ఎవరిది యూటర్న్‌ ?

ఎవరిది యూటర్న్‌ ?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అసహనం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏ వ్యక్తికైనా ఎదుటివారిపై అసహనం పెరుగుతోందంటే వారి మీద ద్వేషం అయినా ఉండాలి లేక ఎదుటి వారి ముందు ఓడిపోతామన్న భయం అయినా ఉండాలి. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి రెండవ కోవకు చెందినదిగా కనపడుతోంది. జగన్‌, పవన్‌లు పాదయాత్రలు ప్రారంభించినప్పటి నుండి చంద్రబాబు పరిస్థితి దిగజారిపోయింది. గత సంవత్సరం మొత్తం చంద్రబాబు, ఆయన తమ్ముళ్లు జగన్‌ను విమర్శించారు. కన్ను మూసినా తెరచినా నిత్యం వారి శక్తిని జగన్‌ను విమర్శించడానికే వినియోగించారు. తరువాత తమ శక్తిని పవన్‌ను విమర్శించడానికి వినియోగించారు.

త్రిపుర గెలుపుతో..

ఈశాన్య రాష్ట్రాలలో మోదీ విజయ పరంపర, ముఖ్యంగా త్రిపురలో 30 సంవత్సరాల వామపక్ష పాలనకు తెరపడటం చంద్రబాబు జీర్ణించుకోలేని స్థితిగా మారింది. మోదీ విజయ పరంపర ఆంధ్రలో కూడా కొనసాగుతుందనే భయం బాబుకు పట్టుకుంది. అంతకుముందే వీధి నాయకులు ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉంటూనే మెల్లగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రారంభించారు. ఒకవైపు కేంద్రం నుండి విభజన హామీలను నెరవేర్చుకుంటూ మరోవైపు ప్రజల ముందు బిజెపిని దోషిగా నిలపాలనే ప్రయత్నాలను బాబు కొనసాగించారు. తమ ప్రభుత్వంలో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు క్యాబినెట్‌ మంత్రులుగా ఉన్నారనే విషయం కూడా మరచి పోయి బిజెపిని విమర్శించారు. అయినప్పటికి ఆ ఇద్దరు మంత్రులు మిత్రధర్మాన్ని పాటించి ఎదురు తిరిగి తెలుగుదేశాన్ని కాని, ముఖ్యమంత్రిని కాని విమర్శించలేదు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి ముఖ్యమంత్రి కూడా కేంద్రప్రభుత్వాన్ని, మోదీని విమర్శించడం ప్రారంభించారు. బాలకృష్ణ సినిమా ఫక్కీలో తొడగొట్టి కేంద్రాన్ని విమర్శించినపుడు అదే సభలో ఉన్న చంద్రబాబు దాన్ని ఖండించకపోవడం ఎన్‌డిఎ నుండి బయటకు రావటానికి ఒక ప్రారంభ వ్యూహం. ఆ తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ పాలనను పక్కన పెట్టి అవకాశం దొరికినపుడల్లా కేంద్రప్రభుత్వాన్ని విమర్శించడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారింది. బంగాళాఖాతంలో పడేస్తానంటూ ఒక ముఖ్యమంత్రిలా కాక వీధి నాయకుడిలా మాట్లాడ టానికి ఆయన అలవాటుపడ్డారు. చౌకబారు విమర్శలు చేస్తున్నారు.

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును లోక్‌సభలో సమర్థించిన చంద్రబాబు ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం రాజ్య సభలో ప్రతిపక్ష పార్టీలతో కలసి వ్యతిరేకించారు. సుజనా చౌదరి కేంద్ర క్యాబినెట్‌ సమావేశాల నుండి బయటకు వచ్చి చంద్రబాబు సలహా మేరకు కేంద్రాన్ని విమర్శించేవారు. అది మిత్రధర్మానికి పూర్తిగా విరుద్ధం. ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ఎం.పి.లు పార్లమెంటు ఉభయసభలను స్తంభింప చేస్తూ కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తూ ధర్నాలు చేస్తుంటే, సుజనాచౌదరి కేంద్రమంత్రిగా ఉంటూ ప్రదర్శించిన రెండు నాల్కల ధోరణిని ప్రజలు గమనించారు.

తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటూ విభజన వాదాన్ని ఎత్తుకున్నారు చంద్రబాబు. కమల్‌హాసన్‌తో చేతులు కలిపి దక్షిణాది రాష్ట్రాల సహకారం, సమాఖ్య పేరిట రాజకీయం చేయాలని ప్రయత్నం చేసారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలకు ఎక్కువగా దోచిపెడుతోందని ప్రచారం చేసి ఉత్తర, దక్షిణ భారతదేశం అనే భావనను ప్రజలలో కలగ చేయడం కోసం తీవ్రంగా కృషిచేసారు. 15వ ఆర్థిక సంఘం నివేదికలోని అంశాలు దక్షిణాది ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయంటూ, దక్షిణ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశాన్ని రెండుసార్లు నిర్వహించారు. వీటన్నిటి ఉద్దేశ్యం బిజెపి పట్ల ప్రజలలో ద్వేషం కలుగచేయడమే.

కర్నాటకకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు బిజెపి పట్ల, మోదీ పట్ల చంద్రబాబుకు ఉన్న ద్వేషానికి నిదర్శనం. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి రాహుల్‌, సోనియాలతోనూ; మిగతా బిజెపి వ్యతిరేకులతో చేతులు కలిపారు. మొన్న లోక్‌సభలో తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు కోసం ముందుగా చేసుకున్న ఏర్పాటు అది.

నిరంతరం మోదీని, బిజెపిని అనరాని మాటలు అంటూ తానొక మహానాయకుడినని చెప్పుకోవటం హాస్యాస్పదం. కేంద్రం నమ్మించి మోసం చేసిందనే మాటలు చంద్రబాబు నోటివెంట రావటం ఆయన అసహనానికి పరాకాష్ఠ. చంద్రబాబు మామగారినే నమ్మించి మోసం చేసిన వ్యక్తి. గత రెండుసార్లుగా బిజెపిని కూడా బాబు అలాగే మోసం చేస్తూ వస్తున్నారు. గత రెండుసార్లుగా చంద్రబాబు బిజెపిని ఉపయోగించుకుని అధికారంలోకి రావటం, చివరి రోజులలో స్వార్థం కోసం బిజెపి నుండి బయటికి వచ్చి బిజెపిని తిట్టడం చంద్రబాబులోని స్వార్థానికి మరో కోణం.

మోదీ పార్లమెంటులో మాట్లాడినవన్నీ అబద్దాలే అని ఈనాడు చంద్రబాబు మాట్లాడుతున్నారు. అదే నిజమైతే ప్రధానమంత్రి మీద తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు హక్కుల తీర్మానం పెట్టొచ్చు కదా! ఆ పని ఎందుకు చేయడంలేదు! తనకు 25 సీట్లు వస్తే దేశ ప్రధానిని నిర్ణయించే అధికారం వస్తుందని మాట్లాడుతున్నారు చంద్రబాబు. కేంద్రంలో మరే ప్రభుత్వం వచ్చినా ప్రత్యేకహోదా రాష్ట్రానికి రాదనే విషయం చంద్రబాబుకు తెలుసు. అయితే ఎన్‌డిఎ ప్రభుత్వ బూచిని చూపి, ప్రత్యేక హోదా పేరుతో మరోసారి అధికారం సంపాదించా లనేది చంద్రబాబు ఉద్దేశ్యంగా కనబడుతోంది.

పవన్‌కల్యాణ్‌, జగన్‌లు వచ్చి ప్రత్యేకహోదా గురించి మాట్లాడడం మొదలు పెట్టిన తరువాత ప్రజలలో వారికి బలం పెరగకుండా ఉండటం కోసం ఎన్‌డిఎకి మొండిచేయి చూపి యూటర్న్‌ తీసుకున్నది చంద్రబాబే. అప్పటిదాకా ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చెబుతూ, కేంద్ర నిధులను యథేచ్ఛగా తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ స్వలాభం కోసం ఈ రోజున దేశ ప్రధాన మంత్రిని సభ్యత, సంస్కారంలేని పరుష పదాలతో విమర్శించడం ఆయన పట్ల బాబు వ్యక్తిగత అసహనాన్ని తెలియచేస్తోంది.

– వైష్ణవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *