ఎన్నికల ఎత్తుగడలు

ఎన్నికల ఎత్తుగడలు

ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబులో అభద్రతా భావం ఎక్కువవుతోరది. ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కోరిక ఉంది కాని ఎలా గెలవాలో, అసలు గెలవగలనా లేదా అనే సందేహం ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు చేసిన ఆర్భాటం, నడిపిన రాజకీయం, అమలు చేసిన పథకాలు ఏవీ తనను ఎన్నికల్లో రక్షించలేవని తెలుగుదేశం పార్టీకి అర్థమైంది. అందుకే ఎన్నికల వేళ ఇప్పుడు హడావిడిగా కొత్త పథకాలు, అక్కరలేని వాటి మీద ప్రచారం చేయించుకుని గెలవాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే రోజుకో కొత్త పథకం, కొత్త పేరుతో తెరమీదికి వస్తున్నాయి. ప్రజలను మరీ అమాయకులుగా భావిస్తున్నారు చంద్రబాబు. తన గిమ్మిక్కులను గుర్తించలేనంత అమాయకులా ఆంధ్రులు అనే సందేహం చంద్రబాబుకు కలగక పోవటమే ఆశ్చర్యం.

ప్రత్యేక హోదా సమస్య, బిజెపి, జగన్‌, పవన్‌లను విమర్శించటం వల్ల ప్రజలలో అనుకున్నంత సానుకూల ఫలితాలు కలగలేదు. క్రితం జరిగిన లోక్‌సభ సమావేశాలలో మంత్రుల రాజీనామాలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినప్పటికి, వైఎస్‌ఆర్‌సిపి తన లోక్‌సభ సభ్యుల చేత రాజీనామాలు చేయించి ప్రజల ముందు హీరోగా నిలిచింది. పోలవరం రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తోందని ప్రజలను నమ్మించడం కోసం ప్రయత్నం చేస్తే అది కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ పర్యటనతో ప్రజలకు తెలిసి పోయింది. అంతేకాకుండా నిర్మాణ వ్యయం కూడా మొదటి సమగ్ర ప్రాజెక్టు నివేదికకు (డిపిఆర్‌)కు రెండవసారి తయారు చేసిన నివేదికకు చాలా వ్యత్యాసం ఉందని, అందుకు తగిన కారణాలు చెప్పాలని గడ్కరీ చంద్రబాబును నిలదీసారు. ముంపు మండలాలలో నివాసాల తొలగింపు, నష్టపరిహారం మొదలైన విషయాలలో హడావుడిగా మొదటి నివేదిక తయారు చేసామని, కాని తరువాత తయారు చేసిన నివేదిక సంపూర్ణమైనదని అందువలననే ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయిందని చెప్పినప్పటికి కేంద్రం చంద్రబాబు వాదనను వినిపించుకున్నట్లుగా లేదు. కేంద్రప్రభుత్వ పథకాలను తనవిగా చెప్పుకున్న చంద్రబాబుకు అసలు నిజాలు ఒక్కొక్కటి బయట పడుతుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హడావుడిగా సంక్షేమ పథకాలను అమలు చేయటం ప్రారంభించారు. ఈ సంవత్సరం జనవరి నుండి జూలై లోపల అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. 4 సంవత్సరాల కాలం వృథా చేసి ఈ రోజున సంక్షేమ పథకాలు హడావిడిగా ప్రారంభించడం చర్చనీయాంశం అయింది. ఏ పథకమైనా ప్రజలకు ఉపయోగపడుతుందా? లేదా అనే విషయం తేలటానికి కొంతసమయం పడుతుంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హడావిడిగా సంక్షేమ పథకాలను అమలుపరిస్తే అది ఓట్ల రాజకీయం అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అదే. ప్రజలను మభ్యపెట్టి ఏదో విధంగా అధికారంలోకి రావాలనే ఆలోచనే.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని ప్రజలకు చెప్పటం కోసం ప్రతి ప్రాంతానికి వరాల జల్లు కురిపించారు. ఎక్కడా పనులు జరుగుతున్న జాడలు లేవు. అమరావతి రాజధాని నిర్మాణం పనులు నత్తనడకన నడుస్తున్నాయి. రైతుల వద్దనుండి రాజధాని నిర్మాణానికి భూమినైతే సేకరించారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం కాలేదు. నెలకొకసారి సింగపూర్‌ వెళ్ళటం అక్కడి కంపెనీలతో అగ్రిమెంట్లు రాసుకోవడం తప్ప ఇంతవరకు రాజధాని నమూనా ఖరారు చేయలేదు. తాత్కాలిక రాజధానే చివరకు శాశ్వత రాజధాని అవుతుందేమో నని ప్రజలు అనుమానపడుతున్నారు. తాత్కాలిక రాజధాని కూడ అసంపూర్ణ నిర్మాణం. వానవస్తే పేదవాడి గుడిసెకి, రాష్ట్ర రాజధాని భవనాలకు పెద్ద తేడా ఏమి కనబడటంలేదు.

రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి పరిశ్రమలు, ఐటి హబ్బుల శంకుస్థాపనలు చేసారు. తను కియో కార్ల కంపెనీని తెచ్చానని, యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పారు. కాని వాస్తవానికి అనంతపురం జిల్లా యువతకు అది ఏవిధంగా ఉపయోగపడటంలేదని స్థానికుల వాదన. కేవలం చిన్న ఉద్యోగాలు, కాంట్రాక్టు పనులకు మాత్రమే అక్కడి యువతను తీసుకుంటున్నారే తప్ప తతిమా ఉద్యోగాలన్నీ కొరియన్లకే అనేది చర్చనీయాంశం అయింది.

నిరుద్యోగభృతి, చంద్రన్న భీమా పథకం, అంగన్‌వాడీ స్త్రీల జీతాల పెంపు, హోం గార్డులకు జీతాల పెంపు, ముస్లింల కోసం హజ్‌ భవనాలు, అన్న క్యాంటీన్లు.. ఇట్లా అన్ని వర్గాల, కులాల వారిని ఆకట్టుకోవటం కోసం అనేక సంక్షేమ పథకాలు ఎన్నికల ముందు ప్రకటించడంలో అర్థం ఏమిటి? తెలుగు భాషపై అభిమానం రాత్రికి రాత్రి పుట్టుకు వచ్చి నియమనిబంధనలను ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాల అమలు తీరులోని సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా ఎన్నికలలో గెలుపుకోసం ప్రవేశ పెడితే నష్టపోయేది ప్రజలే కదా ! పాలకులు ఈ విషయాలను కూడా గమనించాలి.

– వైష్ణవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *