అపరాజితుడు

అపరాజితుడు

పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలు చేసిన రోజు కొన్ని మూకలు కన్నీరు కార్చాయి. కరుణరసాన్ని ఒలకబోశాయి. చంపడం తప్పని బౌద్ధ సూక్తులు బోధించాయి. అఫ్జల్‌ గురుకు తన కూతురుని డాక్టర్‌గా చూడాలని ఉండేదని సెంటిమెంట్‌తో కొట్టే ప్రయత్నమూ చేశాయి. ఇప్పటికీ అఫ్జల్‌ గురు కుటుంబీకులు మరిచిపోయినా ఈ మూకలు మాత్రం తప్పనిసరిగా ఆయనకు ‘తద్దినం’ పెడుతూనే ఉన్నాయి.

పాకిస్తాన్‌ కంచంలో కశ్మీర్‌ను వడ్డించేందుకు లబలబలాడిపోతున్న వాళ్లకు, వాళ్ల హక్కుల కోసమే గొంతులు చించుకునే వాళ్లకు అఫ్జల్‌గురుపై, ఆయన బిడ్డపై అవ్యాజ ప్రేమ కారిపోతూ ఉంటుంది.

కానీ వీళ్లకు అపరాజిత గురించి తెలుసా? అపరాజిత పుట్టక ముందే వాళ్ల నాన్న జమ్మూ కశ్మీర్‌ను కాపాడేందుకు కార్గిల్‌ కొండలపై ప్రాణాలర్పించాడు. అపరాజిత తన తండ్రిని చూడనేలేదు. ఆయన పుట్టబోయే తన బిడ్డ గురించి ఏం కలలు కన్నాడో ఎవరికీ తెలియదు. తండ్రి కార్గిల్‌ కొండలపై అమరుడైన మూడు నెలల తరువాత అపరాజిత పుట్టింది. తాను చూడని తండ్రి గురించి అపరాజిత మనసులో ఏమనుకుంటుందో కూడా ఎవరికీ తెలియదు.

ఏడేళ్ల వయసులో స్కూలు మ్యాగజైన్‌లో అపరాజిత తన తండ్రి గురించి ఒక కవిత రాసింది. తన తండ్రి బాటలోనే పయనించాలని ఉందని రాసింది. అఫ్జల్‌ గురు కుమార్తె గురించి రీములకు రీములు, ఠావులకు ఠావులు రాసిన వారికి అపరాజిత గురించి తెలియదు. వాళ్లు అక్షరం ముక్క కూడా రాయరు.

అయితే అపరాజిత పేరులోనే ఆమె తల్లిదండ్రుల దక్పథం దాగుంది. ఆయన యుద్ధంలో చనిపోయినా భారత్‌ గెలిచింది. ఆ అపరాజేయ తత్వమే ఆమె పేరుగా మారింది. భర్త చనిపోయినా, పుట్టెడంత విషాదం ఉన్నా అపరాజిత తల్లి చారులత కన్నీరు పెట్టుకోలేదు. ఆమెదీ అదే అపరాజేయ తత్వం.

ఇంతకీ ఈ అపరాజిత తండ్రి ఎవరో తెలుసా ? అపరాజిత తండ్రి పేరు పద్మపాణి ఆచార్య. ఆ పేరు వింటేనే కార్గిల్‌ విజయం గుర్తుకు వచ్చి, ఒళ్ళు పులకరిస్తుంది. జమ్మూకశ్మీర్‌ను కబళించేందుకు, సరిహద్దు రేఖల్ని మార్చేసేందుకు పాకిస్తాన్‌ పన్నిన పన్నాగమే కార్గిల్‌ యుద్ధం. ఈ యుద్ధంలోనే పద్మపాణి ఆచార్య తనను తాను దేశమాత కోసం సమర్పించుకున్నారు.

జూన్‌ 28, 1999 నాడు కంపెనీ కమాండర్‌ మేజర్‌ పద్మపాణి ఆచార్యకు లోన్‌ హిల్‌, టోలోలింగ్‌ లను శత్రువునుంచి చేజిక్కించుకునే బాధ్యతను అప్పచెప్పారు. శత్రువు కొండపైకి ఎక్కే దారి మొత్తం మందుపాతరలు పరిచాడు. పై నుంచి భీకరంగా కాల్పులు జరుపుతున్నాడు. ఈ తూటాల వానలోనే పద్మపాణి ఆచార్య, ఆయన దళం కొండపైకి ఎక్కింది. శత్రువుతో పోరాడింది. తాను గాయపడినా, రక్తం కారుతున్నా పద్మపాణి ఆచార్య లెక్కచేయకుండా సైనికులను ముందుకు వెళ్లమని ఆదేశించాడు. తాను కూడా గుళ్ల వర్షం కురిపిస్తూ ముందుకు సాగాడు. శత్రువు బంకర్‌లోకి గ్రెనేడ్లు విసిరి వారిని అంతం చేశాడు. ఆ తరువాత యుద్ధ భూమిలోనే ఆఖరి శ్వాస విడిచాడు పద్మపాణి ఆచార్య. ఆయన సాహసోపేత పోరాటం, సర్వోచ్చ త్యాగం చూసి కతజ్ఞ భరతజాతి ఆయనకు మహావీర చక్ర నిచ్చి తనను తాను సత్కరించుకుంది.

అంతకు వారం రోజుల ముందే ఫోన్‌లో పద్మపాణి కుటుంబ సభ్యులు ఆయన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఆ తరువాత పద్మపాణి ఆచార్య తన తండ్రికి రాసిన లేఖలో అత్యున్నత ఆదర్శం కోసం ప్రాణం ఇవ్వడం కన్నా గొప్ప విషయం ఏముందని రాశాడు. దేశభక్తి, భావోద్వేగం కలగలిసిన ఆ లేఖ ఎవరినైనా కదిలించివేస్తుంది.

ఆయన ఆలోచనలు అపరాజితం. ఆయన కుటుంబ సభ్యుల ఆత్మస్థైర్యం అపరాజితం. ఆ కుటుంబంలో పుట్టిన అమ్మాయికి అపరాజిత అన్న పేరు పెట్టడంలో ఆశ్చర్యం ఏముంది.

– ప్రభాత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *