ఎక్కడ చిత్తశుద్ధి..!

ఎక్కడ చిత్తశుద్ధి..!

ఇటీవల గోదావరి నదిలో మంతూరు, వాడపల్లి మధ్య జరిగిన ఘోర లాంచీ ప్రమాదం అత్యంత విషాదకరమైనది. ఆ ప్రమాదంలో 22 మంది అమాయకులు జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదం జరగటానికి రెండు రోజుల ముందే అదే స్థలంలో గోదావరిలో మరొక లాంచీ అగ్ని ప్రమాదానికి గురయింది. ఆ ప్రమాదం నుండి ప్రయాణీకులు సురక్షితంగా బయటపడటం సంతోషకరం. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉన్నందునే ఇది సాధ్యమైంది.

దీనికి కొద్దిరోజుల ముందు కొన్ని నాటు పడవలు ఇసుక తిన్నెలలో కూరుకుపోయాయి. గత సంవత్సరం కృష్ణానదిలో కార్తీక మాసంలో విజయ వాడ ఇబ్రహీంపట్నంలో సంగమాన్ని చూడటానికి వచ్చిన నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 22 మంది సందర్శకులు జలసమాధి అయ్యారు.

ఇలా ప్రతీ సంవత్సరం ప్రైవేటు పడవలు, లాంచీలలో ప్రయాణాలు చేస్తూ మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రమాదాలు జరిగిన తరువాత తూతూ మంత్రంగా దర్యాప్తు నిర్వ హించడం; కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం; మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించడం, గాయపడిన వారికి పరిహారాలు, ఇంటికొక ఉద్యోగం అని వాగ్దానం చేయడం పరిపాటి అయిపోయింది. ఇంతకుమించి ప్రభుత్వం ఈ నీటి ప్రమాదాల నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

విజయవాడ కృష్ణానదిలో ప్రమాదం జరిగినపుడు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ఆ కమిటీ అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించి, పర్యాటక రంగం వారు నదులపై నడిపే లాంచీలు, పడవల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించింది. ప్రభుత్వం దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రయోజనం శూన్యం.

సాధారణంగా నదులపై విహార యాత్రలకు గాని, ప్రయాణ సౌకర్యాలకు గాని వినియోగించే అధిక శాతం పడవలకు, లాంచీలకు అసలు లైసెన్సులు ఉండవు. ప్రయాణీకుల రక్షణ కోసం వినేయోగించే లైఫ్‌ జాకెట్లు గాని, ఇతర సౌకర్యాలు గాని చాలా తక్కువగా ఉంటాయి. దీనితో పాటుగా పడవలు, లాంచీలు నడిపే సరంగులకు సరయిన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ లేని కారణంగా అధికశాతం ప్రమాదాలకు కారణమవుతున్నారు.

గోదావరి పోలవరం ప్రాజెక్టు దిగువన ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ముంపు గ్రామాలకు, ముంపులేని గ్రామాలకు కూడా రవాణా మార్గం గోదావరిపై పడవ ప్రయాణమే. అట్లాకాకపోతే ఈ గ్రామాలకు చెందిన గిరిజనులు రోడ్డు ద్వారా వెళ్ళడం చాలా కష్టం. రోడ్డుపై వెళితే అనేక కష్టనష్టాలకు ఓర్వవలసి వస్తుంది. ఎంతో దూరం, ఎగుడు దిగుడు మార్గం.

కాబట్టి జలమార్గమే వీరికి శరణ్యం. ఇలా జలమార్గం తప్ప ఈ గ్రామాల ప్రజలకు వేరే రవాణా సౌకర్యం లేనప్పుడు ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా ఎన్నో చర్యలు తీసుకుని ఉండవలసిన అవసరం ఉంది.

మంతూరు గోదావరి ప్రమాదంలో మరణించిన వారంతా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులే. ప్రతి నిత్యం వారు తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేయడానికి, ఇతర పనుల మీద వచ్చి పోయే రోజూవారీ ప్రయాణీకులు. ఫించనుల కోసం, కుల ధృవీకరణ పత్రాలకోసం, పోలవరం ప్రాజెక్టు కింద పోయిన భూముల నష్టపరిహారాల కోసం వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మహిళలు, వృద్ధులు, పిల్లలు కూడా అధిక సంఖ్యలో ప్రయాణిస్తూ ఉంటారు. మరి వారి భద్రతను గోదావరి దయా దాక్షిణ్యాలకు వదిలివేయడం ప్రభుత్వ అసమర్థత తప్ప మరేమీ కాదు.

పర్యాటక శాఖలోని అంతులేని అవినీతి మూలంగా లాంచీలకు, పడవలకు సరియైన లైసెన్సులు ఉన్నాయా? లేదా? అనే తనిఖీ కరువైంది. మరమ్మత్తులు లేని పడవలు, లాంచీలు కూడా ప్రయా ణీకులను తరలిస్తున్నాయంటే తనిఖీ చేయవలసిన అధికారులలో అవినీతి ఎంత పేరుకుపోయిందో చెప్పనవసరం లేదు.

ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రమాదాలకు కారణం లైసెన్సు లేని పడవలే అని తేలాయి. పరిమితిని మించి ప్రయాణీకులను ఎక్కించడం, సిమెంటు బస్తాలు, మోటారు సైకిళ్ళు వంటి అధిక బరువుతో ఉండే సామాగ్రిని కూడా మనుషులు ప్రయాణించే లాంచీలలోనే వేయడం వల్ల ఇటువంటి ఘోర ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ముఖ్యంగా తనిఖీ అధికారులు పడవలు, లాంచీలు ప్రయాణానికి సిద్ధమయ్యేముందు ప్రయాణీకుల సంఖ్య, ఇతర భద్రతా విషయాలు పూర్తిగా పరిశీలించిన తరువాతే వాటిని నదిలో ప్రయాణానికి అనుమతి ఇవ్వాలి. మనుషులు ప్రయాణించేవి, వస్తువులు చేరవేసేవి అని విభజిస్తూ ఆయా పడవలకు, లాంచీలకు ప్రత్యేక లైసెన్సు, పన్ను విధానం అమలు చేయాలి. అంతేగాక పడవ, లాంచీ సరంగులకు సరైన శిక్షణను ఇచ్చి వారి శిక్షణాకాలం పూర్తి అయిన తరువాత మాత్రమే వారిని పడవ సరంగుగా అనుమతించాలి. అందుకు తగిన పత్రాల విధానాన్ని అమలు చేయాలి. వీరి శిక్షణ నిమిత్తం విశాఖపట్టణం నావికాదళం వారిని ఉపయోగించ వచ్చు.

పడవరేవులలో వాతావరణ సమాచారం, నది ఆటుపోటులను గురించి, ఇతర సాంకేతిక సమాచారం ఎప్పటికప్పుడు అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సరైన అనుమతి లేని పడవలను, లాంచీలను పూర్తిగా నిలిపివేయాలి.

అపుడు మాత్రమే ప్రజలు జలసమాధికాకుండా కాపాడగలుగుతాము.

– పి.వి.శ్రీరామశాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *