భారత మహిళా క్రికెట్‌కి మంచి రోజులొచ్చాయనే చెప్పాలి. మిథాలీరాజ్, హర్మన్ ప్రీత్‌కౌర్ వంటి డైనమిక్ ప్లేయర్లు తమ సత్తా చాటుతుంటే, అదే స్ఫూర్తితో స్మృతి మందానా, జెమీమా రోడ్రిగేజ్లు అంచనాలకు మించి రాణిస్తూ వారేవ్వా అనిపించుకొంటున్నారు.
మనదేశంలో మహిళా క్రికెట్‌కు లభిస్తున్న ఆదరణ అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. అయితే ఐసీసీ ఆదేశాలతో మహిళా క్రికెట్‌ను సైతం బీసీసీఐకి అనుబంధంగా చేర్చుకోవడంతో ప్రోత్సాహం, ఆదరణతో పాటు ప్రచారం కూడా కొంతమేర పెరిగింది.
గత మూడు దశాబ్దాలుగా భారత మహిళా క్రికెట్లో మిథాలీరాజ్, హర్మన్ ప్రీత్‌కౌర్ లాంటి ఒకరిద్దరు ప్లేయర్లు మాత్రమే స్టార్లుగా గుర్తింపు తెచ్చుకొన్నారు. వన్డే క్రికెట్లో మిథాలీ, టీ-20 క్రికెట్లో హర్మన్ ప్రీత్‌కౌర్ ప్రధాన క్రికెటర్లుగా కొనసాగుతున్నారు. అయితే అదే వరుసలో నిలిచే సత్తా తమలో ఉందని మరాఠా మెరుపు తీగలు 22 ఏళ్ల స్మృతి మందానా, 18 ఏళ్ల జెమీమా రోడ్రిగేస్లు చెప్పకనే చెబుతున్నారు.
స్మృతి మందానా
భారత మహిళా క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ నమ్మదగిన ఓపెనర్ ఎవరంటే ముంబైకి చెందిన స్మతి మందానా అనే పేరు మాత్రమే వినపడుతుంది. ఎడమచేతి వాటం (లెఫ్ట్ హ్యాండ్) ఓపెనర్‌గా, నిలకడగా రాణించే ప్లేయర్‌గా అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకొన్న స్మృతి ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డులను సైతం గెలుచుకొంది. 16 ఏళ్ల వయసులోనే భారత వన్డే జట్టులో చోటు సంపాదించి బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా 2013 సిరీస్‌లో వన్డే అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్, టీ-20 ప్రపంచకప్ టోర్నీల్లో నిలకడగా రాణించడం ద్వారా స్టార్ ప్లేయర్ల జాబితాలో చేరిపోయింది.
న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన తొలివన్డేతో మొత్తం 44 మ్యాచ్‌లు ఆడిన మందానా 1602 పరుగులు సాధించింది. ఇందులో నాలుగు శతకాలు, 13 అర్థశతకాలు సైతం ఉన్నాయి. దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా టీ-20 క్యాప్ అందుకొన్న ఆమె ఇప్పటి వరకూ ఆడిన 50 మ్యాచ్‌ల్లో 83 పరుగులు అత్యధిక స్కోరుతో మొత్తం 1046 పరుగులు సాధించింది. ఆరు హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి.
జెమీమా
మహిళా క్రికెట్‌కు ముంబై అందించిన అపురూప కానుక 18 ఏళ్ల జెమీమా రోడ్రిగేస్. ఆరేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టి సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలో రికార్డుల మోత మోగిస్తూ వచ్చిన జెమీమాకు ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా పేరుంది. 17 ఏళ్ల చిరుప్రాయంలోనే భారత సీనియర్ జట్టులో చేరిన జెమీమా, 2018 సిరీస్‌లో ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా వన్డే క్యాప్ అందుకొంది. టీ-20ల్లో మాత్రం సౌతాఫ్రికా ప్రత్యర్థిగా తొలిమ్యాచ్ ఆడిన జెమీమా ఇప్పుడు భారతజట్టులో ఓ కీలక ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకొంది.
భారత మహిళా జట్టు ప్రధాన శిక్షకుడిగా రామన్ బాధ్యతలు చేపట్టడంతోనే జట్టులో మార్పులు చేర్పులు చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలివన్డేలో ప్రధాన ఓపెనర్ స్మృతి మందానాకు జంటగా జెమీమాను బరిలోకి దించారు.
నేపియర్ మెక్లీన్ పార్క్ వేదికగా ముగిసిన తొలివన్డేలో న్యూజిలాండ్‌పై ఓపెనర్లు స్మృతి మందానా- జెమీమా రోడ్రిగేస్ వీరవిహారం చేశారు. మొదటి వికెట్‌కు సరికొత్త రికార్డు నెలకొల్పారు. 193 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్‌కు దిగి 190 పరుగుల భారీ భాగస్వామ్యంతో 9 వికెట్ల విజయం అందించారు.
స్మృ 104 బాల్స్‌లో 105 పరుగులకు ఔట్ కాగా, జెమీమా 81 పరుగుల స్కోరుతో నాటౌట్‌గా నిలిచింది. ఈ ఇద్దరూ కేవలం 32.2 ఓవర్లలోనే 190 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయటం విశేషం. స్మృ సెంచరీలో 3 సిక్సర్లు, 9 బౌండ్రీలు; జెమీమా హాఫ్ సెంచరీలో 9 బౌండ్రీలు ఉన్నాయి. తన వన్డే కెరియర్లో స్మృ మందానాకు ఇది నాలుగో శతకం కాగా జెమీమాకు తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. న్యూజిలాండ్ ప్రత్యర్థిగా భారత ఓపెనర్లు 190 పరుగుల అతిపెద్ద భాగస్వామ్యం నమోదు చేయటం ఇదే మొదటిసారి. ఈ ఇద్దరి ఆటతీరు చూస్తుంటే భారత్‌ను సుదీర్ఘకాలంగా వెంటాడుతున్న కుదురైన ఓపెనర్ల జోడీ సమస్య తీరినట్లేనని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
స్మృ మందానా, జెమీమా లాంటి నవతరం ప్లేయర్ల స్ఫూర్తితో మరికొంత మంది మహిళలు క్రికెట్‌ను కెరియర్‌గా ఎంచుకోడం ఖాయమని బీసీసీఐ భావిస్తోంది.
– క్రీడా కృష్ణ , 84668 64969