు శిక్ష పడిన బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఏప్రిల్‌ 7వ తేదీన జోధ్‌్‌పూర్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో పాటు అంతే మొత్తానికి ఇద్దరి హామీతో సల్మాన్‌కు బెయిలు మంజూరైనట్లు ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్‌్‌పూర్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు సల్మాన్‌ఖాన్‌ను 2018 ఏప్రిల్‌ 5న దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.

ఈ కేసులో వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఆయనకు ఐదేళ్ళజైలు శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానాను విధించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సైఫ్‌ ఆలీఖాన్‌, టబు, నీలం, సోనాలీ బింద్రే సహా మరో నిందితుడు దుష్యంత్‌సింగ్‌ను సంశయలబ్ది కింద నిర్ధోషులుగా ప్రకటించింది.

1998 అక్టోబరులో జోధ్‌పూర్‌ సమీపంలోని కంకణి గ్రామం భగోదాలో రెండు కృష్ణజింకలు హత్యకు గురైనట్లు కేసు నమోదయ్యింది. సినిమా చిత్రీకరణ సందర్భంగా అక్కడకు వచ్చిన సల్మాన్‌ఖాన్‌ సహనటులతో కలసి వాహనంపై వెళుతూ జింకల గుంపుపై కాల్పులు జరిపారని, దీంతో రెండు కృష్ణ జింకలు చనిపోయాయని అభియోగాలు ఉన్నాయి.

ఈ కేసులో ఏప్రిల్‌ 5వ తేదీన కోర్టుకు హాజరైన సల్మాన్‌ఖాన్‌ 7వ తేదీ రాత్రి విడుదలయ్యారు. సల్మాన్‌ఖాన్‌ జోధ్‌పూర్‌ జైలుకు రావడం ఇది నాలుగోసారి. జింకల వేట కేసులోనే 1998, 2006, 2007 సంవత్సరాల్లో మొత్తం 18 రోజులు ఆయన జైల్లో గడిపారు.

ఆంధ్రప్రదేశ్‌

వెయిట్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణం

గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో తెలుగు కుర్రాడు రాగాల వెంకట రాహుల్‌ పసిడి వెలుగులను చిమ్మాడు. 85 కిలోల విభాగంలో అతడు విజేతగా నిలిచాడు. స్నాచ్‌లో 151 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 187 కిలోలు ఎత్తిన రాహుల్‌ మొత్తంగా 338 కిలోలతో స్వర్ణం చేజిక్కించుకొన్నాడు. రాహుల్‌ సొంతూరు గుంటూరు జిల్లా స్టువర్టుపురం.

రాహుల్‌ నిరుడు ఇక్కడే కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. అప్పుడు అతడు 351 కేజీలు ఎత్తడం గమనార్హం. ఈ సారి రాహుల్‌ తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. ఎందుకంటే కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత విజేత డాన్‌ ఒపెలోగ్‌ కన్నా అతడు 21 కేజీలు ఎక్కువ ఎత్తాడు. ఈ సారి మాత్రం డాన్‌ ఒపెలోగ్‌ (సమోవా) నుంచి అతడికి గట్టి పోటీ ఎదురయింది. స్నాచ్‌లో మొదట 147 కిలోలు ఎత్తిన రాహుల్‌ రెండో ప్రయత్నంలో 151 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. కానీ మూడో ప్రయత్నంలో ఆ బరువును ఎత్తేశాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో అదే జోరును కొనసాగిస్తూ తొలి ప్రయత్నంలోనే 182 కిలోలు ఎత్తేశాడు. రెండో ప్రయత్నంలో తన ప్రదర్శనను 187కి మెరుగుపరచిన అతడు మూడోసారి 191 కేజీలు ఎత్తే ప్రయత్నంలో విజయవంతం కాలేకపోయాడు. అదృష్టం కూడా రాహుల్‌కు కలసి వచ్చింది. రజత విజేత డాన్‌ ఓపెలోగ్‌ కూడా మూడో ప్రయత్నంలో 191 కిలోలు లేపడంలో విఫలమయ్యాడు. లేదంటే పసిడి అతడికే దక్కేది. ఒపెలోగ్‌ మొత్తంగా 331 కిలోలు ఎత్తి రెండోస్థానంతో సరిపెట్టుకున్నాడు. ఎనిమిదేళ్ళ వయస్సులోనే వెయిట్‌లిఫ్టింగ్‌ను ప్రారంభించిన రాహుల్‌ తన స్వశక్తితో ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను సొంతం చేసుకొన్నాడు. విజయానంతరం రాహుల్‌ మాట్లాడుతూ తన తదుపరి లక్ష్యం 2020 ఒలింపిక్స్‌కు ప్రాతినిథ్యం వహించి పతకం గెలవడమేనన్నాడు.

స్వర్ణ పతకాన్ని సాధించిన తెలుగుతేజం రాహుల్‌ను ఏ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఆతడికి ప్రోత్సాహకంగా రూ. 15 లక్షల ఆర్థిక సాయాన్ని సిఎం గతంలోనే అందించినట్లు శాప్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ కూడా రాహుల్‌ను అభినందించారు. రాహుల్‌ స్వర్ణపతకాన్ని సాధించడంపై అటు దేశవ్యాప్తంగానే కాకుండా ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ

పారదర్శకంగా పోలీసు విచారణలు

మన దేశంలో ఇప్పటివరకు ఎంతో గుట్టుగా కొనసాగే పోలీసు విచారణలు మున్ముందు పారదర్శకంగా కొనసాగనున్నాయి. పోలీసుల దర్యాప్తులను వీడియోల్లో చిత్రీకరించాల్సిన సమయం ఆసన్నమైందని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నేరాల దర్యాప్తునకు, చట్టబద్దమైన పాలనకు ఈ విధానం ఎంతో అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా వీడియో చిత్రీకరణను అమలుచేసే సాధన సంపత్తి దర్యాప్తు సంస్థలకు లేని విషయాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకొని దశలవారీగా ఈ ప్రక్రియను అమలు చేయాలని ఆదేశించింది. కేంద్ర ¬ంశాఖ నియమించిన కమిటీ రూపొందించిన ‘కేంద్రీకృత చర్యా ప్రణాళిక’ను ఆమోదిస్తూ జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయల్‌, ఆర్‌ఎఫ్‌ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను వెలువరించింది. శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిది అయినప్పటికీ ‘కేంద్రీకృత చర్యా ప్రణాళిక’ అమలును పరిశీలించేందుకు ఒక సంస్థను నెలకొల్పాలని ¬ంశాఖకు స్పష్టం చేసింది. దర్యాప్తుల వీడియో చిత్రీకరణకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందించాలని తెలిపింది. ఈ ఏడాది జూలై 15వ తేదీకి తొలిదశ అమలులోకి రావాలని స్పష్టం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలను నిరోధించడానికి అన్ని పోలీసు స్టేషన్లు, కారాగారాల్లో సిసి టివిలను అమర్చాలని 2015లో సుప్రీంకోర్టు ఓ తీర్పులో పేర్కొన్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.

పశ్చిమబెంగాల్‌

మూడేళ్ళుగా ఇంట్లోనే..

నిజంగా తల్లి మీద ప్రేమో లేక ఆమె పెన్షన్‌ మీద వ్యామోహమో తెలియదు కానీ కోల్‌కతాలోని ఓ వ్యక్తి తల్లి చనిపోయి మూడేళ్ళయినా ఆ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా ఇంట్లోనే ఫ్రిజ్‌లో భద్రపరచి తన కర్కశత్వాన్ని చాటుకొన్నాడు. మృతదేహం పాడవకుండా రకరకాల రసాయనాలను పూస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఈ దారుణ సంఘటన యావత్‌ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకెళితే భారత ఆహార సంస్థ విశ్రాంత ఉద్యోగులైన గోపాల్‌ చంద్ర మజుందార్‌ (80), బీనా మజుందార్‌ (70)లది దక్షిణ కోల్‌కతాలోని బెహలా. వీరి కుమారుడు శుభోబ్రతా మజుందార్‌(50).

దాదాపు మూడేళ్ళ కిందట బీనా మజుందార్‌ చనిపోయారు. కానీ మృతదేహానికి ఆమె కుమారుడైన శుభోబ్రతా మజుందార్‌ అంత్యక్రియ లను నిర్వహించలేదు. ఓ పెద్ద ఫ్రిజ్‌లో తల్లి మృత దేహాన్ని భద్రపరిచాడు. మృతదేహం పాడవకుండా రసాయనాలను పూశాడు. ఏప్రిల్‌ నాల్గవ తేదీన ఓ విలేకరి అటుగా వెళ్ళిన సమయంలో ఈ దారుణ సంఘటన వెలుగు చూడడంతో డొంకంతా కదిలింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మజుందార్‌ నివాసంలో సోదాలను నిర్వహించారు. కింది అంతస్తులోని తాళం వేసిన గదిలో రెండు పెద్ద ఫ్రిజ్‌లను గుర్తించారు. వీటిల్లో ఒక దాంట్లో బీనా మృతదేహం ఉండగా మరొకటి ఖాళీగా కనిపించింది. మృతదేహాన్ని, రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. శవానికి కుట్లు ఉండటం పలు అనుమానాలకు అవకాశమిస్తోంది. మృతదేహం కుళ్ళిపోకుండా ఉండేందుకు అవయవాలను తొలగించినట్లు తెలుస్తోంది. నిరుద్యోగి అయిన శుభోబ్రతా తల్లి మరణానంతరం కూడా పెన్షన్‌ను తీసుకొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తండ్రీ, కొడుకులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తండ్రి గోపాల్‌ సమాధానమిస్తూ తల్లిమీద ప్రేమతోనే తన కొడుకు ఇలా చేశాడే తప్ప పెన్షన్‌ మీద వ్యామోహంతో కాదని, ఎలాగైనా ఆమెకు జీవం పోస్తానని చెబుతుండేవాడని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనాన్ని సృష్టించింది.

తమిళనాడు

ముదురుతున్న ‘కావేరీ’ సమస్య

‘కావేరీ’ జల వివాదం క్రమక్రమంగా ముదురు తోంది. కావేరీ వాటర్‌ బోర్డును ఏర్పాటు చేయా లంటూ పదిరోజులకు పైగా అన్నాడిఎంకె ఎంపిలు లోక్‌సభను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. నిరసనలో భాగంగా ఇటీవల తమిళనాడులో డిఎంకె నేతృత్వంలో బంద్‌ కూడా జరిగింది. తాజాగా కావేరీ నిర్వహణ మండలి ( సిఎంబి)ని ఏర్పాటు చేయాలని, స్ట్టెరిలైట్‌ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల (నడిగర్‌) సంఘం, నిర్మాతల మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 8న చెన్నైలో ఆందోళనను నిర్వహించారు. ఈ ఆందోళనలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ప్రసిద్ద నటుడు కమలహాసన్‌, సత్యరాజ్‌, సూర్య, విజయ్‌, ధనుష్‌, శివకార్తికేయన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అజిత్‌తోపాటు పలువురు హీరోలు, నయనతార, అనుష్క వంటి కథానాయికలు హాజరుకాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఆందోళన సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ కావేరీ విషయంలో రాష్ట్ర ప్రజల డిమాండ్‌ న్యాయమైనదని పేర్కొన్నారు. సిఎంబిని ఏర్పాటు చేయకపోతే తమిళుల ఆగ్రహావేశాలను కేంద్రం చవిచూస్తుందంటూ హెచ్చరించారు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా ప్రజలకు సమస్యలు కలిగించే స్టెరిలైట్‌ పరిశ్రమ ఏమాత్రం అవసరం లేదని పేర్కొన్నారు. కావేరీ జలాల కోసం పోరాటానికి సంఘీభావం తెలిపేలా ఐపిఎల్‌ పోటీల్లో చెన్నై జట్టు (సిఎస్‌కె) నల్లబ్యాడ్జీలు ధరించి ఆడాలని కోరారు. నదీ జలాల విషయంలో జరుగుతున్నదంతా రాజకీయమేనని ఆయన దుయ్యబట్టారు. కర్ణాటకలో తన సినిమాను విడుదల చేయకపోతే ఆ విషయాన్ని అక్కడి నిర్మాతలు, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుం దని తెలిపారు. రాజకీయంగా తన ప్రత్యర్థి కమలహాసన్‌ కాదని, ఆయన్ను తాను అలా చూడటం లేదని రజనీ స్పష్టం చేశారు. పేదరికం, లంచం, నిరుద్యోగం తదితరాలే తన ప్రత్యర్థులని రజనీ తన స్టైల్‌లో చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌

యువకుడి హత్య

తమ కూతుర్ని ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడన్న కక్షతో సోనూసింగ్‌ అనే 19 ఏళ్ళ యువకుడిని అమ్మాయి తరపు బంధువులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఏప్రిల్‌ 7వతేదీ అర్దరాత్రి రాటిన తర్వాత కాన్పూర్‌లోని ఫీల్‌ఖానా పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. ఐదుగురు నిందితులు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో బాధితుడి భార్య కుటుంబ సభ్యుడు కూడా ఉండటం విశేషం. సోనూసింగ్‌ ఓ దళిత యువతిని ప్రేమించి కొద్ది నెలల క్రితమే పెళ్ళి చేసుకున్నాడని, ఆ అమ్మాయి బంధువులు ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో కుట్రపన్ని హత్యకు ప్రణాళికను రచించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

కర్ణాటక

అసెంబ్లీలో నేరచరితులు.. కోటీశ్వరులు..

కర్ణాటక ప్రస్తుత శాసనసభ్యుల్లో నేరచరితులు, కోటీశ్వరులకు కొదవే లేదు. గత విధాన సభ ఎన్నికల సందర్భంగా వారు ఎన్నికల సంఘానికి సమర్పించిన ప్రమాణ పత్రాల అధ్యయనంలో ఈ వివరాలు వెలుగుచూశాయి. ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ తాజాగా ఈ అధ్యయనం చేసింది. మొత్తం 224 మంది ఎమ్మెల్యేల్లో 207 మంది ప్రమాణ పత్రాలు మాత్రమే ఆ సంస్థకు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకొని తాజా సమాచారాన్ని జోడించి ఆసక్తికర అంశాలను సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఆ సంస్థ నివేదిక ప్రకారం ప్రస్తుత కర్ణాటక విధానసభలో 68 మంది క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న వారున్నట్లు తేలింది. హత్యాయత్నం, అపహరణ, దోపిడీ తదితర తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 35గా ఉంది. కోటీశ్వరుల సంఖ్య 193 మంది కాగా వారిలో 109 మంది కాంగ్రెస్‌, 36 మంది బిజెపి, 35 మంది జనతాదళ్‌ పార్టీలకు చెందినవారున్నారు. ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.24.54 కోట్లుగా తెలుస్తోంది. శ్రీమంతులైన ప్రముఖుల జాబితాలో ప్రియకృష్ణ (రూ.910 కోట్లు), ఎం.బి.టి. నాగరాజు ( రూ.470 కోట్లు), అనిల్‌లాడ్‌ (రూ.288 కోట్లు), డి. కె. శివకుమార్‌ (రూ.251 కోట్లు), సంతోష్‌ లాడ్‌ (రూ. 186 కోట్లు)లు ఉన్నారు.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *