ఈశాన్యంలో చీకటి తొలగింది.. సూర్యుడు వెలిగాడు.. కమలం వికసించింది..

ఈశాన్యంలో చీకటి తొలగింది.. సూర్యుడు వెలిగాడు.. కమలం వికసించింది..

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ మరుక్షణం నుంచే ఈ గెలుపు అంత పెద్ద గెలుపేం కాదని, ఈ విజయంతో బిజెపి పెద్దగా ఉత్సాహపడాల్సిందేమీ లేదని ఒక వర్గం మేధావులు, మీడియాలోని ఒక వర్గం, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు వివరణలు ఇవ్వడం మొదలుపెట్టాయి. కొందరు తెలివైన విశ్లేషకులైతే అసలు ఇవి విజయాలే కావని వాదించడం మొదలు పెట్టారు. ‘అంత ఆనంద పడాల్సిన అవసరం ఏముంది? రాజస్థాన్‌లో రెండు లోకసభ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. మధ్య ప్రదేశ్‌లో రెండు అసెంబ్లీ సీట్లలో బిజెపి ఓడి పోయింది. గురుదాస్‌పూర్‌ లోకసభ స్థానం ఉప ఎన్నికలో బిజెపి ఓడిపోయింది’ అని బట్టతలకు, బోడిగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేశారు.

నిజానికి ఇలాంటి విశ్లేషణల్లో విషమే తప్ప విషయం కనిపించడం లేదు. దేశ రాజకీయ చిత్రపటంలో మరో మూడు రాష్ట్రాలు బిజెపి రంగు పులుము కున్నాయన్న వాస్తవాన్ని తెరమరుగు చేసేందుకు వారెందుకింత ప్రయత్నం చేస్తున్నారో అర్ధం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. అలాగే కమ్యూనిస్టులను ప్రజలు త్రిపుర తూర్పు వాకిట్లో నుంచి తరిమి కొట్టేశారు. ఇక మిగిలింది పడమటి వాకిలి కేరళ మాత్రమేనని, కాలం చెల్లిన కమ్యూనిజానికి అటు బంగాళాఖాతం, ఇటు అరేబియా సముద్రమే గతి అని బోధపడటానికి పెద్ద విశ్లేషణ అవసరం లేదు. దశాబ్దాల వేర్పాటువాదం విచ్చుకత్తుల మధ్య జాతీయవాద కమలం వికసించడం అంత మామూలు విజయమేమీ కాదన్న సంగతి కనుగొనడానికి మైక్రోస్కోపులో, టెలిస్కోపులో అస్సలు అక్కర్లేదు.

యుక్రెయిన్‌, రుమానియా, హంగెరీ, జార్జియా, చైనా, తూర్పు జర్మనీ, చెకొస్లవాకియా, యుగోస్లేవియా (అసలీ మూడు దేశాలు ఇప్పుడు ప్రపంచపటంలోనే లేవు) గుండెల్లో నుంచి ఎప్పుడో లెనిన్‌ విగ్రహాలు కుప్పకూలి పోయాయి. మార్చి మూడో తేదీన ఇవిఎంలు తెరవడానికి ముందే, ఫిబ్రవరి 18న ప్రజలు మీట నొక్కడానికి ముందే, త్రిపుర ప్రజలు ‘ఛలో పల్టాయ్‌” (పదండి మార్చేద్దాం) అన్న రోజునే లెనిన్‌ విగ్రహం కుప్పకూలిపోయింది. నిజానికి బెలోనియా పట్టణ కూడలిలో లెనిన్‌ విగ్రహాన్ని బుల్‌డోజర్‌తో కొట్టేయాల్సిన అవసరం లేదు. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఉండదు. ఈ సందర్భంగా ప్రపంచమంతా వదిలేసినా లెనిన్‌ విగ్రహాలను పట్టుకుని వేలాడుతున్న భారతీయ కమ్యూనిస్టులను చూస్తే మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయీ రాసిన ఒక కవితలోని పంక్తి జ్ఞాపకం వస్తుంది. చనిపోయిన లెనిన్‌ శవానికి రసాయనాలు పూసి రష్యాలో భద్రపరచడం చూసి ఆయన ‘శివ కా వర్జన్‌ శవ కా అర్చన్‌’ అని ఆ కవితలో వ్యాఖ్యానించారు. అంటే శివాన్ని వదిలి, శవాన్ని ఆరాధిస్తున్నారని అర్థం. మన కమ్యూనిస్టులను చూస్తే ఇదే గుర్తుకు వస్తుంది.

కాంగ్రెస్‌ ఈశాన్యంలో కనుమరుగేనా ?

వినే వాళ్లకు ఓపికుంటే ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు చాలా పాఠాలు చెబుతున్నాయి. ఈశాన్యంలో ఇక కాంగ్రెస్‌ దాదాపు కనుమరుగే. నాగాలాండ్‌లో అరవై స్థానాల్లో పద్దెనిమిది స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ పోటీ చేయగలిగింది. మూడుసార్లు కోహిమా గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పాహిమాం (రక్షించండి) అన్నా పట్టించుకునేవారు లేరు. త్రిపురలోనూ కాంగ్రెస్‌ పోటీలో ఉన్నామా అంటే ఉన్నామన్నట్టు ఉంది. గత ఎన్నికల్లో 42 శాతం ఓట్లు సంపాదించుకున్న కాంగ్రెస్‌ ఈసారి సోదిలో లేకుండా పోవడానికి కారణం ఆ పార్టీ ఎత్తుగడలే. త్రిపురలో నిజానికి గత ఎన్నికల్లోనే ప్రజలు కమ్యూనిస్టుల పట్ల తమ అయిష్టాన్ని వ్యక్తం చేశారు. ఆ వ్యతిరేకతను ఘనీభవింపచేసేందుకు కాంగ్రెస్‌ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. పైపెచ్చు జాతీయ రాజకీయాల్లో కమ్యూనిస్టుల మద్దతు కోసం అర్రులు చాస్తూ, కత్తి పట్టడానికి బదులు కన్ను గీటుతూ కాలం వెళ్లబుచ్చింది. మేఘాలయలో కాంగ్రెస్‌ ప్రదర్శన మెరుగ్గా ఉన్న మాట నిజం. నిజానికి అదే పెద్ద పార్టీగా అవతరించింది. మేఘాలయలో ఇలాంటి ఫలితాలు వస్తాయన్న విషయంలో అంచనాలు ముందునుంచే ఉన్నాయి. అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలతో ముందస్తుగా అవగాహన కుదుర్చుకునే ప్రయత్నాలు ఏమాత్రం చేయలేదు. ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం చేతులు ముడుచుకుని, చేష్టలుడిగి కూర్చుంది. ఫలితంగా కోన్రాడ్‌ సంగ్మా నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవలి కాలంలో వచ్చిన కొద్దిపాటి సానుకూలతను కాంగ్రెస్‌ అధినాయకత్వం స్వయానా ఆవిరి చేసుకుంది.

కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసిన ప్రముఖులు కూడా ఎవరూ లేరు. మేఘాలయలో మంచి అవకాశాలున్నాయని తెలిసినప్పటికీ జాతీయ నేతలు పెద్దగా ప్రచారం చేయలేదు. రాహుల్‌ ఒక రోజు మొక్కుబడి ప్రచారం చేసి తిరుగు విమానం ఎక్కారు. త్రిపురలోనూ కాంగ్రెస్‌ అధ్యక్షుడి పర్యటన ‘పుల్లయ్య వేమవరం వెళ్లాడు.. వచ్చాడు..’ అన్నట్టే సాగింది.

అదే బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ఒక్క త్రిపురలోనే 19 సార్లు పర్యటించారు. త్రిపుర మన మహబూబ్‌నగర్‌ కన్నా చిన్నది. దాని జనాభా హైదరాబాద్‌లో మూడో వంతు. అలాంటి రాష్ట్రంలో ఆయన అన్ని సార్లు పర్యటించారు. ప్రధాని మోది నాలుగు సార్లు పర్యటించారు. జాతీయ నేతలు రామ్‌ మాధవ్‌, హిమాంత బిశ్వ శర్మ వంటి నేతలు నెలకు పదిసార్లు పర్యటించారు. రాష్ట్ర వ్యవహారాల బిజెపి ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ రెండేళ్లుగా అక్కడే మకాం వేశారు. ఇదే రకంగా నాగాలాండ్‌, మేఘాలయల్లోనూ పని జరిగింది. దాని ఫలితాలు అందరికీ కనిపించాయి.

నిజానికి త్రిపురలో కమ్యూనిస్టుల పట్ల తీవ్ర ప్రజావ్యతిరేకత మొదటి నుంచీ ఉంది. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా చాల పెద్ద ఎత్తున ఓటింగ్‌ జరిగింది. ఈ వాతావరణాన్ని ఉపయోగించుకోవడంలో బిజెపి సఫలం అయింది. ఈ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడం చాలా ముఖ్యం. దీనికి ప్రజల్లో ముందు బిజెపి పట్ల నమ్మకం కలిగేలా చేయాలి. బిజెపి అదే చేసింది. ‘ఛలో పల్టాయ్‌’ అన్న నినాదం ‘హలో హవార్యూ’ అన్నట్టు పలకరింపుగా మార్చడంలో, ప్రజల్లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా గళం విప్పే ధైర్యం ఇవ్వడంలో బిజెపి చాలా కష్టపడింది. బిజెపి జాతీయ నేతలు తరచూ రాష్ట్రంలో పర్యటించడం, ఇళ్ల వద్దకు వచ్చి ప్రచారం చేస్తే కమ్యూనిస్టులు దాడులు చేసే అవకాశం ఉన్నందున కరపత్రాల ద్వారా, బస్సుల్లో ప్రచారం నిర్వహించడం వంటి వినూత్నమైన ఎత్తుగడలను బిజెపి అవలంబించింది.

క్రైస్తవ జనాధిక్య రాష్ట్రాల్లో బిజెపి పతాకం రెపరెపలు

ఇక నాగాలాండ్‌, మేఘాలయల్లో ఏకంగా చర్చి నడుం బిగించి మరీ బిజెపికి వ్యతిరేకంగా పనిచేసింది. అబివద్ధి పేరిట బిజెపికి ఓటు వేయవద్దని, బిజెపికి ఓటేయడమంటే చర్చిపై దాడి చేసినవారికి మద్దతివ్వడమేనని చర్చి బహిరంగంగా ఈ రెండు క్రైస్తవ జనాధిక్య రాష్ట్రాల్లో ప్రకటించింది. నాగాలాండ్‌లో పదేళ్లుగా ఎన్‌డిఏ అధికారంలో ఉన్నందున మళ్లీ అదే గెలిచే అవకాశాలున్నాయని, నాగా ¬ ¬ వంటి జేబు సంస్థలతో చర్చి ఎన్నికలను బహిష్కరించమని పిలుపునిచ్చింది. కానీ వీటన్నిటినీ బిజెపి అధిగమించగలిగింది. అత్యధిక ఓటింగ్‌ జరిగింది. దీనితో చర్చి రాజకీయాలను క్రైస్తవ ఓటర్లే తిరస్కరించినట్టయింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బిజెపి ప్రభుత్వాలు ఏర్పడటం బిజెపిపై కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు చేసిన దుష్ప్రచారానికి జవాబు లాంటిది.

సమర్థవంతమైన వ్యూహాలు

వీటన్నిటికి మించి బిజెపి తొలి నుంచీ పాండవుల వ్యూహాన్ని అనుసరించింది. కురుక్షేత్రానికి ముందు సన్నాహాల్లో కౌరవులు పెద్ద పెద్ద రాజులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. కాని పాండవులు చిన్న చిన్న గిరిజన వర్గాలను, సమూహాలను చేరదీశారు. ఫలితంగా కురుక్షేత్ర యుద్ధ సమయానికి పనికొచ్చేవారందరూ పాండవుల వైపు ఉండగా, గత కీర్తులు మాత్రమే ఉన్న వారంతా కౌరవుల పక్షాన మిగిలారు. ముందు నుంచే నాగాలాండ్‌లో ఎన్‌డిపిపి, మేఘాలయలో ఎన్‌పిపి, త్రిపురలో ఐపిఎఫ్‌టి వంటి ప్రాంతీయ గిరిజన పార్టీలను బిజెపి తనతో కలుపుకుంది. వారికి నమ్మకం కలిగించింది. ముఖ్యంగా త్రిపురలోనైతే ఉప ముఖ్యమంత్రి పదవిని గిరిజనుల పార్టీ ఐపిటిఎఫ్‌కి ఇచ్చింది. తొలిసారి గిరిజన నేతకు ఇంత ఉన్నత పదవి లభించింది. గిరిజన, గిరిజనేతర ఐక్యతకు బిజెపి బాటలు వేసింది. మొక్కవోని, రాజీ లేని జాతీయ వాదానికి ప్రతీకైన బిజెపితో చేతులు కలపడం వల్ల తమకు నష్టం లేదని ఆ గిరిజన తెగల స్థానిక పార్టీలకు నమ్మకం కలిగించడం జాతీయ సమైక్యత దష్ట్యా చాలా కీలకం. స్థానిక ఆకాంక్షలను, జాతీయ భావనతో జోడించగలగడం ఈ ఎన్నికల్లో అసలు సాఫల్యం. గెలుపోటములకన్నా ఈ భావాత్మక ఐక్యతా సాధనే అసలు విజయం. ఢిల్లీ తమను పట్టించుకోదన్న నైరాశ్యం నుంచి అధికారంలో తాము సగౌరవ భాగస్వాములన్న నమ్మకం కలిగించగలగడం అత్యంత కీలకమైన గెలుపు. మూడు ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి గెలుపు అసలు పరమార్థం ఇదే. కేవలం 180 అసెంబ్లీ స్థానాలు, అయిదు లోకసభ స్థానాలు మాత్రమే ఉన్న ఈ మూడు రాష్ట్రాలలో గెలవడం జాతీయ సమైక్యతా సాధన దష్ట్యా కీలకమైనది. ఇదే ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల అసలు ఫలితం.

– కస్తూరి రాకా సుధాకర రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *