వారసుడొచ్చాడు..!

వారసుడొచ్చాడు..!

భారత క్రికెట్లో విరాట్‌ పర్వానికి తెరలేచింది. మూడు పదుల వయసులోనే క్రికెట్‌ మూడు ఫార్మాట్లలోనూ విరాట్‌ కొహ్లీ పరుగుల మోత మోగిస్తూ తనకు తానే సాటిగా నిలుస్తున్నాడు. టెస్ట్‌, వన్డే క్రికెట్లో ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా స్థానం సంపాదించి మాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌తోనే ‘వారేవ్వా!’ అనిపించుకొన్నాడు.

మాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ క్రికెట్‌కు వీడ్కోలు తీసుకొన్న సమయంలో అతని లాంటి మరో ఆటగాడి కోసం ఎన్ని దశాబ్దాలపాటు వేచిచూడాలో అంటూ అప్పట్లో అభిమానులు నిట్టూర్పు విడిచారు. అయితే… నేనున్నానంటూ ఢిల్లీ డైనమైట్‌ విరాట్‌ కొహ్లీ భారత క్రికెట్లోకి దూసుకొచ్చాడు. సచిన్‌ ఆటను, రికార్డులను చూస్తూ ఎదిగిన కొహ్లీ ఇప్పుడు తన అభిమాన ఆటగాడి రికార్డులను అధిగమించడమే కాదు, మాస్టర్‌కు తానే తగిన వారసుడనని నిరూపిస్తున్నాడు.

త్రీ-ఇన్‌-వన్‌

ఆధునిక క్రికెట్లో మనకు రెండు రకాల క్రికెటర్లు కనిపిస్తారు. ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్‌ క్రికెట్‌కు మాత్రమే సరిపడే చతేశ్వర్‌ పూజారా లాంటి క్రికెటర్లు ఓ రకమైతే; కేవలం వన్డే, టీ-20 ఫార్మాట్లలో మాత్రమే చెలరేగిపోయే రోహిత్‌శర్మ లాంటి ఆటగాళ్లు రెండో రకం. అయితే… టెస్ట్‌, వన్డే, టీ-20 అన్న తేడా లేకుండా ఒకేవిధంగా రాణించే మూడోరకం త్రీ-ఇన్‌-వన్‌ క్రికెటర్‌ విరాట్‌ కొహ్లీ మాత్రమే.

భారత్‌కు జూనియర్‌ ప్రపంచకప్‌ అందించడం ద్వారా సీనియర్‌ క్రికెట్లోకి దూసుకొచ్చిన విరాట్‌ తన 30వ పుట్టినరోజుకు ముందే టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో కలిపి మొత్తం 60కి పైగా శతకాలు బాదాడంటే ఆశ్చర్యపోక తప్పదు.

రన్‌ మెషిన్‌

2011లో విండీస్‌పై టెస్ట్‌ అరంగేట్రం చేసిన కొహ్లీ ఇటీవల జరిగిన 2018 విండీస్‌ టెస్ట్‌ సిరీస్‌ వరకూ ఆడిన 73 టెస్టుల్లో 24 సెంచరీలు, 19 హాఫ్‌ సెంచరీలతో 6వేల 331 పరుగులు సాధించాడు.

2008లో శ్రీలంకపై వన్డే అరంగేట్రం చేసి ఇటీవల విండీస్‌తో ముగిసిన ఐదుమ్యాచ్‌ల వన్డే సిరీస్‌ వరకూ ఆడిన మొత్తం 216 మ్యాచ్‌ల్లో విరాట్‌ 38 శతకాలు, 48 అర్ధశతకాలతో పాటు 11వేల 16 పరుగులు నమోదు చేశాడు.

ధూమ్‌ధామ్‌ టీ-20 క్రికెట్లో 2010 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేపై హరారేలో తొలిమ్యాచ్‌ ఆడిన కొహ్లీ మొత్తం 62 మ్యాచ్‌ల్లో 18 హాఫ్‌ సెంచరీలతో సహా 2వేల 102 పరుగులు సాధించాడు.

హ్యాట్రిక్‌

ఇటీవల విండీస్‌తో ముగిసిన ఐదుమ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్‌ కొహ్లీ హ్యాట్రిక్‌ సెంచరీలు సాధించాడు. గౌహతీ, విశాఖ, పుణే వేదికలుగా ముగిసిన మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి క్రికెటర్‌గా రికార్డుల్లో చోటు సంపాదించాడు. కెప్టెన్‌గా టెస్టు, వన్డేల్లో 16 సెంచరీలు సాధించిన భారత ఏకైక క్రికెటర్‌ కొహ్లీ మాత్రమే.

వెస్టిండీస్‌ ప్రత్యర్థిగా వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా మాత్రమే కాదు, అత్యంత వేగంగా 10వేల పరుగులు సాధించిన మొనగాడిగా నిలిచాడు. ఇప్పటికే అత్యంత వేగంగా 4 వేలు, 7వేలు, 10వేల పరుగుల ప్రపంచ రికార్డులు సాధించిన కొహ్లీ 2018 క్రికెట్‌ సీజన్‌ను చిరస్మరణీయంగా మిగుల్చుకొన్నాడు.

నంబర్‌వన్‌

2018 క్రికెట్‌ సీజన్లో కొహ్లీ ఆడిన మొత్తం 10 టెస్టుల్లో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్‌ సెంచరీలతో సహా 1063 పరుగులతో 59.05 సగటు సాధించాడు.

వన్డే క్రికెట్లో 14 మ్యాచ్‌లు ఆడితే.. ఆరు శతకాలు, మూడు అర్ధశతకాలతో సహా 1202 పరుగులు సాధించి 133.55 సగటు నమోదు చేశాడు. మొత్తం 73.57 సగటుతో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచాడు.

టెస్ట్‌, వన్డే క్రికెట్‌ బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. కొద్దిరోజుల క్రితమే 30వ పడిలో ప్రవేశించిన విరాట్‌ కొహ్లీ మరో దశాబ్దకాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగగలిగితే సచిన్‌ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డులన్నీ మటుమాయం కాక తప్పదు.

ఒక్కో యుగానికి ఒక్కో మహాపురుషుడు ఉన్నట్లు క్రికెట్లో ఒక్కో తరానికి ఒక్కో గొప్ప ఆటగాడు ఉంటాడనటానికి విరాట్‌ కొహ్లీనే నిదర్శనం. మాస్టర్‌ సచిన్‌, నేటితరం స్టార్‌ విరాట్‌ కొహ్లీ లాంటి అసాధారణ ఆటగాళ్లు భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తారు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *