కథువా – జాతీయవాద కృష్ణుడు శమంతకమణిని గెలుచుకోగలడా

కథువా – జాతీయవాద కృష్ణుడు శమంతకమణిని గెలుచుకోగలడా

పురాణకాలంలో సత్యజిత్తు కృష్ణుడిపై శమంతకమణిని దొంగిలించాడని అభాండం వేస్తాడు. కృష్ణుడు జాంబవంతుని రాజ్యంలోకి వెళ్లి, అతని గుహలో ఉన్న శమంతకమణిని తీసుకువచ్చి తనపైన ఉన్న అభాండాన్ని తొలగించు కుంటాడు. అలనాటి జంబువనమే ఈనాడు పత్రికల్లో పతాక శీర్షికగా మారిన కథువా. శమంతకమణిని తెచ్చిన ప్రదేశమే నేడు హీరానగర్‌ అనే పేరుతో ఉన్న చోటు అంటారు. 1921 దాకా ఈ జిల్లాను జస్రోటా అనేవారు. తరువాత జమ్మూ కశ్మీర్‌ మహారాజు దీని పేరు కథువాగా మార్చారు.

నేడు కథువా ఉన్నట్టుండి వార్తల్లోకి వచ్చింది. వాస్తవానికి రెసానా అనే మారుమూల గ్రామంలో ఒక ఎనిమిదేళ్ల బాలిక బలాత్కారం, హత్యతో ఈ జిల్లా పేరు మార్మోగిపోతోంది. కాసేపు కథువా రేప్‌ సంఘటనను పక్కన బెట్టి కథువా ఎక్కడుందో జమ్మూ కశ్మీర్‌ మ్యాప్‌లో చూడండి. కథువా ప్రాముఖ్య మేమిటో చెప్పకుండానే మీకు అర్థమైపోతుంది.

పశ్చిమాన నియంత్రణ రేఖపై పాకిస్తాన్‌ పొంచి ఉంటుంది. తూర్పున హిమాచల్‌ ప్రదేశ్‌. దక్షిణాన పంజాబ్‌లోని గురుదాస్‌ పూర్‌ జిల్లా. గురుదాస్‌పూర్‌, పఠాన్‌ కోట్‌ ఉగ్రవాద దాడులు జరిగిన ప్రదేశాలు కథువాకి దగ్గర్లోనే ఉంటాయి. ఆ దాడులు చేసిన ఉగ్రవాదుల లక్ష్యం కశ్మీర్‌ ప్రవేశ ద్వారం, కథువాకు వెళ్లే దారులను గుప్పెట్లోకి తెచ్చుకోవడమే. మరో వైపు ఉత్తరాన డోడా, ఉధమ్‌పూర్‌ జిల్లాలు ఉంటాయి. డోడా, ఉధమ్‌పూర్‌ల మీదుగానే కశ్మీర్‌ లోయలోకి ప్రవేశించడానికి వీలుంటుంది. రెండు దశాబ్దాల క్రితం కథువాకి ఉత్తరాన కశ్మీరీ ఉగ్రవాదం, దక్షిణాన ఖలిస్తానీ ఉగ్రవాదం అత్యంత భీతావహ పరిస్థితుల్ని కల్పించాయి.

అయితే ఇంతటి కఠిన పరిస్థితుల్లోనూ కథువాలో ఉగ్రవాదం పెచ్చరిల్లలేదు. ఉగ్రవాదం వైపు యువత వెళ్లలేదు. కథువాలో దాదాపు 85 శాతం జనాభా హిందువులు. మిగతా జనాభా ముస్లింలు. ఉగ్రవాదులు ఎంత ప్రయత్నించినా కథువాలో మత ఉద్రిక్తతలు చెలరేగలేదు. హిందువులు, ముస్లింలు కలిసి మెలిసి ఉంటూ వస్తున్నారు. ముస్లింలు ప్రధానంగా బకర్వాల్‌ తెగకు చెందిన వారు. బకర్వాల్‌లు షెడ్యూల్డు తెగలకు చెందిన వారు. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్న ఏకైక ముస్లింలు బకర్వాల్‌లే. వీరు పహాడీ అనే భాషను మాట్లాడతారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే బకర్వాల్‌లు గత 70 సంవత్సరాల్లో ఏనాడూ ఉగ్రవాదులతో చేతులు కలపలేదు. అదే విధంగా పాకిస్తాన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరిని తమ వైపు తిప్పుకోలేక పోయింది. ఈ బకర్వాల్‌లు సంవత్సరంలో కొన్ని నెలలు కథువాలో నివసిస్తారు. మిగతా సమయంలో వారు తమ పశువులను మేపడానికి పీర్‌పంజాల్‌ వంటి కొండలపైకి వెళ్తారు. అక్కడే నివాసం ఉంటారు. వారు ప్రధానంగా సంచారజాతుల వారు. ఈ బకర్వాల్‌లకు, సైన్యానికి సత్సంబంధాలు ఉంటాయి. పాక్‌ గూఢచారుల కదలికలు, ఉగ్రవాదుల కదలికల గురించి భారత సైన్యానికి సమాచారం ఇచ్చేవారు ప్రధానంగా బకర్వాల్‌లే. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కార్గిల్‌ చొరబాటును భారత ప్రభుత్వం గుర్తించగలిగింది. బకర్వాల్‌లకు, హిందువులైన డోగ్రీలకు మధ్య వివాదాలు సష్టించేందుకు కశ్మీరీ వేర్పాటువాదులు చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు.

ఇటీవలి కాలంలో కథువాను మళ్లీ సమస్యాగ్రస్తంగా చేసేందుకు వేర్పాటు వాదులు, ఉగ్రవాద శక్తులు, ముఖ్యంగా పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హీరానగర్‌ తాలూకాలోని ఛాప్‌నాలా, హరియాచక్‌లను ఉపయోగించుకునేందుకు వారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ చొరబడ్డ ఉగ్రవాదులు కథువా, సాంబాలలోని కీలక లక్ష్యాలపై దాడులు చేయడానికి వీలవుతుంది. ఈ ప్రాంతంలో పలు స్కూళ్లు, ఆర్మీ యూనిట్లు ఉన్నాయి. జమ్మూ పఠాన్‌ కోట్‌ హైవే కూడా నియంత్రణ రేఖకి కేవలం పదిహేను కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంపై పట్టు సాధిస్తే మూడు జిల్లాలపై నియంత్రణ సాధించవచ్చు. 2013 డిసెంబర్‌లో రివరీన్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వేలెన్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విధానంలో భాగంగా ఛాప్‌నాలాను కట్టుదిట్టం చేశారు. అయినా ఈ ప్రాంతంలోని అటవీ విభాగం నర్సరీలు, లోయలు, నదులు, వాగుల ప్రాంతాలను ఉగ్రవాదులు ఉపయోగించుకుంటున్నారు.

గతంలో 2013 సెప్టెంబర్‌లో ఈ ఛాప్‌నాలా గుండా పాక్‌ ఉగ్రవాదులు ప్రవేశించి కథువా, సాంబాలలో దాడులకు తెగబడ్డారు. కథువా మీదుగా రామ్‌బన్‌, డోడా జిల్లాలలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, అక్కడ నుంచి ఉధమ్‌పూర్‌ కిష్త్‌వాడ్‌ జిల్లాలోకి వెళ్లడం, తద్వారా బనిహాల్‌ కనుమ మీదుగా కశ్మీర్‌ లోయలోకి ప్రవేశించడం ఉగ్రవాదుల లక్ష్యం. ఈ మేరకు గత కొంతకాలంగా గతంలో లొంగిపోయిన ఉగ్రవాదులను మళ్లీ కలుపుకుని, స్థావరాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో డోడా, రామ్‌బన్‌లలో రెండు టెర్రర్‌ మాడ్యూల్‌లను జమ్మూ కశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. బనిహాల్‌లో కనుమ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి పాల్పడ్డ ముష్కరులు కూడా కథువాలోని ఛాప్‌నాలా మీదుగా వచ్చిన వారే కావడం గమనార్హం. అదే విధంగా కిష్త్‌వాడ్‌ నుంచి వేర్పాటువాదానికి కంచుకోట అయిన దక్షిణ కశ్మీర్‌లోకి వెళ్లడం సులువు. ఈ ప్రాంతంలో మూడు ఉగ్రవాద ముఠాలు పనిచేస్తున్నాయి.

కథువాలో అల్లర్లు జరగడం, హిందూ ముస్లింల మధ్య విభేదాలు రావడం, ఆ ప్రాంతంలో అశాంతి పెచ్చరిల్లడం పాకిస్తాన్‌కి, ఉగ్రవాదులకు, వేర్పాటు వాదులకు చాలా అవసరం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కథువా కేసులో పడి మనం పట్టించు కోని విషయం ఏమిటంటే ఏప్రిల్‌ 26న కథువాలోకి ఇటీవలి కాలంలో తొలిసారి ఉగ్రవాదులు ప్రవేశించి, ముగ్గురు భద్రతా దళ సైనికులను, ఇద్దరు పౌరులను చంపేశారు. మరో పదిమందిని గాయాల పాలు చేశారు. కశ్మీర్‌లో పిడిపి-బిజెపి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగిన తొలిదాడి ఇదే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో కథువాలో జరిగిన సంఘట నను ఉపయోగించుకోవడానికి పాకిస్తాన్‌, కశ్మీరీ వేర్పాటువాదులు, ఉగ్రవాద సంస్థలు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నాయన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి లక్ష్యం బకర్వాల్‌లకు, జమ్మూ హిందువులకు మధ్య వివాదాన్ని సష్టించి, అగాథాన్ని పెంచడం. కథువా ఉదంతాన్ని వారు ఉపయోగించు కునే ప్రయత్నం చేశారు. ఎప్పుడో జరిగిన ఘాతుకానికి మతం రంగు పూయడానికి, కథువాలో బకర్వాల్‌లు అభద్రతతో ఉన్నారని చెప్పడానికి వారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. కథువా ఉదంతం పతాకశీర్షిక కాగానే కశ్మీర్‌ లోయ నుంచి వెలువడే పత్రికలు బకర్వాల్‌లు హిందువుల అత్యాచారాలకు గురవుతున్నారని, అణచివేతకు గురవుతున్నారని కథనాలు ప్రచురించాయి. ఇప్పటికే కథువా, జమ్మూ వంటి హిందూ మెజారిటీ ప్రాంతాల జనాభా స్వరూపాన్ని మార్చేందుకు వివిధ ఇస్లామిక్‌ సంస్థలు, కొందరు పత్రికాధిపతులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. జమ్మూలో రోహింగ్యాలకు భూములు ఇవ్వడం, వారి కాలనీలను ఏర్పాటు చేయడం, శ్రీనగర్‌ నుంచి వచ్చిన ముస్లిం కశ్మీరీలు జమ్మూలో భూములు కొనుగోలు చేసి కాలనీలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ వెలుగులో కథువా ఉదంతాన్ని ఉపయోగించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

కథువా సంఘటన ఏ రకంగానూ సమర్థనీయం కాదు. బాలిక హత్యకు గురి కావడం అనే వార్త నిజంగా విషాదం. దీని నిజానిజాలు తెలియాలి. దోషులకు శిక్ష పడాలి. శిక్షలో హిందూ ముస్లిం వివేచన ఉండనవసరం లేదు. నిర్భయ కేసులో ఆమెను అత్యంత కిరాతకంగా హింసించిన మైనర్‌ మతం ఏమిటన్నది చాలా మందికి తెలిసినా దానిని ఏనాడూ జాతీయ వాదులు రాజకీయం చేయలేదన్నది ఈ సందర్భంగా గమనించాలి. కథువా కేసులోనూ హిందూ, ముస్లిం వివాదంగా మార్చే ప్రయత్నం జరిగి ఉండాల్సింది కాదు. కశ్మీర్‌ లోయ రాజకీయ నాయకులు, పాకిస్తాన్‌ పంచమాంగ దళాలు ఈ ప్రయత్నాన్ని చేశాయి.

ఇక ఈ కేసులో దేశవ్యాప్త కుహనా సెక్యులర్‌ కాంగ్రెస్‌ కమ్యూనిస్టులు చేసింది కథువా మంటల్లో తమ రాజకీయ రొట్టెలు కాల్చుకోవడం తప్ప మరేం కాదు. వారికి ఆ మైనర్‌ బాలిక పట్ల ప్రేమ లేదు, సానుభూతి అంతకన్నా లేదు. పబ్బం గడుపుకోవడమే వారి లక్ష్యం. ఈ ప్రయత్నంలో పాక్‌ కుట్రల్లో తెలియకుండా వారు భాగస్వాములు కావడమే ఈ మొత్తం ఉదంతంలో అసలైన విషాదం. కథువాలో అపోహల జాంబవంతుడిని ఓడించి, అసత్యాల సత్యజిత్తును పరాభవించి, జాతీయవాదపు కృష్ణుడు శమంతకమణిని తెచ్చుకోగలడా ?

– సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *