ప్రతిభకు పట్టం

ప్రతిభకు పట్టం

క్రీడాకారులకు ప్రభుత్వాలు అందించే పౌర పురస్కారాన్ని మించిన గౌరవం మరొకటి ఉండదనే చెప్పాలి. అర్జున, ద్రోణాచార్య, రాజీవ్‌ ఖేల్‌రత్న లాంటి అవార్డులు ఎన్ని లభించినా కేంద్ర ప్రభుత్వం అందించే ‘పద్మశ్రీ’కి ఎంపిక కావడం పట్ల క్రీడ రంగానికి చెందినవారు సంతృప్తి వ్యక్తం చేస్తారు. అంతటి గౌరవాన్ని తెలుగు తేజాలు గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక, టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆచంట శరత్‌ కమల్‌ సొంతం చేసుకొన్నారు.

భారత ప్రభుత్వం ఇటీవల 112 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటిస్తే అందులో తొమ్మిదిమంది క్రీడాకారులున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ద్రోణవల్లి హారిక, ఆచంట శరత్‌ కమల్‌, సునీల్‌ చెత్రీ ఉండటం గర్వకారణం.

గ్రాండ్‌ మాస్టర్‌

చెస్‌ క్రీడ ద్వారా తెలుగు రాష్ట్రాలకు, భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక అతిచిన్న వయసులోనే దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికై, నవతరం మహిళలకే గర్వకారణంగా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన హారిక ఆరేళ్ల ప్రాయంలోనే చదరంగంలో ఓనమాలు దిద్ది సబ్‌ జూనియర్‌ స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి ప్రపంచ స్థాయి విజయాలతో అతి తక్కువ కాలంలోనే గ్రాండ్‌ మాస్టర్‌ ¬దా సంపాందించింది.

గత తొమ్మిదేళ్ల కాలంలో హారిక సాధించిన విజయాలు, పతకాలు అన్నీ ఇన్నీ కావు. సబ్‌ జూనియర్‌, జూనియర్‌, మహిళల జాతీయ -బీ, జాతీయ-ఏ విభాగాలలో 16 పతకాలు సాధించడం ద్వారా ప్రపంచ మహిళా చెస్‌లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత వ్యక్తిగత, టీమ్‌ విభాగాలలో రాణిస్తూ ప్రపంచస్థాయి మహిళా గ్రాండ్‌ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకొంది.

చెన్నై వేదికగా ముగిసిన 2009 జాతీయ మహిళా చెస్‌ టోర్నీలో బంగారు పతకం సాధించిన హారిక 2001లో స్పెయిన్‌ వేదికగా ముగిసిన అండర్‌ -12 ప్రపంచ యువజన చెస్‌ టోర్నీలో రజత పతకం సంపా దించింది. 2002 ఆసియా చెస్‌లో బంగారు పతకం, ప్రపంచ చెస్‌లో కాంస్య పతకం సాధించింది.

హ్యాట్రిక్‌

ప్రపంచ మహిళల చెస్‌ పోటీల్లో మూడు కాంస్య పతకాలతో పాటు 2011లో గ్రాండ్‌ మాస్టర్‌ ¬దా అందుకొంది. అంతేకాదు ఆసియా క్రీడల చెస్‌లో సైతం దేశానికి కాంస్య పతకం సంపాదించి పెట్టింది. దేశానికి పలు విధాలుగా ఖ్యాతి తెచ్చిన హారిక 28 ఏళ్ల చిరుప్రాయంలోనే పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం ద్వారా తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచింది.

టేబుల్‌ టెన్నిస్‌ వండర్‌

భారత టేబుల్‌ టెన్నిస్‌ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన తెలుగుతేజం ఆచంట శరత్‌ కమల్‌ సైతం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జన్మించి చెన్నై కేంద్రంగా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడిగా మెరుగులు దిద్దుకొన్న శరత్‌ అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పలు పతకాలు అందించాడు. పురుషుల సింగిల్స్‌, డబుల్స్‌, మిక్సిడ్‌ డబుల్స్‌ అంశాలలో పలు పతకాలు అందించాడు. ఇటీవలే ఆస్ట్రేలియాలో ముగిసిన గోల్డ్‌ కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో సైతం అత్యుత్తమంగా రాణించడం ద్వారా పద్మశ్రీ పురస్కారానికి అర్హత సంపాదించాడు.

సునీల్‌ చెత్రీ

భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌గా సునీల్‌ చెత్రీ అందించిన అత్యుత్తమ సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. సునీల్‌ హైదరాబాద్‌లో జన్మించాడు. ఫుట్‌బాల్‌ క్రీడాకారుడిగా బెంగాల్‌లో స్థిరపడ్డాడు. భారత్‌ తరఫున వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండో ఫుట్‌బాలర్‌గా, అత్యధిక గోల్స్‌ సాధించిన కెప్టెన్‌గా సునీల్‌ చెత్రీకి గుర్తింపు ఉంది.

‘పద్మశ్రీ’ పురస్కారాలకు ఎంపికైన ఇతర క్రీడా ప్రముఖుల్లో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌, మల్లయోధుడు భజరంగ్‌ పునియా, ఆర్చరీ స్టార్‌ బోంబేలా దేవి, ప్రశాంతి సింగ్‌, కబడ్డీ వీరుడు అజయ్‌ ఠాకూర్‌ సైతం ఉన్నారు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *