ఆర్థిక వృద్ధి, ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా 2018-19 కేంద్ర బడ్జెట్‌

ఆర్థిక వృద్ధి, ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా 2018-19 కేంద్ర బడ్జెట్‌

మోది నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి దేశాన్ని ఆర్ధికంగా పటిష్టం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. తాత్కాలిక ఉపశమనాలను కాకుండా దీర్ఘకాలంలో భారత ఆర్ధిక వ్యవస్థకు మేలు చేసే చర్యలను ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో చేపట్టింది. ఎవరు ఎంతగా విమర్శించినా 2018-19 బడ్జెట్‌ ప్రజాశ్రేయస్సుకు మార్గాలను సుగమం చేయగలదు.

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లి 2018-19 ఆర్ధిక సంవత్సరపు కేంద్ర బడ్జెట్‌ను 1 ఫిబ్రవరి 2018న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అందరికి ఆమోదయోగ్యమైన, భారత ఆర్ధిక వృద్ధిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందించింది. మోది ప్రభుత్వం పట్టణ ప్రజలకు మాత్రమే మేలు చేస్తోందన్న అపవాదును చెరిపేస్తూ ఈసారి గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. ప్రజలను పేదరికం నుంచి బయట పడేయడానికి పలు పథకాలను రూపొందించారు. ఈ పథకాలన్నింటిలోకి ‘మోది కేర్‌’ అని అందరూ ముద్దుగా పిలుచుకుంటున్న ‘ఆరోగ్య సంరక్షణ పథకం’ ముఖ్యమైనది.

జిఎస్‌టి, నోట్ల రద్దుతో నెమ్మదించిన భారత ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడింది. వృద్ధి రేటు వచ్చే ఏడాది 7 శాతం దాటే అవకాశం ఉంది. మేకిన్‌ ఇండియా ద్వారా భారత్‌లో తయారీకి ఈ బడ్జెట్‌ మార్గం సుగమం చేసింది.

మరో వైపు రైతులకు మద్దతు ధరలను అందించడానికి ప్రభుత్వం కృషిచేస్తోంది. వచ్చే ఖరీఫ్‌లో పెట్టుబడులతో పోల్చితే మద్దతు ధరలు 1.5 రెట్లుగా ప్రకటించాలని నిర్ణయించింది. మరో వైపు ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయల నిల్వకు చర్యలు చేపట్టడంతో పాటు రైతులు మార్కెట్‌తో అనుసంధానమై తమ పంటకు మద్దతు ధర పొందే విధంగా కార్యక్రమాలను చేపడుతోంది.

ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే కావడంతో ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య సమతౌల్యం పాటిస్తూ బడ్జెట్‌ను రూపొందించింది. మొత్తం 24.42 లక్షల కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌లోని వివిధ ప్రధాన రంగాలకు కేటా యింపులు కింది విధంగా ఉన్నాయి. నిత్యావసరాల ధరలను నియంత్రణలో ఉంచడానికి ఆపరేషన్‌ గ్రీన్స్‌ ఫథకాన్ని ప్రారంభించారు. ఫిషరీస్‌, పశుసంవర్ధక రంగాలను బలోపేతం చేయడానికి 10 వేల కోట్లతో రెండు నిధులను ఏర్పాటు చేశారు. స్వయం సహాయక బృందాలకు 75 వేల కోట్ల రుణాలను అందించ నున్నారు. గిరిజనుల కోసం అన్ని గిరిజన బ్లాకుల్లో ఏకలవ్య గురుకుల పాఠశాలలను 2022 నాటికి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు 5.97 లక్షల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 42 మెగా ఫుడ్‌ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. చేనేత రంగానికి 7148 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కొత్తగా 70 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వ్యవసాయం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ

భారతదేశం తన 75వ స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకొనే 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు జరిపింది. రైతులకు మద్దతు ధర అందించడానికి దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌లను ఇ-నామ్‌తో అనుసంధానించడానికి చర్యలు చేపట్టింది. 2018 మార్చి నాటికి మొత్తం 585 వ్యవసాయ మార్కెట్‌లను ఇ-నామ్‌తో అనుసంధానించనుంది. గ్రామీణ వ్యవసాయ మార్కెట్‌లలో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో 2 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఆహార తయారీ రంగానికి 1400 కోట్లు కేటాయించారు. వెదురు అభివద్ధికి 1290 కోట్లు కేటాయించారు. 2018-19 లో 11 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2017-18లో ఇది 10 లక్షల కోట్లుగా ఉంది.

ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద 8 కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్లు అందించనున్నారు. ప్రధాన మంత్రి సౌభాగ్య యోజన కింద దేశంలోని 4 కోట్ల మంది పేదలకు ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్‌ అందిస్తారు. బడ్జెట్‌లో ఈ పథకానికి 16 వేల కోట్లు కేటాయించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా 2 కోట్ల మరుగుదొడ్లను నిర్మించనున్నారు.

అందరికి ఇళ్లు

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఈ ఏడాది 51 లక్షల ఇళ్లను నిర్మించనున్నారు. ‘2022 నాటికి అందరికి ఇళ్లు’ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. జాతీయ గ్రామీణ జీవనాధార మిషన్‌కు కేటాయింపులు 5750 కోట్లకు పెంచారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకు 2600 కోట్లు కేటాయించారు. మొత్తంగా 2018-19 బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వ్యవసాయానికి, మెరుగైన జీవనాన్ని అందించడానికి, గ్రామీణ మౌలిక వసతులు కల్పించడానికి 14.34 లక్షల కోట్లను కేటాయించింది.

ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత

పేదల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 10 కోట్ల కుటుంబాలకు దీని వలన ప్రయోజనం కలుగుతుంది. ఆయుష్మాన్‌ భారత్‌ కింద రెండు ప్రధాన పథకాలను ప్రకటించారు. ఇందులో మొదటిది జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం. దీని కింద మధ్య స్థాయి, ఉన్నత స్థాయి ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందడానికి కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకూ కవరేజి లభించనుంది. ఈ పథకానికి అవసరమయ్యే బీమాను కేంద్ర-రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో భరించనున్నాయి. దీనివల్ల సుమారు 50 కోట్ల మంది లబ్ది పొందనున్నారు. ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య పథకాల్లో ఇదే అతిపెద్దది. ఈ పథకానికి 2 వేల కోట్లు కేటాయించారు. క్షయ (టిబి) రోగులకు చికిత్స కాలంలో పౌష్టికాహారం అందించ డానికి నెలకు 500 రూపాయలు అందించనున్నారు. దేశ వ్యాప్తంగా 24 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. 2018-19 బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 1.38 లక్షల కోట్లు కేటాయించారు.

ఆరోగ్య, విద్యా సెస్‌ను ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి 4 శాతానికి పెంచారు. లక్షకు పైబడ్డ మూలధన లాభాలపై 10 శాతం పన్నును ప్రవేశ పెట్టడంతో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 3 లక్షల కోట్ల ముద్రా రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 80 వేల కోట్ల రూపాయలను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం ఉన్న మూడు సాధారణ బీమా సంస్థలు నేషనల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఎస్యూరెన్స్‌, ఓరియంటల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌లను విలీనం చేసి స్టాక్‌మార్కెట్లో లిస్టు చేయనున్నారు. 56 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. పౌర విమానయాన శాఖకు బడ్జెట్‌లో 6603 కోట్ల రూపాయలు కేటాయించారు. 4470 కోట్లతో వివిఐపిల కోసం రెండు కొత్త విమానాలను కొనుగోలు చేయనున్నారు.

రక్షణ రంగం

రక్షణ రంగంలో స్వావలంబన సాధించడంపై బడ్జెట్‌లో కేంద్రం దష్టి పెట్టింది. 2018-19కి గానూ రక్షణ రంగానికి బడ్జెట్‌లో 2.95 లక్షల కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో ఇది 12.1 శాతం. గత ఏడాది కన్నా ఇది 7.81 శాతం ఎక్కువ. రక్షణ బడ్జెట్‌లో మూలధన వ్యయం 99.9 వేల కోట్లు. దీనితో నూతన ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు కొనుగోలు చేస్తారు. మిగిలినది రెవెన్యూ వ్యయం. దీన్ని వేతనాలు, సైనిక వ్యవస్థల నిర్వహణకు ఉపయోగిస్తారు.

సబ్సిడీలు

సబ్సిడీల దుబారాను అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో బడ్జెట్‌లో సబ్సిడీల వాటా 15 శాతానికి తగ్గింది. మొత్తం 2,64,336 కోట్ల రూపాయల సబ్సిడీలలో సింహభాగం ఆహార సబ్సిడీదే. ఆహార సబ్సిడీ 1,69,323 కోట్లు కాగా తర్వాతి స్థానంలో 70,080 కోట్లతో ఎరువులు ఉన్నాయి. పెట్రోలియం సబ్సిడీ 24,993 కోట్లుగా ఉంది.

రైల్వే బడ్జెట్‌

2018-19 బడ్జెట్‌లో రైల్వేకు మూలధన వ్యయంగా రూ.1,46,500 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌ సవరించిన అంచనాలకంటే ఇది 22 శాతం ఎక్కువ. 18 వేల కిలోమీటర్ల మేర రెండు, మూడు, నాలుగు లైన్ల మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. 5 వేల కిలోమీటర్ల మేర గేజ్‌ మార్పిడి చేయనున్నారు. 600 రైల్వే స్టేషన్లను ఆధునీకరించ నున్నారు. 2018-19 లో 12 వేల వ్యాగన్లు, 5160 ప్యాసిజర్‌ కోచ్‌లు, 700 రైలు ఇంజిన్లు తయారు చేయనున్నారు. ముంబైలోని లోకల్‌ రైలు నెట్‌వర్క్‌ను 11 వేల కోట్లతో 90 కి.మీ.ల ట్రాక్‌ను డబ్లింగ్‌ చేయనున్నారు.

బడ్జెట్‌లో డిజిటల్‌ ఇండియా కార్యక్రమానికి 3,073 కోట్ల రూపాయలను కేటాయించారు. కొత్త బడ్జెట్‌లో రాష్ట్రపతి జీతాన్ని 5 లక్షలకు, ఉపరాష్ట్రపతి జీతాన్ని 4 లక్షలకు, గవర్నర్‌ జీతాన్ని 3.5 లక్షలకు పెంచారు. 2018-19 ద్రవ్యలోటు 3.3 శాతంగా ఉంటుందని ఆర్ధిక మంత్రి అంచనా వేశారు.

పన్ను వసూళ్లు

2018-19 లో పన్ను వసూళ్లను 22.71 లక్షల కోట్లుగా బడ్జెట్‌లో అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా వస్తువులు సేవల పన్ను ద్వారా 7.43 లక్షలు వసూలు కానున్నాయి. కార్పొరేషన్‌ పన్ను ద్వారా 6.2 లక్షల కోట్లు, ఆదాయపు పన్ను ద్వారా 5.29 లక్షల కోట్లు లభించనున్నాయి. 2017 డిసెంబర్‌ నాటికి భారత విదేశీ ఎగుమతులు 223.5 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతులు ఏప్రిల్‌- డిసెంబర్‌ 2017లో 277.9 బిలియన్‌ డాలర్లకు చేరాయి. భారత విదేశీ మారక నిల్వలు 412 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఏప్రిల్‌-డిసెంబర్‌ 2017లో ఎఫ్‌డీఐలు 19.6 బిలియన్లుగా నమోదయ్యాయి. భారత కరెంటు ఖతాలోటు 3.8 బిలియన్లుగా ఉంది.

ఆర్థిక వృద్ధి, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా..

మొత్తం మీద మోది నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి దేశాన్ని ఆర్ధికంగా పటిష్టం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజాకర్షక పథకాలు ఉంటాయని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. కాని ప్రజాకర్షక పథకాలనేవి తాత్కాలిక ప్రయోజనాలనే చేకూరుస్తాయి. నిజానికి ఇవి రాజకీయ నాయకుల స్వార్థానికి తార్కాణం. అటువంటి తాత్కాలిక ఉపశమనాలను కాకుండా దీర్ఘకాలంలో భారత ఆర్ధిక వ్యవస్థకు మేలు చేసే చర్యలను మోది ప్రభుత్వం చేపట్టింది.

2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు కట్టించడం, దేశంలోని పేదలకు ఉచిత కార్పొరేట్‌ వైద్యం అందించడం, రైతులకు మెరుగైన ఆదాయం అందించడం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను, శ్లాబులను సవరించక పోవడంతో కొందరు అసంతృప్తికి లోనయ్యారు. కాని ఇది తాత్కాలికమే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వస్తువులు సేవల పన్ను ఇప్పడిప్పుడే సత్ఫలితాలను ఇస్తోంది. కొత్తగా లక్షల మంది పన్ను పరిధిలోకి వచ్చారు. ఇది శుభశూచకం. ఎవరు ఎంతగా విమర్శించినా 2018-19 బడ్జెట్‌ ప్రజాశ్రేయస్సుకు మార్గాలను సుగమం చేయగలదు.

– ఆర్‌.సి.రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *