ఎవరన్నారు అక్కడ కుల వివక్ష లేదని ?!

ఎవరన్నారు అక్కడ కుల వివక్ష లేదని ?!

అయితే, ఇక్కడే మనం క్రైస్తవులుగా మతంమారిన ఎస్‌.సి.ల పరిస్థితి క్రైస్తవంలో ఎట్లా ఉన్నదనేది గమనించాలి. ‘క్రైస్తవంలోకి మారితే కులమూ, కుల వివక్ష ఉండవు’ అని మభ్యపెట్టి ఎస్‌.సి.లను హిందుత్వం నుండి క్రైస్తవానికి మతమార్పిడులు చేస్తున్నారు.

కేరళ రాష్ట్రం కొట్టాయంలో క్రైస్తవుడిగా మతం మారిన ఎస్‌.సి. వ్యక్తిపై క్రైస్తవులే దాడి చేసి దారుణంగా చంపేశారు. ఆ వార్తను పత్రికలు ముఖ్యంగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ‘పరువు హత్య’ అనే శీర్షికపెట్టి వార్త రాసేసింది. వివరాలులోకి వెళ్తే..

కెవిన్‌ పి.జోసఫ్‌ అనే క్రైస్తవ యువకుడు, అదే క్రైస్తవ మతానికి చెందిన ‘నీను’ అనే యువతి ఇద్దరూ గడిచిన రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. నీను ఇంకా చదువుకుంటోంది. కెవిన్‌ జోసఫ్‌ ఎలక్ట్రీషియన్‌గానే వేరేచోట పనిచేస్తున్నాడు. నీను తండ్రి నీను కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సమయంలో నీను కెవిన్‌ జోసఫ్‌కు సమాచారం అందించింది. జోసఫ్‌ తన ఉద్యోగాన్ని వదులుకొని కొట్టాయంకు తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి వివాహ రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకి వెళ్ళి రిజిష్టర్‌ వివాహము చేసుకొన్నారు. వివాహం జరిగిన తరువాత నీను తన కుటుంబం నుండి తమకు ప్రమాదం ఉన్నదని, తన భర్తకు ప్రాణహాని ఉన్నదని సమీప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే నీను సోదరుడు, మరికొందరు గుండాలు సాయుధులై కెవిన్‌ జోసఫ్‌ ఇంటిపై దాడిచేసి, విధ్వసం సృష్టించి, కెవిన్‌ను కిడ్నాపు చేసి, దూరంగా తీసుకెళ్ళి అతి దారుణంగా చంపివేశారు.

భర్త చనిపోయిన తరువాత నీను తన భర్తను తన సోదరుడు, మరికొందరు కలిసి హత్య చేసారని ఫిర్యాదు చేసింది. కొట్టాయంలో సిఎమ్‌ పర్యటన బందోబస్తులో మొదట చేసిన ఫిర్యాదును పెద్దగా పట్టించుకోని కారణంగా హత్య జరిగిపోయిందని అంటున్నారు. కాని ఇది తీవ్రమైనది. ఈ సంఘటనపై ఆ జిల్లా ఎస్‌పిని ప్రభుత్వం బదిలి చేసింది. అక్కడి ఎస్‌ఐ సస్పెండ్‌ అయ్యాడు.

ఏం చేసినా పోయిన ప్రాణం తిరిగి రాదు. అయితే, ఇక్కడే మనం క్రైస్తవులుగా మతం మారిన ఎస్‌.సి.ల పరిస్థితి క్రైస్తవంలో ఎట్లా ఉన్నదనేది గమనించాలి. ‘క్రైస్తవంలోకి మారితే కులమూ, కుల వివక్ష ఉండవు’ అని మభ్యపెట్టి ఎస్‌.సి.లను హిందుత్వం నుండి క్రైస్తవానికి మతమార్పిడులు చేస్తున్నారు. కెవిన్‌ జోసఫ్‌ది నిరుపేద కుటుంబం. నీను ఉన్నత, ధనవంతుల కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. ఇద్దరు క్రైస్తవులే. అయినా హత్య జరిగింది. నీను తండ్రి వీళ్ళ వివాహానికి ఒప్పుకోలేదు. ఒక బీదవాడు, అందులోనూ మతం మారకముందు తనకంటే తక్కువ కులం వ్యక్తి కాబట్టి హత్యకు గురయ్యాడు. ఎస్‌.సి. నుండి క్రైస్తవులుగా మారిన వారికి ప్రత్యేక స్మశానాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎస్‌.సి.లు తమ అస్తిత్వం కాపాడుకోడానికి క్రైస్తవంలోకి మారుతున్నారు. కాని అక్కడ కూడా వారు కుల వివక్షకు గురవ్వక తప్పటం లేదు. ఫలితంగా ఘర్షణలూ తప్పటం లేదు.

ఈ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయ వలసిన క్రైస్తవ ఫాదరీలు వాటిని మరింత ప్రోత్స హించటం విచిత్రం. ఇంకో విచిత్రం ఏమిటంటే కేరళలోని కొన్ని కమ్యూనిస్టు సంస్థలకు చెందినవారు కూడా ఈ దాడిలో పాల్గొన్నారని తెలుస్తున్నది. ఇటువంటి సంఘటనలకు ఇది ప్రారంభం కాదు. క్రైస్తవులుగా మతంమారిన ఎస్‌.సి.లపై క్రైస్తవులే దాడులు చేసిన సంఘటనలు కేరళలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎస్‌.సి. నుండి మతం మారిన క్రైస్తవులు తిరిగి తమ పాత సాంప్రదాయాలలోకి తిరిగి వస్తున్నారు అని 2008 సంవత్సర కేరళ ప్రభుత్వం నివేదిక తెలియచేస్తున్నది. ఎస్‌.సి.లపై దాడి జరిగితే అగ్రవర్ణాల వాళ్లు దాడి చేశారని హడావిడి చేసే రాజకీయ నాయకులు, సెక్యులర్‌ మేధావులు క్రైస్తవంలో జరుగుతున్న ఈ వివక్షాపూరిత దాడులను ఎందుకు ఖండించరు ?! కనీసం క్రైస్తవ పెద్దలు కూడా వీటిపై స్పందిచటం లేదు. దానికి కారణాలు ఏమిటి ?

క్రైస్తవంలోకి మారితే కులాలు ఉండవు, వివక్ష ఉండదు అని చెప్పేవారు ఎందుకు ఈ వివక్షలను ప్రోత్సహిస్తూ కులాలవారిగా చర్చిలు ఎందుకు నిర్మిస్తున్నారు ? కేరళ; తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఇటువంటి చర్చిలు మనకు దర్శనమిస్తాయి. మతం మారినా కులాల సంఘర్షణ ఆగటం లేదు. సంఘర్షణ నివారణకు మతం మారటం సమాధానం కాదు. దానిని పరిష్కరించేందుకు అందరిని కలుపుకొని పోవటానికి ప్రయత్నం చేయాలి.

దశాబ్దాలుగా సాగుతున్న ఇటువంటి వివక్షలను ఎదుర్కోడానికి తమిళనాడు అన్‌టచ్‌బులిటి ఎరాడికేషన్‌ ఫ్రంట్‌ (TNUEF) అనే సంస్థను క్రైస్తవులుగా మారిన ఎస్‌.సి. ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. తమ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు. 2018 మార్చి 16వ తేదీనాడు రామాంతపురం జిల్లాలో ఆర్‌.ఎస్‌.మంగళంలో ఒక రిటైర్డ్‌ జడ్జి, ఒక విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్‌ అధ్యక్షతన TNUEF బహిరంగ విచారణ చేబట్టింది. ఆ విచారణలో క్రైస్తవులుగా మారిన ఎస్‌.సి.లపై దాడులు, వివక్ష సంఘటనల గురించి ఒక నివేదిక తయారు చేశారు.

భారతదేశంలో జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2.3 శాతం మంది క్రైస్తవులుంటే, అందులో 60 శాతం మంది ఎస్‌.సి. నుండి మారిన వారే. వాళ్ళు క్రైస్తవంలో కూడా తమ హక్కుల రక్షణ కోసం ఆందోళన చేయవలసి వస్తోంది.

దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఇటువంటి సామాజిక సమస్యల పరిష్కారానికి విశేష ప్రయత్నం చేస్తున్నది. హిందూ సమాజం నుండి దూరంగా వెళ్ళిపోయి తిరిగి హిందుత్వంలోకి వస్తున్న వారికి స్వాగతం పలుకుతున్నది. హిందూ సమాజ బలహీనతలను తమ స్వార్థానికి వాడుకునే శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి.

– రాంపల్లి మల్లికార్జున రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *