ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం

సంక్షేమం

తెలంగాణ రైతులకు 5 లక్షల ఆరోగ్య, జీవిత బీమా

తెలంగాణ ప్రభుత్వం రైతులకు 5 లక్షల విలువైన ఉచిత ఆరోగ్య, జీవిత బీమాను ప్రకటించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కరీంనగర్‌లో 26 ఫిబ్రవరి 2018న జరిగిన రైతు సమన్వయ సమితుల మీటింగ్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. రానున్న బడ్జెట్‌లో దీని కోసం 500 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనుంది.

జాతీయం

ఆర్థికం

2017-18లో భారత జిడిపి వద్ధి

2017-18 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికంలో అక్టోబర్‌-డిసెంబరు మాసాలకు గానూ జిడిపి వద్ధిరేటు 7.2 శాతంగా నమోదైంది. ఇదే కాలంలో చైనా వద్ధిరేటు 6.8 శాతంగా ఉంది. మార్చి 31తో ముగిసే 2017-18 ఆర్థిక సంవత్సరంలో వద్ధిరేటు 6.6 శాతంగా ఉండొచ్చని సిఎస్‌ఒ రెండో ముందస్తు అంచనాల్లో పేర్కొంది. మూడో త్రైమాసికంలో తయారీ రంగం 8.9 శాతం, వ్యవసాయరంగం 4.1 శాతం వద్ధిని నమోదు చేశాయి. 2016-17లో వద్ధిరేటు 7.1 శాతంగా నమోదైంది. 2018-19లో జిడిపి వద్ధిరేటు 7 నుంచి 7.5 మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.

రక్షణ

రుస్తోం – 2 డ్రోన్‌ పరీక్ష విజయవంతం

డిఆర్‌డిఒ అభివద్ధి చేసిన మానవ రహిత విమానం రుస్తోం-2ను విజయవంతంగా పరీక్షించారు. 25 ఫిబ్రవరి 2018న కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. అమెరికా తయారుచేసిన ప్రిడేటర్‌ డ్రోన్‌ల తరహాలోనే 24 గంటలు సైనిక బలగాలకు సేవలందించడానికి దీన్ని రూపొందించారు. గంటకు 280 కి.మీ. వేగంతో ఈ డ్రోన్‌ ప్రయాణిస్తుంది. 2.5 మీటర్ల ఎత్తున్న ఈ డ్రోన్‌ రెక్కల పొడవు 20.6 మీటర్లు, వెడల్పు 9.5 మీటర్లు.

ధనుష్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

భారతదేశం మధ్యశ్రేణి క్షిపణి ధునష్‌ను 23 ఫిబ్రవరి 2018న విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే ఈ క్షిపణి అణ్వాయుధాలను మోసుకెళ్తుంది. ఒడిశా తీరంలోని నౌక నుంచి దీన్ని ప్రయోగించారు. ఇది 350 కి.మీ. లక్ష్యాలను చేధిస్తుంది.

పరిశ్రమలు

టాటా బోయింగ్‌ వైమానిక పరికరాల పరిశ్రమ ప్రారంభం

హైదరాబాద్‌ ఆదిభట్ల ఏరోస్పేస్‌ సెజ్‌లో టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ను కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ 1 మార్చి 2018న ప్రారంభించారు. టాటా సంస్థ, ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌తో కలసి ఈ పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమలో అపాచీ హెలికాప్టర్‌-64 భాగాలను, వైమానిక పరికరాలను తయారు చేస్తోంది. పరిశ్రమ ప్రారంభోత్సవంలో భారత్‌లో అమెరికా రాయబారి కెన్నత్‌ జస్టర్‌, టాటా సన్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా, తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్‌ పాల్గొన్నారు. ఈ పరిశ్రమకు 2016 జూన్‌ 18న అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ శంకుస్థాపన చేశారు. కేవలం 20 నెలల వ్యవధిలోనే పరిశ్రమ పూర్తిస్థాయిలో నిర్మితమై విడిభాగాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. అపాచీ హెలికాప్టర్‌లను అమెరికా సైన్యం వినియోగిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2300 హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. భారత్‌ కూడా వీటి కోసం బోయింగ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. టాటా సంస్థ బోయింగ్‌తో కలసి వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను ఆదిభట్ల ఎయిరోస్పేస్‌ సెజ్‌లో ఏర్పాటు చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్‌ కేంద్రం ప్రారంభం

కర్ణాటకలో బెంగళూరుకు 180 కి.మీ. దూరంలో 2000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్న భారీ సౌరవిద్యుత్‌ కేంద్రం ఉత్పత్తిని ప్రారంభించింది. తుంకూరు జిల్లాలోని పావగడ తాలూకాలో తిరుమణిలో దీన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ సౌరవిద్యుత్‌ కేంద్రాన్ని 1 మార్చి 2018న ప్రారంభించారు. కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలో రైతుల నుంచి 13,000 ఎకరాలను తీసుకొని సంవత్సరానికి రూ. 21,000 కౌలును చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని ప్రభుత్వం ఈ సౌరవిద్యుత్‌ ప్లాంట్‌ను నిర్మించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్‌ కేంద్రమైన దీనికి శక్తిస్థల్‌గా పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 14,800 కోట్ల రూపాయలు ఖర్చయింది. తొలి దశలో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని ఈ ప్లాంట్‌ ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి 2700 మెగావాట్లకు ఈ ప్లాంట్‌ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటి వరకు చైనాలో 453 మెగావాట్ల సామర్థ్యమున్న టింగర్‌ డిజర్ట్‌ సోలార్‌ ప్లాంటే ప్రపంచంలో పెద్దది.

నివాళి

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం

కంచి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతీ 28 ఫిబ్రవరి 2018న కాంచీపురంలో శివైక్యం చెందారు. జయేంద్ర సరస్వతీ కంచి పీఠానికి 69వ అధిపతి. స్వామిజీ అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవన్‌. ఈయన మన్నార్‌గుడి సమీపంలోని ఇరుళ్‌నిక్కీలో 1935లో జన్మించారు. 1954లో సన్యాస దీక్ష స్వీకరించారు. 1994లో 68వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతీ నిర్యాణం అనంతరం కంచి పీఠానికి 69వ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. దేశ వ్యాప్తంగా పర్యటించి జగద్గురు జయేంద్ర సరస్వతీ ఆధ్యాత్మక బోధనలు చేశారు. చైనా, బంగ్లాదేశ్‌లోనూ ఈయన పర్యటిం చారు. ఆదిశంకరుల తర్వాత మానససరోవరాన్ని దర్శించిన రెండవ శంకరాచార్యులుగా జయేంద్ర సరస్వతీ కీర్తి గడించారు. ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా పలు సేవాకార్యక్రమాల ద్వారా స్వామిజీ కీర్తి పొందారు. పలు విద్యాలయాలు, ఆసుపత్రులను స్వామి స్థాపించారు. కంచి మఠానికి 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతీని 1983లోనే చంద్రశేఖరేంద్ర సరస్వతీ నిర్ణయించారు.

నేరాలు

ఐఎన్‌ఎక్స్‌ కేసులో కార్తి చిదంబరం అరెస్టు

కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తిని సిబిఐ అధికారులు 28 ఫిబ్రవరి 2018న చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థలో 305 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి జరిగిన అవినీతిలో కార్తి ప్రధాన నిందితుడుగా ఉన్నారు. పీటర్‌, ఇంద్రాణి ముఖర్జీలు మారిషస్‌కు చెందిన మూడు కంపెనీల నుంచి 305 కోట్ల రూపాయలను అక్రమంగా పొందారు. దీనికోసం అడ్డదారులు తొక్కారు. కేంద్ర ఆర్ధిక శాఖలో భాగమైన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక మండలి అధికారులను ప్రభావితం చేసి తమకు అనుకూలమైన నిర్ణయాన్ని పొందేందుకు కార్తి సహకారాన్ని ఐఎన్‌ఎక్స్‌ మీడియా తీసుకుంది. కార్తి చిదంబరం పరోక్ష నియంత్రణలో ఉన్న అడ్వాంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టింగ్‌ ప్రై.లిమిటెడ్‌కు విదేశాల్లో 7 లక్షల డాలర్ల చెల్లింపులు జరిగాయి. వీటన్నింటికి సంబంధించి బలమైన ఆధారాలను సిబిఐ సేకరించింది.

అంతర్జాతీయం

రక్షణ

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణులను రూపొందించిన రష్యా

ప్రపంచంలోని ఏ మారుమూల ప్రదేశం మీదైనా దాడి చేసే అధునాతన, అత్యంత శక్తివంతమైన రెండు క్షిపణులను రష్యా రూపొందించింది. ఫెడరల్‌ అసెంబ్లీని ఉద్దేశించి 1 మార్చి 2018న ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు ఫుతిన్‌ ఈ కొత్త క్షిపణుల గురించి తెలిపారు. ముఖ్యంగా క్షిపణి రక్షక వ్యవస్థలను ఇవి చేధించగలవు. ఈ రెండు క్షిపణులలో ఒకటి హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి కాగా రెండోది జలాంతర్గాముల నుంచి ప్రయోగించే దీర్ఘశ్రేణి క్షిపణి. రష్యా తాజా ప్రకటనలతో మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధం ఛాయలు మొదలయ్యాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మహిళ

సౌదీ అరేబియా సైన్యంలో మహిళలకు అనుమతి

సౌదీ అరేబియా ప్రభుత్వం సైన్యంలో మహిళలు చేరడానికి ఉన్న నిషేధాన్ని తొలగించింది. మహిళలకు సమానత్వం కల్పించే దిశలో సౌదీ ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. రియాద్‌, మక్కా, మదీనా ప్రావిన్సులలో సైనికులుగా పనిచేయడానికి 25 నుంచి 35 ఏళ్ల వయసున్న సౌదీ పౌరసత్వం కలిగిన మహిళల నుంచి ప్రభుత్వం ధరఖాస్తులను ఆహ్వానించింది. సౌదీ ప్రభుత్వం ఇటీవల వరుసగా పలు సంస్కరణలను ప్రవేశ పెడుతోంది. సెప్టెంబరు 2017లో మహిళా డ్రైవర్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం, 15 ఫిబ్రవరి 2018న మహిళలు సొంతగా వ్యాపారాలు చేసుకోడానికి అనుమతిచ్చింది.

క్రీడలు

వింటర్‌ ఒలింపిక్స్‌

దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌యాంగ్‌లో 17 రోజుల పాటు జరిగిన శీతాకాల ఒలింపిక్‌ క్రీడలు 25 ఫిబ్రవరి 2018న ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో 14 స్వర్ణ పతకాలతో నార్వే అగ్రస్థానంలో నిలిచింది. నార్వే మొత్తం 39 పతకాలను సాధించింది. జర్మనీ 14 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 31 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. కెనడా 29 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో భారత్‌కు పతకాలు రాలేదు.

జిమ్నాస్టిక్స్‌లో అరుణకు కారస్యర

ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో తెలుగమ్మాయి బుడ్డా అరుణా రెడ్డి కాంస్యం సాధించి చరిత్ర సష్టించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన మహిళల వాల్డ్‌ ఈవెంట్లో 13.649 పాయింట్లతో అరుణ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా అరుణ రికార్డు సష్టించింది.

2020 టోక్యో ఒలింపిక్స్‌ మస్కట్‌ ఆవిష్కరణ

జపాన్‌ రాజధాని టోక్యోలో 2020లో జరగనున్న ఒలింపిక్‌ క్రీడల మస్కట్‌ను 28 ఫిబ్రవరి 2018న నిర్వహణ కమిటీ విడుదల చేసింది. ఇంకా పేర్లు పెట్టని రెండు మస్కట్‌లలో నీలం రంగు బొమ్మను ఒలింపిక్‌ క్రీడలకు, గులాబీ రంగు బొమ్మను పారాలింపిక్‌ క్రీడలకు ఎంపిక చేశారు. జపాన్‌ నుంచి మొత్తం 2042 డిజైన్లు పోటీలో నిలువగా జపాన్‌ పాఠశాలల విద్యార్థులు ఎక్కువ మంది వీటిని ఎంపిక చేశారు. సూపర్‌ హీరోలకు గుర్తుగా వీటిని రూపొందించారు.

– రామచంద్రారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *