ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం)

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం)

ప్రాంతీయం

హిందుత్వం

ఘనంగా మేడారం జాతర

తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర 29 జనవరి 2018 నుంచి 3 ఫిబ్రవరి 2018 వరకు ఐదురోజులు వైభవంగా నిర్వహించారు. చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌., ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు ఈ జాతరలో పాల్గొన్నారు.

నియామకాలు

తెలంగాణ కొత్త సి.ఎస్‌. గా శైలేంద్రకుమార్‌ జోషి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన సి.ఎస్‌. గా శైలేంద్రకుమార్‌ జోషి నియమితులయ్యారు. జోషి 1984 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. 2019 డిసెంబరు వరకు జోషి ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం జోషి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.

జాతీయం

ఆర్థికం

తమిళనాడులో మల్లెపూలకు రికార్డు ధర

తమిళనాడులోని తేని జిల్లాలో మల్లెపూల ధర రికార్డు స్థాయులో కిలో 7500 రూపాయలు పలికింది. సాధారణంగా వేసవిలో ఇక్కడ మల్లెపూలు అత్యధికంగా పూస్తాయి. ఈ సమయంలో మల్లెపూలకు కొరత ఉండటంతో ధర 7500కు చేరింది. సంక్రాంతి పండగ సంధర్భంగా 3వేలకు చేరిన ధర మార్కెట్‌కు పూలు రాకపోవడంతో గరిష్ఠ ధరకు చేరింది. ఈ ప్రాంతంలో పూసే మల్లెపూలతో సెంట్లను తయారు చేస్తారు. చలి తీవ్రత పెరిగి వాతావరణం అనుకూలించక పోవడంతో తమిళనాడులో మల్లెల ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో ధరలు విపరీతంగా పెరిగాయి.

భారత ఆర్థిక సర్వే 2017-18

భారత ఆర్థిక వ్యవస్థ గమనాన్ని వివరించే ఆర్థిక సర్వేను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ 29 జనవరి 2018న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సర్వే భారత ఆర్థిక స్థితిగతులను వివరించింది. సర్వే ప్రకారం 2017-18 ఆర్థిక వద్దిరేటు 6.75 శాతం, 2018-19లో ఇది 7-7.5 శాతంగా ఉండొచ్చు. జీఎస్టీ అమలు కారణంగా పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50 శాతం పెరిగింది. స్థూల ద్రవ్యలోటు 2017-18లో 3.2 శాతంగా ఉంది. విదేశీ మారక నిల్వలు 414 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఎగుమతుల్లో తెలంగాణకు 5వ స్థానం దక్కింది. పర్యాటకుల్లో ఏపికి మూడో స్థానం దక్కింది. 2014-17 మధ్య కాలంలో జీడీపీ 7.3 శాతం సగటు వద్ధిని సాధించింది. 2016-17లో ఆహారధాన్యాల ఉత్పత్తి 275.7 మిలియన్‌ టన్నులుగా ఉంది. సెప్టెంబరు 2017 నాటికి మొత్తం అప్పులు 495.7 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరాయి. 2017-18 ఖరీఫ్‌ సీజన్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి 134.7 మిలియన్‌ టన్నులుగా ఉంది.

కేంద్ర బడ్జెట్‌ 2018-19

2018-19 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 1 ఫిబ్రవరి 2018న లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. గత సంప్రదాయాలకు విరుద్దంగా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశ పెట్టి జైట్లీ కొత్త ధోరణికి శ్రీకారం చుట్టారు. మొత్తం 24.42 లక్షల కోట్ల అంచనాలతో జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రక్షణ రంగ బడ్జెట్‌ 2.82 లక్షల కోట్లు. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 80 వేల కోట్లు. ఈ బడ్జెట్‌లో రైల్వేకు 1,46,500 కోట్లు కేటాయించారు. 50 కోట్ల మంది పేదలకు ప్రయోజనం చేకూర్చే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భీమా పథకాన్ని ప్రకటించారు. దీనిలో ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వైద్య కవరేజీ లభించనుంది. ఆదాయంలో అత్యధికంగా 23 శాతం జీఎస్టీ నుంచి లభించింది. రాష్ట్రపతి వేతనం 5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనం 4 లక్షలకు, గవర్నర్‌ వేతనం 3.5 లక్షలకు పెంచారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేయలేదు.

సంక్షేమం

దివ్యాంగుల రిజర్వేషన్లు 4 శాతానికి పెంపు

దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను అనుసరించి వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు ఇస్తున్న 3 శాతం రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇకపై ఆటిజం, మానసిక సమస్యలు, మేధో వైకల్యం, ఆమ్ల దాడి బాధితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు.

రక్షణ

కరంజ్‌ జలాంతర్గామి ఆవిష్కరణ

నౌకాదళాధిపతి అడ్మిరల్‌ సునీల్‌ లాంబా సతీమణి రీనా లాంబా నూతన జలాంతర్గామి కరంజ్‌ను ముంబాయిలో 31 జనవరి 2018న ఆవిష్కరించారు. ఇది స్కార్పీన్‌ తరగతికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి. ఈ శ్రేణిలో ఇది మూడోది. దీన్ని మాజెగావ్‌ డాక్‌లో నిర్మించారు.

ప్రతిభ

మెన్సా ఐక్యూ పరీక్షలో మెహుల్‌ గార్గ్‌ రికార్డు

మెహుల్‌ గార్గ్‌ అత్యంత పిన్న వయసులో మెన్సా ఐక్యూ పరీక్షలో 162 పాయింట్లు సాధించి సరికొత్త రికార్డు సష్టించాడు. గార్గ్‌ లండన్‌లో స్థిరపడిన భారత సంతతి బాలుడు. గతంలో మెహుల్‌ సోదరుడు ధవ్‌ గార్గ్‌ 13 ఏళ్ల వయసులో 2017లో ఐక్యూను సాధించాడు. ఇప్పుడు మెహుల్‌ 10 ఏళ్ల వయసులోనే 162 ఐక్యూని సాధించాడు.

ప్రముఖులు

విదేశాంగ కార్యదర్శి జైశంకర్‌ పదవీ విరమణ

ప్రధాని నరేంద్రమోదీ విదేశాంగ విధానానికి రూపశిల్పిగా మన్ననలు పొందిన విదేశాంగ కార్యదర్శి ఎస్‌ జైశంకర్‌ 28 జనవరి 2018న పదవీ విరమణ చేశారు. 2015 జనవరిలో జైశంకర్‌ ఈ పదవీ బాధ్యతలు చేపట్టారు. సుబ్రమణ్యం జైశంకర్‌ 1977 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. చైనా, అమెరికాలకు రాయబారిగా పనిచేసిన జైశంకర్‌ మోదీ విదేశాంగ విధానానికి రూపశిల్పి. అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదరడంలో శంకర్‌ది కీలక పాత్ర. చైనాతో డోక్లాం వివాద పరిష్కారం సమయంలోనూ జైశంకర్‌ కీలకపాత్ర పోషించారు.

నియామకాలు

నూతన విదేశాంగ కార్యదర్శి

భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్‌ స్థానంలో 1981 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి విజయ్‌ కేశవ్‌ గోఖలే నియమితులయ్యారు. ఆయన 29 జనవరి 2018న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.

క్రీడలు

ముస్తాక్‌ అలీ టీ 20 విజేత ఢిల్లీ

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ 20 క్రికెట్‌ కప్‌ను ఢిల్లీ జట్టు గెలుచుకుంది. కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ జట్టు రాజస్థాన్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఢిల్లీ జట్టులో ఉన్ముక్త్‌ చంద్‌, గంభీర్‌, ధ్రువ్‌లు రాణించడంతో ఆ జట్టు 153 పరుగులు సాధిం చింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ 112 పరుగులకే ఆలౌట్‌ అయింది.

పురస్కారాలు

ఆశాభోంస్లేకు యశ్‌ చోప్రా పురస్కారం

ప్రముఖ గాయని ఆశాభోంస్లే నేషనల్‌ యశ్‌ చోప్రా మెమోరియల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. 16 ఫిబ్రవరి 2018న ముంబాయిలో ఈ అవార్డును మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, లతా మంగేష్కర్‌ల చేతుల మీదుగా ఆమె అందుకోనున్నారు. ‘సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్‌’ ప్రముఖ దర్శక నిర్మాత యశ్‌ చోప్రా పేరుతో 2013 నుంచి ప్రతి ఏటా సినీ ప్రముఖులకు ఈ అవార్డును అందిస్తోంది. 2017కు గాను ఆశాభోంస్లేకు ఈ అవార్డు అందించనున్నారు. గతంలో అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌, లతా మంగేష్కర్‌, రేఖ ఈ పురస్కారాన్ని అందుకొన్నారు.

అంతర్జాతీయం

ఆర్థికం

అత్యంత సంపన్న దేశాల్లో భారత్‌కు 6వ ర్యాంకు

అత్యంత సంపన్నుల దేశాల జాబితాలో భారత్‌కు 6వ ర్యాంకు దక్కింది. ‘న్యూ వరల్డ్‌ వెల్త్‌’ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలువగా, చైనా రెండు, జపాన్‌ మూడు, బ్రిటన్‌ నాలుగు, జర్మనీ ఐదో స్థానంలో నిలిచాయి. భారత్‌ ఆరో స్థానం దక్కించు కుంది. 2017లో భారత సంపద 25 శాతం పెరిగి 8230 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. సంపన్నుల సంఖ్య విషయంలో భారత్‌ 9వ స్థానంలో నిలవగా, అమెరికా మొదటి స్థానంలో నిలిచింది.

సాంకేతికం

ప్రపంచంలో శక్తివంతమైన రాకెట్‌ ‘ ఫాల్కన్‌ హెవీ’

ప్రపంచంలోనే శక్తి వంతమైన రాకెట్‌ ‘ఫాల్కన్‌ హెవీ’కి అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ భూతల పరీక్ష నిర్వహించింది. ఫాల్కన్‌ హెవీ అనేది పునర్విని యోగ వాహక నౌక. దీని మొదటి దశలో 27 ఇంజిన్లు ఏకంగా 23 వేల కిలో న్యూటన్ల శక్తిని విడుదల చేస్తాయి. ప్రస్తుతం అత్యంత శక్తి వంతమైన రాకెట్‌ డెల్టా-4తో పోల్చితే ఇది రెట్టింపు శక్తిని కలిగి ఉంటుంది. ఇది వెలువరించే శక్తి 18 బోయింగ్‌ 747 విమానాల పూర్తిస్థాయి శక్తికి సమానం. ఈ రాకెట్‌తో చంద్రుడు, అంగారక గ్రహాల వద్దకు ప్రయాణికులను తీసుకెళ్లాలని స్పేస్‌ ఎక్స్‌ భావిస్తోంది.

నివాళి

ఫర్నీచర్‌ దిగ్గజం ఇంగ్వర్‌ మతి

ప్రపంచ వ్యాప్తంగా తనదైన శైలిలో ఫర్నీచర్‌ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఐకియా సంస్థ వ్యవ స్థాపకుడు ఇంగ్వర్‌ కంప్రాడ్‌ 28 జనవరి 2018న స్టాక్‌¬ంలో మరణించాడు. 1943లో ఇంగ్వర్‌ ఐకెఇఏ ఫర్నీచర్‌ సంస్థను స్థాపించాడు. ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా శాఖలు కలిగి, ఫర్నీచర్‌ వ్యాపారంలో అగ్రగామిగా ఉంది.

క్రీడలు

ఆస్ట్రేలియా ఓపెన్‌-2018

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో 2018 సంవత్సరానికి సంబంధించిన టెన్నిస్‌ పోటీలు జనవరి 15-28 మధ్య జరిగాయి. మెల్‌బోర్న్‌ పార్క్‌లో ఈ పోటీలు నిర్వహించారు. ఓపెన్‌ ఎరాలో ఇవి 200వ గ్రాండ్‌స్లామ్‌ పోటీలు.

మహిళల సింగిల్స్‌ విజేత వోజ్నియా

డెన్మార్క్‌ టెన్నిస్‌ తార కరోలినా వోజ్నియా ఆస్ట్రేలియా ఓపెన్‌ 2018 మహిళల టెన్నిస్‌ ట్రోఫీ విజేతగా నిలిచింది. 27 జనవరి 2018న జరిగిన మహిళల ఫైనల్లో రెండో సీడ్‌ వోజ్నియా రుమేనియా క్రీడాకారిణి హలెప్‌పై 7-6, 3-6, 6-4తో విజయం సాధించి కెరీర్‌లో మొదటి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకుంది.

పురుషుల సింగిల్స్‌ విజేత రోజర్‌ ఫెదరర్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో రోజర్‌ ఫెదరర్‌ విజేతగా నిలిచాడు. 36 ఏళ్ల వయసులో కూడా ఈ స్విస్‌ దిగ్గజం ఏమాత్రం జోరు తగ్గకుండా కెరీర్‌లో 20వ గ్రాండ్‌ స్లామ్‌ను దక్కించుకున్నాడు. ఫైనల్లో ఫెదరర్‌ క్రొయేషియా క్రీడాకారుడు మారిన్‌ సిలిచ్‌పై 6-2, 6-7, 6-3, 3-6, 6-1 తేడాతో విజయం సాధించాడు. కెరీర్‌లో ఫెదరర్‌కు ఇది 30వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌.

మహిళల డబుల్స్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో టీమియా బబోస్‌ (హంగేరి) -క్రిస్టినా మ్లెడనోవిక్‌ (ఫ్రాన్స్‌)లు విజేతగా నిలిచారు. ఫైనల్లో వీరు మకరోవా-వెస్నియా (రష్యా) జంటపై 6-4, 6-3 తేడాతో విజయం సాధించి టైటిల్‌ గెలుచుకున్నారు.

పురుషుల డబుల్స్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను మాట్‌ పవిచ్‌ (క్రొయేషియా) – ఒలివర్‌ మరాచ్‌ (ఆస్ట్రియా) జోడి గెలుచుకుంది. ఫైనల్లో ఏడో సీడ్‌ జంట పవిచ్‌ – మరాచ్‌ లు 6-4, 6-4తో వరుస సెట్లలో పదకొండో సీడ్‌ కబాల్‌-ఫరా (కొలంబియా) జంటపై విజయం సాధించింది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దబ్రౌస్కీ (కెనడా) – పవిచ్‌ (క్రొయేషియా) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో ఈ జంట బోపన్న-బబోస్‌ (హంగేరి)పై 2-6,6-4,(11-9)తో విజయం సాధించి టైటిల్‌ గెలుచుకుంది.

ఇండోనేషియా మాస్టర్స్‌ టోర్నీ విజేత తైజు

ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ప్రపంచ నెంబర్‌వన్‌ క్రీడాకారిణి తైజుయింగ్‌ విజేతగా నిలిచింది. 28 జనవరి 2018న ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ఫైనల్లో తైవాన్‌ క్రీడాకారిణి తైజుయింగ్‌ భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై 21-9,21-13 తేడాతో విజయం సాధిం చింది. తైజు చేతిలో సైనాకు వరుసగా ఇది ఏడో ఓటమి. తైజుతో 10 మ్యాచులు ఆడిన సైనా కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.

– రామచంద్రారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *