పతనావస్థలో పాక్‌ క్రీడారంగం..!

పతనావస్థలో పాక్‌ క్రీడారంగం..!

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సంబంధాలు మాత్రమే కాదు క్రీడాసంబంధాలు సైతం తీసికట్టుగా మారిపోతున్నాయి. భారత్‌తో సంబంధాలు బెడిసికొట్టడంతో పలువిధాలుగా పాక్‌ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమై పోతోంది. ఆ దేశ క్రీడారంగం సైతం పతనం అంచులకు చేరింది. భారత్‌ తోడ్పాటు లేకుంటే మనుగడ సాగించలేమన్న వాస్తవం ఇప్పటికే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు, పాకిస్తాన్‌ హాకీ సమాఖ్యలకు అర్థమైపోయింది.

భారత్‌, పాకిస్తాన్‌.. దక్షిణాసియాలోనే రెండు ముఖ్య దేశాలు. 1947కు ముందు అఖండ భారత్‌లో భాగంగా ఉన్న ఈ రెండు ప్రాంతాలు దేశవిభజనతో రెండు దేశాలుగా అవతరించిన నాటినుంచే దాయాదులుగా మారిపోయాయి. భారత్‌ పెద్ద మనసుతో సహనం, సంయమనం పాటిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నా పాకిస్తాన్‌ మాత్రం ద్వేషభావంతో, పగప్రతీకారాలతో కశ్మీర్‌ కుంపటిని రాజేస్తూ రగిలి స్తూనే వస్తోంది. చైనా, అమెరికా దేశాల అండతో పేట్రేగిపోతూ భారత్‌లో అశాంతిని సష్టించడానికి సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ వస్తోంది.

రాజకీయ ప్రభావం!

క్రీడలు వేరు.. రాజకీయాలు వేరు.. క్రీడలతో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు. అయితే, భారత్‌-పాక్‌ దేశాలలో మాత్రం క్రీడాసంబంధాలను రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. దేశ విభజనతోనే హాకీ, క్రికెట్‌ వారసత్వాలను రెండు దేశాలు పంచుకొని ప్రపంచ స్థాయిలో తమ సత్తా చాటుకొంటూ వస్తున్నాయి. క్రికెట్‌, హాకీ, టెన్నిస్‌, బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌, స్క్వాష్‌ లాంటి క్రీడల్లో భారత్‌ తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తుంటే, పాక్‌ క్రీడారంగం మాత్రం కునారిల్లిపోతూ వస్తోంది. దేశ విభజనకు ముందు ప్రపంచ స్థాయిలో హాకీ అనగానే భారత్‌ పేరు మాత్రమే గుర్తుకొచ్చేది. ఆ తర్వాత ఒలింపిక్స్‌, ప్రపంచ హాకీలో భారత ఆధిపత్యానికి పాకిస్తాన్‌ గండికొడుతూ వచ్చింది.

అయితే.. గత దశాబ్దకాలంలో భారత హాకీ ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడితే, పాకిస్తాన్‌ హాకీ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ప్రపంచ, ఒలింపిక్స్‌ హాకీ టోర్నీలకు పాక్‌ జట్టు నేరుగా అర్హత సాధించలేక చతికిలపడి పోతోంది. భారత్‌తో ద్వైపాక్షిక హాకీ సిరీస్‌లు లేక పాక్‌ తీవ్రంగా నష్టపోతోంది.

పాక్‌ బోర్డు దివాళా

పెద్దమనుషుల క్రీడ క్రికెట్లో ఇటు భారత్‌, అటు పాకిస్తాన్‌ దేశాలకు గొప్ప వారసత్వం, గొప్పగొప్ప క్రికెటర్లను అందించిన ఘనత సైతం ఉన్నాయి. రెండు దేశాల క్రికెట్‌ బోర్డులు కలసి వన్డే ప్రపంచ కప్‌ను సైతం నిర్వహించాయి. ప్రపంచ క్రికెట్లోనే గట్టి ప్రత్యర్థులుగా, దాయాది జట్లుగా నిలిచాయి. భారత్‌, పాక్‌ జట్లు ఒకదానితో ఒకటి పోటీపడు తున్నాయని తెలిస్తే చాలు స్టేడియాలు కిటకిట లాడిపోటం సాధారణ విషయమే. భారత్‌ జట్టు పాక్‌లో పర్యటిస్తే అక్కడి క్రికెట్‌ బోర్డుకు కాసుల వర్షమే. అదే పాక్‌ జట్టు భారత్‌లో పర్యటించినా బీసీసీఐకి డబ్బే డబ్బు.

ముంబై దాడితో..

క్రీడాపరంగా భారత్‌, పాక్‌ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న సమయంలో ముంబై మహానగరంపై ఉగ్రవాదులదాడితో కథ మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్తాన్‌తో క్రీడాసంబంధాలను భారత ప్రభుత్వం తెగతెంపులు చేసుకొంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్‌ పెంచిపోషించినంత కాలం ద్వైపాక్షిక క్రీడాసంబంధాలు ఉండవని తేల్చి చెప్పింది.

ప్రపంచ క్రికెట్‌కు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ మాత్రమే కాదు.. క్రికెట్‌ ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్‌ బోర్డు సైతం భారత్‌ మాత్రమే. బీసీసీఐతో చక్కటి సంబంధాలతో శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డులు ఓ వైపు ఆర్ధిక నష్టాలను పూడ్చుకొని, అప్పుల ఊబినుంచి బయటపడితే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మాత్రం దివాళ తీసే పరిస్థితికి చేరుకొంది. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు లేక పాక్‌ వందల కోట్ల రూపాయల మేర నష్టపోయింది. పైగా భారత్‌ తమతో సిరీస్‌లు ఆడటం లేదంటూ ఐసీసీలో కేసు వేసినా విఫలం కాకతప్పలేదు. ఉగ్రవాదుల భయంతో స్వదేశంలో సిరీస్‌లు నిర్వహించలేని పాకిస్తాన్‌ దుబాయ్‌, అబుదాబీ తటస్థ వేదికలుగా అంతర్జాతీయ సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చే దయనీయమైన స్థితికి దిగజారిపోయింది.

ఉభయ దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడటం కోసం రెండు దేశాల క్రీడాకారులు తమవంతు పాత్ర నిర్వర్తిస్తుంటే పాక్‌ పాలకులు మాత్రం ఉగ్రవాదులను ఉసిగొలుపుతూ ద్వైపాక్షిక సంబంధాలకు దారుణంగా విఘాతం కలిగిస్తున్నారు. పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ జహీర్‌ అబ్బాస్‌ 1970 దశకంలోనే భారత యువతి రీటా లూత్రాను తన జీవితభాగస్వామిగా చేసుకొంటే, పాకిస్తాన్‌ మాజీ ఓపెనర్‌ మొహిసిన్‌ ఖాన్‌ భారత నటి రీనా రాయ్‌ను వివాహం చేసుకున్నాడు. భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సైతం మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ను నిఖా చేసుకొని పాకిస్తాన్‌ కోడలిగా మారింది. రెండుదేశాల క్రీడాకారులు తమవంతుగా సంబంధాల బాగుకోసం పాటుపడుతున్నా పాక్‌ పాలకుల దుశ్చర్యలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతూ వస్తోంది.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *