కశ్మీరీ ఉగ్రవాదం కంచుకోటలో కమలం

కశ్మీరీ ఉగ్రవాదం కంచుకోటలో కమలం

ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల దగ్గరకి పోవడానికి సైతం సాహసించడం లేదు. అధికార పిడిపి, ప్రతిపక్ష నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు ముసుగు తన్ని పడుకున్నాయి. గత ఏడాదిన్నర, రెండేళ్లుగా ఒక్క పెద్ద కార్యక్రమాన్ని, ఒక్క బహిరంగ సభను సైతం నిర్వహించేందుకు ఈ రెండు పార్టీలూ ముందుకు రావడం లేదు. ఎంతో కొంతబలం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా కశ్మీర్‌ లోయలో శవాసనం వేసేసింది. అసలు లోయలో రాజకీయ కార్యకలాపాలే దాదాపు లేని పరిస్థితి దాపురించింది.

ఈ పరిస్థితిని మార్చేందుకు కశ్మీర్‌ లోయలో భారతీయ జనతాపార్టీ నడుం బిగించింది. ఆ పార్టీ కార్యకర్తలు కశ్మీర్‌ లోయలో సభలు, సమావేశాలు నిర్వహించి రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించు కున్నారు. ముసుగులో గుద్దులాట పనికిరాదన్న దఢమైన ధోరణిని అవలంబిస్తూ తొలి సమావేశాన్ని దక్షిణ కశ్మీర్‌లోని ట్రాల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశం ఏప్రిల్‌ 14న జరుగుతుంది. ట్రాల్‌ ఉగ్రవాది బుర్హన్‌ వానీ సొంత ఊరు. ఉగ్రవాదానికి చాలా సానుకూలత ఉన్న ప్రాంతమది. కానీ ఈ ప్రదేశం లోనే తొలి సమావేశాన్ని నిర్వహించి, స్టాటస్‌కోను సవాలు చేయాలని బిజెపి నిర్ణయించింది. రాష్ట్ర బిజెపి కార్యదర్శి అశోక్‌ కౌల్‌ ఈ సభలో ప్రసంగిస్తారు.

ట్రాల్‌లో బిజెపి కార్యకర్తలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. మిగతా పార్టీలు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలూ నిర్వహించకుండా స్తబ్దుగా ఉండిపోయిన సమయంలో ఈ కార్యకర్తలు పనిచేస్తున్నారు. గత నెల మార్చి 3, 4 తేదీల్లో బిజెపి కుల్గామ్‌, పుల్వామాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించింది. పుల్వామాలో పార్టీ కార్యాలయాన్ని కూడా తెరిచింది. పుల్వామాలో బిజెపి కార్యాలయం తెరిచిన కొన్ని రోజులకే ఆ పార్టీ నేత అన్వర్‌ ఖాన్‌పై హత్యా ప్రయత్నం జరిగింది. ఆయనకు తూటాలు తగలలేదు. కానీ ఆయన అంగరక్షకుడు గాయ పడ్డాడు. అయినప్పటికీ ఆయన వెనుకంజ వేయకుండా పార్టీ పనిని కొనసాగిస్తున్నారు.

కశ్మీర్‌ లోయలో గతంలోనూ బిజెపి శాఖ లుండేవి. ఉగ్రవాదం అత్యుగ్రస్థాయిలో ఉన్నప్పుడు జిహాదీల చేతిలో హత్యకు గురైన తొలి కశ్మీరీ పండిత్‌ టికాలాల్‌ టాప్లూ అప్పట్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవారు. 1999 లోనే గులామ్‌ హైదర్‌ నూరానీ అనంతనాగ్‌ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనను ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. ఆయన అనుచరుడు సోఫీ యూసుఫ్‌ 1999 నుంచి పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపిగా పోటీ చేశారు. ఆయన ప్రస్తుతం ఎంఎల్‌సిగా ఉన్నారు. కశ్మీర్‌ లోయ నుంచి బిజెపికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఎంఎల్‌సి ఆయన. దీనదయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా బిజెపి చేపట్టిన ‘దీన్‌దయాళ్‌ విస్తారక్‌ యోజన’కు కశ్మీర్‌ లోయ నుంచి 30 మంది పూర్ణకాలిక కార్యకర్తలు ముందుకొచ్చారు. వీరంతా ముస్లింలే కావడం విశేషం.

నిజానికి కశ్మీర్‌ లోయలో రాజకీయ కార్యకలాపాలు వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉంది. 2011 తరువాత అక్కడ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. పంచాయతీ స్థాయి ఎన్నికలు జరిగితే ప్రజలకు ప్రజాస్వామ్య యుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వీలు కలుగుతుంది. వాతావరణంలో మార్పు వస్తుంది. గ్రామ స్థాయిలో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. వీటన్నిటి వల్ల రాష్ట్రంలో ఉగ్రవాదం వెనుకంజ వేసే అవకాశాలున్నాయి. ఈసారి అమర్‌నాథ్‌ యాత్ర పూర్తయిన తరువాత పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 35 వేల పంచాయితీ లున్నాయి. నిజానికి కశ్మీర్‌ లోయలో నేడు ఉగ్రవాదం వెనుకంజలో ఉంది. ఇటీవలే పెద్ద ఎత్తున ఉగ్రవాదు లను భద్రతాదళాలు హతమార్చాయి. పాకిస్తాన్‌ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కశ్మీరీ ప్రజలను ఉవ్వెత్తున లేచి ఉద్యమించేలా చేయలేక పోతోంది. యువతలో ఒక గణనీయమైన వర్గం ఉగ్రవాదం, వేర్పాటువాదాల రక్త క్రీడతో విసిగి వేసారి పోయింది. ఆ వర్గం మార్పును కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి ఉపాధి, ఉద్యోగావ కాశాలను కల్పించాల్సి ఉంది. ఇదే జరిగితే ప్రజలు మరింత పెద్ద సంఖ్యలో ముందుకు రాగలరు, ఉగ్రవాదం వెన్ను విరిగిపోతుంది. కశ్మీర్‌ లోయలో యువతను కేంద్ర బిందువుగా చేసుకుని రాజకీయ ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *