ఒక్క సభ… రెండు లక్ష్యాలు…

ఒక్క సభ… రెండు లక్ష్యాలు…

ఏప్రిల్‌ 27వ తేదీన హైదరాబాద్‌ శివారులోని కొంపల్లిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీలో ‘ఒక్కదెబ్బకు రెండు పిట్టలు’ అన్న సామెతను కళ్లకు కట్టించారు ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌. ఇటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీని ఎదురులేని శక్తిగా నిలుపు కోవడంతో పాటు, అటు జాతీయ రాజకీయాల్లోనూ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే క్రమాన్ని నిర్దేశించు కున్నారు. అంతేకాదు బహిరంగంగా అందరి ఆమోదాన్ని అందుకోవడంలో తాను ముందస్తుగా తయారుచేసుకున్న స్కెచ్‌లో కెసిఆర్‌ సఫలమయ్యారనే చెప్పాలి. ప్లీనరీ వేదికగా తన సరికొత్త రాజకీయ వ్యూహానికి వేగం పెంచారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట కేంద్ర ప్రభుత్వం, జాతీయ రాజకీయ పార్టీలపై సమరశంఖం పూరించిన కెసిఆర్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశారు.

స్కెచ్‌ రెడీ

రాజకీయ చతురతలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న కెసిఆర్‌ ఏదైనా అంశం మీద పోరు మొదలెట్టారంటే దాని వెనుక పటిష్టమైన పునాది, అధ్యయనం, దీర్ఘకాలిక ప్రయోజనం ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. అలా ఇప్పుడు జాతీయ రాజకీయాల విషయంలోనూ కెసిఆర్‌ తనదైన స్టైల్‌లో దూసుకు పోయేందుకు టాప్‌గేర్‌ వేసుకున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికలే లక్ష్యంగా ఇటు తెలంగాణలో, అటు జాతీయ స్థాయిలో తిరుగులేని ఆధిపత్యానికి పక్కా స్కెచ్‌ రెడీ చేసుకుంటున్నారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన కెసిఆర్‌ గడిచిన నాలుగేళ్లలో పార్టీని తిరుగులేని శక్తిగా కనీసం బలమైన ప్రతిపక్షం కూడా తయారు కాకుండా రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ సమ్మతితో, హైదరాబాద్‌ గడ్డపై నుంచే జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌కు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ క్రమంలోనే టిఆర్‌ఎస్‌ ప్లీనరీలో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే అంశాన్నే మొట్టమొదటి తీర్మానంగా ప్రవేశపెట్టించారు.

హైదరాబాద్‌ నుంచే హస్తిన పాలిటిక్స్‌

ప్లీనరీలో తన భవిష్యత్‌ వ్యూహానికి సంబంధిం చిన తీర్మానం ఆమోదం పొందిన వెంటనే కెసిఆర్‌ సుదీర్ఘ ప్రసంగం చేశారు. హైదరాబాద్‌ నుంచే భూకంపం సష్టిస్తానన్నారు. దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. భారత ఆత్మగౌరవ బావుటా తానే ఎగరేస్తానని చెప్పుకొచ్చారు. ‘హర్‌ ఎకర్‌కో పానీ.. హర్‌ ఖేత్‌కో పానీ’ (ప్రతి ఎకరాకూ, ప్రతి పొలానికీ నీరు) అన్నదే ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రధాన నినాదంగా ప్రకటించారు. ఫ్రంట్‌ పేరుతో ఢిల్లీ వెళ్తున్నా అని ఎవరూ అనుకోవద్దని, హైదరాబాద్‌ నుంచే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని ‘జై తెలంగాణ-జై భారత్‌’ అని నినదించారు.

మొదలైన కార్యాచరణ

‘మొండిగా భూకంపం సృష్టించి రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా నిజం చేశానో రాబోయే రెండు, మూడు నెలల్లో పక్షిలా తిరిగి, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి దేశంలో గుణాత్మక మార్పు కోసం అంతే కృషి చేస్తాను’ అన్నారు కెసిఆర్‌. అంతకుముందే ఫ్రంట్‌ కోసం దేశమంతా తిరుగుతానని చెప్పిన కెసిఆర్‌ మొట్టమొదటిగా కోల్‌కతా వెళ్లి పశ్చిమబెంగాల్‌ సిఎం మమతాబెనర్జీని కలిశారు. ఆ తర్వాత బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడకు ఫ్రంట్‌ ఉద్దేశాలు వివరించారు. ఈ క్రమంలోనే కెసిఆర్‌ కుమారుడు కెటిఆర్‌ లక్నో వెళ్లి యుపి మాజీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌ను కలిసి వచ్చారు. ప్లీనరీ జరిగిన రెండోరోజే కెసిఆర్‌ చెన్నై వెళ్లి డిఎంకె అధినేత కరుణానిధి, స్టాలిన్‌ను కలిశారు. మరోవైపు జార్ఖండ్‌ ముక్తి మోర్చా అధినేత శిబూసోరేన్‌తోనూ ఫ్రంట్‌పై చర్చలు సాగించారు. మే నెలలో ఒడిశా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కూడా కలిసేందుకు కెసిఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని కొంత మంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రాంతీయ పార్టీలను ఫెడరల్‌ ఫ్రంట్‌వైపు ఆకర్షించడమే కెసిఆర్‌ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

టిఆర్‌ఎస్‌ను గద్దెదించుతామన్న టిజెఎస్‌

ఇదిలా ఉంటే మరోవైపు టిఆర్‌ఎస్‌ ప్లీనరీ జరిగిన రెండోరోజే ఏప్రిల్‌ 29న తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భంచింది. ఏప్రిల్‌ మొదటివారంలోనే పార్టీని ప్రకటించిన కోదండరాం తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభను సరూర్‌నగర్‌ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు. కెసిఆర్‌ను గద్దె దించడానికే తాము బయలుదేరామని కుండబద్దలు కొట్టారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పూరించిన ఈ శంఖారావంతో నవతెలంగాణ నిర్మించడమే లక్ష్యమన్నారు. తెలంగాణ జనం ఓట్లతో గెలిచిన కెసిఆర్‌ తన కుటుంబ పెత్తనం సాగిస్తున్నాడని ఆక్రో శించారు. ప్రభుత్వం ప్రజల మీద పరాన్నభుక్కుగా జీవిస్తోందని విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్‌ పాఠక్‌ తీయరని, సచివాలయానికి రారని, ఇదేం పాలన ? అని ప్రశ్నించారు. 2019లో రాజ్యాధికారమే లక్ష్యంగా బరిలోకి దిగుతామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. వ్యవసాయమే టిజెఎస్‌ ప్రధాన అజెండా అని కోదండరాం స్పష్టం చేశారు. డబ్బులతో రాజకీయాలు చేయడం తమకు రాదని, సామాన్యుల పక్షాన నిలబడేందుకే పార్టీ జెండా ఎగురవేశామని స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారాన్ని దుర్వినియోగం చేసేవారిని నిలదీద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి నిరసనల్లో పాల్గొని జైలుకు వెళ్లిన వాళ్లు రౌడీషీటర్లు అయ్యారని, ఉద్యమకారులను అణచివేసిన, ఉద్యమానికి అప్పుడు ద్రోహం చేసిన వాళ్లు తెలంగాణ స్వరాష్ట్రంలో మంత్రులై రాష్ట్రాన్ని ఏలుతున్నారని దుయ్యబట్టారు.

– సప్తగిరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *