అదీ జాతీయవాదం అంటే !

అదీ జాతీయవాదం అంటే !

బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌

ఈ దేశంలో నేను దేశభక్తుడిని కాదు అనేవారు లేరు. కేరళలో వరదలు వచ్చినపుడు లేదా ఉత్తర భారత్‌లో వరదలు వచ్చినపుడు నేను ఒకరోజు జీతం ఇచ్చానంటారు. అంటే మనం దేశభక్తిని ప్రదర్శించు కోడానికి వరదలు రావాలా? ప్రమాదాలు రావాలా? అలా కాదు, మన సాధారణ జీవితంలో దేశభక్తి ప్రతిబింబించాలి. దైనందిన వ్యవహారంలో దేశభక్తి తొణికిసలాడాలి అన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌.

ప్రముఖ జాతీయవాద రచయిత డా.పి.భాస్కర యోగి భాస్కరవాణి పేరుతో రాసిన వ్యాసాల సంకలనం ‘ఫోర్త్‌ ఎస్టేట్‌’ గ్రంథాన్ని సెప్టెంబర్‌ 24న ఆయన ఆవిష్కరించారు. భాగ్యనగర్‌లోని సుందరయ్య కళాభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు.

‘జాతీయభావాలను కేంద్రం చేసుకొని వ్యాసాలు రాస్తున్నవారు భాస్కరయోగి. అనేకమంది ఆలోచన లను ప్రభావితం చేసేలా ఈ వ్యాసాలుంటున్నాయి. జాతీయ జీవనం, జాతీయ భావన అనేవి మన దేశానికి కేంద్ర బిందువు. అనేక రంగాలలో ఈ దేశాన్ని విజయవంతంగా నడిపిస్తున్నవారు జాతీయ భావాలు నిండినవారే. జాతీయవాదంలో స్వదేశ భక్తి, స్వధర్మ నిష్ఠ, స్వాభిమానం అనే మూడు అంశాలు ప్రధానం అన్నారు. ఉద్వేగభరితంగా సాగిన రామ్‌మాధవ్‌ ప్రసంగంలో పలు జాతీయాంశాలు ప్రస్తావనకు వచ్చాయి…

‘130 కోట్ల ప్రజలు నావాళ్లు అనే భావన కావాలి. కాశ్మీర్‌ మనది. దాంతోపాటు కాశ్మీరీ లందరూ మనవారే. అక్కడ కొందరు విదేశీ ప్రభా వంతో దేశ వ్యతిరేకులుగా ఉండవచ్చు. అలాంటి వారిని కూడా దేశభక్తులుగా మార్చే బాధ్యత మనపైనే ఉన్నది. ఈ దేశ ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలనే ఏకైక సంకల్పంతో నేటి కేంద్రప్రభుత్వం పనిచేస్తున్నది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల ప్రజల ఉన్నతి కోసం పనిచేసే ప్రభుత్వం ఉన్నది. దేశభక్తి, దేశ ప్రజల హితం ఎదుట రాజకీయాలు లేవు.

స్వధర్మ నిష్ఠ అనేది ముఖ్యమైనది. జాతీయ భావన అంటే రాజకీయపరమైనది గాదు. ఇది ఆధ్యాత్మిక భావాలతో ప్రేరేపితమైన దేశం. ఉత్తరం నుండి దక్షిణం వరకు కలిపి ఉంచేది ధర్మమే కాని రాజకీయ భావనలు కావు. ధర్మం అంటే జీవన విలువలు. ఇవి శాశ్వతమైనవి. కాలానికి అతీతం. ఈ జీవన విలువ లను మనకు అందించేవే రామాయణ, భారతాలు, భగవద్గీత గ్రంథాలు. అవి అందించే జీవన విలువలను సమాజంలో నింపడం కూడా జాతీయవాదమే అవుతుంది’ అని రామ్‌మాధవ్‌ వివరించారు.

‘గోరా నవలను రవీంద్రనాథ టాగూర్‌ రచించారు. బ్రిటిష్‌వారు మన జీవన విలువలను అణగదొక్కడానికి వారి సంస్కృతిని ఏ విధంగా మనపై రుద్దారో ఈ నవలలో టాగూర్‌ వర్ణించారు. బ్రిటిష్‌వారిచే అణచివేత నుండి ఇద్దరు యువకులు ఎలా బయటపడ్డారో ఈ నవలలో వివరించారు. ఇది స్వాభిమానానికి సంబంధించిన ఆవిష్కరణ. అలాంటి స్వాభిమానం కలిగినదిగా మన సమాజాన్ని నిలబెట్టాలి. అటువంటి చిత్తశుద్ధితో పనిచేసే జాతీయవాద ప్రభుత్వం నేడు మనకున్నది.

స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొ న్నది. ఇది ముఖ్యంగా మహిళల స్వాభిమానానికి సంబంధించిన విషయం. ఇంతకుముందటి వారు అనేక సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా మరుగుదొడ్ల నిర్మాణం గురించి పట్టించుకోలేదు. ఆ సమస్య పరిష్కారానికి నేటి ప్రభుత్వం ముందుకొచ్చింది. స్వచ్ఛభారత్‌ కార్యక్రమం పట్ల మహిళలకు అవ గాహన పెరిగింది. ఇది స్వాభిమానానికి నిదర్శనం’ అన్నారు రామ్‌మాధవ్‌.

‘ఆయుష్మాన్‌ భారత్‌ పథకం రాజకీయపరమైన ప్రచారం కోసం కాదు. ఆరోగ్యానికి సంబంధించినది. మన దేశంలోని 50 కోట్లమంది పేదవారికి ఇది వర్తిస్తుంది. అందరికీ సమయానికి మెరుగైన వైద్యం అందాలనేదే ఈ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ఉద్దేశం. ఏ వ్యక్తి కూడా హాస్పిటల్‌ సౌకర్యానికి సుదూరంగా ఉండిపోకూడదు. సరైన వైద్యసదుపాయం గ్రామాల్లోకి కూడా విస్తరించాలి. ఇదే ఈ పథకం లక్ష్యం. ఇదే స్వాభిమానం, జాతీయవాదం.

ఈ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి నోట్ల రద్దు వంటి కార్యక్రమం తీసుకోవాల్సి వచ్చింది. తప్పనిసరి అయింది. అప్పటివరకు దేశంలో 30 శాతం ఉన్న నల్లధనం నేడు సున్న శాతానికి వచ్చింది. ఇదీ స్వాభిమానం. జాతీయవాదం ఆధారంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్నం నేటి ప్రభుత్వం చేస్తున్నది.

ఈ జాతీయవాద ప్రభంజనాన్ని ఎదుర్కోలేక జాతి వ్యతిరేకవాదులందరూ ఒక జెండా ఎజెండా లేకుండా, జాతీయవాదులను దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో ఒక కూటమిగా తయారవుతున్నారు. మన పార్టీలు వేరుకావచ్చు. కాని జాతీయవాదం విషయంలో అందరిది ఒకే మాటగా ఉండాలి. 2013లో మన్‌మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు పాకిస్తాన్‌ ప్రధానిగా ఉన్న నవాజ్‌షరీఫ్‌ ‘భారత ప్రధాని ఆడవారిలాగ ఏడుస్తూ ఉంటాడు’ అంటూ అవమాన కరంగా మాట్లాడారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి దీన్ని సీరియస్‌గా తీసుకుంది. ఆ వ్యాఖ్యలను ఖండించింది. ఇది కేవలం మన్‌మోహన్‌సింగ్‌కి సంబంధించిన విషయం కాదు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న 130 కోట్లమందికి అవమానం కలిగించే విషయం అని బిజెపి భావించింది. నవాష్‌షరీఫ్‌కు గట్టిగా సమాధానమిచ్చింది. కాని నేడు కాశ్మీర్‌లో పాకిస్తాన్‌ చేస్తున్న దురాగతాలను సమర్థంగా ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వంపై నిన్నగాక మొన్న మిలటరీ దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇమ్రాన్‌ మాటలను మన ప్రతిపక్షంవారు సమర్థిస్తూ.. ‘అవును ఇది మోదీ బలహీనత’ అంటున్నారు. జాతీయభావన లేని మన ప్రతిపక్షం తీరు ఇది. స్వదేశ భక్తి, స్వధర్మ నిష్ఠ, స్వాభిమానం ఏ జాతికైనా అవసరం. నేడు దీని గురించే చర్చ జరుగుతున్నది.

దేశ విభజన జరిగిన రోజున అరవిందమహర్షి ఎంతో విశ్వాసంతో ‘ఈ రోజు మనందరం బాధలో ఉన్నాం, కాని ఈ బాధ శాశ్వతం కాదు. త్వరలోనే భారత భాగ్యభానుడు ఉదయించనున్నాడు. ఈ తేజస్సు భారతదేశాన్నే కాదు, ఆసియా ఖండాన్ని, సమస్త ప్రపంచాన్ని వెలుగుతో నింపనున్నది. ఇది దైవ నిర్ణయం’ అన్నారు. అందుకై మనం పనిచేద్దాం’ అని సభికుల హర్షధ్వానాల మధ్య రామ్‌మాధవ్‌ చెప్పారు.

మేధావుల వేదిక ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథ రచయిత డా.పి.భాస్కర యోగితో పాటు, ఆత్మీయ అతిథిగా జాతీయ సాహిత్య పరిషత్‌ అధ్యక్షులు డా.కసిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రజ్ఞాభారతి చైర్మన్‌ డా.టి.హనుమాన్‌ చౌదరి అధ్యక్షత వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *