బాక్సాఫీస్‌ బరిలో ‘యూరి’ విజయకేతనం!

బాక్సాఫీస్‌ బరిలో ‘యూరి’ విజయకేతనం!

సినిమా అనే వినోద సాధనం ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే తలంపు ఇవాళ్టి దర్శక నిర్మాతలలో తగ్గిపోతోంది. పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి ఎలాంటి చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేయడానికైనా వెనకాడని పరిస్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భారత సైనికుల సత్తాను ప్రపంచానికి చాటే విధంగా తెరకెక్కింది ‘యూరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌’ చిత్రం. 2016 సెప్టెంబర్‌ 18న జమ్ము-కాశ్మీర్‌లోని యూరి గ్రామంలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో 19మంది భారతీయ సైనికులు అసువులు బాశారు. ఆ దుష్టచర్యకు ప్రతీకారంగా కేవలం 11 రోజుల్లో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలను సర్వనాశనం చేశారు భారత సైనికులు. ఆ వీరోచిత గాథనే ‘యూరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌’ పేరుతో సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు ఆదిత్యధర్‌.

భారతదేశానికి తలమానికంగా నిలిచిన కశ్మీర్‌పై కన్నేసిన పాకిస్తాన్‌… ప్రత్యక్షంగా మనతో పోరు సలపలేక, పరోక్షంగా తీవ్రవాదులకు సాయం చేస్తూ వస్తోంది. పాక్‌ అండతో సమయం వచ్చినప్పు డల్లా తమ క్రూరత్వాన్ని చూపుతున్నాయి పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాల సంస్థలు. వారు జరిపిన దాడిలోనే 2016 సెప్టెంబర్‌ 18న 19మంది సైనికులు చనిపోయారు. ఈ సంఘటనతోనే ‘యూరి’ చిత్రం మొదలవుతుంది. ఆ దాడిలో మేజర్‌ విహాన్‌ సింగ్‌ షేర్గిల్‌ బావ మేజర్‌ కరణ్‌ కశ్యప్‌ అమరుడవు తాడు. తల్లి అనారోగ్య కారణంగా సోదరి దగ్గరికే ఢిల్లీకి వచ్చి ఉంటున్న విహాన్‌కు సర్జికల్‌ స్ట్రైక్‌ ఆపరేషన్‌ను నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజర్‌ గోవింద భరద్వాజ్‌ అప్పగిస్తాడు. దాంతో తన బావను హతమార్చిన టెర్రిస్టులను, దేశద్రోహులను కూడా తుదముట్టించే అవకాశం విహాన్‌కు లభించినట్టు అవుతుంది. తనతోటి సైనికులలో ఏ ఒక్కరికీ ఎలాంటి హానీ జరగకుండా భారత్‌కు తిరిగి తీసుకొస్తానని ప్రధానమంత్రికి మాట ఇచ్చిన విహాన్‌, సర్టికల్‌ స్ట్రైక్‌ను ఎలా విజయవంతంగా పూర్తి చేశాడన్నదే ఈ సినిమా కథ. విహాన్‌ సాహసకృత్యాలతో మొదలయ్యే ఈ సినిమాలో సర్జికల్‌ స్ట్రైక్‌కు కారణమైన యూరి సంఘటనను చూపించారు. దాంతో భారత్‌ ఏ కారణంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోకి వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇచ్చినట్టు అయ్యింది. అసలు సర్జికల్‌ స్ట్రైక్‌ జరగలేదని చెప్పుకునే కొన్ని వైరి దేశాలకు, మన దేశంలోని కుహనా రాజకీయ నేతలకు కళ్లకు కట్టినట్టుగా ఆ ఆపరేషన్‌ ఎలా జరిగిందో దర్శకుడు ఆదిత్యధర్‌ చూపించాడు. దేశ భద్రత కోసం, సైనికుల ఆత్మ స్థైర్యాన్ని నిలబెట్టడం కోసం ఇస్రో, డి.ఆర్‌.డి.ఓ., రా సంస్థలు కలిసికట్టుగా ఎలా పనిచేస్తాయో కూడా ఇందులో తెలిపారు. పరస్పర సహకారం ఉంటే మనం ఏదైనా సాధిస్తామని మరోసారి ఈ సినిమా ద్వారా నిరూపించారు. సాధారణ ప్రేక్షకుడిని ఆకట్టుకోవడం కోసం మరీ డాక్యుమెంటరీ తరహాలో కాకుండా హాస్యచతురతతో, ఆసక్తిని కలిగించే సన్నివేశాలతో కథను నడిపించారు. చేయబోతున్న ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారం శత్రుదేశానికి చేరినప్పటికీ లక్ష్యాన్ని ఛేదించడానికి మన సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి ఎలా పోరాడారో చూపారు. అందువల్లే సినిమా పూర్తి కాగానే మల్టీప్లెక్స్‌ థియేటర్లలో సైతం ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ ప్రేక్షకులు నినదిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ‘ఘాజీ’ చిత్రం పలు భాషల్లో అనువాదమైంది. అలానే ఈ సినిమా కూడా ప్రాంతీయ భాషల్లో అనువాదమైతే, మరింత మందిని చేరుకుంటుంది, ఉత్తేజపరుస్తుంది.

రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాలో మేజర్‌ విహాన్‌ సింగ్‌ షేర్గిల్‌గా విక్కీ కౌశల్‌, అతని బావగా మోహిత్‌ రైనా, నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజర్‌ గోవింద భరద్వాజగా పరేశ్‌ రావెల్‌ నటించారు. ఇక ప్రధానమంత్రి మోదీ పాత్రను రజిత్‌ కపూర్‌, అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ పాత్రను యోగేష్‌ సోమన్‌ సమర్థవంతంగా పోషించారు. జనవరి 11న ‘యూరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి వారాంతంలోనే ఈ సినిమా రూ. 37 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. అంతేకాదు… రెండువందల కోట్ల క్లబ్‌లోనూ అతి త్వరలో చేరబోతోంది. దీనితో పాటు కాస్త అటు ఇటుగా వచ్చిన ఎన్టీయార్‌, బాల్‌థాక్రే, ఝాన్సీ లక్ష్మీబాయ్‌ బయోపిక్స్‌ బాక్సాఫీస్‌ బరిలో చతికిల పడ్డాయి. చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు, కేవలం ధనార్జన కాకుండా ప్రేక్షకులకు సరైన చిత్రాన్ని అందించాలనే సంకల్పం ఉన్నప్పుడు విజయం తధ్యమని ‘యూరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌’ సినిమా నిరూపించింది. మరి ఈ విజయస్ఫూర్తితో ఇలాంటి విజయగాథలతో మరిన్ని చిత్రాలు రావాలని కోరుకుందాం!

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *