ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు !!

ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు !!

ఆరేళ్ల వయసులో తండ్రిని ఆఖరి సారి చూశాడు హితేశ్‌…

శవపేటికలో నాన్న .. ఆయనపై త్రివర్ణ పతాకం…

తండ్రికి ఏమైందో హితేశ్‌కి తెలియదు. అక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాలేదు. చుట్టూ ఉన్న అందరూ కన్నీరు మున్నీరవుతున్నా హితేశ్‌ చూస్తూనే ఉండిపోయాడు నిద్రపోతున్నట్టున్న నాన్నను… ఆయనపైన ఉన్న జాతీయ జెండాను..

ఆ రోజు జూన్‌ 12, 1999. కార్గిల్‌ యుద్ధం జరుగుతున్న రోజులవి. ‘మీ నాన్న దేశం కోసం చనిపోయాడురా!’ అంటూ అందరూ తనను దగ్గరకు తీసుకుని ఏడుస్తుంటే హితేశ్‌ జెండాను ఒకసారి తాకాడు. తల్లి చీరను తాకినట్టనిపించింది. ఆరేళ్ల ఆ పసికూనకు ఎందుకనాలనిపించిందో తెలియదు కానీ ‘నేనూ నాన్న లాగానే అవుతాను’ అనేశాడు. ఒక్కసారిగా అందరూ హితేశ్‌ను మరింత దగ్గరకు తీసుకుని ఇంకా పెద్దగా ఏడ్చారు.

ఆ రోజు నుంచి హితేశ్‌ను ఆ జెండా స్పర్శ వెన్నాడుతూనే ఉంది. పందొమ్మిదేళ్ల తరువాత ఇరవై అయిదేళ్ల వయసులో హితేశ్‌ తండ్రి శవపేటిక మీదున్న త్రివర్ణ పతాకాన్ని తాకుతూ అనుకున్న మాటను నిజం చేశాడు. హితేశ్‌ భారత సైన్యంలో చేరాడు. డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీ నుంచి ఉత్తీర్ణు డయ్యాడు.

హితేశ్‌ను రాజ్‌పుతానా రైఫిల్స్‌ రెండవ బెటాలియన్‌లోకి పంపారు అధికారులు. తన తండ్రి పని చేసిందీ అదే బెటాలియన్‌!

పందొమ్మిదేళ్లుగా హితేశ్‌ సైన్యం గురించే కలలు కన్నాడు. సైన్యంలో చేరాలనే తహతహలాడాడు. అతని ఊహ, ఊపిరి, ఉద్దేశం, ఉద్రేకం, ఉద్వేగం.. అన్నీ సైన్యమే. హితేశ్‌ తల్లిది కూడా అదే కల. వీరపత్ని వీర మాత కావాలనుకోవడంలో ఆశ్చర్యమేముంది.

సైన్యంలో చేరగానే హితేశ్‌, అతని తల్లి కామేశ్‌ బాల ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో తండ్రి స్మారకం వద్దకు వెళ్లి తల ఆనించారు. హితేశ్‌కి త్రివర్ణ పతాకాన్ని స్పశించిన అనుభూతే గుర్తుకొచ్చింది.

‘నా భర్త మరణించిన తరువాత చాలా కష్టాలు పడ్డాను. నా ఇద్దరు పిల్లల్ని పెంచడమే జీవిత పరమావధి అయిపోయింది. ఇప్పుడు హితేశ్‌ సైన్యంలో చేరాడు. ఆయన ఆశయాలను కొనసాగిస్తాడు. అంతే కాదు.. నా రెండో కొడుకు హేమంత్‌ కూడా సైన్యంలో భర్తీ అయేందుకు సిద్ధం అవుతున్నాడు. నా జీవితానికి ఇంక కావలసిందేమీ లేదు. ఇంకేమీ నేను కోరుకోలేదు కూడా’ అన్నారు కామేశ్‌ బాల.

కార్గిల్‌ యుద్ధ సమయంలో అత్యంత క్లిష్టమైన టోలోలింగ్‌ పోరాటంలో కామేశ్‌ బాల భర్త బచన్‌ సింగ్‌ తుది వరకూ పోరాడి చనిపోయాడు. ఆ ఒక్క రోజు పోరాటంలో మేజర్‌ వివేక్‌ గుప్తా సహా పదిహేడు మంది సైనికులు అమరులయ్యారు. టోలోలింగ్‌లో సాధించిన తొలి విజయమే మిగతా విజయాలకు పునాదులు వేసింది. టోలోలింగ్‌ కోసం మూడు వారాల పాటు పోరాటం సాగింది. దాదాపు వంద మందికి పైగా జవానులు గాయపడ్డారు.

మువ్వన్నెలను కాపాడుకునేందుకు ఆ ఇంట్లో నుంచి రెండో తరం పిడికిలి బిగించింది. ఇలాంటి తల్లులు, ఇలాంటి కొడుకులు ఉన్నంత కాలం కశ్మీరంపై పాకిస్తాన్‌ పాదం మోపగలుగుతుందా ?

అవును…. ‘ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు’ అన్న మాట అక్షరాలా నిజం !!

– సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *