ఉడత

ఉడత

‘ఏంటీ? ఇల్లు ఆ అడవుల్ని, కొండల్ని తవ్విన చోట కడతారా? నన్ను అడవుల పాలు చేస్తారా? ఉండండి ఒక్క క్షణం…’ అంటూ రివ్వుమని లోపలికి పరిగెత్తి మళ్లీ అంతే వేగంగా వెనక్కి వచ్చి రెండు నెలల క్రితం న్యూస్‌ పేపర్‌ పట్టుకొచ్చింది మీనాక్షి. పోనీ చేతికిచ్చిందా? వణుకుతున్న చేతుల్లో కంపన స్వరంతో చదివింది.

‘మహాదారుణం..’

మార్చి 12, చట్టిపల్లి గ్రామం!

రచ్చబండ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు యువకులు. అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ చిరుత ఒక్కసారిగా వారి మీదకి లంఘించి అప్పలనాయుడు అనే వ్యక్తిని ఒక్కపంజా దెబ్బతో చంపి, కొండల మధ్యకి లాక్కుపోయింది. గ్రామస్థులు వణికిపోతున్నారు. ఆ చిరుత గ్రామాల్లోకి చొరబడటానికి కారణం అడవుల్ని నరికేయడమేనని సమాచారం…’ అని చదివి పెద్ద పెట్టున భోరుమంది.

వెర్రిదాన్ని చూసినట్టు చూసి ఇల్లు కట్టక తప్పదని, కట్టే తీరుతానని చెప్పేసి ఆఫీసుకెళ్లిపోయాడు సుందరం.

మీనాక్షిది నాలుగు పదుల వయసు. ఆమె భర్త సుందరానికి నలభై రెండు. మరో ఇల్లు కట్టాలని కోరిక. పల్లె జీవితం ప్రశాంతంగా ఉంటుందని చట్టిపల్లి దగ్గర పదేళ్ల కిందటే స్థలం కొన్నాడు.

సుందరానిది ఉడుం పట్టు. ఏదైనా చెయ్యాలనుకున్నాడో చేసే తీరతాడు. చెప్పినా వినడని తెలిసాక చేష్టలుడిగి చూసింది మీనాక్షి. ఆమెకి గుండె గొంతులోకి వచ్చింది. అత్తగారు, మామగారు బంధువుల ఇంట్లో పెళ్లికని సామర్లకోట వెళ్లారు. వాళ్లు తిరిగి వచ్చే వరకు బెంగగా ఇల్లంతా తిరిగింది.. పెరట్లోకి వచ్చి తాము వేసిన పచ్చపచ్చ చెట్లతో తన దిగులంతా చెప్పుకుంది.

సాయంత్రానికి అత్తామామలు వచ్చారు. మరో గంటకి సుందరం వచ్చాడు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక మీనాక్షి సోదంతా విన్నారు.

‘ఏరా? మనకి ఇల్లుందిగా? మరొకటి ఎందుకు?’ అన్నాడు సుందరం తండ్రి.

‘సైట్‌ అప్రూవల్‌ అయింది. బ్యాంకు లోన్‌ ఇస్తుంది. అందుకని..’ అన్నాడు.

‘ఇల్లు కట్టాలంటే బ్యాంకు లోన్‌ ఉంటే చాలా? ఇంకేం చూడక్కర్లేదా?’ అన్నాడు తండ్రి.

‘నేను.. మీనాక్షి అక్కడికి వెళ్లి ఉందామను కుంటున్నాం’ అన్నాడు. అది విన్న సుందరం తల్లి మొహం వెంటనే పాలిపోయింది.. ఒక అశక్తత, కంటిలో నీటి పొరలా వచ్చిచేరి బాధ కనపడుతుంది.

‘మనకి ఇల్లు ఉంది కదరా? ఇంకెవరో కట్టుకుంటారు. వదిలెయ్‌!’ అన్నాడు తండ్రి.

తండ్రికి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు సుందరం.

———

సుందరం ఆ శని, ఆదివారాల్లో చట్టిపల్లి పోయాడు. నాలుగు వందల చదరపు అడుగుల స్థలం అది. చాలా చౌకగా కొట్టేసాడు తను. ఒక్కగానొక్క కొడుకు సిద్ధార్థ. పర్లేదు బాగానే వెనకేసాడతను. వాడికి బాధ లేదు.

తను కొన్న స్థలం వైపు వెళ్లి, చుట్టూ పరికించి చూసాడు. స్థలం చుట్టూ బోలెడన్ని చెట్లు. ఆకులు రాలి గాలికి ఎగిరి అంతటా పరుచుకుంటున్నాయి. పక్షుల ఊసులు సరే.. బాదం చెట్ల వల్ల మాత్రం గొప్ప ఇబ్బందిగా ఉంటుంది. ఉడతలు బాదం కాయల్ని, పిందెల్ని కొరికి తొక్కు పోస్తుంటే రణరంగంలా ఉంది. పనివాళ్లని పిలిచి తుప్పలు, చెత్తా చెదారం క్లీన్‌ చెయ్యడంతో పాటు చెట్లు కూడా కొట్టెయ్యమన్నాడు. గొప్ప నొచ్చుకున్నాడు పెద్ద మేస్త్రి రాములు.

‘అదేటి బావూ.. తమరు కూడా.. ఇల్లు కట్టడానికి సెట్లు అడ్డు నేవు గదా? ఉత్తి పున్నానికి ఆటిని కొట్టడమెందుకు? ఆ పచ్చుల్ని సూడండి కిలకిలమంటూ ఎంత సందడి గున్నయో? ఆ ఉడత పిల్లల్ని సూడండి లేత సివురులు తినుకుంతా ఎంత సూడ ముచ్చటగ ఉన్నయ్యో? అడవి కదా ఇదంతా? ఏడకి పోతాయి? అడవుల్ని నరికేసారు, కొండల్ని కొట్టిసేరు … బాదం పిందెల్ని కొరుక్కుతింటూ సెక సెకా పెళ్లింట్లో తిరిగినట్టు తిరుగుతున్నాయ్‌. తవరు పెద్ద మనసు సేసుకోవాలి. ఏడకి పోతాయవి? కొట్టెయ్యమనకండి బావూ!’ అన్నాడు..

ఫకాలున నవ్వాడు సుందరం.

‘చెట్లున్నచోటికి పోతాయి గాని, రోజూ ఉడతలు పోసిన చెత్తా చెదారం ఎవడు తుడుచుకుంటాడు? ఆ చుట్టూ ఉన్న పెద్దపెద్ద మానులన్ని కొట్టిపారెయ్‌! ఆదివారం వొచ్చి పునాదులు తీద్దువుగాని… మంచి రోజు!’ పురమాయించి బస్‌స్టాండ్‌కి వచ్చాడు.

విశాఖపట్నం నుంచి చట్టిపల్లికి వచ్చే దారి గుతకల రోడ్డు కావడంతో బస్సులోనే రావాలి. కారులో వస్తే అది పాడయిపోవడం ఖాయం. చట్టిపల్లి బస్టాండులో బస్సు టైరు పంక్చరై, లేటవుతుందని డ్రైవర్‌ చెప్తే అతన్ని ఊరి విశేషాలు అడుగుతూ కాలక్షేపం చేద్దామనుకున్నాడు. ఈలోగా క్లీనర్‌ వచ్చి ఖారాకిళ్లీనీ తుపుక్కున ఉమ్మి, ఆ చోటంతా చెత్త చేసాడు. డ్రైవర్‌ తిట్టి పోసి.. సుందరం వైపు తిరిగి ‘వూరు గురించా అడుగుతున్నారు? చిరుతపులి ఇక్కడిక్కడే తిరుగుతోందని తెలిసే ఉంటుంది. అదొక్కటే కాదు. అడివంతా పోయి చిరుతలు.. పులులు ఊర్లోకి జొరబడిపోతున్నాయి. అడివిని కొట్టేస్తే అయి ఎక్కడుంటయండి? ఇడ్డూరంగా అంతా కవుర్లు సెప్తన్నారు.. అడివిలో ప్రతి జీవికి స్థానం ఉందండి. లేడి పిల్లకి, సింహానికి, పులికి.. వేటిస్థానం వాటికుంది.. దేన్నీ కాదనదండి అడవితల్లి. ప్రతీ జీవిని సంరక్షిస్తూనే తన పవిత్రతనీ కాపాడు కుంటుంది… కాని కొత్తగా అడివిల్లో పార్టీ లెట్టు కుంటున్నారు మనుషులు. కూల్‌డ్రింకుల కేన్ల డబ్బాలు, బంగాళాదుంప చిప్స్‌ పాకెట్లు, కేకులు, కోకులు.. ఇప్పుడు సూసారు కదండీ క్లీనరు గాడి ఖరాకిల్లీ ఉమ్ములతో కలుషితం చేసేసి.. అడివిలో చెట్లు నరికేసి, కొండలు కొట్టేసి.. జనమంతా ఇక్కడ ఇల్లు కట్టేసుకోడమేటి? తిరిగి జంతువుల్ని తిట్టడమే విటి? ఇంత చేసేది మనిషండి బాబూ మనిషి. ఎన్ని సిత్రాలేనా సేస్తడు’ అన్నాడు డ్రైవర్‌.

వింటున్నాడు సుందరం.

‘మీరూ ఇక్కడ చోటు కొన్నారా? ఇల్లు కడదావనా? కట్టండి కట్టండి’ అన్నాడు.

బస్‌ బయల్దేరి విశాఖ చేరుకున్నా, ఇంటికి వచ్చాడే గాని తల్లి కళ్లలో బాధ, తండ్రి మౌనం, భార్య దిగులు వల్ల మరో ఆదివారం వరకు ఆలోచనలు వదలలేదు సుందరానికి. ఏవేవో కలలు. శుక్రవారం పెద్ద మేస్త్రి ఫోన్‌ చేసి మొత్తం చెట్లన్నీ కొట్టేసి చదును చేస్తామని చెప్పాడు. విని కళ్లు మూసుకున్నాడు సుందరం. కళ్లు మూసుకుంటే ఉడత హాయిగా చెంగుమని గెంతుతున్నట్టు కలలు.

మరుసటి ఆదివారం ! చట్టిపల్లి !

పునాదులు తవ్వడం మొదలెట్టారు. ఆ సాయంత్రం త్వరగానే ఇల్లు చేరాడు సుందరం.. మనసేమిటోలా ఉంది. ఇంటి గేటు తీసాడు. పచ్చని పందిరిలు.. పొందికగా ఉన్న గొప్పు తవ్విన మొక్కలు తీరుగా లేవు. ఇంటిముందు తోటంతా చిందరవందరగా ఉంది. తల్లి చెట్ల వంక చూస్తోంది. తండ్రి గుమ్మం ముందు కుర్చీలో చేతుల్లో దాచుకుని ఉన్నాడు.. సుందరం భార్యని అడిగాడు.

‘ఏమయింది? ఇంటి ముందు తోటంతా చిందరవందర ఉందేమిటి?’ అని..

‘ఉడతలు మొత్తం లేత చిగుర్లనుంచి తోటలో అప్పుడే వస్తున్న కూరగాయల పిందెలతో సహా కొరికి పారేసాయి. ఒక్కటి కూడా మిగలలేదు..’ అంది.

అది విని అలా నిలబడిపోయిన సుందరం దగ్గరికి వస్తూ – అతని తల్లి కొడుకు చేతిని పట్టుకుంది. ఆ చేతుల్లో వణుకు ఏదో చెప్తోంది.

‘ఇన్నేళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదురా.. తోటంతా పోయింది’ అంది దిగులుగా…కరెంట్‌ షాక్‌ తగిలినట్టయింది సుందరానికి.

–  బులుసు సరోజినిదేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *