మహిళా విజయనామ సంవత్సరం -2018

మహిళా విజయనామ సంవత్సరం -2018

క్రీడారంగంలో భారత మహిళలు దూసుకుపోతున్నారు. ఆట ఏదైనా తమకు తిరుగేలేదని చాటుకొంటూ అబ్బురపరచే విజయాలు సాధిస్తున్నారు. 2018 సంవత్సరాన్ని భారత మహిళామణులు విజయవంతంగా ముగించడమే కాదు, కొత్త సంవత్సరంలో సరికొత్త విజయాల కోసం ఉరకలేస్తున్నారు.

ఇద్దరూ ఇద్దరే..

బ్యాడ్మింటన్‌ మహిళల విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ పలు చిరస్మరణీయ విజయాలతో వారేవ్వా అనిపించుకొన్నారు. గాయాల నుంచి తేరుకొని, ప్రతికూల పరిస్థితులను అధిగమించిన సైనా ఏకంగా కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతకంతో పాటు ఆసియాక్రీడల కాంస్య పతకాన్ని సైతం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది.

ఇక తెలుగు తేజం పీవీ సింధు మాత్రం సిల్వర్‌ క్వీన్‌ స్థాయి నుంచి గోల్డెన్‌ స్టార్‌ స్థాయికి చేరుకో గలిగింది. గత ఏడాది పొడుగునా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆసియా క్రీడలతో పాటు పలు సూపర్‌ సిరీస్‌ టోర్నీల్లో ఏకంగా ఐదు రజత పతకాలు సాధించింది.

అంతేకాదు, చైనా వేదికగా ముగిసిన సీజన్‌ ముగింపు ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో సింధు విశ్వరూపమే ప్రదర్శించింది. గ్రూప్‌ లీగ్‌ నుంచి ఫైనల్స్‌ వరకూ తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా బంగారు పతకం అందుకొంది. ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ నంబర్‌వన్‌ తాయ్‌ జు ఇంగ్‌, జపాన్‌ జోడీ నజోమీ ఒకుహర, యమగుచి, ప్రపంచ మాజీ చాంపియన్‌ ఇంటానెన్‌ రచనోక్‌ లాంటి ప్రపంచ మేటి ప్లేయర్లను మట్టికరిపించి తానేమిటో నిరూపించుకొంది. ఫైనల్‌ ఫోబి యాను అధిగమించడమే కాదు, విజేతగా స్వర్ణ పతకం అందు కోగలనని తొలిసారిగా సింధు చాటి చెప్పింది.

మేరీ’గోల్డ్‌’

ప్రపంచ వ్యాప్తంగా భారత మహిళలకు గుర్తింపు తెచ్చిన మేరీకోమ్‌ గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది. ప్రపంచ అమెచ్యూర్‌ మహిళా బాక్సింగ్‌లో ఆరుసార్లు విశ్వవిజేతగా బంగారు పతకాలు సాధించిన ఘనత మేరీకోమ్‌కు మాత్రమే దక్కుతుంది. వరుసగా ఏడు ప్రపంచకప్‌ పోటీల్లో ఆరు స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించిన అరుదైన, అసాధారణ రికార్డు కూడా మేరీ పేరుతోనే ఉంది.

న్యూఢిల్లీ వేదికగా ముగిసిన 2018 మహిళా ప్రపంచ బాక్సింగ్‌ మహిళల 48 కిలోల విభాగం ఫైనల్లో ఉక్రెయిన్‌ బాక్సర్‌ హన్నాను 5-0తో చిత్తు చేయటం ద్వారా… మేరీ ఆరో బంగారు పతకం సొంతం చేసుకొంది.

మూడేళ్ల విరామం తర్వాత

లండన్‌ వేదికగా జరిగిన 2012 ఒలింపిక్స్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా బాక్సింగ్‌లో కాంస్య పతకం సాధించిన మేరీకోమ్‌ 2010 గాంగ్జావో ఆసియా క్రీడల్లో కాంస్యం, 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన తర్వాత బాక్సింగ్‌ నుంచి విరామం తీసుకొంది. అప్పటికే ముగ్గురు బిడ్డల తల్లిగా ఓవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మూడేళ్లపాటు బాక్సింగ్‌కు దూరమైన మేరీ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యింది. అంతేకాదు భారత బాక్సింగ్‌ పరిశీలకురాలిగానూ బాధ్యతలు తీసుకొంది. ఇలా పలురకాల కారణాలతో బాక్సింగ్‌కు దూరంగా ఉన్నా, ఫిట్‌నెస్‌ను మాత్రం నిర్లక్ష్యం చేయకుండా సాధన కొనసాగిస్తూనే వచ్చింది.

ప్రపంచ అమెచ్యూర్‌ బాక్సింగ్‌లో మాత్రమే కాదు, ఆసియా బాక్సింగ్‌లోనూ ఐదు బంగారు పతకాలు సాధించడం ద్వారా మేరీ తానేమిటో నిరూపించుకుంది.

2018 న్యూఢిల్లీ ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో సైతం మేరీకోమ్‌- మేరీగోల్డ్‌గా నిలిచింది. ప్రపంచ మహిళా బాక్సింగ్‌ చరిత్రలోనే ఆరు ప్రపంచ స్వర్ణాలు, ఓ రజతంతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించిన ఏకైక బాక్సర్‌గా రికార్డు నెలకొల్పింది.

హర్మన్‌ థండర్‌- మిథాలీ వండర్‌

టీ-20 మహిళా ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీలో శతకం సాధించిన భారత తొలిమహిళగా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ చరిత్ర సృష్టించింది. కరీబియన్‌ ద్వీపాలు వేదికగా ముగిసిన 2018 మహిళా టీ-20 ప్రపంచకప్‌ టోర్నీ గ్రూప్‌- బీ ప్రారంభ లీగ్‌ పోటీలో న్యూజిలాండ్‌ బౌలర్లను హర్మన్‌ ప్రీత్‌ ఓ ఆటాడుకొంది.

కేవలం 51 బాల్స్‌లోనే 7 బౌండ్రీలు, 8 సిక్సర్లతో సుడిగాలి సెంచరీ చేసి 103 పరుగులు సాధించింది. కేవలం 49 బాల్స్‌లోనే వంద పరుగులు సాధించిన హర్మన్‌ ప్రీత్‌ మహిళా టీ-20 క్రికెట్లో మూడో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసింది. జెమీమా రోడ్రిగేస్‌తో కలసి నాలుగో వికెట్‌కు 134 పరుగులు జోడించింది. అంతేకాదు న్యూజిలాండ్‌ ప్రత్యర్థిగా భారత్‌ 194 పరుగులతో అత్యధిక స్కోరు సాధించడం మరో విశేషం.

వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో 171 పరుగులు సాధించిన హర్మన్‌ ప్రీత్‌.. ఇప్పుడు టీ-20 ప్రపంచకప్‌లో సైతం శతకం బాదడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

మిథాలీ పరుగుల జోరు

భారత ఎవర్‌ గ్రీన్‌ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ ధూమ్‌ ధామ్‌ టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలను అధిగమించి, టీ-20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచింది.

2018 మహిళా టీ-20 ప్రపంచకప్‌ గ్రూప్‌-బీ లీగ్‌లో ఆడిన మూడురౌండ్ల మ్యాచ్‌ల్లో మిథాలీ రెండు హాఫ్‌ సెంచరీలతో అత్యధిక పరుగుల రికార్డు సాధించింది. గయానా నేషనల్‌ స్టేడియం వేదికగా ఐర్లాండ్‌తో ముగిసిన మూడోరౌండ్‌ పోటీలో మిథాలీ 56 బాల్స్‌లో 51 పరుగులు సాధించింది. మొత్తం 2వేల 283 పరుగులు సాధించి, 2వేల 207 పరుగుల రోహిత్‌ శర్మ, 2వేల 102 పరుగుల విరాట్‌ కొహ్లీల రికార్డును అధిగమించింది. భారత టీ-20 క్రికెట్‌ పురుషుల, మహిళల విభాగాలలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ నిలిచింది.

ఆసియా క్రీడల్లో..

జకార్తా ఆసియా క్రీడల్లో భారత్‌ గెలుపొందిన మొత్తం 15 స్వర్ణ పతకాలలో అధికభాగం అసోం, బెంగాల్‌, ఒడిషా, హర్యానా, గుజరాత్‌, పంజాబ్‌, కేరళ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అథ్లెట్లే సాధించడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

బెంగాల్‌ రాష్ట్రంలోని జల్పాయ్‌గురికి చెందిన స్వప్న బర్మన్‌ ఏడు అంశాల సమాహారమైన హెప్టాథ్లాన్‌లో బంగారు పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత క్రీడా చరిత్రలోనే ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా నిలిచింది.

ఇక అసోం రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల రన్నర్‌ హిమదాస్‌ మహిళల 400 మీటర్ల పరుగులో రజతం, మిక్సిడ్‌ రిలేలో రజతం, మహిళల 400 మీటర్ల రిలేలో బంగారు పతకాలు సాధించి సంచలనం సష్టించింది. ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన హిమాదాస్‌ ఏకంగా మూడు పతకాలతో దేశానికే గర్వకారణంగా నిలిచింది.

ఒడిషా ఎక్స్‌ప్రెస్‌ ‘ద్యుతీచంద్‌’

ఒడిషా రాష్ట్రంలోని ఓ చేనేత కుటుంబానికి చెందిన ద్యుతీచంద్‌ సైతం మహిళల 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు అంశాలలో రజత పతకాలు సాధించి తనకు తానే సాటిగా నిలిచింది. 20 సంవత్సరాల తర్వాత 100, 200 మీటర్ల పరుగులో భారత్‌కు జంట రజతాలు సాధించి పెట్టింది. గుజరాత్‌లోని గిరిజన జిల్లా డంగ్‌కు చెందిన సరిత గయక్వాడ్‌ మహిళల 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచింది.

ఆల్‌-ఇన్‌-వన్‌ మనుబాకర్‌

ఇక కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల షూటింగ్‌ 10 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ షూటింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన మనుబాకర్‌ వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. హర్యానాలోని జాజ్జర్‌ జిల్లా గోరియా గ్రామంలో జన్మించిన మనుకు బాల్యం నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. బాక్సింగ్‌, టెన్నిస్‌, స్కేటింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో పతకాలు సాధించిన మను. ఆ తర్వాత షూటింగ్‌ వైపు తన దృష్టిని మళ్లించింది.

గాడల్‌ జరాలో ముగిసిన ప్రపంచ షూటింగ్‌ పోటీల టీమ్‌, వ్యక్తిగత విభాగాలలో బంగారు పతకాలు సాధించడం ద్వారా భారత సీనియర్‌ షూటింగ్‌ జట్టులోకి దూసుకొచ్చిన మను బాకర్‌.. 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌ వ్యక్తిగత విభాగంలో సైతం స్వర్ణ పతకం సాధించి తనకు తానే సాటిగా నిలిచింది. ప్రపంచ షూటింగ్‌ పోటీలలో సైతం సరికొత్త రికార్డు నమోదు చేసింది.

క్రికెట్‌, బాక్సింగ్‌, షూటింగ్‌, బ్యాడ్మింటన్‌, ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ క్రీడలు ఏవైనా భారత మహిళలు అసాధారణంగా రాణించిన సంవత్సరంగా 2018 చరిత్రలో మిగిలిపోతుంది.

– క్రీడా కృష్ణ , 8466864969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *