ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం

సంక్షేమం

సైక్లింగ్‌ పార్కు ప్రారంభం

హైదరాబాద్‌లో పాలపిట్ట పేరుతో సైక్లింగ్‌ పార్కును ఏర్పాటు చేశారు. దీన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ 20 నవంబర్‌ 2017న ప్రారంభించారు. కోట్ల విజయ భాస్కరరెడ్డి బొటానికల్‌ గార్డెన్‌లోని 30 ఎకరాల స్థలంలో ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఒకప్పుడు డంపింగ్‌ యార్డుగా ఉన్న ఈ ప్రాంతంలో 7500 మొక్కలు నాటి సైక్లింగ్‌ పార్కుగా అభివద్ధి చేశారు. ప్రత్యేకంగా సైక్లింగ్‌ పార్కును ఏర్పాటు చేయడం దేశంలో ఇదే ప్రథమం.

స్వచ్ఛత

ఛార్మినార్‌కు స్వచ్ఛ గుర్తింపు

స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఛార్మినార్‌ను స్వచ్ఛతకు గుర్తింపు చిహ్నంగా ప్రకటించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న సుప్రసిద్ధ ప్రాంతాలను సందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకోసం ఢిల్లీలో సమావేశమైన బృందం ఛార్మినార్‌ను స్వచ్ఛతకు గుర్తింపు చిహ్నంగా ప్రకటించింది. ఛార్మినార్‌ భాద్యతను ఎన్‌టిపిసికి అప్పగించారు. మొదటిదశలో అమత్‌సర్‌, స్వర్ణ దేవాలయం లాంటి పది ప్రాంతాలుండగా రెండో జాబితాలో ఛార్మినార్‌తో పాటు గంగోత్రి, యమునోత్రి, ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ దేవాలయం, గోవాలోని చర్చ్‌ అండ్‌ కాన్వెంట్‌ ఆఫ్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆఫ్‌ ఎస్సిస్సి, ఎర్నాకులంలోని ఆదిశంకరా చార్య క్షేత్రం, దేవ్‌గఢ్‌లోని బైజ్‌నాధ్‌ ధామ్‌, బీహార్‌లోని గయా తీర్ధ్‌, గుజరాత్‌లోని సోమనాధ్‌ మందిరం ఉన్నాయి.

జాతీయం

రక్షణ

తొలి మహిళా పైలట్‌గా శుభాంగి

భారత నౌకాదళంలో పైలట్‌గా చేరి శుభాంగి స్వరూప్‌ తొలి మహిళా పైలట్‌గా రికార్డు సష్టిం చారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన శుభాంగి నావికా అధికారి జ్ఞాన్‌ స్వరూప్‌ కుమార్తె. శుభాంగి కేరళలోని ఎజిమల ఇండియన్‌ నావెల్‌ అకాడమీలో మొదటి బ్యాచ్‌ మహిళ అధికారిణి. వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌ బయోటెక్నాలజీ పూర్తి చేసిన శుభాంగి, నావెల్‌ అకాడమీలో చేరి శిక్షణ పొందారు. శుభాంగి సముద్రాలపై నిఘూ విమానాలను నడపనున్నారు. తదుపరి శిక్షణను ఈమె హైదరాబాద్‌లోని వైమానికదళ అకాడమీలో పొందుతారు. శుభాంగితో పాటు మరో ముగ్గురు మహిళా అధికారులు ఆస్థాసెగల్‌, రూప, శక్తి మాయాలు నావికాదళ ఆయుధాల పర్యవేక్షణ విభాగంలో చేరారు. వీరు కూడా ఈ విభాగంలో చేరిన తొలి మహిళలు.

బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని భారత్‌ సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. దీంతో త్రివిధ దళాలకు ఈ క్షిపణి అందుబాటులోకి వచ్చింది. బ్రహ్మోస్ అనేది మధ్య శ్రేణి సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది. దీనిని జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, భూతలం నుంచి ప్రయోగించవచ్చు. రష్యా, భారత్‌ సంయుక్తంగా ఈ క్షిపణిని అభివద్ధి చేశాయి. భారత్‌లోని బ్రహ్మపుత్రా నది, రష్యాలోని మాస్కోవా నదుల పేరుతో దీనికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. భారత వైమానికదళం సుఖోయ్‌-30 యుద్ధ విమానం ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణితో 290 కి.మీ దూరం లోని లక్ష్యాలపై గురిపెట్టవచ్చు. సుఖోయ్‌ నుంచి ప్రయోగించిన క్షిపణుల్లో 2.5 టన్నుల బ్రహ్మోసే అత్యంత బరువైనది.

నావికాదళంలోకి మరో అణు జలాంత్గామి

భారత నౌకాదళంలోకి మరో అణు జలాంత్గామి చేరింది. విశాఖ నావెల్‌ డాక్‌యార్డ్‌లోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ అణు జలాంతర్గామికి అరిధామన్‌ అని పేరుపెట్టారు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెసల్‌ ప్రాజెక్టు కింద రూపొందించనున్న ఐదు అణు జలాంతర్గాముల్లో అరిధామన్‌ రెండోది. మొదటి అణు జలాంతర్గామి అరిహంత్‌ 2009 జూలై 26 నుంచి సేవలను అందిస్తోంది. అరిధామన్‌ 3500 కిలోమీటర్ల దూరం వరకు అణు క్షిపణులను ప్రయోగించగలదు. కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ 19 నవంబర్‌ 2017న ఈ జలాంతర్గామిని లాంఛనంగా ప్రారంభించారు.

చట్టం

కర్ణాటకలో మూఢనమ్మకాల నిషేధ చట్టం

అమానవీయ దురాచారాలను, చేతబడి లాంటి తాంత్రిక విద్యలను సమూలంగా నిర్మూలించేందుకు, సామాన్యులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమో దించింది. ఇక మీదట కర్ణాటకలో మూఢనమ్మకాల చట్టం పరిధిలో నేరానికి పాల్పడిన వ్యక్తికి ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.5 వేల నుంచి 50 వేల వరకూ జరిమానా విధిస్తారు. బాణమతి, చేతబడి, దయ్యాల వైద్యం, పాముకాటు మంత్రాలు మొదలైనవి చట్టం పరిధిలోకి వస్తాయి. మూఢభక్తికి సంబంధించి అగ్నిగుండంలో నడవడం, జంతువుల గొంతు కొరికి చంపడం, నాలుక, పెదాలకు ఇనుప కమ్మీలు గుచ్చుకోవడం, ఆలయాల్లో ఎంగిలాకు పై పొర్లు దండాలు మొదలైనవాటిని నిషేధించారు. 2013లోనే మహారాష్ట్ర ఇలాంటి మూఢనమ్మకాల వ్యతిరేక బిల్లును ఆమోదించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

సాహిత్యం

‘ది నేషనలిస్ట్‌’ పుస్తకావిష్కరణ

దేశంలోనే ప్రఖ్యాత నిర్మాణ రంగ సంస్థ లార్సన్‌ అండ్‌ టోబ్రో (ఎల్‌ అండ్‌ టీ), దాని చైర్మన్‌ ఏఎం నాయక్‌ల చరిత్రను వివరిస్తూ ప్రముఖ జర్నలిస్టు మిన్‌హాజ్‌ మర్చంట్‌ రాసిన పుస్తకం ‘ది నేషనలిస్ట్‌.’ ఈ పుస్తకాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ 18 నవంబర్‌ 2017న ముంబైలో ఆవిష్కరించారు. 1980లలో కూడా దేశీయంగా నిర్మాణాన్ని చేపట్టగలిగే స్థాయిలో ఎల్‌ అండ్‌ టీ సంస్థను నాయక్‌ తీర్చిదిద్దారు. నాయక్‌ నాయకత్వంలో ఎల్‌ అండ్‌ టీ దేశంలోనే అత్యున్నత ఇంజనీరింగ్‌ సంస్థగా అభివద్ధి చెందింది. మేకిన్‌ ఇండియాకు నాయక్‌ ఆధ్యుడని ముకేశ్‌ అంబానీ నాయక్‌ను కొనియాడారు. 1965లో ఎల్‌ అండ్‌ టీలో జూనియర్‌ ఇంజనీర్‌గా చేరిన నాయక్‌, 2003లో చైర్మన్‌గా నియమితు లయ్యారు. 2009లో భారత ప్రభుత్వం నాయక్‌ సేవలకు గుర్తుగా పద్మ భూషణ్‌ అవార్డును అందించింది.

క్రీడలు

గాయిత్రికి అండర్‌-19 టైటిల్‌

జాతీయ జూనియర్‌ స్థాయిలో గాయిత్రి మరో టైటిల్‌ కైవసం చేసుకుంది. 19 నవంబర్‌ 2017న జరిగిన కష్ణ ఖేతాన్‌ ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్స్‌ టోర్నీలో బాలికల సింగిల్స్‌లో గాయిత్రి 23-21, 21-18తో టాప్‌ సీడ్‌ పూర్వ బార్వెపై విజయం సాధించింది. ఈ ఏడాది గాయిత్రి జాతీయ ర్యాంకింగ్స్‌ టోర్నీల్లో అండర్‌-17 విభాగంలో 3 టైటిళ్లు గెలుచుకుంది. గాయిత్రి జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కుమార్తె.

పురస్కారాలు

చేనేత కార్మికుడికి గౌరవ డాక్టరేట్‌

పశ్చిమ బెంగాల్‌లోని పులియా గ్రామానికి చెందిన బిరేన్‌కుమార్‌ బసక్‌కు యుకె లోని ప్రపంచ రికార్డుల విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆరు గజాల చీరపై రామాయణం లోని ఏడు అపూర్వ ఘట్టాలను ఎంతో సుందరంగా బిరేన్‌ తీర్చిదిద్దాడు.1996లోనే చీరను నేసిన బిరేన్‌ గతేడాది ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలసి లండన్‌ వెళ్లారు. అక్కడ ఈ చీరను ప్రదర్శించడంతో యుకెలోని రికార్డుల విశ్వవిద్యాలయం దీనిపై థీసీస్‌ సమర్పించవలసిందిగా బిరేన్‌ను కోరారు. అనంతరం ఢిల్లీలో బిరేన్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు.

పవన్‌ కల్యాణ్‌కు ఐఈబీఎఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

లండన్‌లోని ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను ఎక్స్‌లెన్స్‌ అవార్డుతో సత్కరించింది. లండన్‌లోని హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో 18 నవంబర్‌ 2017న పవన్‌కు ఈ అవార్డును అందజేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పవన్‌ చేస్తున్న కషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేసినట్లు బిజినెస్‌ ఫోరం తెలిపింది.

మన్మోహన్‌కు ‘ఇందిరాగాంధీ’ శాంతి పురస్కారం

భారత మాజీ ప్రధాని, ఆర్ధిక వేత్త మన్మోహాన్‌ సింగ్‌కు 2017 ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని అందజేయనున్నారు. 2004 నుంచి 2014 మధ్య భారత ప్రధానిగా ఉండి శాంతి, నిరాయుధీకరణ, అభివద్ధి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ స్థాయిని పెంచినందుకుగాను ఈ అవార్డుకు ఎంపికచేసినట్లు ట్రస్టు తెలిపింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ నేతత్వం లోని అంతర్జాతీయ న్యాయనిర్ణేతల మండలి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.

అంతర్జాతీయం

రక్షణ

ప్రపంచంలో ఎక్కడికైనా దూసుకెళ్లే డాంగ్‌ఫెంగ్‌-41 క్షిపణి

ప్రపంచంలో ఎక్కడికౖెెనా చేరుకొనే అధునాతన క్షిపణిని చైనా రూపొందించింది. బహుళ వార్‌హెడ్‌లను మోసుకెళ్లే ఈ అధునాతన క్షిపణిని అమెరికా లక్ష్యంగా రూపొందించింది. 2018లో దీన్ని సైన్యానికి అప్పగించనున్నారు. డాంగ్‌ఫెంగ్‌ 41 అనే క్షిపణి ధ్వని వేగం కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలదు. శత్రుదేశపు క్షిపణి హెచ్చరిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థలను కన్నుకప్పి దాడులు చేయగలదు. ఘన ఇంధనంతో నడిచే ఈ క్షిపణి 12 వేల కిలో మీటర్ల దూరం ప్రయాణించగలదు. 10 అణు వార్‌హెడ్లతో ప్రపంచంలోని ఏ ప్రాంతం పైనైనా దాడి చేయగలదు.

వైద్యం

తల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇటలీ శాస్త్రవేత్త క్యానవెరో 17 నవంబర్‌ 2017న ఆస్ట్రియాలోని వియాన్నాలో ప్రకటించారు.18 గంటల పాటు ఆపరేషన్‌ నిర్వహించి ఇద్దరు వ్యక్తుల వెన్నుపాము, నాడులు, రక్తనాళాలను విజయవంతంగా అనుసంధానం చేశారు. చైనాలోని హార్బిన్‌ మెడికల్‌ యూనివర్సిటీకి చెందిన జియవోపింగ్‌ రెన్‌ నేతత్వంలోని వైద్య బృందం ఈ ఆపరేషన్‌ నిర్వహించింది.

విద్య

బ్రిక్స్‌ అత్యుత్తమ విద్యాసంస్థల్లో భారత ఐఐటీలు

బ్రిక్స్‌ దేశాల అత్యుత్తమ విద్యా సంస్థల్లో మూడు భారత ఐఐటీలు మొదటి 20 స్థానాల్లో నిలిచాయి. బెంగళూరుకు చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు కూడా తొలి 20 స్థానాల్లో చోటు లభించింది. బ్రిక్స్‌ దేశాల్లోని 300 విశ్వవిద్యాలయాలను పరిశీలించిన క్వాకరెల్లి సైమండ్స్‌ 2017కు గాను ఈ ర్యాంకులను ప్రకటించింది. ఐఐటీ బాంబే 9, ఐఐఎస్‌సీ బెంగళూరు10, ఐఐటీ ఢిల్లీ 15, ఐఐటీ మద్రాస్‌ 18వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది బెంగళూరు ఐఐఎస్‌సీకి ఆరో ర్యాంకు దక్కంది.

ఎన్నికలు

ఐసీజేలో జస్టిస్‌ భండారీకి సభ్యత్వం

అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) సభ్యుడిగా జస్టిస్‌ దల్వీర్‌ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. ఐరాసలో 20 నవంబర్‌ 2017న జరిగిన ఎన్నికలో మూడింట రెండోంతుల సభ్యదేశాలు భండారీకి మద్దతు తెలపడంతో బ్రిటన్‌ పోటీ నుంచి వైదొలగింది. సర్వ ప్రతినిధి సభలో 193 ఓట్లకు గాను 183, భద్రతా మండలిలో 15 ఓట్లు భండారీకే పడ్డాయి. దీంతో తొలిసారిగా ఐసీజే ధర్మాసనంలో బ్రిటన్‌కు సభ్యత్వం లేకుండా పోయింది.

క్రీడలు

అండర్‌-19 ఆసియా కప్‌ విజేత అఫ్గాన్‌

కౌలలాంపూర్‌లో జరిగిన ఆసియా అండర్‌-19 క్రికెట్‌ టోర్నీ లో ఆఫ్గనిస్తాన్‌ విజేతగా నిలిచింది. 19 నవంబర్‌ 2017న జరిగిన ఫైనల్లో ఆఫ్గాన్‌ పాకిస్తాన్‌ను ఓడించి విజేతగా నిలిచింది. గత మూడు టోర్నీల్లో సెమీస్‌ దశలోనే వెను దిరిగిన ఆఫ్గాన్‌ ఈ సారి టైటిల్‌ను సాధించింది. టోర్నీ ఫేవరేట్‌గా బరిలో దిగిన భారత్‌ లీగ్‌దశలోనే వెనుదిరిగింది. ముజీబ్‌ జర్దాన్‌ 5 వికెట్లు తీసి ఫైనల్లో ఆఫ్గాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నివాళి

టెన్నిస్‌ క్రీడాకారిణి నొవోత్నా మతి

చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి, మాజీ వింబుల్డన్‌ ఛాంపియన్‌ యానా నొవోత్నా 19 నవంబర్‌ 2017న ప్రేగ్‌లో మరణించారు. కొంత కాలంగా యానా కాన్సర్‌తో భాదపడుతున్నారు. 1998 వింబుల్డన్‌ సింగిల్స్‌ ఫైనల్లో టౌజిట్‌ను ఓడించి నొవోత్నా టైటిల్‌ సాధించారు. 1993లో స్టెఫీగ్రాఫ్‌ చేతిలో, 1997లో మార్టినా హింగీస్‌ చేతిలో ఓడిపోయిన నొవోత్నా రన్నరప్‌గా నిలిచారు. డబుల్స్‌లో నొవోత్నా హెలెనా సుకోవా,అరంటా సాంజెస్‌, హింగిస్‌లతో కలసి 4 వింబుల్డన్‌ టైటిళ్లు గెలిచారు.

– రామచంద్రారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *