ఆజాద్‌ కశ్మీర్‌లో ఆజాదీ ఎంత?

ఆజాద్‌ కశ్మీర్‌లో ఆజాదీ ఎంత?

ఆజాద్‌ కశ్మీర్‌ అంటే స్వతంత్ర కశ్మీర్‌. పాకిస్తాన్‌ చేతుల్లో ఉన్న జమ్మూకశ్మీర్‌ భూభాగాన్ని పాకిస్తాన్‌ ఆజాద్‌ కశ్మీర్‌ అని పిలుచుకుంటుంది. అంటే దీని అర్థం భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌ ‘గులాం కశ్మీర్‌’ అని పాకిస్తాన్‌ అభిమతం.

తమాషా ఏమిటంటే ఆజాద్‌ కశ్మీర్‌లో ఆజాదీ లేదు. కశ్మీర్‌ అంతకన్నా లేదు. ఇది చాలా మందికి తెలియని నిజం. పాక్‌ గుప్పెట్లో ఉన్న భూభాగానికి ఆజాదీ అంటే స్వేచ్ఛలేదు. అది కశ్మీర్‌ అంతకన్నా కాదు. పాకిస్తాన్‌ గుప్పెట్లో ఉన్న భూభాగంలో గిల్గిత్‌, బల్తిస్తాన్‌లు కశ్మీర్‌ కాదు. అవి షియా జనాభా అధికంగా ఉండి, షీనా, బల్తీ వంటి భాషలు మాట్లాడే ప్రాంతాలు. కశ్మీర్‌ లోయకు అసలు వాటికి సంబంధమే లేదు. హురియత్‌ నేతలు పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు గిల్గిత్‌, బల్తిస్తాన్‌ నేతలను కలిసేందుకు ప్రయత్నిస్తే వారు నిర్మొహమాటంగా నిరాకరించారు.

పాకిస్తాన్‌ లెక్కల ప్రకారమే అది ‘ఆజాద్‌’. కశ్మీర్‌లో అంతర్భాగం కాదు. అందులో రెండు భాగాలున్నాయి. ఒకటి మీర్పూర్‌ డివిజన్‌. ఇందులో పూంఛ్‌, కోట్లీ, మీర్పూర్‌ జిల్లాలకు చెందిన ప్రజలు ఉంటారు. వీరు కశ్మీరీలు కారు. పుంఛీ, సుదన్‌ జమ్మూ ప్రాంతాలకు చెందిన వారికి కశ్మీర్‌కి సంబంధం లేదు. ఇక రెండో డివిజన్‌ ముజఫరా బాద్‌. ఇందులో కొన్ని కశ్మీరీ గ్రామాలున్నాయి. కానీ అక్కడి వారికి కశ్మీరీ భాష కూడా రాదు. అంటే దానికి కశ్మీరీదనానికి సంబంధమే లేదు. కాబట్టి ఆ భూభాగం ఆజాద్‌ కాదు, అది కశ్మీర్‌ కాదు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అసెంబ్లీలో కశ్మీరీ భాష మాట్లాడే సభ్యుడు ఒక్కడంటే ఒక్కడు ఉన్నాడు.

ఇక ఆజాద్‌ కశ్మీర్‌ అనే నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో చూద్దాం. ఇటీవలే పాకిస్తాన్‌లోకి ఆక్రమిత కశ్మీర్‌ ప్రధానమంత్రి షాహిద్‌ ఖకన్‌ అబ్బాసీ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఏర్పాటు చేసిన ఫ్యూచర్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ 2017 అనే సదస్సులో మాట్లాడుతూ ఆజాద్‌ కశ్మీర్‌ అంటే పాకిస్తాన్‌ అధీనంలోని కశ్మీరేనని. కశ్మీర్‌ ఏనాడూ స్వతంత్రంగా ఉండే అవకాశమే లేదని, అది పాకిస్తాన్‌ లోనే ఉండాలని అన్నాడు. కాబట్టి ఆజాదీ అన్న పేరు వాస్తవానికి గులామీగా అర్ధం చేసుకోవాలి.

అంతే కాదు. ఆక్రమిత కశ్మీర్‌కి ఒక అధ్యక్షుడు, ఒక ప్రధానమంత్రి ఉన్నారు. వారి కింద ఒక మంత్రివర్గం, 48 మంది సభ్యుల అసెంబ్లీ ఉంది. కానీ దాని సమావేశాలన్నిటికీ పాకిస్తాన్‌ ప్రధానమంత్రే అధ్యక్షత వహిస్తారు. ఆక్రమిత కశ్మీర్‌ ప్రభుత్వాన్ని పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి కార్యాలయమే నేరుగా నడిపిస్తుంది. అంతే కాదు. ఆజాద్‌ కశ్మీర్‌పై దాని అధ్యక్ష, ప్రధానమంత్రులకన్నా ఎక్కువ అధికారం ఇస్లామాబాద్‌లోని కశ్మీర్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శకి ఉంటుంది. వాస్తవానికి పోలీసులు, మిలటరీలు అక్కడ ప్రత్యక్షంగా పరిపాలనలో జోక్యం చేసుకుంటారు. వారి ఆజమాయిషీలోనే పాలన సాగుతుంది. మరో మాటలో చెప్పాలంటే అక్కడ ప్రధాన మంత్రి, అధ్యక్షుడు కేవలం కీలుబొమ్మ లన్నమాట. ఇక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నీటి వనరులన్నిటినీ పాక్‌ ప్రభుత్వం పంజాబ్‌కి మళ్లిస్తుంది. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును పూర్తిగా పంజాబ్‌ అవసరాలకు తరలిస్తారు. అంటే ‘ఆజాద్‌’ కశ్మీరీ ప్రజలకు తమ నీటిని, విద్యుత్తును కూడా వాడుకునే స్వేచ్ఛ లేదన్నమాట. కశ్మీర్‌కు ఆజాదీ కోరుకునే మన హురియత్‌ నేతలు, వేర్పాటువాదులు ఈ ఇనుప చెరలోకే కశ్మీరీ యువతను తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారన్న మాట! ఈ విషయాన్ని వారు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే వారికి అంత మంచిది. కావున ఆజాద్‌ కశ్మీర్‌కి ఆజాదీ లేదు. అది కశ్మీరూ కాదు.

–  సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *