ఆ శిక్ష ఖరారు వెనుక – వారి కృషి అద్భుతం

ఆ శిక్ష ఖరారు వెనుక – వారి కృషి అద్భుతం

ప్రకృతిని ప్రేమిద్దాం అంటూ ఊరికే ఊదర గొడుతూ, నాగరికులమంటూ విర్రవీగే అనేకులకు బిష్ణోయ్‌ తెగ గొప్ప పాఠం నేర్పింది. నాగరికత అంటే నగరీకరణ అనుకొని తమకు మేలు చేసే వాటిని సర్వనాశనం చేస్తూ ఆ మాటకొస్తే మనుషులను సైతం నిత్యం బాధిస్తూ, సృష్టిలో అన్ని జీవులకు తమలాగే అన్ని హక్కులు ఉన్నాయన్న విషయాన్ని కూడా మరచి ప్రవర్తిస్తున్న బుద్ధిజీవులకు నిజమైన మానవ జీవనం అంటే ఇలా ఉండాలి అని నిరూపించిన వారయ్యారు బిష్ణోయ్‌ తెగ ప్రజలు. ఒక ప్రముఖ బాలీవుడ్‌ సినీ నటుడు కృష్ణ జింకలను వేటాడడం, రమారమి 20 సంవత్సరాల తర్వాత శిక్ష ఖరారు కావడం వెనుక అతి సామాన్య గిరిజన తెగ ఉండటం నిజంగా అద్భుతం, అభినందనీయం.

నిజానికి బిష్ణోయ్‌ తెగ భంజీశ్వర్‌ అనే గురువు ప్రవచించిన 29 అంశాల ప్రాతిపదికగా అనాదిగా జీవనం సాగిస్తూ వస్తున్నారు. కరువును జయించటానికి ఏర్పరచుకున్న అనేక ప్రకృతి సహిత నియమాలను జీవనంలో భాగం చేసుకున్నారు. తాము నమ్మిన సిద్ధాంత రక్షణకై వందల మంది రాజుల కాలంలోనే ప్రాణాలర్పించి, నేటికీ అదే సిద్ధాంతం పునాదులపై జీవనం సాగిస్తున్నారు. విహారానికి వెళ్ళి తోటి వారి ప్రోత్సాహంతో వన్యజీవిని వేటాడుతూ తారస పడ్డవారు ప్రముఖులని తెలిసినా అదరక, బెదరక న్యాయ ప్రక్రియ ద్వారా శిక్ష పడేవరకు నిలబడి నిజమైన మానవతావాది ఎలా ఉండాలో సమాజానికి చాటిచెప్పింది బిష్ణోయ్‌ తెగ.

1730 సంవత్సరంలో మార్వాడ్‌ రాజు అభయ్‌ సింగ్‌ నూతన నిర్మాణాలు తలపెట్టి ‘ఖేత్రీ’ వృక్షాల నరికివేతకు ఆదేశాలు ఇవ్వగా, అమృతాదేవి ఆ వృక్షాలను కౌగిలించుకుని అడ్డుకొనేందుకు చేసిన ప్రయత్నంలో అనేకులు అమరులయ్యారు. వారి త్యాగానికి స్వయంగా రాజే వచ్చి క్షమాపణలు కోరి చెట్ల నరికివేతను ఆపించాడు. కనీసం వండుకోవడానికి సైతం చెట్ల నరికివేత చేయక రాలిన ఆకులు, పడిపోయిన కట్టెలను మాత్రమే వాడే వారి ప్రకృతి ప్రేమ నిజంగా అపూర్వం, అనుసరణీయం.

ప్రకృతితో మమేకమై సకల జీవులతో సహజీవనం సాగించే విధానాన్ని జీవితంలో భాగంగా చేసుకుని వాటి జీవనానికి ఆడ్డొచ్చే చర్యల నివారణ కోసం తమ విలువైన ప్రాణాలను సైతం పణంగా పెట్టగల ధీరోదాత్త వైఖరి అసలు సిసలు ప్రకృతి ప్రేమనూ, అంకితభావాన్ని తేటతెల్లం చేస్తుంది. అంతేకాదు నగరీకరణ చెందుతున్న మన సమాజంలో తోటి మానవులపట్ల వ్యవహరించే తీరు పలు సందర్భాల్లో విస్తు గొలుపుతుంది. ముఖ్యంగా ఆపదలో, ప్రమాదంలో, చావుబతుకుల్లో ఉన్నా సరే పట్టింపులేని తనం, మూగజీవాల పట్ల సైతం కర్కశంగా ప్రవర్తించడం పెరిగిపోతోంది. అయినా ప్రజలలో ‘మనకెందుకులే అనే భావన హెచ్చు మీరుతోంది. అమానవీయతను నరనరాన జీర్ణం చేసుకుంటూ కాలం గడుపుతున్న మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందించి రుజువు చేసే ప్రక్రియకి సహకరించకపోవటం, సహకరించినా కడదాకా వచ్చాక ఎదురు తిరిగే ‘నాగరిక నైపుణ్యాలు’ ఆందోళన కలిగిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మూగజీవాలైనా, వాటి ప్రాణాలు సైతం విలువైనవేనని నమ్మి నిందితులకు శిక్ష పడేవరకు పోరాడిన అతి సామాన్యుల అనన్య సామాన్యమైన పోరాటం ఆదర్శనీయం.

– వినోద్‌ కుమార్‌ సుద్దాల

(ఆంధ్రజ్యోతి నుండి..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *