ఎవరికి వారే యమునా తీరే !

ఎవరికి వారే యమునా తీరే !

–  2019 ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు

తెలంగాణలో రాజకీయంగా బలంగా వేళ్ళాను కొన్న టి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే రాజకీయ శక్తుల పునరేకీకరణ తప్పదని ఓ వైపు విపక్షాలు కార్యాచరణను సిద్ధం చేసుకొంటున్నప్పటికీ ఈ సారి ఎన్నికల్లో బహుముఖ పోరు తప్పేట్టులేదు.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరుబాట పడుతామంటూ ఇప్పటికే బి.జె.పి. సంకేతాలివ్వగా ‘టి’ టి.డి.పి. ఏ పార్టీతోను జతకట్టే ప్రసక్తే లేదని, ఒంటిరిగానే బరిలో దిగుతామంటూ ఇటీవల పలుమార్లు తన మనోభావాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ తాజా రాజకీయ లెక్కల ప్రకారం తెలంగాణలో అధికారపక్షమైన టి.ఆర్‌.ఎస్‌.ను ఢీ కొనేందుకు అటు కాంగ్రెస్‌, ఇటు తెలుగుదేశం పార్టీలతో పాటు బి.జె.పి కూడా సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో చతుర్ముఖ పోరు ఖాయమేనన్నది ఇప్పటి మాట.
ఇక జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ తమ పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందన్న సంకేతాలనివ్వడం, టి జె.ఎ.సి. ఛైర్మన్‌ కోదండరాం సొంతపార్టీ ప్రయత్నాల్లో మునిగితేలుతోండడంతో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎం.ఐ.ఎం. పార్టీ అధికారపక్షంతో కలసి పోటీ చేయడం ఖాయం కావడంతో వామపక్షాల దారెటు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని పశ్న్రగా మారుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో సత్సంబంధాలున్న వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలోను, ఇటు తెలంగాణలోను కాంగ్రెస్‌తోనే కలసి పనిచేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎల్‌.రమణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న టి టి.డి.పి అధికార పార్టీతో కలసి పనిచేయవచ్చన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వాదం వివాదం కావడంతో తాము వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామంటూ ఆ పార్టీ నాయకులు వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.
ఎప్పటి నుంచో సొంతంగా ఎదగాలని భావిస్తున్న కమలదళం టి.డి.పి ముక్కలైన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీతో జతకట్టగలదని ఊహించలేం. తెలంగాణ ఉద్యమ సమయంలో కె.సి.ఆర్‌. తర్వాత అత్యంత క్రియాశీలక పాత్రను పోషించిన ‘టి’ జె.ఎ.సి. ఛైర్మన్‌ కోదండరాం రాష్ట్ర ఆవిర్భావానంతరం వివిధ కారణాల దృష్ట్యా కె.సి.ఆర్‌.కు బద్దశత్రువుగా మారాడు. ఎంతో కష్టపడి తెలంగాణను సాధించుకొన్నా పరిపాలనంతా ఒకే కుటుంబం చేతుల్లోకి వెళ్ళిపోయిందంటూ గత కొన్నేళ్ళుగా అధికారపక్షంపై పోరాటం చేస్తూ వస్తున్న కోదండరాం సొంతంగా ఓ పార్టీని ఏర్పాటు చేసి ఉద్యమంలో పాల్గొన్న ప్రజాసంఘాలను కూడగట్టుకొని వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకొంటున్నారు. కోదండరాం కూడా ఏ పార్టీతో జతకట్టకుండా ఒంటరిపోరు దిశగానే అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.
టి.ఆర్‌.ఎస్‌., కాంగ్రెస్‌, బి.జె.పి.లను రాజకీయంగా శత్రుపక్షాలుగా భావిస్తున్న పవన్‌కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో తాను ఏ ఒక్క పార్టీతోను స్నేహబంధం కొనసాగించగలరని భావించలేం. ఇటీవల టి.డి.పితో కూడా మనస్పర్థలు ఏర్పడడంతో ఒంటరి పోరుకే పవన్‌కళ్యాణ్‌ ప్రాధాన్యతనివ్వగలరన్న సంకేతాలందు తున్నాయి. ప్రస్తుతానికి విపక్షాల తీరు ‘ఎవరికివారే యమునాతీరే’ అన్న చందంగా ఉన్నా ఎన్నికల సమయంలో అన్నీ ఒక్కటయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. విపక్షాలు ఊహిస్తున్నంతగా ప్రజావ్యతిరేకత లేకున్నా అధికారపక్షమైన టి.ఆర్‌.ఎస్‌. కూడా తమ పార్టీ నుంచి నాయకులు చేజారి పోకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది. సాధారణ ఎన్నికల్లోపు అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయమని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. తమ పార్టీలోకి భారీస్థాయిలో ఫిరాయించిన కాంగ్రెస్‌, బి.జె.పి., టి.డి.పి. నాయకులను తాత్కాలికంగా బుజ్జగించే పనిలో పడ్డారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లోపు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ ప్రక్రియ కసరత్తుకు ప్రస్తుతమున్న సమయం సరిపోదు. తెలుగు రాష్ట్రాల్లో సీట్లను పెంచినా అధికారపక్షాలైన టి.డి.పి., టి.ఆర్‌.ఎస్‌.లు లాభపడగలవే తప్ప తమకొనగూరే ప్రయోజనం శూన్యమన్న ఆలోచనతోనే కేందంలోని కమలదళాధిపతులు సీట్లపెంపు ప్రక్రియ్రకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది మరో వాదన. తెలంగాణ ఆవిర్భావానంతరం ప్రధాన విపక్షంగా ఏర్పడిన కాంగ్రెస్‌ క్రమక్రమంగా బలపడుతూ వస్తోంది. కాంగ్రెస్‌ ఎంత బలపడ్డా ఆ పార్టీ బి.జె.పి.తో జతకట్టదు కదా. ఇక 2009 సాధారణ ఎన్నికల సందర్భంగా నాటి సమైక్యాంధ్రలో ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారాన్ని నిర్వహించిన ఇప్పటి జనసేనాని పవన్‌కళ్యాణ్‌ కాంగ్రెస్‌ నాయకుల పంచలూడగొడతామంటూ అప్పట్లో ఆ పార్టీపై తన వ్యతిరేకతను చాటుకొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్థావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
మొదటినుంచి కాంగ్రెస్‌కు బద్దశత్రువైన పవన్‌కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ మహాద్భుత శక్తిగా ఎదిగినా జతకట్టే అవకాశాలే లేవన్నది నిర్వివాదంశం. ఇక బి.జె.పితో కూడా ఆయన అదే దూరాన్ని పాటించవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన కూడా 2019 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగే అవకాశాలు ప్రస్తుతానికి కనపడుతున్నాయి. ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారి తెలంగాణలో టిడిపి, జనసేన, వామపక్షాలు ఏకమై సమరశంఖాన్ని పూరించవచ్చన్న అభిప్రాయాన్ని కూడా కొంతమంది రాజకీయ పండితులు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నిర్వివాదాంశం. ఎన్నికల నాటి మూడ్‌ను బట్టి రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతుంటుంది. సాధారణ ఎన్నికల పతాక సన్నివేశంలో బాహుబలిగా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న అధికార పక్షమైన టి.ఆర్‌.ఎస్‌.ను ఓడించడమే లక్ష్యంగా ఎవరూ ఊహించని విధంగా విపక్షాలన్ని ఏకమై మహాకూటమిగా ఆవిర్భవించి కదనరంగాన కత్తులు దూసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
– వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *