జగన్‌ సారథ్యంలో మహాకూటమి..!

జగన్‌ సారథ్యంలో మహాకూటమి..!

– జనసేన, వామపక్షాలతో కలిసి..
– ప్రత్యేక హోదాయే ప్రధానాంశంగా..

సాధారణ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ఎపిలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న సంకేతాలందుతున్నాయి. గత ఎన్నికల్లో కేవలం లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని కోల్పోయిన వైకాపా రథసారథి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి రానున్న ఎన్నికల్లో అధికారపక్షమైన టిడిపిని గద్దె దించడమే లక్ష్యంగా తెరవెనుక పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయయ సమాచారం.
2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపిల తరపున ప్రచారాన్ని నిర్వహించి అనంతరం క్రియాశీలక రాజకీయ ఎంట్రీనిచ్చిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ వివిధ కారణాల దృష్ట్యా క్రమంగా ఆ కూటమికి దూరమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ప్రధానాంశంగా పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలన్న దిశగా కసిగా తెరవెనుక కార్యాచరణను రూపొంది స్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తనకు ఆగర్భ శతృవైన చంద్రబాబును గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకొన్న ప్రధాన విపక్ష నేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి వచ్చే ఎన్నిలు జీవన్మరణ సమస్యగానే పేర్కొనవచ్చు. ఈసారి ఎలాగైనా అధికారపక్షాన్ని చావుదెబ్బ తీసి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని తనదైన శైలిలో మార్చాలని ఉవ్విళ్ళూరుతున్న జగన్మోహన్‌రెడ్డి తదనుగుణంగా అందివచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం లేరు. శతృవుకు శతృవులు మితృలు కాగలరన్న  సిద్ధాంతంతో జగన్‌ ఈసారి తనతో కలసి వచ్చే రాజకీయ శక్తులతో ఓ మహా కూటమిని ఏర్పరచి టిడిపి పాలనకు చరమగీతం పాడాలన్న దిశగా రహస్య కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాస్‌ ఫాలోయింగ్‌ బాగా ఉన్న జనసేనాని పవన్‌కళ్యాణ్‌తో స్నేహం దిశగా వైకాపా అడుగులేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముందస్తు ఎన్నికలు వచ్చినా, లేక సాధారణ ఎన్నికలే జరిగినా సమయం దాదాపుగా ఒకటే కావడంతో రాష్ట్రంలోని అధికార, విపక్షాలు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకొంటూ పొత్తు ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నాయి. ప్రస్తుత అధికార కూటమి టిడిపి-బిజెపిలు కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంతో వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీల మధ్య పొత్తు తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో విపక్షాలు కూడా మహాకూటమి దిశగా అడుగులేస్తున్నాయన్న వాదనలు బలంగా వినపడుతున్నాయి.
తమ పార్టీతో కలసి పని చేసేందుకు బిజెపి జాతీయ నాయకత్వం దోబూచులాడుతోందన్న ముందస్తు ఆలోచనతో జగన్‌ నేతృత్వంలోని వైకాపా ఇతర రాజకీయ శక్తులతో పొత్తులకు ప్రయత్నించే పనిలో కార్యాచరణను ముమ్మరం చేసినట్లు సమాచారం. మారిన పరిస్థితులతో వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అన్న జనసేన పార్టీతో జతకట్టే దిశగా వైసిపి పార్టీ పావులు కదుపుతున్నట్లు సంకేతాలందు తున్నాయి. ఈ సరికొత్త మిత్రబంధంపై కొద్ది నెలల కిందటే ఇరు పార్టీలకు చెందిన నేతలు కొందరు రహస్య మంతనాలు జరిపినట్లు స్పష్టమవుతోంది. ఈ భవిష్యత్‌ పొత్తు కారణంగానే నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ టిడిపికి మద్దతును ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. వైకాపా ప్రధాన రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్‌ కిశోర్‌ జనసేనతో పొత్తు కోసం తమ పార్టీకి చెందిన వారిని పంపి రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చలో వైకాపాకు చెందిన ఒక యువ ఎంపి, ఎమ్మెల్యేలు జనసేనతో సంప్రదింపులు జరిపారన్న వార్తలు గుప్పుమటున్నాయి. ప్రస్తుతానికి ఈ చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని, కార్యాచరణలోనే ఉన్నాయని స్పష్టమవుతోంది.
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే విపక్షాలన్నీ ఏకం కావడమే ఉత్తమ మార్గమన్న ఆలోచనలో వైకాపా సారథి ఉన్నారు. జనసేనతో పాటు ప్రజా పోరాటాల్లో ఎల్లప్పుడూ ముందుండే వామపక్షాలను కూడా కలుపుకెళ్ళాలన్న దిశగా వైసిపి మంత్రాంగాన్ని రచించే పనిలో పడింది.
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి, జగన్‌ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఎలాంటి కార్యాచరణను రూపొందించాలన్న అంశాలపై అధ్యయనం చేసేందుకు వైసిపి తరపున రంగంలోకి దిగిన ప్రశాంత్‌ కిశోర్‌ సలహాల మేరకే జగన్‌ కూడా మహాకూటమి ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయాన్ని వైకాపాలోని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు.
వైకాపాతో పొత్తు ప్రతిపాదనను జనసేన తోసిపుచ్చకపోయినా ఇంకా సమయం ఉందికదా అప్పుడు ఆలోచిస్తామంటూ దాటవేత ధోరణిని అవలంబిస్తోంది. ఒకవేళ కలసి పోటీ చేయవలసి వస్తే తమ డిమాండ్లను కూడా ఓ చిట్టా రూపంలో జనసేన ప్రతినిథులు వైకాపా ముందుంచినట్లు కూడా వార్తలు వినపడుతున్నాయి. పొత్తు ఫలించి అధికారంలోకి వస్తే తమ పార్టీకి డిప్యూటి సిఎంతో పాటు కొన్ని మంత్రి పదవులనూ ఇవ్వాలన్న డిమాండ్‌ను జనసేన చేసినట్లు సమాచారం. ఈ డిమాండ్ల విషయంలో మరింత స్పష్టత రావాలంటే ఇరుపార్టీల మధ్య మరిన్ని సమావేశాలు జరగక తప్పదన్న అభిప్రాయం పొత్తుకోసం ప్రయత్నించే ప్రతినిథుల్లో వ్యక్తమవుతోంది.
ఒకవైపు జనసేన నాయకులతో చర్చలు జరుపుతూనే మరోవైపు వామపక్షాల నాయకులతో కూడా వైసిపి టచ్‌లో ఉన్నట్లు వినికిడి. వచ్చే ఎన్నికల్లో అధికారపక్షమైన టిడిపితో తలపడేందుకు బలమైన అంశంగా ఎపికి ప్రత్యేక¬దా డిమాండ్‌ను ఎంచుకోవాలన్న దిశగా ఈ పార్టీలు ఓ అంగీకారానికి వచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలా జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో జనసేన, వామపక్షాలు ఏకతాటిపైకి వచ్చి మహాకూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక¬దానే పాశుపతాస్త్రంగా  ఎంచుకుని ఎన్నికలకు సిద్ధమవటం ప్రస్తుతానికి మాత్రం ఖాయంగానే కనపడుతోంది.

– పద్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *