తొలి అడుగు

తొలి అడుగు

వర్ష మాటలు విన్న తర్వాత అక్కడ కూర్చున్న వాళ్లకెవరికీ ఏం మాట్లాడాలో తెలీలేదు. రామకృష్ణ ఒక్కగానొక్క కూతురు వర్ష. పాతికేళ్ల వయసు దాటి కూడా మరో ఆర్నెళ్లయిపోయింది. గత రెండేళ్లుగా రామకృష్ణ కూతురు పెళ్లి చేయటానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చూసిన సంబంధాలు వంద దాటి పోయుంటాయి. ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క సంబంధం నచ్చిన పాపాన పోలేదు. ఒక విధంగా రామకృష్ణ కూడా కొద్దిగా అశ్రద్ధ చేసాడేమో అనిపిస్తుంది. ఆలస్యం అయినా ఫర్వాలేదుగానీ కూతురికి ఇష్టం లేకుండా చేయకూడదనుకున్నాడు. మరీ ఇంత ఆలస్యం అవుతుందని అతను కూడా ఊహించలేదు.

సంబంధాలు చూడటంలో దిట్టలాంటి వాడిని ఇంటికి ప్రత్యేకంగా పిలిచాడు. అతని పేరు వాలి. ‘పెళ్లికి ముందే పెటాకులు’ అనే సబ్జెక్టు మీద డాక్టరేట్‌ కూడా చేసాడు. అందువల్ల అతన్ని ఎవరు పిలిచినా డాక్టర్‌ వాలి అని ప్రత్యేకంగా పిలవాలని చెబు తూంటాడు. అతను ఇంటికొచ్చిన అయిదు నిమిషాల్లో ఏదో మాంత్రికుడిలాగా వర్షకు ఏం కావాలో చెప్పించాడు. వర్ష చెప్పింది విన్నాక అందరికీ ఫ్యూజులు కొట్టేసాయి.

‘పెళ్లికొడుక్కి ఎలాంటి బ్యాగేజ్‌ ఉండకూడదు’ అంది వర్ష.

‘బ్యాగేజంటే ఏమిటమ్మా?’ అన్నాడు డాక్టర్‌ వాలి.

‘ఇదికూడా తెలీకుండా ఈవెంట్‌ మేనేజర్లుగా ఏలా చేస్తున్నారండీ.. బ్యాగేజంటే మీ భాషలో జంఝాటం.. అమ్మా నాన్నా.. అక్కా.. చెల్లీ.. అన్నా.. తమ్ముడూ.. ఎవరూ.. ఉండకూడదు’ అంది వర్ష.

ఆ షాక్‌ నుంచి అందరికంటే ముందుగా తేరుకున్న వాడు డాక్టర్‌ వాలి.

‘తల్లీ తండ్రీ లేకుండా అసలు వాడెలా పుడతాడమ్మా.. వాడు పుట్టాక అక్కా తమ్ముడూ.. పుట్టకుండా ఉంటారా.. గాలికీ ధూళికీ పుట్టేవాళ్లు మన పురాణాల్లో దొరుకుతారేమోగానీ నిజ జీవితంలో దొరకాలంటే..’ నసిగాడు డాక్టర్‌ వాలి. వర్ష వంకరగా నవ్వి ‘టైం పడుతుంది.. చూద్దాం తొందరేముంది’ అంది విలాసంగా అతడ్ని అనుకరిస్తూ.

రామకృష్ణకు చిర్రెత్తుకొచ్చింది. ‘అవును.. తొందరేముంది.. ఇప్పటికి పాతిక దాటాయి.. మరో పాతిక దాటాక అప్పుడెలాగూ అవసరం వుండదు.. బలవంతం చేయటానికి మేమూ వుండము..’ కోపంలో ఏదో అనబోతూ వుంటే వర్ష తల్లి విమల అడ్డుపడింది. ‘దాన్నెందుకంటారు.. తప్పంతా మనదే.. ఇన్ని కోరికలున్నాయని మనం తెలుసుకుని వుంటే పదేళ్ల ముందునుంచీ వెతుకుతూ వుండేవాళ్లం కదా?’ అంది రామకృష్ణకు నచ్చజెబుతూ.

డాక్టర్‌ వాలి నవ్వి ‘మీ అమ్మాయి కోరికలు మీకు కొత్తగా వున్నాయేమో గానీ మాకివన్నీ మామూలే మేడమ్‌. ఇప్పటి ఆడపిల్లలకి మొగుడొక్కడు దొరికితే చాలు.. అమ్మాబాబూ.. అక్కాచెల్లీ ఎవరూ వుండొద్దని అంటున్నారు. అలా అనటమే కాదండీ.. అలాంటి వాడు దొరికేవరకూ పెళ్లి చేసుకోవటం వాయిదా వేస్తున్నారుకానీ పెళ్లి మాత్రం చేసుకోవటం లేదండీ.. ఏం ఫర్వాలేదు.. మై హూ..నా’ అని వెంటనే ఎవరిదో ప్రొఫైల్‌ తీసి ‘సార్‌ యిది చూడండి.. తల్లి మళయాళీ.. తండ్రి ఆఫ్రికన్‌.. వీడు పుట్టాక.. నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదని.. వీడ్ని అనాధాశ్రమంలో వదిలేసి పోయారు..’

రామకృష్ణ నవ్వి ‘విశ్వామిత్రుడు మేనకా శకుంతలను వదిలేసినట్టుగా వదిలేసారన్నమాట..’ అన్నాడు.

‘ప్లీజ్‌.. అలాంటివి వద్దండీ.. పిల్లకు మేము నచ్చజెప్పుకుంటాంగానీ.. మంచి సంబంధమే చూడండి..’ అంది తల్లి విమల.

శూన్యంలోకి చూస్తూ వుండిపోయిన డాక్టర్‌ వాలి గబగబా తన లాప్‌టాప్‌లో ఒక ఫైల్‌ తీసి కుర్రాడ్ని చూపించాడు. ‘సార్‌.. రామకృష్ణగారూ.. యీ కుర్రాణ్ణి చూడండి’ రామకృష్ణకూ విమలకూ అబ్బాయి బాగా నచ్చాడు. ఆ మాటే చెప్పారు డాక్టర్‌ వాలికి.

డాక్టర్‌ వాలికి కాస్త ఉత్సాహం వచ్చింది ‘డీటైల్స్‌ యింకా బాగుంటాయి సార్‌.. పేరు మురళి.. బెంగుళూర్లో సాఫ్ట్‌వేర్లో వున్నాడు. 48 లక్షల పేకేజీ.. తండ్రి లేడు.. అంటే యాక్సిడెంట్లో చనిపోయాడు. తల్లి వున్నా లేనట్టే.. అంటే.. ఆవిడ భర్త చనిపోయాక కాశీ వెళ్లిపోయింది. కొడుకుతో ఫోన్లో అప్పుడప్పుడూ మాట్లాడటమే కానీ చూసేందుకు కూడా రాదు. అబ్బాయి వేలువిడిచిన మేనమామ మనకు బాగా తెలిసిన వాడే.. ఇతని గురించి మనం ఏం మాట్లాడాలనుకున్నా ఆయనతోనే మాట్లాడాలి.. అదంతా నేను చూసుకుంటాను.. ఇహ యీ పెళ్లయిపోయినట్టే.. మీరేం కంగారుపడొద్దు’

డాక్టర్‌ వాలి చెప్పినట్టే వారం రోజుల్లో వర్ష పెళ్లి మురళితో బ్రహ్మాండంగా జరిగిపోయింది.

* * * *

వర్ష, మురళి వైవాహిక జీవితం నిత్య వసంతంలా సాగుతుంది. చుట్టం అనే వంకతో చుట్టుముట్టే వారుకాని బంధువులనే కారణంగా బంధం వేసేవారుకానీ ఎవరూ లేరు. ఆ విధమైన జీవితం వర్షకు చాలా తప్తిగా వుంది. తను ఎవరికీ చాకిరీ చేయనక్కరలేకుండా పోయింది. ఓపికుంటే వండుకోవటం లేకపోతే రెస్టారెంట్లో తినేసి రావటం.. కోరుకున్న బట్టలు, నచ్చిన సినిమా, పార్టీలు, విలాసాలు.. జీవితం ఒకప్పటి కంటే కూడా బాగున్నట్టు అనిపించింది. మురళికి మాత్రం తల్లిని ఒంటరిగా కాశీలో వదిలిపెట్టి వుండటం యిష్టం వుండేదికాదు. తను అవివాహితుడిగా వున్నప్పుడంటే తప్పలేదు.. కానీ యిప్పుడు కూడా తల్లి దూరంగా వుండటం బాధకలిగించేది. అయితే వర్షకు ఎలాంటి బంధుత్వమన్నా యిష్టముండేది కాదు. తర్వాత్తర్వాత మెల్లగా నచ్చజెప్పే ఆలోచనతో వున్నాడు మురళి.

ఆదివారం సెలవు కావటంతో మురళి యింట్లోనే వున్నాడు. టీవీలో సినిమా చూస్తుంటే అప్పుడే కరెంట్‌ పోయింది. సినిమా చూస్తున్న వర్ష నిరాశగా పైకి లేస్తూ.. ‘అబ్బ.. ఆదివారం కూడా వంట చేయాలి బాబూ’ అని కుర్చీలోంచి పైకి లేచింది. మురళి చేయిపట్టుకుని వర్షను ఆపాడు. ‘భోజనం సంగతి తర్వాతగానీ.. మనం చిన్న ఆట ఆడుదాం’ అన్నాడు.

వర్ష ఉత్సాహంగా అడిగింది ‘ఏంటా గేమ్‌?’

మురళి వెంటనే తన లాప్‌టాప్‌ తెచ్చి ‘నేను నీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను.. వాటి పేర్లు చెప్పాలి..’ అన్నాడు.

‘నేను చెప్పను’ అంది వర్ష గారాబంగా ఏదో గుర్తుకొచ్చినదానిలా.

‘అదేం?’ అడిగాడు మురళి.

‘నువ్వు మంచి బొమ్మలు చూపించటం లేదు.. దేవాలయాల మీద వుండే బూతు బొమ్మలు చూపిస్తున్నావ్‌..’

మురళి పకపకా నవ్వాడు. ‘అది ఆ మూడ్‌లో వుండగా..’ అని నడుం పట్టుకుని ముందుకు గుంజాడు.

‘ఇప్పుడు నీకు మనం తినేవి చూపిస్తాను..’ అని ఒక ఫోటో దగ్గర ఆపి చూపించాడు. ‘యిదిగో చూడు వీటినేమంటారు ?’

వర్ష పకపకా నవ్వి ‘ఇవి నాకెందుకు తెలీదు.. ఇవి Wheat‌.’

మురళి ‘గుడ్‌.. మరి యివేమిటి’ వర్ష తేరిపార చూసింది కాని తెలీలేదు ‘ఊహు.. తెలీదు’ అంది.

మురళి నవ్వి ‘పెసరట్టు ఉప్మా తినమంటే మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటావే?’

వర్ష గట్టిగా అరిచింది.. ‘యస్‌.. యస్‌.. ఇవి పెసలు’

అదే సమయానికి శివానంద యింట్లోకి అడుగుపెట్టాడు. శివానంద మురళికి మావయ్య వరసవుతాడు. మురళి అంటే శివానందకు చాలా ప్రేమ అందుకే తను మురళికి మేనమామనని అందరికీ చెబుతాడు. శివానందను చూడగానే మురళి సంతోషంగా కుర్చీలోంచి లేచి ‘ఇప్పుడేనా మావయ్యా.. రావటం’ అన్నాడు. శివానంద రావటం చూసి వర్ష మొహం బిగుసుకుపోయింది. పెళ్లయిన కొత్తలో ఒకసారి వచ్చి అవమానపడి వెళ్లాడు. మళ్లీ రాలేదు. ‘ఇప్పుడెందుకొచ్చినట్టూ’ అనుకుంది వర్ష మనసులో.

‘అమ్మాయికి నువ్వేదో జనరల్‌ నాలెడ్జీ చెబుతున్నావల్లే వుంది..’ అన్నాడు శివానంద.

మురళి మెల్లగా నవ్వాడు. ‘మొన్న నా కాలు బెణికితే తను సూపర్‌ మార్కెట్‌కు వెళ్లింది. ఇడ్లీ రవ్వ తెమ్మంటే బొంబాయి రవ్వ తెచ్చింది..’ అని నవ్వాడు. వర్ష సీరియస్‌గా చూడగానే తల పక్కకు తిప్పుకున్నాడు.

శివానంద నవ్వుకున్నాడు. ‘సరె..సరె.. అర్ధమై పోయింది.. మొత్తానికి నువ్వే వంట చేస్తున్నావ్‌.. అంతేగా..’

మురళి కాస్త సిగ్గు పడ్డాడు. శివానంద అల్లుడి భుజం తట్టి ‘ఇందులో సిగ్గు పడాల్సిందేం లేదులేరా.. మీ అత్తయ్యకు వంట నేర్పింది నేనే.. ఆవిడ స్వయంగా ఎవరి సాయమూ లేకుండా కాఫీ యివ్వటానికి సంవత్సరం పట్టింది.. పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి వంటావార్పూ నేర్పేందుకు పెద్దవాళ్లుండేవాళ్లు. ఇప్పుడు మొగుడే అన్నీ నేర్పుకోవాలి.. ఆఫీసులోనే టైమంతా అయిపోతుంది.. ఆఫీసు నుంచి వస్తూ వస్తూ ఎక్కడో ఓ చోట తినేసి రావటమేగా.. అందుకే యిప్పటి పిల్లలకి ఏది కందిపప్పో ఏది మినప్పప్పో తెలీటం లేదు. వంట చేసే అవకాశం లేదు.. ఉత్సాహమూ లేదు. ఎక్కడ చూసినా కర్రీ పాయింట్లేగా.. లేదా రెస్టారెంట్లు.. ఆడవాళ్లు కూడా ఉద్యోగం చేసుకుంటూ సంపాయిస్తున్న యీ రోజుల్లో ఏ కుటుంబానికీ డబ్బు సమస్య కావటంలేదు. మనుషులే సమస్యగా మారుతున్నారు’ అన్నాడు.

మురళి అర్ధంకానట్టుగా చూసాడు ‘మనుషులు సమస్యేమిటి మావయ్యా..?’

శివానంద నవ్వి ‘బంధువుల్నీ బంధుగణాన్నీ వీలైనంతవరకూ వదులుకుంటున్నారు’ అన్నాడు. వర్ష వాళ్ల సంభాషణని జాగ్రత్తగా గమనిస్తుంది. శివానంద లోకం తీరు మాట్లాడుతున్నా తనను టార్గెట్‌ చేసినట్టుగానే ఉలిక్కిపడుతోంది.

మురళి కాస్త తడబడి ‘పరిస్థితులు కూడా వేగంగా మారిపోతున్నాయిగా మావయ్యా..’ అన్నాడు.

శివానంద అర్ధం చేసుకున్నట్టుగా తల వూపాడు. ‘అవునవును.. మన సామాజిక పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగానే వుంటున్నాయి. మనిషిని మనిషి కలుసుకునే సమయం ఉండటం లేదు. పెళ్లి పేరంటాళ్లకు వెళ్లటమే వీలుకావటం లేదు. వాట్సప్‌లో గ్రీటింగ్స్‌ పెట్టేస్తే చాలు’.

మురళి చిరునవ్వు నవ్వి ‘పోనీలెండి.. ఆ విధంగా నైనా టచ్‌లో వుంటున్నారు కదా మావయ్యా..’

శివానందకు అసహనంగా అనిపించింది ‘టచ్‌లో వుండటం అంటే పేస్‌బుక్‌లో లైక్‌ కొట్టటం.. వాట్సప్‌లో =వర్‌ ఱఅ ూవaషవ అని మెసేజివ్వటం కాదురా మురళీ.. స్వయంగా మనం వెళ్లి అవతలి వ్యక్తిని అభినందించటం లేదా పరామర్శ చెప్పడంవల్ల ఆ వ్యక్తికి మనం చెప్పలేని పాజిటివ్‌ శక్తిని అందజేయగలుగుతాం. నాకోసం యింతమంది వ్యక్తులున్నారనే భావం వ్యక్తుల్లో ఉత్తేజాన్ని నింపుతుంది. అందువల్లనే ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో అంతమంది మనుషులకి చాకిరీ చేసినా ఎలాంటి సమస్యలూ వుండేవి కావు.. ఇప్పుడు ఒంటరితనమే ప్రధానమైన సమస్య.. ఆధునిక యువత అది తెలుసుకోలేకపోతున్నారు..’

శివానంద ఎమోషనల్‌గా మాట్లాడటం చూసి దాన్ని బ్రేక్‌ చేయాలనుకున్నాడు మురళి.

‘వర్షా.. మావయ్యకు కాఫీ యివ్వరాదూ..’ అన్నాడు. వర్ష మురళి వంక కొరకొరగా చూసి ‘నేనివ్వను..’ అంది.

మురళికి తల కొట్టేసినట్టయింది. వర్ష దగ్గరగా వచ్చి ‘ముందు కాఫీ.. ఆ తర్వాత భోజనం.. అదీ కూడా అయ్యాక.. రాత్రి నిద్ర.. నేను ముందే చెప్పాను.. బంధువుల పేరుతో.. నాకివన్నీ ఇష్టం వుండవు..’ అని కాస్త కఠువుగానే అంది. శివానంద మురళి పరిస్థితి అర్ధంచేసుకున్నాడు. ‘అబ్బే.. అవేం వద్దురా..యీ టైములో కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిదికాదు.. తాగను.. ఇక యీ రోజు నేను ఉపవాసంలో వున్నాను కాబట్టి భోజనం.. చేయను. అసలు మిమ్మల్ని యిబ్బంది పెట్టటం నా ఉద్దేశం కాదు.. మా చెల్లెలు వస్తున్నానని చెప్పింది.. చూసి పోదామని వచ్చానంతే.. మురళీ.. మీ అమ్మని ఒకసారి పిలువ్‌..’ అన్నాడు.

మురళికి అయోమయంగా అనిపించింది. తల్లి వస్తున్నట్టు మావయ్యకు తెలిసింది. మరి తనకెందుకు తెలీలేదు.. అనుకున్నాడు. ‘మావయ్యా.. అమ్మ రాలేదే?’

శివానంద ఆశ్చర్యపోయి ‘రాకపోవటమేమిట్రా.. తను ఉదయం వస్తానని ఫోన్‌ చేసి చెప్పింది. చూడాలి రమ్మంటే సాయంత్రం వస్తానని చెప్పాను..’

వర్ష నిశ్శబ్దంగా చూస్తూ వుండిపోయింది. మురళి వర్షను అడిగాడు ‘వర్షా.. అమ్మ ఏమైనా ఫోన్‌ చేసిందా ?’

‘అవును..మీరు వాకింగ్‌కు వెళ్లినపుడు ఫోన్‌ వచ్చింది. స్టేషన్‌కు రమ్మని చెప్పిందావిడ..’ నిర్లక్ష్యంగా చెప్పింది వర్ష. మురళికి కోపం పెరిగింది ‘మరి నాకు చెప్పలేదే?’

వర్ష తెగేసినట్లుగానే చెప్పింది ‘ఆవిడ రావటం నాకిష్టం లేదు..’

మురళి షాక్‌ తిన్నవాడిలా వుండిపోయాడు. ‘వర్షా.. ఆవిడ నా తల్లి’ గొంతులో ఏదో అడ్డుపడినట్టుగా వుంది. దుఃఖం పొంగుకొస్తుంది. అవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు వర్ష. ‘నేను నీ భార్యని.. నాకంటూ ఇష్టాలుండవా?’

‘ఆవిడ పాతికేళ్లు నన్ను పెంచింది.. ముసలి తనంలో చూడాల్సిన బాధ్యత నాది’ అన్నాడు మురళి బాధగా.

‘నీ బాధ్యతలన్నీ షేర్‌ చేసుకోవాల్సిన అవసరమైతే నాకు లేదు.. మిస్టర్‌.. మురళీ..’ నిక్కచ్చిగా అంది వర్ష.

మాటకు మాటా పెరిగి తుఫానుకు దారి తీస్తుందని అర్ధంచేసుకున్నాడు శివానంద. ‘సరే..సరే.. ఉదయం ఊళ్లోకొచ్చి ఇంత వరకూ ఎందుకు రాలేక పోయిందో.. అది చూడు..’

‘తన దగ్గర అడ్రసు లేదు మావయ్యా’ సిగ్గుతో తలదించుకున్నాడు మురళి.

శివానంద నిట్టూర్చి ‘బాగుంది.. కొడుకు ఎక్కడుండేదీ తల్లికి తెలీని రోజులు దాపురించాయి’

‘అదికాదు మావయ్యా.. నా ఫోన్‌ నెంబరుంది.. అమ్మ వచ్చేప్పుడు నాకు ఫోన్‌ చేస్తుంది కదాని నేనే ఆశ్రద్ధ చేసాను..’ మురళి గొంతు బొంగురు పోయింది. శివానంద మురళి పరిస్థితి అర్ధం చేసుకున్నాడు. భయం లేదన్నట్టుగా భుజం తట్టి ‘కారు తీయ్‌.. అలా వెళ్లి ఏ పోలీస్‌ స్టేషన్లోనైనా చెబితే ఏదైనా సాయం చేస్తారేమో చూద్దాం’ మరుక్షణంలోనే వాళ్లిద్దరూ మురళి తల్లిని వెతికేందుకు బయల్దేరారు. వర్ష నిరాసక్తంగా చూస్తూ వుండిపోయింది.

* * * *

సాయంత్రం వరకూ తల్లి ఆచూకీ దొరకనే లేదు మురళికి. సాయంత్రం ఎవరో హాస్పిటల్‌ నుంచి ఫోన్‌ చేసారు. ప్రమాదం లేదు గానీ దూరప్రయాణం, వయోభారం వల్ల కళ్లు తిరిగి పడిపోతే ఎవరో మహానుభావుడు హాస్పిటల్లో వేసాడని తల్లి చెప్పింది. తను ఫోన్‌ చేసిన సంగతి కొడుక్కి చెప్పని కోడలు తనను ఎలా చూసుకుంటుందో అర్ధంచేసుకున్న పెద్దావిడ కనీసం ఇంటికి కూడా రాకుండానే మళ్లీ కాశీ వెళ్లిపోయింది.

తల్లిని సంతోషపెట్టలేకపోయిన బాధలో ఇల్లు చేరిన మురళికి మరో ఉపద్రవం ఎదురైంది.

తన మాట లక్ష్యపెట్టకుండా వెళ్లిపోయిన భర్తపై కసిపెంచుకున్న వర్ష ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది. మణికట్టు దగ్గర గాయం చేసుకుని అచేతనంగా పడివుంది. అయితే అప్పటికి మరీ ఎక్కువ సమయం కాకపోవటంతో ప్రాణం పోకుండా కాపాడారు డాక్టర్లు.

వర్ష గురించి తెలిసిన తల్లిదండ్రులు వచ్చి వాలిపోయారు. వాళ్లిద్దర్నీ చూడగానే భోరున ఏడ్చింది వర్ష.

‘నువ్వు చేసింది బాగాలేదమ్మా’ అంది తల్లి విమల. వర్ష సిగ్గుతో తల వంచుకుంది. ‘మనిషికి మనిషి తోడుగా వుండాలి వర్షా.. ఎవరికి వాళ్లుగా వుండిపోతే.. కాలం చేసే గాయాలను తట్టు కునేందుకు మన శక్తి చాలదమ్మా..’ అన్నాడు తండ్రి రామకృష్ణ.

‘అబ్బాయితో ఏదైనా ప్రాబ్లమా?’ అంది విమల.

‘ఊహు.. అదేం లేదు.. యీ మధ్య నాకెందుకో నేను ఒంటరినైపోయానన్న దిగులు పెరిగిపోయింది’ అంది వర్ష.

‘నువ్వేగా.. బంధువులు అక్కరలేదని చెప్పావు’ అంది విమల. వర్ష మౌనంగా వుండి పోయింది.

‘మరి నేను వెళ్లొస్తాను’ అంది విమల.

‘నన్నీ స్థితిలో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లిపోతావా.. అమ్మా’ అంది వర్ష తల్లిని పట్టుకుని ఏడుస్తూ.

‘మనిషెప్పుడూ ఒంటరివాడేనమ్మా.. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్లిపోతాం. ఈ భూమ్మీద వున్నన్నాళ్లయినా తోటి మనుషులతో సంతోషంగా కలిసి జీవించటం అలవాటు చేసుకోవాలి వర్షా.. అలా నిన్ను ప్రేమించిందించి కాబట్టే నీకు ముప్ఫయ్‌ సంవత్సరాల క్రితం మంచి తల్లి దొరికింది..’ అన్నాడు రామకృష్ణ వర్ష తల నిమురుతూ.

‘అంటే..’ వర్షకు అర్ధంకాలేదు. ‘నేను నీకు జన్మనిచ్చిన తల్లిని కాదమ్మా’ అంది విమల. ఆవిడ కంటివెంట ధారాపాతంగా కన్నీరు వర్షిస్తోంది. ముప్ఫయ్యేళ్ల క్రితం జరిగింది కళ్లముందు చూస్తున్నట్టుగా ఏదో లోకంలో వున్నట్టుగా అంది.. ‘నువ్వు నా కన్న కూతురివి కాదు.. ఆ దేవుడిచ్చిన కూతురివి.. నాది ప్రేమ వివాహం. మా పెళ్లి ఇష్టం లేని మా మామగారు నా మీద హత్యా ప్రయత్నం చేసారు. ఆ దాడిలో నేను నా భర్తను కోల్పోయాను. వాళ్లనుంచి రక్షణకోసం వెతుక్కుంటున్న నాకు కాలేజీ స్నేహితుడైన రామకృష్ణగారు.. మీ నాన్నగారు కనిపించారు. అభం శుభం తెలీని నువ్వు అమాయకంగా ఏడుస్తూ నన్ను నీ అమ్మ అనుకుని నన్ను వదలకుండా ఏడుస్తూ వుండిపోయావు. నీ కోసం కొంతకాలం వుంటానని నేను రామకృష్ణగారికి మాటిచ్చాను. అందులో నాకు ఒక నీడ దొరుకుతుందనే స్వార్ధం కూడా వుంది. అయితే ఆయన చూపించిన కరుణ, నీతో ఏర్పడిన బంధం కారణంగా నేను ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం కనబడలేదు. అయితే తల్లి మరణం వల్ల కలిగిన విషాదం నీ మనసులో ఎక్కడో మిగిలిపోయింది. చిన్నతనంలో కలిగిన ఆ అభద్రతా భావం వయసుతో పాటే పెరిగి నువ్వు ఒంటరిగా వుండేందుకు అలవాటుపడిపోయావు. దానికితోడు ఎవరికి వాళ్లుగా బ్రతుకుతున్న ప్రస్తుత జీవనవిధానం నిన్ను మరింత క్రుంగదీసి ఇలా ఆత్మహత్యకు ఉసిగొల్పింది’

‘అవునమ్మా.. అప్పుడు నువ్వు మూడు సంవత్సరాల పిల్లవి. గుండెపోటుతో మీ అమ్మ చనిపోయింది. కానీ నువ్వు అమ్మ కావాలి అమ్మ కావాలి అంటూ రోజులతరబడి ఏడుస్తూనే వున్నావు. భార్యతో పాటు కూతుర్ని కూడా పోగొట్టు కుంటానేమోనని భయం వేసింది. ఈ విమల నా కాలేజీ స్నేహితురాలు. ఆవిడకు నీడ ఇచ్చానని నేను ఏనాడూ.. అనుకోలేదు.. ఆ దయగల తల్లి నీడలో మన బ్రతుకు సాగినందుకు.. జన్మజన్మలకూ మనం ఆవిడ ఋణం తీర్చుకోలేం..’ అన్నాడు రామకృష్ణ.

వర్ష విచారంగా కళ్లు మూసుకుంది. తనకు తెలిసీ తెలియని వయసులో ఇదంతా జరిగింది. విమలను ముందు ‘ఆంటీ’ అని పిలిచేది.. కానీ తర్వాత ‘అమ్మ’గానే పిలవటం మొదలుపెట్టింది. కళ్లవెంట ధారగా కన్నీళ్లు కారుతూనే వున్నాయి. గుండెల్లో ఏవో భావాలు మెదుల్తూ వున్నాయి. ‘ఆధునిక జీవన విధానం ఆడవాళ్లకు స్వేచ్ఛ నిచ్చిందికానీ భద్రతాభావాన్ని కలిగించలేకపోతోంది. ఆడపిల్లకు రక్షణ ఇవ్వలేని సమాజం ఎంత ఆధునికంగా మారినా అది అనాగరిక సమాజంతో సమానమే.. పెరిగిపోతున్న టెక్నాలజీ మనిషిని అయోమయం వైపు తీసుకుపోతుందే తప్ప జీవితాలను శాంతంగా వుంచలేకపోతోంది. దీనికి ఒక్కటే పరిష్కారం! కూలిపోతున్న కుటుంబ వ్యవస్థను తిరిగి నిలబెట్టటమే.. నన్ను ప్రేమించే మనుషులు నా చుట్టూ వున్నారనే భావమే మనిషిని ఆనందంగా వుంచుతుంది. ఆ ఆనందం అద్భుతమైన శక్తిని మేల్కొలుపుతుంది. గాంధీగారు కలలు కన్న గ్రామ సీమల్ని మళ్లీ వెలిగించాలి. ముసలివాళ్లు మాత్రమే వుంటున్న మన గ్రామాలలో మళ్లీ యువరక్తం నింపాలి. యువకులు ఆధునిక పద్ధతులతో వ్యవసాయాన్ని ఒక వృత్తిలా స్వీకరించాలి. మురళికి ఎప్పటినుంచో ఇలాంటి కోరిక వుండేది. మనం ఉమ్మడి కుటుంబాలను ఉద్ధరించుకోవాలి. అందుకు గాను మనం పల్లెదారి పట్టాలి. ఒకప్పటి సమస్యలను అధిగమించి కొత్త దారులు వేసుకోవాలి. అందుకు యువత ముందుకు రావాలి’ ‘ఇలా జరిగితే ఎంత బావుండు’ అనుకునే వర్ష మనసులో అందుకు తనే తొలి అడుగు వేయాలంటే ఏం చేయాలా? అని ఆలోచనలు మొదలయ్యాయి.

– ఆకురాతి భాస్కర్‌ చంద్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *