‘శ్రీనివాస కళ్యాణం’ చూతము రారండి!

‘శ్రీనివాస కళ్యాణం’ చూతము రారండి!

భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచంలోని చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. ఇక్కడి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పెద్దలు జరిపే పెళ్లిళ్లు, మహిళలు చేసే వ్రతాలు, పేరంటాలు, పర్యావరణ హితానికై జరిపే హోమాల గురించి మాట్లాడుకుంటారు. కానీ పాశ్చాత్య ప్రభావానికి లోనైన మనం వాటికి నిదానంగా దూరమవుతున్నాం. మరీ ముఖ్యంగా ఇవాళ పెళ్లి, దాని ప్రాధాన్యం గురించి ఎవరైనా చెబితే పాత చింతకాయ పచ్చడిగా భావించడం మామూలే. ఆరోగ్యకరమైనప్పుడు ఆ పాత చింతకాయ పచ్చడిని సైతం స్వీకరించాల్సిందే. అలాంటిదే ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం. ఆ మధ్య ‘శతమానం భవతి’తో ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలూ ఆత్మీయతలను తెలియచేసిన దర్శకుడు సతీశ్‌ వేగేశ్న రూపొందించిన తాజా చిత్రమే ‘శ్రీనివాస కళ్యాణం’. ఆ సినిమాను నిర్మించిన ‘దిల్‌’ రాజే ఈ చిత్రాన్ని జనం ముందుకు తీసుకొచ్చారు.

ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీనివాస్‌ (నితిన్‌)కు చిన్నప్పటి నుండి పెళ్లి మీద ఓ నిశ్చితాభిప్రాయం ఉంది. పెద్దల అంగీకారంతో బంధుమిత్ర సమేతంగా పెళ్లి చేసుకోవాలన్నది అతని కోరిక. కోటీశ్వరుడి కూతురైన శ్రీదేవి (రాశీఖన్నా)తో చంఢీఘర్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త ఆర్‌.కె. (ప్రకాశ్‌రాజ్‌) కూతురు అని తెలియకుండానే ప్రేమిస్తాడు, అయినా ఆమెను తన ఇష్టప్రకారంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. ఇదే విషయాన్ని ఆర్‌.కె.ను కలిసి చెబుతాడు. అయితే… అప్పటికే అతని పెద్దకూతురు విడాకులకు అప్లయ్‌ చేసి ఉంటుంది. ప్రతి నిమిషాన్ని రూపాయలతో పోల్చుకునే ఆర్‌.కె. కు శ్రీనివాస్‌ వైఖరి పెద్దంత బోధపడదు. కానీ తన కూతురు కోసం అయిష్టంగానే పెళ్లికి అంగీకరిస్తాడు. ఈ వివాహ బంధం ఎక్కువ కాలం సజావుగా సాగదనేది అతని అభిప్రాయం. అందుకే పెళ్లికి ముందే శ్రీనివాస్‌తో విడాకులకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయించు కుంటాడు. పైగా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడ దనే నిబంధన పెట్టి పెళ్లికి అంగీకరిస్తాడు. ఆర్‌.కె. మనస్తత్వం తెలిసిన శ్రీనివాస్‌ సైతం ఓ ఆడపిల్ల తండ్రిగా అవసరమైన ప్రతి సందర్భంలోనూ ఆయన పెళ్లి ఏర్పాట్లలో పాల్గొనాలనే షరతు పెడతాడు. మరి ఆర్‌.కె. ఆ షరతులను అంగీకరించాడా? శ్రీనివాస్‌, శ్రీదేవి ప్రేమ.. పెళ్లి పీటలవరకూ చేరిందా? శ్రీనివాస్‌ మీదే చిన్నప్పటి నుండీ ఆశలు పెట్టుకున్న అతని మేనత్త కూతురు పద్మావతికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వీటికి సమాధానాలు ద్వితీ యార్ధంలో లభిస్తాయి.

‘అ..ఆ’ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో నితిన్‌ నటనపై కాస్తంత నమ్మకం ఏర్పడింది. కేవలం ప్రేమకథా చిత్రాలే కాకుండా కుటుంబ కథా చిత్రాలనూ అతనితో చేయవచ్చనే ధీమా నిర్మాతలకూ కలిగింది. అందుకే రాజు… నితిన్‌తో ఈ సినిమా నిర్మించాడు. విశేషం ఏమంటే… పదిహేనేళ్ల క్రితం ‘దిల్‌’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ఇది. శ్రీదేవిగా రాశీఖన్నా, పద్మావతిగా నందితాశ్వేత బాగానే నటిం చారు. మొన్నటి వరకూ అమ్మగా నటించిన జయసుధకు నానమ్మగా ప్రమోషన్‌ ఇచ్చేశారు. ఆమని, రాజేంద్ర ప్రసాద్‌ నితిన్‌ తల్లిదండ్రులుగా నటించారు. ఇందులో కథంతా నితిన్‌, ప్రకాశ్‌రాజ్‌ మధ్యే సాగుతుంది. మిగిలిన పాత్రధారులంతా ఇలా వచ్చి అలా వెళతారు. అయితే ఉమ్మడి కుటుంబానికి చెందిన చిత్రం కావడంతో ప్రతి ఫ్రేమ్‌లోనూ పది పదిహేను మందికి తక్కువ ఉండరు. ప్రథమార్ధం అంతా నితిన్‌, రాశిఖన్నా ప్రేమ వ్యవహారంతో సాగిపోతుంది కాబట్టి బోర్‌కొట్టదు. ఇక ద్వితీయార్థంలో తాను అనుకున్న విధంగా పెళ్ళి చేసుకోవడానికి నితిన్‌ పడే పాట్లు ఉంటాయి. కాబోయే మావగారిని దారిలో పెట్టడానికి అతను చేసే ప్రయత్నాలు పెద్దంత ఆసక్తిని కలిగించేవి కాదు. పైగా ఈ తరానికి పెళ్లి అంటే ఇలా వెళ్లామా అలా కనిపించి వచ్చామా అన్నదే అలవాటైపోయింది. ఊరు ఊరంతా పెళ్లి పనుల్లో నిమగ్నమైపోవడం, బంధుమిత్రులంతా పెళ్లికి నాలుగైదు రోజుల ముందే వచ్చేయడం వంటివి పెద్దంత ఎక్కేలా అనిపించలేదు. పైగా సాధ్యంకాని అంశాలను మనపైన దర్శకుడు రుద్దుతాడేమిటీ అనే నిరసన భావన కూడా ఏర్పడే ఆస్కారం లేకపోలేదు. అయితే… దర్శక నిర్మాతలు మాత్రం ఈ సినిమా విషయంలో ఓ స్పష్టతతో ఉన్నారు. మృగ్యమైపోతున్న మన వివాహబంధంలోని గొప్పతనాన్ని చెప్పాలనుకున్నారు. చెప్పేశారు. అది క్లాస్‌ పీకినట్టు ఉండటం కాస్తంత ఇబ్బంది పెట్టేదే. దీనిని మరింత హత్తుకునేలా చూపించి ఉంటే… ఈ కాలం కుర్రాళ్లు సైతం అంగీకరించేవారేమో! పాతతరం కనెక్ట్‌ అయినట్టుగా ఈ తరం ఈ సినిమాకు ఎంతవరకూ కనెక్ట్‌ అవుతారనేది చూడాల్సిందే. మిక్కీ జె మేయర్‌ స్వరాల కంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.

చేస్తోంది మంచి ప్రయత్నం కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారులే అనే అతి నమ్మకంతో కాకుండా ఈ తరానికి ఇదే కథను నచ్చేలా ఎలా చెప్పాలనే దానిపై కాస్తంత ఆలోచన చేసి ఉంటే బాగుండేది. ఏదేమైనా అర్థంపర్థంలేని యూత్‌ఫుల్‌ లవ్‌ అండ్‌ లస్ట్‌ యాక్షన్‌ సినిమాలు మన సంస్కృతిపై పరోక్షంగా దాడి చేస్తున్న సమయంలో ఇలాంటి చిత్రాలను రూపొందించడం ఓ సాహసం. ఆ ప్రయత్నాన్ని అభినందించాలి. ఇలాంటి సినిమాలను ఆదరిస్తేనే… మరిన్ని వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకోసమైనా తప్పనిసరిగా ఇలాంటి చిత్రాలను చూడాలి.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *