ఇప్పుడు గెలిచారు కానీ…

ఇప్పుడు గెలిచారు కానీ…

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లోని కైరానా లోకసభ స్థానంలోను, నూర్‌పూర్‌ విధానసభ స్థానంలోను భారతీయ జనతాపార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ రెండు చోట్లా నాలుగు ప్రతిపక్షాలు అంటే రాష్ట్రీయ లోకదళ్‌ (ఆర్‌ఎల్‌డి), సమాజవాది పార్టీ (ఎస్‌పి), బహుజన సమాజపార్టీ (బిఎస్‌పి) కాంగ్రెస్‌లు సంయుక్తంగా ఒకే ఒక్క అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటితమైనప్పటి నుంచి వీరు దాన్ని తమ ఘన విజయంగా భావించి, సంతోషంగా ఉన్నారు.

భాజపాకు కాలం చెల్లింది, ఉత్తరప్రదేశ్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ రెండు అంకెల స్థానానికి చేరలేదంటూ రాజకీయ పండితులు (విశ్లేషకులు) ఇప్పుడే జోస్యం చెబుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాలను ఆధారం చేసుకుని రాబోయే సాధారణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం తొందరపాటే అవుతుంది.

ఈ రాష్ట్రంలో ఈ నాలుగుపార్టీలు కలిసి భాజపాను ఢీకొంటే వారికి విజయం సాధ్యమేనని అంకెలు చెబుతున్నాయి. అయితే ఈ నాలుగుపార్టీలు రాబోయే 2019 ఎన్నికలలో కలిసి పనిచేయగలవా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. తమ పార్టీకి తగినన్ని సీట్లు కేటాయించని పక్షంలో తాము కూటమిలో చేరబోమని బహుజన సమాజపార్టీ సుప్రీం మాయావతి ఇటీవలే సన్నాయి నొక్కులు నొక్కారు.

ఈ నాలుగు పార్టీలు ఒక ఉమ్మడి అభ్యర్థిని 2019 ఎన్నికలలో భారతీయ జనతాపార్టీకి విరుద్ధంగా నిలబెట్టగలుగుతారా? కైరానా సీటునే తీసుకుందాం. మోదీ ప్రభంజనం వల్ల 2014లో ఆ స్థానాన్ని భారతీయ జనతాపార్టీ తమ సంచిలో వేసుకుంది. అందులో సందేహం లేదు. 1962లో మొట్టమొదటగా కైరానా లోకసభ స్థానం అస్తిత్వంలోనికి వచ్చింది. ఇప్పటివరకు అక్కడ 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ పదిహేను పర్యాయాల్లో రెండుమార్లు కాంగ్రెస్‌ 1971, 1984లోను, రెండుమార్లు భారతీయ జనతాపార్టీ 1998, 2014లోను విజయం సాధించాయి. కాబట్టి ఇది కాంగ్రెసు పార్టీకి కాని భారతీయ జనతాపార్టీకి కాని పరంపరాగతమైన సీటు కాదు. కాబట్టి ఈ ఉపఎన్నికలలో ఆ స్థానాన్ని బిజెపి కోల్పోతే ఆ పార్టీకి పెద్దగా ప్రమాదం లేదు.

మోదీ ప్రభం జనం కారణంగా 2014 ఎన్నికలలో భారతీయ జనతాపార్టీకి 38 శాతం ఓట్లు పోలయ్యాయి. విడివిడిగా పోటీ చేసిన ఇతర అభ్యర్థులకు మొత్తం 57 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే విపక్షాలన్నింటికి కలిసి భారతీయ జనతాపార్టీ కన్నా 19 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ ఉపఎన్నికలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి వచ్చిన ఓట్ల అంతరం కేవలం 4.6 శాతం (సుమారుగా అయిదు శాతం). అరటే విపక్షాలు ఉమ్మడిగా అభ్యర్థిని నిలిపినా బిజెపికి వచ్చిన ఓట్ల శాతం పెరిగిందనేగా!

సాధారణ ఎన్నికలకు ఉపఎన్నికలకు మధ్య చాలా బేధం ఉంది. సాధారణంగా ఎన్నికలలో పార్టీకి ఓటు వేస్తారు, అభ్యర్థికి కాదు. అయితే ఉపఎన్నికలలో స్థానిక సమస్యలు, వాటిని ఎవరు పరిష్కరించగలరు అన్న అంశం ఆధారంగా ఓటు వేస్తారు. బరిలోనున్న వారిలో ఎవరికి ఎక్కువ పలుకుబడి ఉందో వారికే ఓటు వేస్తారు. అందువలన ఉపఎన్నికల ఫలితాలను బట్టి సాధారణ ఎన్నికల ఫలితాలు నిర్ణయించలేం. ఇప్పుడు ఒకే నియోజకవర్గం కాబట్టి ఉమ్మడి అభ్యర్థికి ఆయా పార్టీలన్ని తమ శక్తి వినియోగించుకుని ఓటర్లను, ప్రభావితం చేయగలరు. అయితే ఒకే సమయంలో 80 స్థానాలలో న్నికలు జరిగితే, తమ శక్తిని ఒకే చోట కేంద్రీకరించలేరు.

ఈ ఉపఎన్నికలలో విపక్షాల విజయానికి కారణం వేరుగా ఉంది. కైరానా జాట్‌ బాహుళ్య క్షేత్రం. అందువలన ఆర్‌.ఎల్‌.డి. ఎన్నికల చిహ్నం మీద పోటీ చేశారు. అది అధిక సంఖ్యాక ఓటర్లను ఆకర్షించింది. ముజఫర్‌పూర్‌ మతకలహాల గాయాలు మళ్ళీ ప్రచారం కాకూడదని భావించి, సమాజవాది పార్టీ అధ్యక్షుడు, మాజి ముఖ్యమంత్రి అఖిలేష్‌ను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచారు. ఉప ఎన్నికలలో బహుజన సమాజపార్టీకి అభ్యర్థులను పోటీకి నిలిపే ఆనవాయితీ లేదు. అందువలన తన పార్టీ శ్రేణులను కార్యకర్తలను ప్రచారం చేయమని ఆమె నిర్దేశించలేదు. మరో కారణమేమంటే కైరానా, నూర్‌పూర్‌లు జాట్‌ జాదవ్‌లు అధికంగా ఉన్న క్షేత్రం. వారి మధ్య వైమనస్యాలు కలిగిస్తే రాబోయే ఎన్నికల తో అది తన పార్టీకి దెబ్బ అని ఆమెకు తెలుసు.

ఇప్పటిలాగే రాబోయే ఎన్నికలలో కూడా తామంతా కలిసి పనిచేస్తాం అని వీరు బీరాలు పలికినా అది కుదరని పనే. ఎందుకంటే వీరి మధ్య అంతర్విరోధాలు, సమస్యలు అపారంగా ఉన్నాయి. షెడ్యూల్డ్‌ కులాల ఓటర్లు యాదవులను నమ్మరు. నమ్మకపోవడానికి చాలా కారణాలున్నాయి. 1998లో బహుజన సమాజ పార్టీ, సమాజవాది పార్టీ ఉమ్మడి ప్రభుత్వాల గెస్ట్‌హౌస్‌ కాండవలన పతనమైంది. అది నివురు కప్పిన నిప్పులాగుంది. అందువలన ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని విశ్వాసంగా చెప్పలేం. ఓట్ల బదిలీ సజావుగా సాగకపోతే ఉమ్మడి అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకం లేదు. 2014లో తమ ఓట్లను కాంగ్రెస్‌కు అఖిలేష్‌ బదిలీ చేయలేకపోయారు.

ప్రతి పార్టీకి స్థానికంగా కొంత బలం ఉంటుంది. మాట వరసకు బహుజన సమాజపార్టీ సీటు వేరే పార్టీకి కేటాయిస్తే అక్కడి పార్టీ శ్రేణులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగవచ్చు. సీట్ల పంపకం సజావుగా జరుగుతుందని చెప్పలేం. కనుక ఇల్లలకగానే పండుగ కాదు. మోదీని గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో అందరు కలిసిపోదాం అనుకుంటే అయ్యేదా? ప్రతి పార్టీ తమకు అధిక సీట్లు కావాలనుకుంటుంది. తిరుగుబాటు దార్ల బెడద ఉంటుంది.

ఒక విషయం మరిచిపోకూడదు. బంగారు పని చేసే కంసాలి నూరు సుత్తి దెబ్బలు వేసాడు. ఇక ఇనుము పనిచేసే కమ్మరి ఒక సుత్తిదెబ్బ వేయవలసి ఉంది. కైరానా ఉప ఎన్నికల్లో మోదీ, షాలు పోటీలో లేరు. ఈ ఫలితాలను చూసి 2019 ఎన్నికల్లో వీరిద్దరు తమ పూర్తి శక్తిని వినియోగించే ప్రయత్నం చేయవచ్చు. అప్పుడు ప్రతిపక్షాలకు ఉమ్మడిగా తాము చేసిన గోల తప్ప మరేమీ మిగలకపోవచ్చు.

– జి.ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *