చర్చి భూముల కుంభకోణం కార్డినల్‌పై ఆరోపణలు

చర్చి భూముల కుంభకోణం కార్డినల్‌పై ఆరోపణలు

కేరళలోని ఎర్నాకులం ఆర్చిబిషప్‌ మరియు కార్డినల్‌ జార్జ్‌ అలెంచేరీల సారథ్యంలో చర్చి భూముల అమ్మకాల లావాదేవీలలో జరిగిన అవకతవకల నేపథ్యంలో చర్చి ఆస్తులను పరిరక్షించేం దుకు జాతీయ స్థాయిలో ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ తెరమీదికి వచ్చింది. Poor Christian Liberation Movement ఈ విషయమై జరుగుతున్న ఆందోళనను బలపరుస్తోంది.

అయితే కేథలిక్‌ బిషప్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (CBCI) చైర్మన్‌ మాత్రం వీరి డిమాండును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చర్చి భూములపై ఆధిపత్యం కార్డినల్‌ గ్రాసియందే అన్నది ఆయన వాదన.

కేరళలో ఇటీవల ప్రతిపాదింపబడిన భూ చట్టాన్ని తాను ఆమోదించననీ, భూమి వ్యవహారాలకు సంబంధించిన అవకతవకల విషయంలో తమ కంటూ లీగల్‌ ఏర్పాట్లు ఉన్నాయనీ, చర్చి ఆస్తుల విషయంలో పారదర్శకత కోసం ఎప్పటికప్పుడు తాము ఆడిట్‌ చేస్తుంటామనీ కార్డినల్‌ గ్రాసియం అంటున్నారు. చర్చి భూముల వ్యవహారాలలో అవకతవకలకు పాల్పడ్డాడని క్రిమినల్‌ ఆరోపణలున్న కార్డినల్‌ జార్జ్‌ అలెంచేరీ ఆ పదవికి రాజీనామా చెయ్యాలని సగానికి పైగా కేథలిక్‌ మతాధిపతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయినా సరే కార్డినల్‌ గ్రాసియం బహిరంగంగానే కార్డినల్‌ జార్జ్‌ అలెంచేరీకి తన సమర్ధన తెలుపుతున్నారు.

ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలలో కార్డినల్‌ స్థాయి మత గురువుపై అవినీతి ఆరోపణలు రావడం భారతదేశంలో ఇదే మొదటిసారి. మనదేశంలోని పత్రికల్లోనూ, మీడియాలోనూ ఎక్కడా ఈ ప్రస్తావన లేకపోవడం వల్ల దీని గురించి ఎవరికీ తెలియకుండా ఉండిపోయింది.

భూమి వ్యవహారాలకు సంబంధించి మత గురువు జార్జ్‌ అలెంచేరీ పెద్ద మొత్తంలోనే అవక తవకలకు పాల్పడ్డారని స్వయానా చర్చి నియమించిన ఒక ఎంక్వయిరీ కమిటీ ఆరోపించింది. చర్చి మార్గదర్శక సూత్రాలను అనుసరించి అతనిని కఠినంగా శిక్షించాలని కూడా కమిటీ సూచించింది.

కార్డినల్‌ అంటే పోప్‌ అజమాయిషీలో పనిచేసే అత్యున్నతస్థాయి మతగురువు. జార్జ్‌ అలెంచేరీ భారతదేశంలోని ఏడుగురు కార్దినల్స్‌లో ఒకరు. విశేషమేమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ‘కార్డినల్‌’ హోదాలో ఉన్నవారే వాటికన్‌ పోప్‌ని ఎన్నుకునేది! అందువల్ల ఎంక్వయిరీ కమిటీ తన నివేదికను వాటికన్‌కి పంపించింది.

ఎంక్వయిరీ కమిటీ నివేదిక ప్రకారం చర్చి భూములకు సంబంధించిన ఐదు ప్రధాన వ్యవహారాలలో జార్జ్‌ అలెంచేరీకి 27 కోట్ల రూపాయల నగదు ముట్టింది. అయితే జార్జ్‌ అలెంచేరీ మాత్రం తనకి 9 కోట్ల రూపాయలే ముట్టాయని అంటున్నారు.

చర్చికి సంబంధించిన నిర్దేశిత సూత్రాలను జార్జ్‌ అలెంచేరీ తుంగలో తొక్కారనీ, ఆయన చర్చి వ్యవస్థ విశ్వాసాలను భంగపరిచారనీ, ఇది చాలా నేరపూరితమైనదనీ, భారతదేశంలో ఇంతవరకూ ఇలాంటి ఆరోపణలే రాలేదనీ ఎంక్వయిరీ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

కేరళ హైకోర్టు కార్డినల్‌ జార్జ్‌ అలెంచేరీకి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను రిజిస్టర్‌ చేకుండా స్టే ఇచ్చింది. కోర్టులో పిటిషన్‌ వేసిన షైన్‌ వర్గీస్‌ మాత్రం, ‘చర్చికి సంబంధించిన ఆస్తుల వ్యవహారాలలో ఏమాత్రం పారదర్శకత లేదు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ జార్జ్‌ అలెంచేరీ సమాధానం చెప్పాలి. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. మొత్తం చర్చి వ్యవస్థకి సంబంధించినది. చర్చి భూముల అమ్మకాలు-కొనుగోళ్ళ వ్యవహారాల ప్రభావం క్రైస్తవ సమాజంపై ఉంటుంది. అందుకే చర్చి యొక్క మార్గదర్శక సూత్రాల ఉల్లంఘన జరిగిందని ఎంక్వయిరీ కమిటీ పేర్కొంది’ అని అన్నారు.

జార్జ్‌ అలెంచేరీ కార్డినల్‌ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనపై విచారణ జరిపే నిర్ణయాధికారం ఒక్క పోప్‌కే ఉందని కౌన్సిల్‌ ఆఫ్‌ కార్డినల్స్‌ గట్టిగా వాదించడం పట్ల కేరళ హైకోర్టు మార్చి 2018లో విస్మయం వ్యక్తం చేసింది. చర్చి ఆస్తులకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు కార్డినల్‌కి వర్తించవని కౌన్సిల్‌ అనడం చాలా ఆశ్చర్యంగా ఉందనీ, ఇది చర్చి ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల పట్ల విశ్వసనీయతను దెబ్బతీయడమేననీ హైకోర్టు పేర్కొంది.

ఎర్నాకులం ఆర్చియోసిస్‌ మెడికల్‌ కాలేజి నిర్మాణం కోసమని బ్యాంకులలో 60 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. అది తీర్చడానికై 2016లో కొచ్చిలో చర్చికి చెందిన మూడు ఎకరాల భూమిని అమ్మేసింది. ఈ అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు చర్చి ఒక ఏజంటును నియమించింది. అతడు ఆ మూడు ఎకరాలకు 27.30 కోట్ల రూపాయల ధర పలుకుతుందని అంచనా వేసాడు. కానీ స్థానికులు మాత్రం ఆ మూడెకరాల వాస్తవ ధర 80 కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు.

చర్చి ఆస్తి వ్యవహారాలు ఇలా ఉండగా జార్జ్‌ అలెంచేరీపై విచారణలు చేపట్టడానికి వాటికన్‌ నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదనీ, అందువల్ల ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకునే అవకాశం లేదనీ కౌన్సిల్‌ ఆఫ్‌ కార్దినల్స్‌ తెలిపింది.

ఢిల్లీ నుంచి వెలువడే Matters India సంపాదకుడు జోస్‌ కావి, ‘ఇది చర్చి రాజకీయాలకు సంబంధించిన విషయమని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరైనా సరే కార్డినల్‌ పక్షమైనా వహించాలి, లేదా అతడికి వ్యతిరేకంగానైనా నిలబడాలి.

ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. వాటికన్‌ లేదా కేథలిక్‌ బిషప్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (CBCI) ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పూనుకోవాలి’ అని అన్నారు. ‘అసలు తనపై ఏదైనా నేరారోపణలు వచ్చినప్పుడు కార్డినల్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చెయ్యాలి. విచారణ పూర్తయి తన నిర్దోషిత్వం నిరూపితమయ్యే వరకూ అతడు చర్చి వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు’ అని కాన్పూరులో గల ఆల్‌ ఇండియా కేథలిక్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు చోటేభాయ్‌ అన్నారు.

– డా. దుగ్గిరాల రాజకిశోర్‌, 8008264690

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *