ఇళ్ళ నిర్మాణంలో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు

ఇళ్ళ నిర్మాణంలో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (PMAY) క్రింద ఎన్‌.టి.ఆర్‌. గృహనిర్మాణ పథకం పేరుతో నిర్మించిన ఇళ్ళను పేదలకు అందించారు.

పేదల స్వంత ఇంటి కలను సాకారం చేయటం కోసం 2014లో కేంద్రంలో ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పేర ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఇంతకు పూర్వం ‘అందరికీ పక్కా ఇళ్ళు’ అనే పేరుతో ఉండేది. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన యొక్క లక్ష్యం 2022 నాటికి 20 మిలియన్ల మంది పేదలకు స్వంత ఇంటి కల సాకారం చేయటం. అప్పట్లో కేంద్రంలో పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు 20 లక్షల ఇళ్ళ నిర్మాణం కోసం పథకాన్ని రూపొందించారు. అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా మన రాష్ట్రానికి 6.80 లక్షల ఇళ్ళను మంజూరు చేశారు. కారణం ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావటం.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ముఖ్యఉద్దేశ్యం ఆర్ధికంగా బలహీన వర్గాల వారికి ఇళ్ళు నిర్మించి ఇవ్వటం. ఎవరైతే తమ స్వంత ఇంటి నిర్మాణం కోసం ఆర్ధికంగా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టుకోలేరో వారికి ప్రభుత్వం చేయూతనిచ్చి స్వంత ఇంటి కలను సాకారం చేయటం. ఈ పథకం క్రింద ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి.లకు చెందిన వారిని మైనారిటీలుగా పరిగణిస్తారు. వారు తమ కుల ధుృవీకరణ పత్రాలను, ఆదాయ ధుృవీకరణ పత్రాలను అందచేయాలి. వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన స్త్రీల విషయంలోను ఈ పథకం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుంది.

మన రాష్ట్రంలో ఈ పథకానికి ముందు ఎన్‌.టి.ఆర్‌. పేరును చేర్చారు. మన రాష్ట్రానికి ఇచ్చిన 6.80 లక్షల గృహాలకుగాను మన ముఖ్యమంత్రి 3 లక్షల ఇళ్ళను నిర్మించామని చెప్పుకుంటున్నారు. పట్టణాలలో గృహ నిర్మాణానికిచ్చే మొత్తం 6 లక్షల రూపాయలకుగాను కేంద్రం 1.50 లక్షలు, రాష్ట్రప్రభుత్వం 1.50 లక్షలు ఇస్తుంది. మిగతాది బ్యాంకుల నుండి ఋణంగా అందిస్తారు. సబ్సిడీ పోగా మిగిలిన మొత్తాన్ని లబ్దిదారుడు 20 సంవత్సరాల కాలంలో వాయిదాల రూపంలో చెల్లిస్తాడు.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు తమ సొంత పేర్లను పెట్టి వాటిని తమ పథకాలుగా ప్రచారం చేసుకోవటం రాష్ట్రాలకు ఆనవాయితీగా మారింది. అలాగే ఇక్కడ కూడా ఈ పథకానికి ఎన్‌.టి.ఆర్‌. పేరును, చంద్రన్న పేరును చేర్చి అవి రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రకటిస్తూ, ప్రజలకు తనే చేస్తున్నట్లుగా చెప్పుకోవడం బాబుకు అలవాటయింది. ఇటీవల జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి కేంద్రం నుండి ఒక్క మంత్రిని కూడా బాబు పిలవలేదు. ఈ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికైన సురేష్‌ ప్రభునైనా గృహ ప్రవేశ కార్యక్రమానికి పిలవలేదు. ఇది చంద్రబాబు కపట రాజకీయాన్ని తెలియచేస్తోంది.

ఇంకోపక్క కేంద్రం సహకరించకపోయినా తాను 2022 నాటికి ఇళ్ళ నిర్మాణం పూర్తిచేస్తానని చంద్రబాబు చెప్పటం హాస్యాస్పదమే. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అమలు చేయాలి. కానీ డబ్బులేమో కేంద్రానివి, ప్రచారం తమకు అన్నట్లుంది రాష్ట్రం తీరు. ూవ్‌ీూ పథకం క్రింద కేంద్రం రూ.75,000 మాత్రమే ఇచ్చింది, మిగతావి నేనే ఇస్తున్నానంటూ బాబు దుష్ప్రచారం చేస్తున్నారు.

అయితే ఈ ఇళ్ళ నిర్మాణంలో రాష్ట్రంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో 3 రకాల ఇళ్ళ నిర్మాణం జరిగింది. 300 చదరపు అడుగులు, 370 చదరపు అడుగులు, 420 చదరపు అడుగులు. ఒక్కొక్క చదరపు అడుగు నిర్మాణానికి రూ.1,000 ఖర్చు అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకి రూ.2,000 నుండి రూ.2,400 కి పెంచిందని అంటున్నారు. రాష్ట్రప్రభుత్వం షేర్‌వాల్‌ నిర్మాణం ద్వారా నిర్మాణం జరిపామని అంటోంది. కాని పక్క రాష్ట్రమైన తెలంగాణాలో చదరపు అడుగుకి రూ.850 చొప్పున కడుతుంటే మనం ఎందుకు రూ.2,400 కి పెంచాల్సి వచ్చిందని అడుగుతున్నారు.

ఎంత ఖర్చు అయినా చదరపు అడుగుకు రూ.1,200 ఖర్చు అవుతుంది తప్ప రూ.2,400 కాదని ప్రతిక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది పేదవాడిపై భారం అవుతున్నదని అంటున్నాయి. ఇలా ఈ గృహనిర్మాణ పథకంలో వేలకోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నాయి.

రాష్ట్రం నిర్మించిన సరాసరి నిర్మాణం ప్రతి ఇంటికి 300 చదరపు అడుగులు అనుకుంటే నిర్మాణ వ్యయం 1000 చొప్పున అవుతుందని, కాని చదరపు అడుగుకి రూ.2,000 లేదా 2400 కి నిర్మాణ వ్యయం పెంచటంతో దాదాపు రూ.30 వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లుగా కనబడుతోందని అంటున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షపార్టీలు సంధిస్తున్న ప్రశ్నలకు చంద్రబాబు నుండి సరైన సమాధానం లభించటం లేదు.

పేదల ఇళ్ళ విషయంలో ప్రభుత్వంపై వస్తున్న ఈ ఆరోపణలకు సరయిన సమాధానం ఇవ్వవలసిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. అయితే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి ఇన్ని ఆరోపణలు వస్తున్నా, వామపక్ష పార్టీలు పెదవి విప్పకపోవడం విడ్డూరం.

నిజాయితీకి, పారదర్శకతకు తనను మారుపేరుగా చెప్పుకుంటున్న చంద్రబాబు జిల్లాల వారీగా లబ్దిదారుల పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి ప్రచార ఆర్భాటాలు మాని అసలు విషయాలు ప్రజలకు తెలపాలి. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయటం సరయిన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. దాడులు చేయడం, అరెస్టులు చేయించడం ప్రభుత్వ పిరికి తనాన్ని తెలియచేస్తున్నది.

– పి.వి. శ్రీరామశాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *