ఆ సట్టణానికి దీపావళి లేదు

ఆ సట్టణానికి దీపావళి లేదు

జమ్మూ కశ్మీర్‌ కోసం తుపాకులు పట్టిన సైనికులు, జైళ్లకు వెళ్లిన నాయకులే కాదు, సాధారణ ప్రజలు కూడా పోరాడారు. రక్తంతో ప్రాణాల దీపాలు వెలిగించి, బలిదానాల దీపావళి జరుపుకున్నారు. ఇలాంటి బలిదానమే జమ్మూ ప్రాంతంలోని రాజౌరీలో అక్కడి హిందువులు చేశారు. రాజౌరీ పట్టణ ప్రజలు నవంబర్‌ 11, 1947ను ఎప్పటికీ మరిచిపోరు.

ఆ రోజు దీపావళి. దేశమంతా టపాసులు మోగించి, దీపాలు వెలిగించి పండుగ చేసుకుంటే, రాజౌరీలో మాత్రం మగవారు తమ ప్రాణాల దీపాలు వెలిగించారు. మహిళలు విషాన్ని ప్రసాదంగా తిని ప్రాణాలర్పించారు. ఆ రక్తపు దీపావళి తరువాత దశాబ్దాల పాటు రాజౌరీలో దీపావళి చీకటి పండుగగానే జరిగింది.

ఒకపైపు పాకిస్తానీ మూకలు, మరో వైపు స్థానికంగా ఉన్న పాకిస్తానీ మద్దతుదారులు, వారికి తోడుగా జిహాదీ ఉన్మాదం ముప్పేటగా పెనవేసుకుని ప్రళయంలా రాజౌరీపైకి ముంచుకొచ్చింది. రాజౌరీలోని హిందువులు భయంతో పట్టణాన్ని ఖాళీ చేస్తే దాన్ని పాకిస్తాన్‌ ప్యాకెట్లో దూర్చేసేందుకు పన్నాగం సిద్ధమైంది. జమ్మూ కశ్మీర్‌ మహారాజు హరిసింగ్‌ సైన్యంలో పనిచేసే కెప్టెన్‌ సఫీ దలేర్‌, మేజర్‌ అస్లాంలు వెన్నుపోటు పొడిచి, పాకిస్తాన్‌తో చేతులు కలిపారు. పాక్‌ తెగల దండు అప్పటికే రాజౌరీకి ఎనిమిది కిలో మీటర్ల దూరం వరకూ వచ్చేసింది. స్థానిక జిహాదీలు కూడా వారికి తోడయ్యారు. వారంతా కలిసి, రాజౌరీ హిందువులకు పట్టణాన్ని తమకు అప్పగించమని లేఖ రాశారు.

రాజౌరీ హిందువుల ముందు రెండే రెండు మార్గాలు. ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోవడం. రాజౌరీని శత్రువు చేజిక్కకుండా కాపాడుకునేందుకు అక్కడే నిర్భయంగా, నిబ్బరంగా నిలబడటం. తాము వెనకడుగు వేస్తే మైళ్లకు మైళ్లు పాకిస్తాన్‌లో కలిసిపోతాయి. పచ్చరంగు పులుము కుంటాయి. కాబట్టి మరణమే తప్ప శరణాన్ని కోరుకోదలచుకోలేదు రాజౌరీ హిందువులు. రాజౌరీ తహసీల్దార్‌ హర్జీ లాల్‌, తన చిన్న దళంతో రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చి, మరుసటి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా చెక్కేశాడు. అయినా రాజౌరీ ప్రజలు నగరాన్ని విడిచిపెట్టలేదు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ స్వయంసేవకుల నాయకత్వంలో వారు దళాలుగా ఏర్పడి నగరానికి గస్తీ కాశారు.

నవంబర్‌ 11, 1947. సఫీ దలేర్‌, అస్లాంల నాయకత్వంలో పాకిస్తానీ మిడుతల దండు రాజౌరీపై దాడిచేసింది. హిందువులు పోరాడారు. చాలా సేపు దురాక్రమణదారులను నిలువరించారు. కానీ సూర్యుడు అస్తమించినట్టు వారి బలిమి సన్నగిల్లింది. దురాక్రమణదారులు నగరాన్ని వల్లకాడుగా, శవాల దిబ్బగా మార్చేశారు. దాదాపు పదివేల మందిని నేటి రాజౌరీ ఎయిర్‌ ఫీల్డ్‌ ఉన్న ప్రాంతానికి తెచ్చి ఊచకోత కోశారు. దాదాపు మూడువేల అయిదు వందల మంది మహిళలు బావుల్లోకి దూకి, విషం మింగి ప్రాణాలర్పించారు. ‘అప్పటికి నాకు పన్నెండేళ్లు. నా కళ్లముందే నా తండ్రిని అత్యంత కిరాతకంగా చంపేశారు. నా తల్లి పాకిస్తానీ దుండగుల చేతుల్లో పడేకన్నా చావడమే మేలని విషం మింగింది’ అంటారు సత్పాల్‌ గుప్త.

రాజౌరీలో ఆ మరుసటి రోజు పాకిస్తానీ జెండా ఎగిరింది. ఆ తరువాత అయిదు నెలల పాటు రాజౌరీ పాకిస్తాన్‌ గుప్పెట్లో పక్షిలా విలవిలలాడింది. మందిరాలు ధ్వంసం అయ్యాయి. స్కూళ్లు దిబ్బలుగా మారిపోయాయి. అయిదు నెలల తరువాత దీపావళి నాడు అలుముకున్న చీకట్లు వైశాఖీ పండుగ నాడు తొలగిపోయాయి. ఏప్రిల్‌ 13, 1948 నాడు భారత సైన్యాలు మళ్లీ రాజౌరీని గెలుచుకున్నాయి. పాకిస్తానీలు పరుగులు తీశారు. రాజౌరీ విముక్తం అయింది. కానీ ప్రజల గుండెల్లో గాయం మానలేదు. ఏళ్ల పాటు రాజౌరీలో దీపావళి కన్నీటి దీపావళే. గుప్పెడు మంది పిల్లలు, కొందరు ముసలివారు మాత్రమే నగరంలో మిగిలారు.

బలిదానాలను మరిచిపోకుండా ఉండేందుకు రాజౌరీ ప్రజలు ప్రతి ఏటా దీపావళి నాడు సామూహిక యజ్ఞాన్ని నిర్వహించి, జమ్మూ కశ్మీర్‌ కోసం, భారత దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలర్పించిన వారిని తలచుకుని, తర్పణాలు ఇస్తారు. ప్రతి వైసాఖీ రోజు రాజౌరీ దివస్‌గా పండుగలు చేసుకుంటారు. బలిదానాలు చేసిన వారిని స్మరించుకునేందుకు రాజౌరీ పట్టణంలో ఒక బలిదాన్‌ భవన్‌ను నిర్మించారు. ఆ భవనం నేటికీ తమ రక్తంతో దీపాలు వెలిగించి, పాకిస్తానీ చీకట్లను పారద్రోలిన వీరులను గుర్తు చేస్తూనే ఉంటుంది.

– సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *