విజయ్‌ పథంలో.. టాక్సీవాలా

విజయ్‌ పథంలో.. టాక్సీవాలా

తెలుగులో కొత్త కథలు రావడం లేదన్నది వాస్తవం. అయితే పాత కథలనే కొత్తగా చెబుతున్న సినిమాలను మనవాళ్లు ఆదరిస్తున్నారు. చెప్పాలనుకున్న పాయింట్‌కు కాస్తంత వినోదాన్ని జోడించి, విసుగు తెప్పించ కుండా రెండు గంటల్లో చూపితే సంతృప్తి పడుతున్నారు. హారర్‌ చిత్రాల విషయంలో అయితే లాజిక్‌ జోలికి కూడా పోవడం లేదు. ఆ కోవకు చెందిన సినిమానే ‘టాక్సీవాలా’. గత ఐదారేళ్లుగా తెలుగులో ఎంటర్‌టైనింగ్‌ హారర్‌ మూవీస్‌ కుప్పలు తెప్పలుగా వచ్చిపడు తున్నాయి. అలా వస్తున్న డబ్బింగ్‌ చిత్రాలకూ కొదవలేదు. ఈ నేపథ్యంలో ఆ జానర్‌లో సినిమా చేయకూడదనుకున్న విజయ్‌ దేవరకొండను తన కథతో దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ ఒప్పించాడు. ఫలితంగా వచ్చిందే ‘టాక్సీవాలా’.

శివ (విజయ్‌ దేవరకొండ) ఓ దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. ఎలాగో కష్టపడి డిగ్రీ పూర్తి చేస్తాడు. అన్నయ్య, వదిన మీద ఆధారపడటం ఇష్టం లేక హైదరాబాద్‌ వచ్చి స్నేహితుడి సహకారంతో రకరకాల ఉద్యోగాలు చేసి, చివరకు సొంత కారు ఒకటి తక్కువ ధరకు వస్తుంటే కొని, క్యాబ్‌ డ్రైవర్‌గా స్థిరపడతాడు. ఫస్ట్‌ రైడ్‌లోనే తనకు పరిచయం అయిన జూనియర్‌ డాక్టర్‌ అను (ప్రియా జవాల్కర్‌)తో ప్రేమలో పడతాడు. జీవితం సాఫీగా సాగిపోతోందనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా అది మలుపు తిరుగుతుంది. తాను ఎంతో ఇష్టపడి, కష్టపడి కొనుకున్న కారులో ఓ ఆత్మ ఉందనే విషయం తెలుస్తుంది. తప్పనిసరి పరిస్థితిల్లో ధైర్యం తెచ్చుకుని టాక్సీ నడుపుతూనే ఉంటాడు. చివరకు ఆ ఆత్మ తనకు హాని తలపెట్టేది కాదని అర్థమౌతుంది. అదే సమయంలో ఓ డాక్టర్‌ను తీసుకుని వెళుతుంటే… కారులోని ఆత్మ అతన్ని చంపేస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? డాక్టర్‌ను ఎందుకు చంపేసింది? కారులోనే అది ఎందుకు ఉంటోంది? అనే సందేహాలకు ద్వితీయార్థంలో సమాధానాలు దొరుకుతాయి.

కోరికలు తీరక చనిపోయిన వ్యక్తి ఆత్మలు వేరొకరిని ఆవహిస్తాయని, అలానే పగ, ప్రతీకారాలు తీర్చుకుంటాయని చాలా సినిమాల్లోనే చూశాం. కానీ బ్రతికి ఉన్న వ్యక్తి నుండి ఆత్మను వేరు చేసి, వేరే శరీరంలోకి ప్రవేశింపచేయడం అనేది తెలుగు సినిమాల వరకూ కాస్తంత కొత్త అంశమే. గతంలో ఒకటి రెండు సినిమాల్లో ఇలా బతికి ఉన్న వారి ఆత్మలను చూపిన సంఘటనలు ఉన్నాయి. కానీ దానికి వినోదాన్ని జోడించి, ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ సఫలీకృతుడయ్యాడు. గతంలో వచ్చిన నయనతార ‘డోర’ సినిమా ఛాయలూ మనకు కాస్తంత ఇందులో కనిపిస్తాయి.

నటీనటుల విషయానికి వస్తే… ఇది విజయ్‌ దేవరకొండ వన్‌ మ్యాన్‌ షో. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ అతను సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. ఓ రకంగా చెప్పాలంటే నూతన నటి ప్రియా జవాల్కర్‌ కంటే కూడా ద్వితీయార్థంలో కనిపించే ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్‌ మాళవికా నాయర్‌ బాగా నటించింది. అలానే చిన్న పాత్రలే అయినా ఆమె తల్లిగా యమున, విజయ్‌ వదినగా కళ్యాణి ఆయా పాత్రలలో చక్కగా ఇమిడిపోయారు. ఇతర కీలక పాత్రలను సిజ్జు, రవివర్మ, ఉత్తేజ్‌ పోషించారు. మధునందన్‌, హాలీవుడ్‌, చమ్మక్‌చంద్ర తమ వంతు వినోదం అందించారు.

మలయాళీ సంగీత దర్శకుడు జెక్స్‌ బిజోయ్‌కు ఇది తొలి తెలుగు సినిమా. అయినా… ఈ తరహా సినిమాలకు పనిచేయడం అతనికి కొత్తకాదు కాబట్టి తనదైన నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. పరిమితమైన పాత్రలు, పరిమితమైన ప్రదేశాలే సినిమాలో ఉన్నాయి. అయినా… అందులోనే కాస్తంత వైవిధ్యంగా, కన్నులకు ఇంపైన దృశ్యాలను బంధించాడు ఛాయాగ్రాహకుడు సుజిత్‌ సారంగ్‌. సాయికుమార్‌ రెడ్డి సంభాషణలూ ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ సన్నివేశంతో పాటు, ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాల మధ్య మరింత శ్రద్ధ చూపించి ఉంటే బాగుండేది. సినిమా నిడివిని కాస్తంత తగ్గించి ఉండాల్సింది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘టాక్సీవాలా’ వి.ఎఫ్‌.ఎక్స్‌. వర్క్‌ కారణంగా విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. దీని తర్వాత మొదలైన ‘గీత గోవిందం, నోటా’ ముందు విడుదలయ్యాయి. పైగా ఆ మధ్య మూవీ అన్‌ ఎడిటెడ్‌ వర్షన్‌ సోషల్‌ మీడియాలో లీక్‌ అయిపోయింది. దాంతో సినిమా మీద ఎవరూ పెద్దంత ఆశలు పెట్టుకోలేదు. కానీ దానికి భిన్నంగా ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ను అందుకోవడం విశేషమే. ‘నోటా’ పరాజయంతో కాస్తంత తడబడిన విజయ్‌ దేవరకొండను ‘టాక్సీవాలా’ తిరిగి విజయపథంలోకి తీసుకెళ్లింది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ అనుబంధ సంస్థ అయిన జి.ఎ.2, యు.వి. క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించిన ‘టాక్సీవాలా’కు ఎస్‌.కె.ఎన్‌. నిర్మాతగా వ్యవహరించారు.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *